Doctors neglect
-
మోకాలి చికిత్స కోసం వస్తే ప్రాణం తీశారు!
మన్సూరాబాద్: మోకాలి చికిత్స కోసం వస్తే ప్రాణం పోయిన సంఘటన ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రిలో బుధవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నాగర్‌కర్నూల్, అంబేడ్కర్ నగర్ కాలనీకి చెందిన పూడూరి రాములమ్మ(48) మోకాలి నొప్పితో బాధపడుతూ గత నెల 21 ఎల్బీనగర్లోని కామినేని ఆస్పత్రి వైద్యులను సంప్రదించింది. ఆమెను పరీక్షించిన వైద్యులు వెన్నుపూసకు శస్త్ర చికిత్స చేయాల్సి ఉన్నందుకు ఆస్పత్రిలో చేరాలని, ఇందుకు రూ. 1.32 లక్షలు ఖర్చు అవుతుందని తెలిపారు. దీంతో కుటుంబసభ్యులు ఆగస్టు 23న రాములమ్మను ఆస్పత్రిలో అడ్మిట్ చేయగా, అదే నెల 25న వెన్నుపూసకు శస్త్ర చికిత్స చేశారు. చికిత్స అనంతరం శ్వాస తీసుకోవటంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని పేర్కొంటూ ఈ నెల 3న కడుపులో మరో శస్త్రచికిత్స చేశారు. అనంతరం ఊపరితిత్తుల్లో రక్తం గడ్డ కట్టిందని చెబుతూ ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచి వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఆమెకు గుండెనొప్పి రావడంతో గుండె పని చేయడం లేదని, కరెంటు షాక్‌తో తిరిగి పల్స్‌రేట్‌ను పెంచామని వైద్యులు తెలిపారు. బుధవారం సాయంత్రం బంధువులు ఇంటెన్సివ్ కేర్ యూనిట్లోకి వెళ్లి చూడగా రాములమ్మ అప్పటికే మృతిచెందింది. దీనిపై వైద్యులను నిలదీయగా ఇప్పుడే మృతి చెందిందని చెబుతున్నారని బాధితులు ఆరోపించారు. మొదట చికిత్సకు రూ. 1.32 లక్షలు ఖర్చవుతుందని చెప్పారని, అయితే సీఎం సహాయనిధి నుంచి రూ. 2.50 లక్షలు, గొర్లను అమ్మి మరో రూ. 2.70 లక్షలు చెల్లించిప్పటికీ మరో రూ. 1.08 లక్షలు చెల్లించి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆస్పత్రి వర్గాలు చెప్పడంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే రాములమ్మ మృతి చెందిందని, ఆస్పత్రి యాజమాన్యం, వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్బీనగర్ పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. వైద్యుల నిర్లక్ష్యం లేదు:ఆస్పత్రి సూపరింటెండెంట్ రాములమ్మకు సరైన చికిత్సను అందించామని, వైద్యుల నిర్లక్ష్యం లేదని కామినేని ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రసాదరావు పేర్కొన్నారు. న్యూరో సర్జన్ డాక్టర్ అనంత్ చికిత్సను అందించారని, శస్త్ర చికిత్స తరువాత అరుదుగా వచ్చే సమస్యల కారణంగా రాములమ్మ మృతి చెందిందని ఆయన పేర్కొన్నారు. -
మొక్కుబడిగా ‘కంటి వెలుగు’
నిజాంసాగర్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కంటి వెలుగు కార్యక్రమం గ్రామాల్లో మొక్కుబడిగా సాగుతోంది. వైద్యులు సమయపాలన పాటించకపోవడం, మండల, గ్రామ స్థాయి పలు శాఖల అధికారులు శిబిరాలకు డుమ్మా కొడుతున్నారు. దాంతో క్షేత్రస్థాయిలో కంటి వెలుగు వైద్యుల ఇష్టా రాజ్యంగా మారింది. షెడ్యూల్ ప్రకారం మండలంలోని తెల్గాపూర్ గ్రామంలో మంగళవారం కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. ఆరోగ్య కార్యకర్తలు, ఆశవర్కర్లు, అంగన్వాడీ టీచర్లు సమయానికి శిబిరానికి చేరుకున్నారు. అయితే మండల వైద్యులు, కంటి వైద్యులు శిబిరానికి సకాలంలో హాజరుకాకపోవడంతో వైద్య సిబ్బంది, రోగులు నిరీక్షించారు. గ్రామ పంచాయతి కార్యదర్శి, వీఆర్వోతో పాటు మండల అధికారి కంటి వెలుగు శిబిరానికి దూరంగా ఉన్నారు. గ్రామ, మండలస్థాయి అధికారులు శిబిరాలకు దూరంగా ఉండటంతో వైద్యాధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ ప్రాంత పేదలకు ప్రపంచానికి చూపు నిచ్చేందుకు ప్రభుత్వం కంటి వెలుగుకు శ్రీకారం చుట్టినా నిర్వాహకుల పనితీరుపై స్థానికులు మండి పడుతున్నారు. అధికారులు ఇకనైనా స్పందించి గ్రామాల్లో కంటి వెలుగు కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కాలునే దిండుగా..
ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఝాన్సీ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి కాలును తొలగించిన వైద్యులు.. ఆ కాలును తలగడగా వినియోగించి మరోసారి అమానవీయంగా వ్యవహరించారు. క్యాజువాలిటీ వార్డ్‌లో స్ట్రెచర్‌పై పడుకున్న రోగి.. ఆయన తలగడగా తొలగించిన కాలున్న వీడియోను ఓ స్థానిక టీవీ ప్రసారం చేసింది. దీంతో ఈ ఆసుపత్రి డాక్టర్ల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఓ స్కూలు బస్సుకు క్లీనర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని.. శనివారం బస్సు ప్రమాదంలో కాలు విరగటంతో హుటాహుటిన ఝాన్సీ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఇన్ఫెక్షన్ శరీరమంతా వ్యాపించకుండా ఉండేందుకు డాక్టర్లు వెంటనే కాలు తీసేశారు. అనంతరం, బెడ్‌పై కాకుండా స్ట్రెచర్‌పైనే ఆ వ్యక్తికి చికిత్సనందించిన డాక్టర్లు.. ఆ వ్యక్తికి ఆయన కాలునే తలగడగా పెట్టారు. దీన్ని స్థానిక మీడియా బయటపెట్టడంతో ఈ విషయం ప్రభుత్వ ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది. దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే, తొలగించిన కాలు ఎలా గదిలోకి వచ్చిందో తెలియదని డాక్టర్లంటున్నారు. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఆసుపత్రిలోనే కాలు తొలగించామని, లోపలకు ఎలా వచ్చిందో తెలియదని చెబుతుండగా.. ప్రమాదం జరిగిన చోటే కాలు తెగిపోయిందని, కుటుంబ సభ్యులు దీన్ని తీసుకొచ్చి ఉంటారని మరికొందరంటున్నారు. అయితే.. ఈ ఆసుపత్రిలో స్వీపర్లు, వార్డ్బాయ్లే చిన్న చిన్న సర్జరీలు చేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. -
వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడి మృతి
రాజమహేంద్రవరం క్రైం: వైద్యుల నిర్లక్ష్యంతో ఓ యువకుడు మృతి చెందాడు. దీంతో బంధువులు అతడి మృతదేహంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. బాధితులు, కడియం మాజీ సర్పంచ్ వెలుగు బంటి ప్రసాద్ కథనం ప్రకారం.. సోమవారం బొమ్మురు జాతీయ రహదారిపై జరిగిన మోటారు సైకిల్ ప్రమాదంలో కడియం గ్రామానికి చెందిన పిండి గణేష్(28) తలకు గాయమైంది. అతడిని చికిత్స నిమిత్తం సోమవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇతడిని పరీక్షించిన న్యూరో సర్జన్ విద్యాసాగర్ వెంటనే ఆపరేషన్ చేయాలని, రక్తం అవసరమని బంధువులకు సూచించారు. అయితే బ్లడ్ ఇచ్చేందుకు ఇద్దరు డోనర్లను తీసుకొని బ్లడ్ బ్యాంక్ వద్దకు వెళితే అక్కడ బ్లడ్ తీసేవారు లేరని, వారు వచ్చే సరికి రెండు గంటలు పట్టిందని తెలిపారు. అనంతరం బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ తీశారని తెలిపారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఆపరేషన్ చేసేందుకు థియేటర్ వద్దకు తీసుకువెళ్లినా సాయంత్రం ఆరుదాటినా క్షతగాత్రుడిని పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. సాయంత్రం పరిస్థితి విషమంగా ఉందని, కాకినాడ తీసుకువెళ్లాలని సూచించారని వాపోయారు. డాక్టర్ల సూచన మేరకు కాకినాడ తీసుకువెళితే అక్కడ యాక్సిడెంట్ కేసు ఎఫ్ఐఆర్ లేకుండా చికిత్స చేయబోమని అన్నారని, ఎట్టకేలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల సిఫారసులతో ఆసుపత్రిలోకి చేర్చుకున్నా సరైన చికిత్స అందించలేదని తెలిపారు. దీంతో రాత్రి 8గంటల సమయంలో వైద్యం అందక మృతి చెందాడని వివరించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో యువకుడు మృతి చెందాడని మృతికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ కుల శేఖర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ కిషోర్ ఆందోళన చేస్తున్న వారితో చర్చించారు. బాధ్యుల పై ఎఫ్ఐఆర్ కట్టె వరకూ కదిలే ప్రసక్తి లేదని ఆందోళన నిర్వహించారు. -
కడుపులో కత్తెర వదిలేసిందెవరో
నెల్లూరు (బారకాసు): శస్త్ర చికిత్స చేసి.. రోగి కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేసిన ప్రభుత్వ వైద్యుల తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. నగరంలోని నారాయణరెడ్డిపేట కొత్త కాలువ సమీపంలోని రైస్ మిల్లులో పని చేస్తున్న ఎస్.చలపతి అనే కూలీ ఎడతెగకుండా వస్తున్న కడుపు నొప్పితో బాధపడుతుండగా.. నెల్లూరు సర్వజనాస్పత్రి వైద్యులు గతనెల 3న శస్త్ర చికిత్స చేసిన విషయం విదితమే. అతని కడుపులో టీబీ క్రిములు చేరాయని.. దానివల్ల పేగులు దెబ్బతిన్నాయని గుర్తించిన వైద్యులు వాటిని తొలగించేందుకు ఆపరేషన్ నిర్వహించారు. జనరల్ సర్జన్ విభాగాధిపతి డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ పద్మజారాణి, డాక్టర్ సాయిసుదీప్, మత్తు డాక్టర్ వేణుగోపాల్ ఇందులో పాల్గొన్నారు. ఆపరేషన్ చేయడానికి ఉపయోగించిన కత్తెర (ఫోర్సెప్స్)ను రోగి కడుపులోనే వదిలేసి కుట్లు వేసేశారు. చలపతిని 20 రోజులపాటు ఆస్పత్రి వార్డులోనే ఉంచి వైద్య సేవలందించారు. అనంతరం అతడిని డిశ్చార్జి చేయగా.. చలపతి ఇంటికి వెళ్లినప్పటి నుంచి మూత్రం సక్రమంగా రాకపోవడం, కడుపు ఉబ్బరం, నొప్పి పెరిగాయి. దీంతో చలపతిని అతడి భార్య జానకమ్మ ఈనెల 27న తిరిగి పెద్దాస్పత్రికి తీసుకొచ్చింది. నొప్పి తగ్గకపోగా.. బాగా పెరిగిపోయిందని చెప్పడంతో విధుల్లో ఉన్న వైద్యులు అతడికి మరోసారి ఎక్స్‌రే తీయించారు. అతని కడుపులో కత్తెర ఉన్నట్టు స్పష్టంగా కనిపించడంతో కంగుతిన్నారు. ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా.. కడుపులో పేగులు మడత పడ్డాయని, మరోసారి ఆపరేషన్ చేసి సరిచేస్తామని చెప్పారు. ఈనెల 28న చలపతికి రెండోసారి ఆపరేషన్ చేసి కత్తెరను తొలగించి వార్డుకు తరలించారు. అతడికి వైద్య సేవలందించేందుకు వచ్చిన ఇతర వైద్యులు ఈ విషయాన్ని గుర్తించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. బాధ్యులెవరో! కడుపులో కత్తెర ఉంచి కుట్లు వేసిన వ్యవహారంలో తప్పిదం ఎవరిది, ఈ ఘటన పొరపాటున జరిగిందా లేక నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆపరేషన్ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, చలపతి విషయంలో వైద్య బృందం ఏవిధంగా వ్యవహరించిందనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై ఇప్పటికే ప్రాథమిక విచారణ జరిపిన వైద్యాధికారులు కలెక్టర్‌కు నివేదిక అందజేశారు. పాటించాల్సిన నిబంధనలివీ రోగి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన అనంతరం సదరు వ్యక్తికి శస్త్ర చికిత్స అవసరమని భావిస్తే అందుకు అవసరమైన చర్యలు చేపడతారు. ప్రమాణాలను అనుసరించి ఒక్కొక్క శస్త్ర చికిత్సను ఒక్కొక్క రకంగా చేయాల్సి ఉంటుంది. కొన్నిరకాల శస్త్ర చికిత్సలను సహాయ వైద్యులు (అసిస్టెంట్ డాక్టర్స్) లేకుండానే ప్రధాన వైద్యులు చేస్తారు. కానీ.. పొట్టను కోసి ఆపరేషన్ చేయాల్సిన కేసుల విషయంలో మాత్రం ప్రధాన వైద్యునికి అసిస్టెంట్ డాక్టర్లు సహకరిస్తారు. చేయాల్సిన ఆపరేషన్ ఎలాంటిదనే అంశాన్ని ప్రధాన వైద్యుడు నిర్ధారించుకున్న అనంతరం ఆ విషయాన్ని శస్త్ర చికిత్స నిపుణుల బృందానికి, సహచర వైద్యులకు, నర్సులకు ముందు రోజునే తెలియజేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా వైద్య బృందం తగిన పరికరాలు, మందులు, ఇతర సామగ్రితో ఆపరేషన్ చేసేందుకు సిద్ధమవుతుంది. రోగికి తగిన పరీక్షలు నిర్వహించి.. ఆపరేషన్ థియేటర్‌కు తరలిస్తారు. ఆపరేషన్ చేసే ప్రాంతం మినహా రోగి శరీరాన్ని క్లాత్‌తో మూసేస్తారు. ఆ తరువాత అనస్థిస్ట్ ఆ రోగికి మత్తు ఇస్తారు. అతడు మత్తులోకి జారుకున్నాడన్న విషయాన్ని నిర్ధారించుకున్న అనంతరం శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలు అంటే గాజు పీసులు, మాప్, కత్తెరలు, బ్లేడ్స్, బ్లేడ్ హ్యాండిల్, ఫోర్సెప్స్, నీడిల్స్‌ను వినియోగిస్తారు. ఆపరేషన్ సందర్భంలో ఏయే పరికరాలను వినియోగిస్తున్నారు, ఎన్ని వినియోగిస్తున్నారనే విషయాన్ని రికార్డులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వైద్యులు అడిగే పరికరాలను నర్సులు అందిస్తుంటారు. శస్త్రచికిత్స పూర్తయిన అనంతరం ఆ విషయాన్ని ప్రధాన వైద్యుడు ప్రకటిస్తారు. అనంతరం ఆపరేషన్ కోసం వినియోగించిన పరికరాలన్నీ ఉన్నాయా లేవా అనే విషయాన్ని ముందే రికార్డు చేసుకున్న జాబితా ఆధారంగా విధిగా సరి చూసుకోవాలి. ప్రాథమిక సూచిక (చెక్ లిస్ట్) ఆధారంగా అన్ని పరికరాలు సరిపోయాయని నిర్ధారించుకున్న అనంతరమే రోగి శరీరానికి కుట్లు వేయాల్సి ఉంటుంది. ఇక్కడేం జరిగింది చలపతికి జనరల్ సర్జన్ విభాగాధిపతి డాక్టర్ పద్మశ్రీతోపాటు డాక్టర్ పద్మజారాణి, డాక్టర్ సాయిసుదీప్, మత్తు డాక్టర్ వేణుగోపాల్‌తోపాటు ముగ్గురు నర్సులతో కూడిన బృందం శస్త్ర చికిత్స నిర్వహించింది. ఈ క్రమంలో అవసరమైన పరికరాలను డాక్టర్ పద్మశ్రీకి నర్సులు అందజేశారు. అయితే, శస్త్ర చికిత్స మొదలైన కొద్దిసేపటికే ఆ బృందంలోని డాక్టర్ పద్మజారాణి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశారని చెబుతున్నారు. ఆ తరువాత శస్త్రచికిత్స ప్రక్రియలో డాక్టర్ పద్మశ్రీ ఉపయోగించిన పరికరాలను కాకుండా సమీపంలో అందుబాటులో ఉన్న అదనపు పరికరాలను కూడా వాడారని సమాచారం. అనంతరం శస్త్రచికిత్స పూర్తిచేసి కుట్లు వేసిన వైద్యులు పని ముగించారు. ఆ తరువాత నర్సు నమోదు చేసుకున్న పరికరాల సంఖ్యను చెక్‌లిస్ట్‌తో సరిచూసుకున్నప్పుడు సరిపోయినట్లుగా గుర్తించింది. అయితే చలపతి శరీరంలో ఉండిపోయిన ఫోర్సెప్స్ (కత్తెర)ను అదనపు పరికరంగా గుర్తించాల్సి ఉంది. ఈ పరికరాన్ని ఆపరేషన్ చేసే సమయంలో అదనంగా వినియోగించినట్టు చెబుతున్నారు. ఒక్కోసారి ఇలాగే జరుగుతుంటాయని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ చలపతికి ఆపరేషన్ నిర్వహించిన సందర్భంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని పలువురు వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతటి నిర్లక్ష్యం వహించిన వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పొరపాటు పునరావృత్తం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటే కాని ఇతర వైద్యులు జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భయంగా ఉందయ్యా నా భర్తకు ఆరోగ్యం బాగాలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడి ప్రభుత్వాస్పత్రిలో మంచి వైద్యం చేస్తారని చెబితే తీసుకొచ్చి చూపించా. డాక్టర్లు పరీక్షలు చేసి పేగులు పాడైపోయాయని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. సరే చేయండని డాక్టర్లకు చెప్పాను. ఈ నెల 3వ తేదీన ఆపరేషన్ చేశారు. ఆ తరువాత 20 రోజుల పాటు ఇక్కడే ఉన్నాం. ఇంటికి తీసుకెళ్లిన మరుసటి రోజు నుంచి కడుపునొప్పి, ఉబ్బరం, మూత్రం సరిగా రాకపోవడతో ఇబ్బంది పడ్డాడు. దీంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చాను. డాక్టర్లు చూసి కడుపులో పేగులు మడతపడి ఉన్నాయని, ఏమీ కాదని చెప్పారు. ఈనెల 28న రెండోసారి ఆపరేషన్ చేశారు. ఆయితే, అసలు సంగతి ఏమిటనేది నాకు సరిగా తెలియడం లేదు. ఆయనను చూస్తుంటే ఏమవుతుందోనని భయమేస్తోందయ్యా. – ఎస్.జానకమ్మ, చలపతి భార్య -
వైద్యుల నిర్లక్ష్యంతో గర్భంలోనే శిశువు మృతి?
హన్మకొండ ఆస్పత్రిలో ఘటన హన్మకొండ చౌరస్తా: పెళ్లై పదేళ్ల తర్వాత కాన్పు కాబోతుందన్న సంతోషం ఆ దంపతుల్లో ఎంతో సేపు నిలవలేదు. వైద్యుల నిర్లక్ష్యంతో గర్భంలోనే శిశువు మృతి చెందగా.. ఆ తర్వాత కూడా వైద్యం అందక ఆ గర్భిణి నరకయాతన పడింది. ఈ ఘటన హన్మకొండ ప్రసూతి ఆస్పత్రిలో మంగళవారం జరిగింది. జయ శంకర్ భూపాలపల్లి జిల్లా వెంకటాపురానికి చెందిన దారా తిరుపతమ్మకు నెలలు నిండ డంతో భర్త అశోక్ నాలుగు రోజుల క్రితం ఏటూరునాగారంలోని సామాజిక ఆస్పత్రికి తీసుకెళ్లాడు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో అక్కడ పట్టించుకు నేవారే లేకుండా పోయారు. తిరుపతమ్మకు సోమవారం పురిటినొప్పులు రావడంతో భర్త అశోక్, సోదరి సమ్మక్కలు ప్రైవేటు వాహనంలో హన్మకొండలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రికి తీసుకొచ్చారు. వైద్య పరీక్ష లు చేసిన సిబ్బంది రాత్రి 8 గంటల సమ యంలో తిరుపతమ్మను చేర్చుకున్నారు. మంచంపై కాకుండా వరండాలో కటిక నేలపైనే తిరుపతమ్మను ఉంచారు. అప్పటికే ఆమెకు ఉమ్మనీరు పోతుండగా.. ఈ విషయా న్ని సమ్మక్క వైద్య సిబ్బందికి చెప్పినా పట్టిం చుకోలేదు. బతిమిలాడినా కనీసం స్పందిం చకపోవగా.. సమ్మక్కను దూషించారే తప్ప.. గర్భిణి వద్దకు వచ్చి చూడలేదు. మంగళవారం ఉదయం పరీక్షించిన వైద్య సిబ్బంది గర్భంలోనే శిశువు చనిపోయినట్లు నిర్ధారించారు. గర్భంలోనే బిడ్డ చనిపోయినట్లు తెలుసుకున్న తిరుపతమ్మ గుండెలవిసేలా ఎడ్చి సొమ్మసిల్లి పడిపోయింది. అయితే, కడుపులో ఉన్న మృత శిశువును మాత్రం మంగళవారం సాయంత్రం తీరికగా ఆమెకు వైద్య సహాయం అందించారు. వైద్యులు సకాలంలో స్పందించి ఉంటే గర్భంలో శిశువు బతికేదని.. గర్భంలోనే శిశువు చనిపోయిందని తెలిసినా.. మంగళవారం సాయంత్రం వరకు వైద్యం అందించలేదని బంధువులు, భర్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
జీజీహెచ్‌లో శిశువు మృతి
-
శవానికి వైద్యమంటూ హడావుడి!
విశాఖ: వైద్యుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. ఈ ఘటన విశాఖ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో గురువారం చోటుచేసుకుంది. చికిత్స కోసం సూర్యారావు అనే వ్యక్తి ఆస్పత్రికి వచ్చాడు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అతడు మృతిచెందాడు. దాంతో సూర్యారావు మృతిచెందిన విషయాన్ని ఆస్పత్రి యాజమాన్యం కప్పిపుచ్చుకునే యత్నం చేసింది. ఏకంగా శవానికే మెరుగైన వైద్యం అందించాలంటూ హడావుడి చేసిన ఆస్పత్రి వైద్యులు మరో ఆస్పత్రికి తరలించేందుకు యత్నించారు. ఆస్పత్రి యాజమాన్యం తీరుపై అనుమానం వచ్చిన మృతుని కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. -
వైద్యం వికటించి బాలుడి మృతి
► వైద్యుల నిర్లక్ష్యంతో మృతిచెందాడని కుటుంబసభ్యుల ఆందోళన ► వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందాడని కుటుంబ ► సభ్యుల ఆందోళన నర్సింగ్ హోం అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం మహబూబ్‌నగర్ క్రైం : వైద్య వికటించి ఓ బాలుడు మృతి చెందాడు. వైద్యుల నిర్లక్ష్యంతోనే మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నర్సింగ్ హోం ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ సంఘటన జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు.. పాన్‌గల్ మండలం రేమొద్దులకు చెందిన రాములు, సాయిసుధ ఇద్దరు ప్రభుత్వ ఉపాధ్యాయులు, వృతిరీత్యా ఇద్దరు మక్తల్‌లో నివాసం ఉంటున్నారు. వారికి ముగ్గురు కొడుకులు. రెండో కొడుకు నితిన్ తేజ (5) ఏర్నియా (కిడ్నీకి) సంబంధించిన వ్యాధితో బాధపడుతుండడంతో ఆపరేషన్ చేయించడానికి సోమవారం జిల్లా కేంద్రంలోని బాలాజీ నర్సింగ్ హోంలో ఆడ్మిట్ చేశారు. వైద్యులు మీ బాబుకు ఆపరేషన్ చేస్తామని ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకువెళ్లారు. గంట తర్వాత బాబును బయటకు తీసుకొచ్చారు. తల్లిదండ్రులు వెళ్లి చూస్తే బాబుకు శ్వాస ఆడటం లేదు. గమనించిన తండ్రి తన కొడుకుకు ఏమైందని నిలదీశాడు. మీ వాడు క్షేమంగా ఉ న్నాడని అక్కడి నుంచి పట్టణంలోని మరో ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. అయితే నితిన్ తేజకు ఎడమ భాగంలో గతంలో ఇదే ఏర్నియా వ్యాధి వస్తే పట్టణంలోని ఓ ఆస్పత్రిలో ఆపరేషన్ చేయించారు. ప్రస్తుతం కుడి భాగంలో రావడంతో ఓ స్నేహితుడు ఇచ్చిన సలహాతో ఈ ఆసుపత్రికి వచ్చారు. ఇక్కడ వైద్యుల నిర్లక్ష్యం, అనుభవం లేని వారు సరైన వైద్యం అందకపోవడంతో బాబు మృతి చెందినట్లు బంధువులు ఆరోపించారు. బా బు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యా రు. బాబు మృతి చెందాడనే ఆగ్రహంతో బంధువు లు బాలాజీ నర్సింగ్ హోంకు చెందిన అ ద్దాలు, కిటికీలు, ఇతర ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. విషయం తెలియడంతో సంఘటన స్థలాన్ని రూరల్ సీఐ రా మకృష్ణ, టూటౌన్ సీఐ సోమ్‌నారాయణ సింగ్, ఎస్ఐలు రాజేశ్వర్‌గౌడ్, మురళి సందర్శించి బంధువుల కు నచ్చచెప్పారు. ఈ క్రమంలో ప్రైవేట్ ఆస్పత్రి వై ద్యులు మొత్తం అక్కడికి చేరుకుని నష్టపరిహారం చెల్లిస్తామని చర్చలు జరిపారు. ఈ సంఘటనపై వైద్యులను సంప్రదించడానికి యత్నిస్తే అందుబాటులోకి రాలేదు -
బాధ్యతారాహిత్యానికి నిండు ప్రాణం బలి
అటు వైద్యులు.. ఇటు పోలీసులు.. రెండు శాఖల అధికారుల బాధ్యతారాహిత్యంతో ఓ నిండు ప్రాణం బలైంది. చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో అపస్మారక స్థితిలో ఉన్న ఓ రోగిని 4రోజుల క్రితం పోలీసులు చేర్పించారు. రోగికి సహాయకులు ఎవరూ లేరని వైద్యులు నిర్లక్ష్యం చేశారు. చివరకు అతను చనిపోవడంతో, మా తప్పు లేదంటే, మా తప్పు కాదంటూ బుకాయిస్తున్నారు. - చౌటుప్పల్ చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో ఈ నెల 21న సాయంత్రం 4గంటల సమయంలో 1033అంబులెన్సు సిబ్బంది, హైవే పెట్రోలింగ్ పోలీసులు సుమారు 50సంవత్సరాల వయస్సు గల ఓ వ్యక్తిని చేర్పించారు. హైవేపై తుఫ్రాన్‌పేట స్టేజీ సమీపంలో అపస్మారక స్థితిలో పడి ఉన్న ఇతడిని స్థానికులు గుర్తించి సమాచారమిచ్చారు. 21న ఉదయం ఇతను రోడ్డు ప్రమాదానికి గురై ఉంటాడని, చేతికి గాయం ఉందని, అంబులెన్సు సిబ్బంది చెబుతున్నారు. రోగికి సహాయకులు ఎవరూ లేకపోవడంతో వైద్యులు నిర్లక్ష్యం చేశారు. వార్డులో వేసి గ్లూకోజ్ పెట్టారు. కే-షీట్ కూడా రాయలేదు. వైద్య సిబ్బంది కూడా పట్టించుకోలేదు. చివరకు శుక్రవారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ఆ వృద్ధుడు మృతిచెందాడు. విషయం వెలుగులోకి వచ్చిందిలా.. సంస్థాన్ నారాయనపురం మండలం పుట్టపాక గ్రామానికి చెందిన ఓ పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. మృతదేహాన్ని చూసేందుకు, కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపేందుకు సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి ఆసుపత్రికి వచ్చారు. శవాన్ని చూసిన అనంతరం, వార్డులోకి వెళ్లగా, ఈ వృద్ధుడు ఓ మంచంపై కొన ఊపిరితో, జీవచ్ఛవంలా ఉన్నాడు. ఇది చూసి వైద్యులను ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించాడు. రోగికి సహాయకులు ఎవరూ లేరని, మేమేం చేస్తామని, పోలీసులకు సమాచామిచ్చినా రాలేదని సమాధానమిచ్చారు. నంద్యాల వెళ్లిపోయిన కొద్దిసేపటికే, వృద్ధుడు మృతిచెందాడు. దీంతో సీపీఎం నాయకులు డాక్టర్లను నిలదీశారు. రోగుల పట్ల ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎలా అంటూ వాగ్వాదానికి దిగారు. రోగికి డాక్టర్లు కే-షీట్ కూడా రాయకపోవడం పట్ల ఆశ్చర్యానికి గురయ్యారు. ఆసుపత్రి వద్ద సీపీఎం నాయకులు ఆందోళన చేస్తున్నారని వైద్యులు పోలీసులకు సమాచారమివ్వడంతో, ఎస్ఐ మల్లీశ్వరి పోలీసులతో కలిసి ఆసుపత్రికి వచ్చారు. ఆస్పత్రి ఎదుట సీపీఎం ఆందోళన.. రోగి మృతికి కారణమైనై వైద్యులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, సీపీఎం నాయకులు చింతల భూపాల్‌రెడ్డి, బూరుగు కృష్ణారెడ్డి, రొడ్డ అంజయ్య, చీరిక సంజీవరెడ్డి, అరుణ్ తదితరులు ఆస్పత్రి ఎదుట ఆందోళకు దిగారు. డాక్టర్లపై పోలీసు కేసునమోదు చేయాలన్నారు. రోగికి కేవలం ఒక గ్లూకోజ్ ఇచ్చి వదిలేశారని, అందుకే చనిపోయాడన్నారు. అపస్మారక స్థితిలో ఉన్నప్పటికీ, గ్లూకోజులు ఎక్కించి ఉంటే బతికే వాడన్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని, రోగికి కే-షీట్ రాయకపోవడం చూస్తే, వైద్యుల నిర్లక్ష్యం తేటతెల్లమవుతుందన్నారు. అసలు ప్రమాదం జరిగిందెప్పుడు..? చౌటుప్పల్‌లోని ప్రభుత్వాసుపత్రిలో మృతిచెందిన గుర్తుతెలియని వ్యక్తి మృతిపై పోలీసులు వీఆర్ఏ రాజశేఖర్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేశారు. ఈ నెల 21వ తేదీన, ఖైతాపురం శివారులో మధ్యాహ్నం 12గంటలకు గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందని పోలీసులు కేసునమోదు చేయగా, ఆసుపత్రి వైద్యులేమో, 3రోజుల క్రితం అనగా 22వ తేదీ మధ్యాహ్నం 4గంటలకు ఆసుపత్రిలో క్షతగాత్రుడిని చేర్పించారని చెబుతున్నారు. తప్పు మాది కాదంటే.. మాది కాదు.. ! రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి సహాయకులు ఎవరూ లేకపోతే, పోలీసులే సహాయకులుగా ఉండాలి. ఇదే విషయమై, ఆస్పత్రికి వచ్చిన ఎస్ఐ మల్లీశ్వరిని వైద్యులు సమాచారం ఇచ్చినా ఎందుకు రాలేదని, రోగిని ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. అసలు నాకు సమాచారం ఎవరూ ఇవ్వలేదని, సీపీఎం నాయకులు ఆందోళన చేస్తున్నారంటే, ఇక్కడికి వచ్చానని ఎస్ఐ చెప్పారు. లేదు శుక్రవారం ఉదయం 11.30గంటలకు ఫోన్ చేశానని డాక్టర్ వీరన్న చెప్పడంతో, ఎస్ఐ మల్లీశ్వరి అంగీకరించారు. దీంతో మల్లీశ్వరి మాట్లాడుతూ అవును నాకు రోగి మంచంపైనే మలమూత్రాలు విసర్జిస్తున్నాడని, ఏదైనా చేయమని చెప్పారని, హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లమని చెప్పలేదని చెప్పుకొచ్చారు. అసలు మేం రోగినే చేర్పించలేదని ఎస్ఐ అంటే, మీవాళ్లే చేర్పించారని డాక్టర్లు, చేర్పిస్తే నాకు సమాచారమిస్తారని ఎస్ఐ, పెట్రోలింగ్ పోలీసులే తీసుకొచ్చారని డాక్టర్లు, ఇలా ఒకరిపై ఒకరు తప్పును నెట్టివేసుకుంటూ వాదనలకు దిగారు. -
'బతికుండగానే మార్చురీకి తరలించాలని చూశారు'
హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీ నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో తల్లీబిడ్డ బతికుండగానే మార్చురీకి తరలించే ప్రయత్నం చేశారని బంధువులు ఆరోపించారు. వైద్యుల నిర్లక్షంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బతికున్న పేషెంట్ చనిపోయారని వైద్యులు తప్పుడు సమాచారం ఇచ్చారని బంధువులు ఆరోపించారు. తాము గుర్తించి చెబితే వైద్యం ప్రారంభించారని చెప్పారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సివుంది. -
బతికున్న పేషంట్ చనిపోయారని...
-
వైద్యుల నిర్లక్ష్యంతో శిశువు మృతి, బంధువుల ధర్నా
హైదరాబాద్ : వైద్యుల నిర్లక్ష్యం వల్లే శిశువు మృతి చెందిందంటూ ఓ బాలింత బంధువులు పాతబస్తీలోని ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి ముందు సోమవారం ఉదయం ఆందోళనకు దిగారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం... రంగారెడ్డి జిల్లా పరిగికి చెందిన కార్పెంటర్ రాజు భార్య సంతోషి (22) డెలివరీ కోసం ప్రసూతి ఆస్పత్రిలో ఈ నెల 18న చేరింది. ఆదివారం రాత్రి పురిటి నొప్పులు ఎక్కువ కావడంతో వార్డులోని సిబ్బందికి తెలిపారు. వైద్యుడిని పిలిపించాలని కోరినా... ఎవరూ రాలేదు. రాత్రి 12.30 గంటల సమయంలో సంతోషి బిడ్డను ప్రసవించింది. శిశువు పుట్టిన గంట తర్వాత వైద్యులు వచ్చారు. అప్పటికే పుట్టిన శిశువు మృతి చెందింది. దీంతో సంతోషి బంధువుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైద్యులు సరైన సమయానికి రాకపోవడం వల్లే శిశువు మృతి చెందిందని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్నాకు దిగారు. (షాలిబండ) -
తప్పనిసరి ప్రభుత్వసేవల వైద్యులపై నిర్లక్ష్యం
* ఐదు నెలలుగా గౌరవ వేతనం ఇవ్వకుండా సర్కారు జాప్యం * పీజీ విద్యార్థుల స్టైపెండ్ పెంపులోనూ నిర్లిప్తత * 2012 నాటి హామీలకూ అతీగతీ లేదు సాక్షి, హైదరాబాద్: జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదిపాటు తప్పనిసరి వైద్య సేవల నిబంధన కింద వైద్యం అందిస్తున్న పీజీ పూర్తయిన డాక్టర్లపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గతేడాది అక్టోబర్ నుంచి వారికి గౌరవ వేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ పరిణామం వారిని మానసిక వేదనకు గురిస్తోంది. గత నెల నుంచి పెరిగిన గౌరవ వేతనం ప్రకారం పీజీ పూర్తయిన డాక్టర్లకు నెలకు రూ. 40 వేలు, పీజీ డిప్లొమా పూర్తయిన వారికి రూ. 38 వేలు, పీజీ సూపర్ స్పెషాలిటీ పూర్తయిన వారికి రూ.45 వేలు స్టైపెండ్ ఇవ్వాలి. ప్రతి నెలా ఐదో తేదీలోపు గౌరవ వేతనం చెల్లించాలని జీవో 107 స్పష్టంగా చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా కొనసాగుతోంది. సర్కారు నిర్లక్ష్యానికితోడు ప్రణాళికేతర బడ్జెట్లో ఈ చెల్లింపులు ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీన్ని చక్కదిద్ది గ్రీన్‌చానల్ పద్ధతిలో ప్రతి నెలా గౌరవవేతనమిచ్చే ప్రయత్నాలు జరిగినా అధికారులు పట్టించుకోలేదని మండిపడుతున్నారు. పెరగని పీజీ విద్యార్థుల స్టైపెండ్... నిత్యావసర ధరలకు అనుగుణంగా పీజీ వైద్య విద్యార్థుల స్టైపెండ్‌ను రెండేళ్లకోసారి 15 శాతం పెంచాలి. 2012 జనవరిలో చివరిసారిగా ఇది 15 శాతం పెరిగింది. ఆ తర్వాత 2014 జనవరి నుంచి పెరగాల్సి ఉంది. కానీ గడువు దాటి 13 నెలలు కావస్తున్నా వీరి స్టైపెండ్‌ను ప్రభుత్వం పెంచలేదు. అప్పటి నుంచి ఎరియర్స్ ఇవ్వాలి. ఇటీవల 62 రోజులపాటు జరిగిన జూడాల సమ్మె సందర్భంగా స్టైపెండ్ పెంచుతామని సర్కారు హామీ ఇచ్చింది. కానీ సీఎం వద్దకు పెంపు ఫైలు వెళ్లినా ఇంకా ఆమోదం లభించలేదని అధికారులే చెబుతున్నారు. మరోవైపు స్టైపెండ్ చెల్లింపులో సర్కారు మెలిక పెట్టింది. గత ఏడాది జనవరి నుంచి కాకుండా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే పెంపును వర్తింప చేస్తామంటోంది. అయితే ఇది అన్యాయమంటూ జూడాలు మండిపడుతున్నారు. ప్రభుత్వ జాప్యం కారణంగా దాదాపు వెయ్యి మంది పీజీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. రెసిడెన్షియల్ వైద్యులుగా పీజీలకు హోదా కల్పించాలి... పీజీ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న స్టైపెండ్ అఖిల భారత స్థాయి స్టైపెండ్‌తో పోలిస్తే అత్యంత తక్కువ. రాష్ట్రంలో మొదటి సంవత్సరం పీజీ విద్యార్థులకు రూ. 20,700, రెండో సంవత్సరం వారికి రూ. 21,700, మూడో సంవత్సరం వారికి రూ. 23 వేలు స్టైపెండ్ ఇస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ పీజీలకు అదే వరుసలో రూ. 26 వేలు, రూ. 27 వేలు, రూ. 28 వేలు ఇస్తున్నారు. అదే అఖిల భారత స్థాయి స్టైపెండ్ ఇస్తున్న నిమ్స్‌లో పీజీలకు రూ. 50 వేల వరకు, సూపర్ స్పెషాలిటీ వారికి రూ. 60 వేల వరకు ఆయా కేటగిరీల్లో ఇస్తున్నారు. నిమ్స్ స్వయం ప్రతిపత్తి సంస్థ కావడంతో అక్కడ కేంద్ర సంస్థల స్థాయిలో ఇస్తున్నారు. ఎయిమ్స్‌లోనూ ఆ స్థాయిలోనే స్టైపెండ్ ఇస్తున్నారు. అలాగే నిమ్స్, ఎయిమ్స్‌లలో పీజీ విద్యార్థులకు రెసిడెన్షియల్ వసతి కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పీజీ వైద్యుల సేవలను బోధనాసుపత్రుల్లో కేవలం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉపయోగించుకుంటున్నారు. అదే ఎయిమ్స్, నిమ్స్‌ల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి సేవలను వినియోగించుకుంటున్నారు. అంతేకాదు విడతల వారీగా 24 గంటలూ వారి సేవలు అందుతాయి. అందువల్ల వారికి స్టైపెండ్ ఎక్కువ ఇస్తూనే రెసిడెన్షియల్ వసతి ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ పీజీలకు అటువంటి వసతి సౌకర్యం కల్పించి స్టైపెండ్ పెంచాలని పీజీ విద్యార్థులు కోరుతున్నారు. దానివల్ల నిరంతరం రోగులకు సేవలు అందుతాయంటున్నారు. 2012లో జూడాలు సమ్మె చేసినప్పుడు ఈ డిమాండ్ చర్చకు వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం రెసిడెన్షియల్ వసతి కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ అది అమలులోకి రాలేదు. కాగా, ఈ అంశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా తప్పనిసరి ప్రభుత్వ వైద్య సేవల్లో ఉన్న పీజీ పూర్తయిన డాక్టర్లకు ఐదు నెలలుగా గౌరవ వేతనం ఎందుకు అందడంలేదో పరిశీలించి చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఇప్పటివరకు కొన్ని ఇబ్బందులు తలెత్తినా ఇకముందు జరగకుండా తగు చర్యలు తీసుకుంటానన్నారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి, బంధువుల ధర్నా
ఖమ్మం: జిల్లాలో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. వైద్యం వికటించి ఓ మహిళ మృతిచెందింది. ఈ ఘటన అర్ధరాత్రి చోటుచేసుకుంది. చికిత్స నిమిత్తం సైదాబీ అనే మహిళను ఖమ్మంలోని ఓ ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలిసింది. ఆమెకు వైద్యులు చికిత్స అందించగా, వైద్యం వికటించి ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది. దాంతో వైద్యుల నిర్లక్షమే కారణమంటూ మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆస్పత్రి అద్దాలు ధ్వంసం చేశారు. అక్కడి వైద్యులపై దాడికి యత్నించారు. తమకు న్యాయం చేయాలంటూ శవాన్ని ఆస్పత్రి ఎదుటే ఉంచి బంధువులు ధర్నాకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతురాలి బంధువులకు సర్దిచెప్పి వారిని శాంతింప చేసినట్టు సమాచారం. -
వైద్యుల నిర్లక్ష్యంతో 9నెలల చిన్నారి మృతి
హైదరాబాద్: నగరంలోని ఓ ఆస్పత్రిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యానికి గురైన 9నెలల చిన్నారి చికిత్స నిమిత్తం అబిడ్స్‌లోని ఆదిత్య ఆస్పత్రిలో చేరింది. ఆ చిన్నారికి వైద్యం చేయాలంటే 40వేల రూపాయలు కట్టాల్సిందిగా వైద్యలు చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో ఆ చిన్నారి తల్లిదండ్రులు అంతా సోమ్ము చెల్లించలేమని, ముందుగా కొంత సొమ్ము చెల్లిస్తామని, వైద్యం చేయమని వైద్యులను కోరారు. అందుకు ప్రైవేటు ఆస్పత్రి వైద్యులు అంగీకరించలేదు. డబ్బులు చెల్లించలేదనే కారణంతో ఆ చిన్నారికి చికిత్స చేయలేదు. దీంతో సకాలంలో వైద్యం అందకపోవడంతో ఆ చిన్నారి మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మృతిచెందడాని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యుల వైఖరికి నిరసనగా ఆస్పత్రి ముందు బంధువులు ఆందోళనకు దిగినట్టు సమాచారం. -
వైద్యులు మానసిక వైకల్యం పై నిర్లక్ష్యం
సాక్షి, సంగారెడ్డి: మానసిక వికలాంగులు మరణశయ్యపై ఊగిసలాడుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా కనీస వైద్యం అందక మృత్యువుకు చేరువవుతున్నారు. సంగారెడ్డిలోని జిల్లా కేంద్రాస్పత్రి ప్రాంగణంలో ఉన్న మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న రోగుల్లో 20 మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రోజులు లెక్కబెడుతున్నారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో ఇద్దరు రోగులు మృతి చెందారు. 2004లో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఈ పునరావాస కేంద్రంలో 497 మంది మానసిక వికలాంగులను ఆశ్రయం కల్పించగా.. అందు లో ఏకంగా 80 మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 61 మంది రోగులు ఆశ్రయం పొందుతుండగా.. అందులో 40 మంది వివిధ రకాల శారీరక అనారోగ్యంతో బాధపడుతున్నవారే. క్షయతో పాటు కాలేయ సంబంధిత వ్యాధులతో అందులో 20 మంది బక్కచిక్కిపోయి ఉన్నారు. పరిస్థితి దయనీయం.. ఇంటిగ్రేటెడ్ న్యూలైఫ్ సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్(ఇన్సెడ్) అనే స్వచ్ఛంద సంస్థ 2004 నుంచి ఆస్పత్రి ప్రాంగణంలో మానసిక వికలాంగుల కోసం పునరావాస కేంద్రాన్ని నిర్వహిస్తోంది. 2007లో అప్పటి కలెక్టర్ పియూష్ కుమార్ పునరావాస కేంద్రం దుస్థితి చూసి చలించిపోయారు. వెంటనే డీఆర్డీఏ నుంచి రూ.25 లక్షల నిధులు కేటాయించడంతో పాటు ఆస్పత్రి ఆవరణలోనే 2 ఎకరాల స్థలాన్ని కేటాయించి సొంత భవనాన్ని సమకూర్చారు. ఆస్పత్రి ఇన్‌పేషంట్ల కోసం వండే భోజనం నుంచే 90 మంది మానసిక వికలాంగులకు రోజూ మూడు పూటల భోజనాన్ని సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రారంభమైన నాటినుంచి ఈ కేంద్రంలో 333 మంది పురుష, 164 మంది మహిళలు కలిపి మొత్తం 497 మంది రోగులకు ఆశ్రయం కల్పించారు. మతిస్థిమితం లేక రోడ్లపై తిరుగుతుంటే పట్టుకుని తీసుకొచ్చిన రోగులే అధికమంది ఉన్నారు. ఇలా రోడ్లపై తిరుగుతూ కామాంధులకు చిక్కి బలైన మతిస్థిమితం లేని నలుగురు మహిళలు ఇక్కడ చేరిన తర్వాత బిడ్డలను ప్రసవించడం వారి దయనీయ స్థితిని తెలియజేస్తోంది. ప్రస్తుతం నలుగురు బాలబాలికలు పిచ్చితల్లులతో పాటే మానసిక కేంద్రంలో ఉంటూ చదువుకుంటున్నారు. రెండు రోజుల కింద ఈ మహిళా రోగి క్షయ వ్యాధితో మరణించడంతో పిల్లలిద్దరూ అనాథలుగా మారారు. దయలేని వైద్య దేవుళ్లు .. అనారోగ్యంతో బాధపడుతున్న మానసిక రోగులను ఎవరైనా మానవతావాదులు పెద్దాస్పత్రిలో చేర్పిస్తే.. ఆస్పత్రి వర్గాలు వైద్య సేవలందించకుండానే బలవంతంగా పునరావాస కేంద్రానికి పంపించి చేతులు దులుపుకుంటున్నారు. చనిపోయిన 80 మందిలో 59 మంది రోడ్లపై నుంచి తీసుకువచ్చినవాళ్లు ఉండగా..మిగిలిన 21 మంది పెద్దాస్పత్రికి వైద్యం కోసం వచ్చి ఇలా పునరావాస కేంద్రానికి చేరినవాళ్లే ఉన్నారు. ముఖ్యంగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారించకుండానే ఈ కేంద్రానికి పంపిస్తుండడం.. ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకపోవడంతో చాలామంది రోగులు మృత్యువాత పడ్డారు. వైద్యులెవరూ ఈ పునరావాస కేంద్రాన్ని సందర్శించి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. కొత్త కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో గత నెల 15వ తేదీన ఓ వైద్యుడు పునరావాస కేంద్రం నుంచి రోగుల కేస్ షీట్లను తెప్పించుకుని వైద్య పరీక్షలు జరిపించినట్లు సంతకాలు చేయడం గమనార్హం. ఇక పునరావాస కేంద్రం భవనానికి ప్రహరీ గోడలు లేకపోవడంతో 139 మంది రోగులు తప్పించుకుని పారిపోయారు.