రాజమహేంద్రవరం క్రైం: వైద్యుల నిర్లక్ష్యంతో ఓ యువకుడు మృతి చెందాడు. దీంతో బంధువులు అతడి మృతదేహంతో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. బాధితులు, కడియం మాజీ సర్పంచ్ వెలుగు బంటి ప్రసాద్ కథనం ప్రకారం.. సోమవారం బొమ్మురు జాతీయ రహదారిపై జరిగిన మోటారు సైకిల్ ప్రమాదంలో కడియం గ్రామానికి చెందిన పిండి గణేష్(28) తలకు గాయమైంది. అతడిని చికిత్స నిమిత్తం సోమవారం ఉదయం పదిన్నర గంటల సమయంలో రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇతడిని పరీక్షించిన న్యూరో సర్జన్ విద్యాసాగర్ వెంటనే ఆపరేషన్ చేయాలని, రక్తం అవసరమని బంధువులకు సూచించారు. అయితే బ్లడ్ ఇచ్చేందుకు ఇద్దరు డోనర్లను తీసుకొని బ్లడ్ బ్యాంక్ వద్దకు వెళితే అక్కడ బ్లడ్ తీసేవారు లేరని, వారు వచ్చే సరికి రెండు గంటలు పట్టిందని తెలిపారు. అనంతరం బ్లడ్ బ్యాంక్ లో బ్లడ్ తీశారని తెలిపారు.
మధ్యాహ్నం రెండు గంటలకు ఆపరేషన్ చేసేందుకు థియేటర్ వద్దకు తీసుకువెళ్లినా సాయంత్రం ఆరుదాటినా క్షతగాత్రుడిని పట్టించుకోలేదని బంధువులు ఆరోపించారు. సాయంత్రం పరిస్థితి విషమంగా ఉందని, కాకినాడ తీసుకువెళ్లాలని సూచించారని వాపోయారు. డాక్టర్ల సూచన మేరకు కాకినాడ తీసుకువెళితే అక్కడ యాక్సిడెంట్ కేసు ఎఫ్‌ఐఆర్ లేకుండా చికిత్స చేయబోమని అన్నారని, ఎట్టకేలకు స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల సిఫారసులతో ఆసుపత్రిలోకి చేర్చుకున్నా సరైన చికిత్స అందించలేదని తెలిపారు. దీంతో రాత్రి 8గంటల సమయంలో వైద్యం అందక మృతి చెందాడని వివరించారు. డాక్టర్ల నిర్లక్ష్యంతో యువకుడు మృతి చెందాడని మృతికి కారణమైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఆసుపత్రి వద్ద ఆందోళన చేశారు. సెంట్రల్ జోన్ డీఎస్పీ కుల శేఖర్, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమేష్ కిషోర్ ఆందోళన చేస్తున్న వారితో చర్చించారు. బాధ్యుల పై ఎఫ్‌ఐఆర్ కట్టె వరకూ కదిలే ప్రసక్తి లేదని ఆందోళన నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment