ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న మృతురాలి బంధువులు రాములమ్మ (ఫైల్)
మన్సూరాబాద్: మోకాలి చికిత్స కోసం వస్తే ప్రాణం పోయిన సంఘటన ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్, అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన పూడూరి రాములమ్మ(48) మోకాలి నొప్పితో బాధపడుతూ గత నెల 21 ఎల్‌బీనగర్‌లోని కామినేని ఆస్పత్రి వైద్యులను సంప్రదించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు వెన్నుపూసకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉన్నందుకు ఆస్పత్రిలో చేరాలని, ఇందుకు రూ. 1.32 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆగస్టు 23న రాములమ్మను ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా, అదే నెల 25న వెన్నుపూసకు శస్త్ర చికిత్స చేశారు. చికిత్స అనంతరం శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ ఈ నెల 3న కడుపులో మరో శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఊపరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టిందని చెబుతూ ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నారు.
మంగళవారం సాయంత్రం ఆమెకు గుండెనొప్పి రావడంతో గుండె పని చేయడం లేదని, కరెంటు షాక్‌తో తిరిగి పల్స్‌రేట్‌ను పెంచామని వైద్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం బంధువులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లోకి వెళ్లి చూడగా రాములమ్మ అప్పటికే మృతిచెందింది. దీనిపై వైద్యులను నిలదీయగా ఇప్పుడే మృతి చెందిందని చెబుతున్నారని బాధితులు ఆరోపించారు. మొదట చికిత్సకు రూ. 1.32 లక్షలు ఖర్చవుతుందని చెప్పారని, అయితే సీఎం సహాయనిధి నుంచి రూ. 2.50 లక్షలు, గొర్లను అమ్మి మరో రూ. 2.70 లక్షలు చెల్లించిప్పటికీ మరో రూ. 1.08 లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రాములమ్మ మృతి చెందిందని, ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్‌బీనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
వైద్యుల నిర్లక్ష్యం లేదు:ఆస్పత్రి సూపరింటెండెంట్
రాములమ్మకు సరైన చికిత్సను అందించామని, వైద్యుల నిర్లక్ష్యం లేదని కామినేని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు పేర్కొన్నారు. న్యూరో సర్జన్ డాక్టర్ అనంత్ చికిత్సను అందించారని, శస్త్ర చికిత్స తరువాత అరుదుగా వచ్చే సమస్యల కారణంగా రాములమ్మ మృతి చెందిందని ఆయన పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment