Minister Kakani Govardhan Reddy Comments On Nara Lokesh Padayatra - Sakshi
Sakshi News home page

ఏ పంట ఏదో లోకేశ్‌కు తెలియదు: మంత్రి కాకాణి

Published Sat, Jun 17 2023 9:01 AM | Last Updated on Sat, Jun 17 2023 12:58 PM

Kakani Govardhan Reddy Satirical Comments On Nara Lokesh Padayatra - Sakshi

నెల్లూరు (దర్గామిట్ట): టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా లోకేశ్‌ పాదయాత్రలో పాల్గొనేందుకు ఆసక్తి చూపడం లేదని, యువగళానికి స్పందనే లేదని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి విమర్శించారు. నెల్లూరులోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఏ పంట ఏదో, ఎక్కడ పండుతుందో కనీస పరిజ్ఞానం లేని లోకేశ్‌ వ్యవసాయం గురించి మాట్లాడుతుంటే నవ్వొస్తోందన్నారు. టీడీపీ హయాంలో సాగు, తాగునీరు లేదని, చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు కాటకాలు విలయతాండవం చేస్తాయని చెప్పా­రు.

బాబు హయాంలో ఏటా కరువు మండలాలు ప్రకటించారని గుర్తుచేశారు. సోమశిల లిఫ్ట్‌ ఇరిగేషన్‌ తీసుకొస్తామని చెబుతున్న లోకేశ్‌ చంద్రబాబు హయాంలో ఎందుకు చేయలేకపోయారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రైతురథం పేరుతో కమీషన్లు కొల్లగొట్టింది నిజం కాదా అని ప్రశ్నించారు. అప్పటి మంత్రి సోమిరెడ్డి మిల్లర్ల నుంచి ముడుపులు దండుకున్నాడన్నారు. ఉద్యాన పంటల్లో ఏపీ అగ్రస్థానంలో ఉందన్న విషయం మర్చిపోయి లోకేశ్‌ మాట్లాడుతున్నాడన్నారు. రైతులకు రుణమాఫీ చేస్తామని మోసం చేసింది లోకేశ్‌కు గుర్తురాలేదా అని ప్రశ్నించారు.

కోర్టులో చోరీకి సంబంధించి ఎఫ్‌ఐఆర్‌లో తన పేరు లేకున్నా పదేపదే అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారన్నారు. ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికారన్నారు. పంచాయతీరాజ్‌ మంత్రిగా లోకేశ్‌ వీధిదీపాల నిర్వహణను ఒకేసంస్థకు అప్పగించి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. ప్రజలను రెచ్చగొట్టేందుకు అబద్ధాలు చెబుతున్న లోకేశ్‌ హుందాగా మాట్లాడడం నేర్చుకోవాలని సూచించారు. వ్యవసాయ రంగానికి తామేంచేశామో చెబుతామని, దమ్ముంటే టీడీపీ హయాంలో ఏంచేశారో చెప్పాలని మంత్రి సవాల్‌ చేశారు. 

చదవండి: ‘దేవుడి రథంతో రాజకీయాలా? అగ్నికి ఆహుతి అయినట్లు అబద్దాలా?’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement