సాక్షి, నెల్లూరు : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆయన కుమారుడు నారా లోకేష్ బాబులు పొలిటికల్ జోకర్లంటూ వైఎస్సార్ సీపీ నేత కాకాణి గోవర్ధన్ రెడ్డి విమర్శించారు. టాలీవుడ్‌లో నిన్నటి వరకు టాప్ కమెడియన్‌గా వెలుగొందిన ఓ హాస్యనటుడి పాత్రను నారా లోకేష్ భర్తీ చేస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ఏపీ ప్రజలు నిన్నటి వరకు లోకేష్ పండించిన బ్రహ్మాండమైన కామెడీ షోలను సోషల్ మీడియాలో చూసి ఆనందించారన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మంగళగిరిలో ఓటమి భయంతో ఫ్రస్టేషన్‌లోకి వెళ్లిపోయిన లోకేష్... ఎక్కడో దాక్కున్నారని అన్నారు. లోకేష్ అజ్ఞాతంలోకి వెళ్లిపోవటంతో టాప్ కమెడియన్ పాత్రను ఆయన తండ్రి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈవీఎంలపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు సరికాదనిచ, ఎన్నికలు జరిగిన తీరుపై ఎన్నికల కమిషన్‌కే ఫిర్యాదు చేయడాన్ని చూస్తే.. చంద్రబాబుకు మతి భ్రమించిన సంగతి అర్థమవుతోందన్నారు.
అధికారులను గుప్పెట్లో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు ఈసీని కూడా తన కనుసన్నల్లో పనిచేయాలని కోరుకుంటున్నారని కాకాణి పేర్కొన్నారు. ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు వేలు చూపించారని, అనంతరం తాను ఎవరికి ఓటు వేశానో తెలియడం లేదనటం విడ్డూరంగా ఉందన్నారు. ఓటింగ్ శాతం పెరగడంతో బాబు బెంబేలెత్తుతున్నారన్నారు. ఓటమి తప్పదని తెలిసి ఎన్నికల కమిషన్‌పై నిందలు వేస్తున్నారని, 2014 ఎన్నికల్లో ఈవీఎంల ద్వారానే గెలిచిన విషయాన్ని ఆయన మర్చిపోయారంటూ మండిపడ్డారు. ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వేవ్ కనిపించిందని తెలిపారు. చంద్రబాబును ప్రజలు అంగీకరించడం లేదని, సైకిల్‌కు ఓటు వేయాలనుకుని పోలింగ్ బూత్‌కు వెళ్లి.. నిర్ణయం మార్చుకున్నారని చెప్పారు. ఓటింగ్ శాతం పెరగడంతో చంద్రబాబుకు ముచ్చెమటలు పడుతున్నాయని అన్నారు. ఓటమిని అంగీకరించకుండా ఆ నెపాన్ని ఈవీఎంల మీద నెట్టాలని చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment