
ఆధునీకరణకు ఆసుపత్రులు సై..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆధునిక టెక్నాలజీకి పెద్ద పీటవేస్తూ నాణ్యమైన వైద్య సేవలందించే ఆసుపత్రులే భవిష్యత్తులో నిలదొక్కుకుంటాయా? ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. నిపుణులైన వైద్యులతోపాటు ఆధునిక ఉపకరణాలను సమకూర్చుకున్న ఆసుపత్రుల్లోనే వైద్యం చేయించుకోవడానికి రోగులు మొగ్గు చూపుతున్నారట. దీనికితోడు ఆసుపత్రుల మధ్య తీవ్ర పోటీ నెలకొంటోంది. ఇంకేముంది మార్కెట్‌లో అందుబాటులో ఉన్న టెక్నాలజీని తప్పనిసరి పరిస్థితుల్లో ఆసుపత్రులు కొనుగోలు చేయాల్సి వస్తోంది. వైద్య చికిత్సలో ఉపయోగించే, అలాగే రోగ నిర్ధారణ పరీక్షలకు వాడే ఎంఆర్‌ఐ, అల్ట్రాసౌండ్, ఎక్స్‌రే, హిమోడైనమిక్ రికార్డింగ్, సర్జికల్ ఇమేజింగ్, వార్మర్ వంటి ఉపకరణాల మార్కెట్ పరిమాణం ప్రస్తుతం భారత్‌లో సుమారు రూ. 4,340 కోట్లకు చేరుకుంది. వృద్ధి రేటు 7 నుంచి 10 శాతం ఉంది.
ప్రైవేటు ఆసుపత్రులే ముందు..
సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడంలో దేశంలో ప్రైవేటు ఆసుపత్రులే ముందుంటున్నాయి. మొత్తం మార్కెట్లో 70 శాతం వాటా ఈ ఆసుపత్రులదే. మెట్రో, అగ్రశ్రేణి నగరాల్లోని పెద్ద ఆసుపత్రులు కొత్త టెక్నాలజీని విరివిగా వినియోగిస్తున్నాయని జీఈ హెల్త్‌కేర్ లైఫ్‌కేర్ సొల్యూషన్స్ విభాగం దక్షిణాసియా డెరైక్టర్ అశుతోష్ బెనర్జీ తెలిపారు. లల్లబాయ్ వార్మర్ ప్రైమ్ ఉపకరణాన్ని ఆవిష్కరించేందుకు హైదరాబాద్ వచ్చిన ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ప్రజల్లో కూడా ఉపకరణాలపట్ల అవగాహన పెరుగుతోంది. కావాల్సిన సౌకర్యాలున్న ఆసుపత్రికే వెళ్తున్నారని చెప్పారు. నవజాత శిశువుల సంరక్షణకు ఉపయోగించే వార్మర్లు దేశవ్యాప్తంగా ఏటా 15,000 అమ్ముడవుతున్నాయని వివరించారు. మొత్తం ఉపకరణాల మార్కెట్లో 40 శాతం వాటాతో జీఈ తొలి స్థానంలో ఉన్నట్టు చెప్పారు. దేశంలో ఫిలిప్స్, జాన్సన్ అండ్ జాన్సన్, సీమెన్స్, ఎరిక్సన్ వంటి కంపెనీల ఉత్పత్తులకు డిమాండ్ ఎక్కువ.
నైపుణ్యానికి టెక్నాలజీ తోడు..: ప్రపంచంలో వస్తున్న అధునాతన టెక్నాలజీని పరిశీలించి, సూచనలిచ్చేందుకు అంతర్జాతీయ పరిశోధనా విభాగాన్ని అపోలో హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకుంది. ఉపకరణాల కొనుగోలుకు ఏటా రూ.100 కోట్ల దాకా ఖర్చు చేస్తున్నట్టు అపోలో హాస్పిటల్స్ ఈడీ సంగీతా రెడ్డి తెలిపారు. రోగుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని, అందుబాటు ధరలో వైద్యం అందించడమే తమ లక్ష్యమని చెప్పారు. నిపుణులైన వైద్యులకు టెక్నాలజీ తోడైతే రోగులకు అత్యుత్తమ వైద్య సేవలు అందుతాయని రెయిన్‌బో హాస్పిటల్స్ ఎండీ రమేష్ కంచర్ల తెలిపారు. కొత్త టెక్నాటజీ వినియోగంలో తమ ఆసుపత్రి ఎప్పుడూ ముందుంటుందని, ఏటా సుమారు రూ.10 కోట్లు వెచ్చిస్తున్నట్టు చెప్పారు.
ధర నియంత్రించాలి..
ఉపకరణాల ధరలు ఖరీదుగా ఉండడం వల్లే చికిత్సల ఖర్చు కూడా ఎక్కువగా ఉంటోందని ఆసుపత్రుల యాజమాన్యాలు అంటున్నాయి. వీటి ధరలు దిగివస్తే సామాన్యులకూ నాణ్యమైన సేవలు చేరతాయని కామినేని హాస్పిటల్స్ ఎండీ కామినేని శశిధర్ తెలిపారు. ‘తక్కువ ధరకే వైద్యం అందించాలని ప్రభుత్వం అంటోంది. అదే ఉపకరణాల ధర విషయంలో మాత్రం దేశంలో నియంత్రణ లేకుండా పోయింది. ఉదాహరణకు గత ఏడాది రూ.1 కోటి ఉన్న ఉపకరణం ధర కాస్తా ఏడాదిలో సగానికి పడిపోతుంది. ఈలోపు మరో కొత్త టెక్నాలజీ మార్కెట్లోకి వస్తుంది. మొత్తంగా తయారీ కంపెనీలు ఆసుపత్రులతో ఆటలాడుకుంటున్నాయి’ అని అన్నారు. కాగా, టెక్నాలజీ కోసం కామినేని ఆసుపత్రులు ఏటా రూ.30 కోట్లదాకా వ్యయం చేస్తున్నాయి.