బెయిలడిగేదీ వారే... బురద జల్లేదీ వారే! | TDP Double Game In Abdul Salam Family Suicides | Sakshi
Sakshi News home page

బెయిలడిగేదీ వారే... బురద జల్లేదీ వారే!

Published Wed, Nov 11 2020 3:09 AM | Last Updated on Wed, Nov 11 2020 10:37 AM

TDP Double Game In Abdul Salam Family Suicides - Sakshi

నంద్యాల: ఒకవైపేమో ఇంతటి తీవ్రమైన కేసుల్లో 24 గంటలు తిరక్కుండానే బెయిలెలా వచ్చేస్తుందంటూ ప్రశ్నించేది వాళ్లే!!. మరోవంక ‘మిలార్డ్‌! నా క్లయింటుకు బెయిలివ్వండి’ అంటూ కోర్టులో వాదించేది కూడా వాళ్లే!! ఇదీ తెలుగుదేశం నేతల తీరు!?. నంద్యాలలో కుటుంబంతో సహా అబ్దుల్‌ సలామ్‌ ఆత్మహత్య చేసుకున్న వ్యవహారంలో టీడీపీ రాజకీయ కుట్ర స్పష్టంగా బయటపడింది. ఒకవంక టీడీపీ నేతలే తమ లాయర్లను పంపి నిందితులుగా ఉన్న సీఐ సోమశేఖర్‌ రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌ తరఫున కోర్టులో పిటిషన్లు వేసి, వారికి బెయిలొచ్చేలా చేశారు. మరోవంక కోర్టు ఇచ్చిన బెయిలును ప్రభుత్వానికి అంటగడుతూ చంద్రబాబు, అచ్చెన్నాయుడు సర్కారుపై బురదజల్లే ప్రయత్నం చేశారు. నిందితుల్ని ప్రభుత్వం వెనకేసుకొస్తోందని, అందుకే 24 గంటల్లోపే బెయిలొచ్చేసిందని విమర్శలు చేశారు.

నిజానికి అబ్దుల్‌ సలామ్‌ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో బయటపడిన వెంటనే ప్రభుత్వం వేగంగా స్పందించింది. దీనికి కారకులు ఎంతటివారైనా వదలొద్దని, చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించడమే కాకుండా ఈ కేసు దర్యాప్తు కోసం ఇద్దరు ఐపీఎస్‌లను నియమించారు. దీంతో 24 గంటల్లోనే బాధ్యులైన సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌ను సస్పెండ్‌ చేశారు. వారిపై క్రిమినల్‌ కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అయితే కుట్రలకు పెట్టింది పేరైనా టీడీపీ.. అరెస్టయిన ఆ ఇద్దరినీ బెయిలుపై బయటకు తేవటానికి తమ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టరు వేదుర్ల రామచంద్రరావును రంగంలోకి దింపింది. నిందితుల తరఫున ఆయన బెయిలు పిటిషన్‌ వేసి, వారికి బెయిలొచ్చేలా చేశారు. ఇలా నిందితుల్ని బెయిలుపై బయటకు తీసుకొచి్చన టీడీపీ నేతలు... ఆ బెయిలేదో ప్రభుత్వమే ఇచ్చినట్లుగా... నిందితులకు ప్రభుత్వం కొమ్ముకాస్తోందని కూడా విమర్శలు చేయటం వారి నైజానికి పరాకాష్ట.  

బెయిలును రద్దు చేయండి..
వన్‌టౌన్‌ సీఐ సోమశేఖర్‌రెడ్డి, హెడ్‌కానిస్టేబుల్‌ గంగాధర్‌ బెయిల్‌పై బయటకు రావటంతో... దాన్ని రద్దు చేయాలంటూ ప్రభుత్వం తరఫున పిటిషన్‌ దాఖలైంది. మంగళవారం కర్నూలు జిల్లా నంద్యాలలోని జిల్లా సెషన్స్‌ కోర్టులో పోలీసులు ఈ పిటిషన్‌ దాఖలు చేశారు. సీఐ, హెడ్‌ కానిస్టేబుల్‌పై ఐపీసీ సెక్షన్‌ 323, 324, 306 కింద కేసులున్నాయని, వారు బయటకు వస్తే విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున బెయిల్‌ రద్దు చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేస్తూ జిల్లా సెషన్స్‌ కోర్టు జడ్జి మోకా సువర్ణరాజు ఆదేశాలు జారీ చేశారు. 
టీడీపీ కార్యవర్గ జాబితాలో రామచంద్రరావు పేరు 

ఆర్థికంగా అంతంచేసింది అగ్రిగోల్డే..
ఎందరినో బలి తీసుకున్న అగ్రిగోల్డ్‌ దగ్గరే సలామ్‌ ఆత్మహత్యకూ మూలాలు కనిపిస్తాయి. ఈయన గాందీచౌక్‌లోని నిమిషాంబ జ్యువెలరీ షాపులో 22 ఏళ్లుగా గుమస్తాగా పని చేస్తున్నాడు. గతంలో సలాం అనేక మందితో అగ్రిగోల్డ్‌లో డిపాజిట్లు పెట్టించారు. అగ్రిగోల్డ్‌ కంపెనీ బోర్డు తిప్పేయడంతో బాధితులు సలాంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో తన ఇంటిని అమ్మేసి మరీ బాధితులకు రూ.10 లక్షల వరకూ చెల్లించాడు. ఆర్థికంగా చితికిపోయినా... ఏదో ఉద్యోగం ఆసరాగా నెట్టుకొస్తుండగా గతేడాది నవంబర్‌ 7న జ్యువెలరీ షాపులో కిలోన్నర బంగారం, రూ.5.50 లక్షల నగదు చోరీ జరిగింది. ఈ కేసు విచారణలో భాగంగా సలామ్‌ను పోలీసులు వేధించటంతో డిసెంబర్‌ 4న బాత్‌రూంకు అని బయటకువెళ్లి చెత్తను తగలబెట్టి ఆ మంటలను దుస్తులకు అంటించుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దాంతో పోలీసులే గోప్యంగా చికిత్స అందించారు.

చివరకు తన ఇంట్లోవారికి చెందిన 50 తులాల బంగారాన్ని పోలీసులకిచ్చాడని, వారు దాన్ని రికవరీగా చూపించారని సమాచారం. ఆ తరవాత మకాం మార్చి ఆటో నడుపుతూ జీవనం కొనసాగిస్తున్నాడు. గత సోమవారం స్థానికుడైన భాస్కరరెడ్డి సలామ్‌ ఆటో ఎక్కి తరవాత దిగిపోయాడు. అయితే రూ.70వేలు ఆటోలో పోయాయంటూ భాస్కరరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ సోమశేఖర్‌రెడ్డి విచారణ నిమిత్తం సలామ్‌ను స్టేషన్‌కు పిలిపించారు. వారు తమదైన శైలిలో ప్రశ్నించడంతో సలాం మనోవేదనకు గురై కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడినట్లు సెల్ఫీ వీడియోలో పేర్కొన్నాడు. 

టీడీపీ నాయకులెందుకు వాదించారు?
అక్రమ కేసులు బనాయించిన పోలీసులకు టీడీపీ నేతలు వత్తాసు పలకడం శోచనీయం.  పోలీసుల వేధింపులు తాళలేక నలుగురు మృతి చెందితే దానికి కారకులైన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం అభినందించదగ్గ విషయం. టీడీపీ నాయకులు నిందితుల తరఫున వాదించి వారికి బెయిల్‌ ఇప్పించడం బాధాకరం. దీన్ని ముస్లిం మైనార్టీ వర్గాలు మరిచిపోవు.   
 – పఠాన్‌ సాహెబ్‌ఖాన్, నంద్యాల  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement