రోడ్డు ప్రమాదంలో లాల్‌జాన్‌బాషా దుర్మరణం ‘దేశం’ శ్రేణుల దిగ్భ్రాంతి
Published Fri, Aug 16 2013 4:01 AM | Last Updated on Fri, Aug 24 2018 2:33 PM
సాక్షి, గుంటూరు/ కొరిటెపాడు, న్యూస్‌లైన్ : తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ ఎస్‌ఎం లాల్‌జాన్‌బాషా అకాల మరణంతో ఆ పార్టీ జిల్లా శ్రేణులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. మరణవార్త తెలుసుకున్న లాల్‌జాన్‌బాషా తమ్ముడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌ఎం జియావుద్దీన్ తీవ్ర షాక్‌కు లోనయ్యారు. హైదరాబాద్ నుంచి గుం టూరు బయల్దేరిన లాల్‌జాన్‌బాషా నల్లగొండ జిల్లా నార్కెట్‌పల్లి సమీపంలో గురువారం ఉద యం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారనే సమాచారం తెలుసుకున్న పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు, బంధువులు గుంటూరు ఆనందపేటలో ఉన్న ఆయన ఇంటికి భారీగా చేరుకున్నారు.
బాషా కుటుంబసభ్యులను పరామర్శించి, ప్రగాఢసానుభూతి తెలిపారు. 1956 లో జన్మించిన ఆయనకు 1975లో వివాహమైంది. నలుగురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఉమ్మడి కుటుంబాన్ని ఇష్టపడే ఆయన.. తల్లి, ఆరుగురు తమ్ముళ్లు, నలుగురు సోదరీమణులతో తరచూ గడుపుతుంటారు. ఐరన్ వ్యాపారంలో స్థిరపడిన లాల్‌జాన్‌బాషా 1991లో గుంటూరు పార్లమెంట్‌కు పోటీచేసి ఆచార్య ఎన్‌జీ రంగాపై గెలుపొందారు. ఇక్కడ్నుంచి గెలుపొందిన మొట్టమొదటి టీడీపీ ఎంపీగా లాల్‌జాన్‌బాషాకు గుర్తింపు ఉంది. ఆ తర్వాత 1996, 98లలో రాయపాటి సాంబశివరావుపై ఓటమిపాలయ్యారు. 1999లోనూ నరసరావుపేట పార్లమెంట్ స్థానానికి నేదురుమల్లి జనార్దనరెడ్డిపై పోటీచేసి ఓటమిపాలుకాగా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను 2002లో రాజ్యసభకు పంపారు. 2008 వరకు రాజ్యసభ సభ్యునిగా కొనసాగారు. పార్టీ సంక్షోభసమయంలో పొలిట్‌బ్యూరో సభ్యునిగా ఉండి చంద్రబాబుకు ప్రధాన సలహాదారుగా పనిచేశారు. ఢిల్లీలో టీడీపీ అధికారప్రతినిధిగా కూడా ఆయన వ్యవహరించారు. ప్రస్తుతం ముంబైలో మర్కంటైల్ బ్యాంకు చైర్మన్‌గా లాల్‌జాన్‌బాషా కొనసాగుతున్నారు.
నేతల పరామర్శలు..: లాల్‌జాన్‌బాషా కుటుంబ సభ్యులను పరామర్శించి, సానుభూతిని తెలిపిన వారిలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు ధూళిపాళ్ల నరేంద్రకుమార్, యరపతినేని శ్రీనివాసరావు, నక్కా ఆనందబాబు, కొమ్మాలపాటి శ్రీధర్, మాజీమంత్రులు కోడెల శివప్రసాదరావు, ఆలపాటి రాజేంద్రప్రసాద్, గుంటూరు తూర్పు ఎమ్మెల్యే షేక్ మస్తాన్‌వలి, టీడీపీ నాయకులు మన్నవ సుబ్బారావు, దాసరి రాజామాస్టారు, వెన్నా సాంబశివారెడ్డి, ముమ్మనేని వెంకటసుబ్బయ్య, ఎమ్మెల్సీ మహ్మద్ జానీ, వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు నసీర్‌అహ్మద్, చాంద్ బాషా తదితరులు ఉన్నారు. నరసరావుపేట ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి ఫోన్‌లో ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు.
అంత్యక్రియలు నేడు.. : లాల్‌జాన్‌బాషా భౌతికకాయం గురువారం అర్ధరాత్రికి గుంటూరు చేరుకుంటుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. ప్రజల సందర్శనార్థం స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఉంచనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు అంత్యక్రియలు జరగనున్నాయి. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు గుంటూరు వస్తున్నట్లు ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు.
బాషా మృతి పార్టీకి తీరనిలోటు.. : లాల్‌జాన్‌బాషా మరణం పార్టీకి తీరనిలోటని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు ప్రత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు. జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం సంతాప సభ నిర్వహించారు. పుల్లారావు మాట్లాడుతూ క్రమశిక్షణ గల నాయకుడిని పార్టీ కోల్పోయిందని తెలిపారు. అన్ని పార్టీల నేతలతో ఆయన సఖ్యతగా మెలిగేవారని గుర్తుచేశారు. ఇటీవల పార్టీ ప్రకటించిన ముస్లిం మైనార్టీ డిక్లరేషన్‌ను రూపొందించడంలో లాలాజాన్‌బాషా కీలకపాత్ర పోషించారన్నారు. సంతాప సభలో పార్టీ జిల్లా నాయకులు పాల్గొన్నారు. తొలుత లాల్‌జాన్‌బాషా చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు నివాళులు అర్పించారు.
Advertisement
Advertisement