సాక్షి ప్రతినిధి, ఏలూరు : చంద్రబాబునాయుడి ప్రభుత్వ విధానాలతో పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ఒకవైపు అతివృష్టి, అకాల వర్షాలు.. మరోవైపు తుపాన్లు రైతుల పాలిట శాపంగా మారాయి. ఆపద సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం రిక్తహస్తం చూపడంతో అన్నదాతలు మరింత కష్టాలపాలవుతున్నారు.
టీడీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న అస్థవ్యస్థ వైఖరి కారణంగా జిల్లాలో రైతులు అప్పులపాలవుతున్నారు. గోదావరి చెంతనే ఉన్నా పొలా లకు నీరందని దుస్థితి. ఏటా రబీలో రోడ్డెక్కితే గాని సాగునీరు అందించలేని దుస్థితిలోకి ప్రభుత్వం వెళ్లిపోయింది. పశ్చిమ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా పొగాకు రైతులు, కౌలు రైతులు ఈ ఐదేళ్లలో ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు చేసిన మోసంతో అప్పులు పుట్టక సేద్యం భారమైపోయింది. దీనికి తోడు కుటుంబపోషణ, పిల్లల చదువులు, పెళ్లిళ్లు అన్నదాతకు పెనుసవాళ్లుగా మారాయి.
భవిష్యత్ అగమ్యగోచరంగా మారడంతో పలు వురు బలవన్మరణాలకు పాల్పడ్డారు. çకొందరు పొలంలోనే చెట్టుకు ఉరేసుకుంటే.. మరికొందరు పురుగు మందు, విషపు గుళికలు మింగేస్తున్నారు. మిగిలిన జిల్లాలతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే అయినా అన్నపూర్ణగా పేర్గాంచిన పశ్చిమలో రైతుల ఆత్మహత్యలు కలవరపెడుతున్నాయి. ప్రభుత్వం ఇప్పటికీ రుణమాఫీ నాలుగు, ఐదు విడతల కింద రూ.471 కోట్లు పెండింగ్‌లో పెట్టింది. రుణమాఫీ అర్జీలు ఇవ్వడానికే నాలుగేళ్లుగా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్న రైతులు వేలల్లో ఉన్నారు.
ఇటీవల అమలు చేసిన అన్నదాత సుఖీభవ కింద ఇచ్చిన రూ.1,000 చిల్లర ఖర్చులకు కూడా సరిపోలేదు. వాతావరణ బీమా, ఫసల్ బీమా వంటి పథకాలు ధీమా ఇవ్వలేకపోయాయి. వాటి కోసం కట్టిన ప్రీమియం మొత్తం కూడా వెనక్కిరాలేదు. 2014 నుంచి రైతులకు దక్కాల్సిన రూ.300 కోట్లకు పైగా ఇన్‌పుట్ సబ్సిడీ చంద్రబాబు సర్కారు ఇవ్వకుండా మోసం చేసింది.
అప్పు పుట్టదు.. రాయితీ రాదు
బ్యాంకుల నుంచి అప్పు పుట్టదు.. వెబ్‌ల్యాండ్‌కు బయోమెట్రిక్ విధానాన్ని అనుసంధానం చేయడం వల్ల విత్తనాలపై రాయితీ రాదు. చేతిలో చిల్లిగవ్వ కూడా లేకుండా ఈ ఖరీఫ్ ఈదడం ఎలా అన్నది కౌలు రైతులను వేధిస్తున్న సమస్య. ఏటా ఖరీఫ్ ముందస్తు సాగు అంటూ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటోంది. జూన్ 1 నాటికే గోదావరి నీరు కాలువలకు వదిలారు. డెల్టాలో 80 శాతం మంది కౌలు రైతులు సాగు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మూడు లక్షల మంది కౌలు రైతులు ఉంటే డెల్టాలోనే సుమారు రెండు లక్షలకు పైగా న్నారు. అధికారిక లెక్కల ప్రకారమే 5.30 లక్షల ఎకరాల్లో వరి సాగవుతోంది. అయితే ఈ ఏడాది ఖరీఫ్‌లో పంట వేసేందుకు కౌలు రైతుల వద్ద చిల్లిగవ్వ కూడా లేని పరిస్థితి ఉంది. గతేడాది ఖరీఫ్, రబీలో చేసిన అప్పులు తీర్చడానికి వచ్చిన డబ్బులు సరిపోయే పరిస్థితి ఉంది. కౌలు రైతులకు బ్యాంకుల నుంచి అప్పు పుట్టే పరిస్థితి లేకుండా పోయింది. పెట్టుబడులు పెరిగిపోతున్న నేపథ్యంలో గతంలో పది ఎకరాలు చేసిన కౌలు రైతులు ప్రస్తుతం నాలుగైదు ఎకరాలకు పరిమితం కావాల్సి వస్తోంది.
ఆ సంతకం.. జీవితాలను మార్చేసింది
2004లో మహానేత వైఎస్సార్ తొలిసారి ముఖ్యమంత్రి కాగానే చేసిన రైతులకు ఉచిత విద్యుత్ ఫైల్‌పై తొలి సంతకం చేశారు. ఇది రైతుల జీవితాలను మార్చేసింది. దీంతో పాటు రైతు రుణమాఫీతో అన్నదాత నిలదొక్కుకోగలిగాడు. అప్పటికీ జిల్లాలో 80 వేలకు పైగా విద్యుత్ మోటార్లు ఉన్నాయి. మెట్ట ప్రాంతంలో ఎక్కువ మంది రైతులు విద్యుత్ మోటార్లపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్నారు. వైఎస్సార్ కల్పించిన ఊరటతో వీరి విద్యుత్ బకాయిలు రద్దయ్యాయి. లక్షలాది మంది రైతులు రుణ విముక్తులయ్యారు. అదే చంద్రబాబు ప్రభుత్వం 2014లో గద్దెనెక్కిన తర్వాత పూర్తిస్థాయి రుణమాఫీని విస్మరించడంతో రైతుల పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది.
వరుస నష్టాలు.. వీడని కష్టాలు
చింతలపూడి మండలంలోని నరసింగపురానికి చెందిన తూము రాంబాబు (33) అదే గ్రామంలో ఎనిమిది ఎకరాలు కౌలుకు తీసుకుని నాలుగేళ్లుగా మొక్కజొన్న, కాకర, పత్తి పంటలు పండించాడు. వ్యవసాయంలో వరుస నష్టాలు రావడంతో అప్పులపాలయ్యాడు. అయినా సేద్యంపై ఆశతో మరో ఏడాది రెండెకరాల్లో పత్తి, రెండు ఎకరాల్లో కాకర పంటలు వేశాడు. అయితే పంటకు తెగుళ్లు సోకడంతో దిగుబడులు తగ్గాయి. అప్పులు రూ.5 లక్షలు తీర్చే మార్గం లేక 2015 డిసెంబర్‌లో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
పంట కుదేలు.. అప్పులతో దిగాలు
జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెంకి చెందిన కౌలు రైతు పారేపల్లి మంగరాజు (27) 2015 అక్టోబర్ 4న తాను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్న లక్కవరంలోని పొలంలో పురుగు మందు తాగి మృతిచెందాడు. పంటలో నష్టం, అప్పుల బాధలు మృతికి కారణమని బంధువులు తెలిపారు. ఏడు ఎకరాలను కౌలుకు తీసుకోగా ఐదు ఎకరాల్లో మొక్కజొన్న, రెండు ఎకరాల్లో వరి సాగుచేశాడు. విద్యుత్ కోతలు, సాగునీటి కొరతతో మొక్కజొన్న పంట ఎండిపోయే స్థితికి చేరింది. మొక్కజొన్న పంటకు పొత్తులు కూడా రాకపోవడంతో రెండున్నర ఎకరాలు దున్నివేశాడు. మరో రెండున్నర ఎకరాల్లో సాగుచేసిన మొక్కజొన్న పంట కూడా ఎదుగుదల లేక పొత్తులు రాకపోవడంతో ఆ పంటను పశువుల మేతకు వదిలేశాడు. దీంతో కౌలు చెల్లించే మార్గం లేక, అప్పులు తీర్చే దారి లేక తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు.
అతడి పాలిట పగాకు
కొయ్యలగూడెం మండలం సరిపల్లికి చెందిన పందిరిపల్లి వెంకట సత్యనారాయణ (45) ఎకరాన్నర సొంత భూమిలో, ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని వర్జీనియా పొగాకు సాగుచేయగా తీవ్ర నష్టం వచ్చింది. దీంతో రూ.10 లక్షల వరకు అప్పులపాలయ్యాడు. వర్జీనియా ధరలు ఆశాజనకంగా లేకపోవడంతో అప్పులకు వడ్డీలు పెరుగుతూ వచ్చాయి. బ్యాంకు రుణాలు కట్టాల్సిం దిగా నోటీసులు రావడంతోపాటు అప్పు ఇచ్చిన వారి నుంచి కోర్టు నోటీసులు రావడంతో మనోవేదనకు గురై కుటుంబసభ్యుల ఎదుటే పురుగుమందు తాగి అసువులు బాశాడు.
అప్పు తీర్చే మార్గం లేక..
కొవ్వూరు మండలం కుమారదేవంకి చెందిన కౌలు రైతు నల్లూరి వెంకటేశ్వరరావు ఈనెల 12న పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈనెల 15న మృతి చెందాడు. వ్యవసాయంలో నష్టాలు రావడంతో రూ.2.58 లక్షల వరకూ అప్పులపాలయ్యారు. అప్పులు తీర్చేమార్గం లేక ప్రాణాలు తీసుకున్నాడు. ఆయనకు ఆరికిరేవుల సొసైటీలో రూ.12 వేలు, ఆరికిరేవుల బరోడా బ్యాంకులో రూ.77 వేలు, స్థానికుల వద్ద సుమారుగా రూ.1.69 లక్షలు అప్పులు ఉన్నాయి.
పుస్తెలమ్మి పెట్టుబడులు పెట్టినా..
జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడేనికి చెందిన రైతు మాధవరపు నరసింహమూర్తి (40) నాలుగేళ్ల క్రితం రాజవరానికి భార్య, బిడ్డలతో వచ్చాడు. అక్కడ పది ఎకరాలు కౌలుకు తీసుకుని వరి వేశాడు. వర్షాభావం, దిగుబడి తగ్గడం, గిట్టుబాటు ధర లేకపోవడంతో పెట్టుబడులు కూడా రాలేదు. చివరకు భార్య పుస్తెలను సైతం అమ్మి పెట్టుబడులు పెట్టాడు. దీంతో పాటు అందినకాడికి అప్పులు కూడా చేశాడు. చివరకు పంట దెబ్బతినడంతో రూ.8 లక్షల అప్పుల భారం మోయాల్సి వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు.
ఉసురుతీసిన వరి
నిడదవోలు 1వ వార్డు లింగంపల్లికి చెందిన బూరుగుపల్లి నాగవిద్యాసాగర్ (35) 2017 నవంబర్‌లో అప్పుల బాధ తాళలేక పొలంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఐదు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వరి పండించాడు. దళారుల దగ్గర పెట్టుబడి కింద సుమారు రూ.2 లక్షల వరకు వ్యవసాయ ఖర్చులకు, విత్తనాలకు, కూలీల కోసం తీసుకున్నాడు. పంట దిగుబడి సరిగా లేకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment