తప్పనిసరి ప్రభుత్వసేవల వైద్యులపై నిర్లక్ష్యం | State Govt negligence of govt doctors | Sakshi
Sakshi News home page

తప్పనిసరి ప్రభుత్వసేవల వైద్యులపై నిర్లక్ష్యం

Published Wed, Feb 18 2015 5:00 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM

తప్పనిసరి ప్రభుత్వసేవల వైద్యులపై నిర్లక్ష్యం

తప్పనిసరి ప్రభుత్వసేవల వైద్యులపై నిర్లక్ష్యం

* ఐదు నెలలుగా గౌరవ వేతనం ఇవ్వకుండా సర్కారు జాప్యం
* పీజీ విద్యార్థుల స్టైపెండ్ పెంపులోనూ నిర్లిప్తత
* 2012 నాటి హామీలకూ అతీగతీ లేదు
 
సాక్షి, హైదరాబాద్: జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఏడాదిపాటు తప్పనిసరి వైద్య సేవల నిబంధన కింద వైద్యం అందిస్తున్న పీజీ పూర్తయిన డాక్టర్లపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. గతేడాది అక్టోబర్ నుంచి వారికి గౌరవ వేతనం ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తోంది. ఈ పరిణామం వారిని మానసిక వేదనకు గురిస్తోంది. గత నెల నుంచి పెరిగిన గౌరవ వేతనం ప్రకారం పీజీ పూర్తయిన డాక్టర్లకు నెలకు రూ. 40 వేలు, పీజీ డిప్లొమా పూర్తయిన వారికి రూ. 38 వేలు, పీజీ సూపర్ స్పెషాలిటీ పూర్తయిన వారికి రూ.45 వేలు స్టైపెండ్ ఇవ్వాలి. ప్రతి నెలా ఐదో తేదీలోపు గౌరవ వేతనం చెల్లించాలని జీవో 107 స్పష్టంగా చెబుతోంది. కానీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా కొనసాగుతోంది. సర్కారు నిర్లక్ష్యానికితోడు ప్రణాళికేతర బడ్జెట్‌లో ఈ చెల్లింపులు ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. దీన్ని చక్కదిద్ది గ్రీన్‌చానల్ పద్ధతిలో ప్రతి నెలా గౌరవవేతనమిచ్చే ప్రయత్నాలు జరిగినా అధికారులు పట్టించుకోలేదని మండిపడుతున్నారు.
 
 పెరగని పీజీ విద్యార్థుల స్టైపెండ్...
 నిత్యావసర ధరలకు అనుగుణంగా పీజీ వైద్య విద్యార్థుల స్టైపెండ్‌ను రెండేళ్లకోసారి 15 శాతం పెంచాలి. 2012 జనవరిలో చివరిసారిగా ఇది 15 శాతం పెరిగింది. ఆ తర్వాత 2014 జనవరి నుంచి పెరగాల్సి ఉంది. కానీ గడువు దాటి 13 నెలలు కావస్తున్నా వీరి స్టైపెండ్‌ను ప్రభుత్వం పెంచలేదు. అప్పటి నుంచి ఎరియర్స్ ఇవ్వాలి. ఇటీవల 62 రోజులపాటు జరిగిన జూడాల సమ్మె సందర్భంగా స్టైపెండ్ పెంచుతామని సర్కారు హామీ ఇచ్చింది. కానీ సీఎం వద్దకు పెంపు ఫైలు వెళ్లినా ఇంకా ఆమోదం లభించలేదని అధికారులే చెబుతున్నారు. మరోవైపు స్టైపెండ్ చెల్లింపులో సర్కారు మెలిక పెట్టింది. గత ఏడాది జనవరి నుంచి కాకుండా రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే పెంపును వర్తింప చేస్తామంటోంది. అయితే ఇది అన్యాయమంటూ జూడాలు మండిపడుతున్నారు. ప్రభుత్వ జాప్యం కారణంగా దాదాపు వెయ్యి మంది పీజీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
 
 రెసిడెన్షియల్ వైద్యులుగా పీజీలకు హోదా కల్పించాలి...
 పీజీ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న స్టైపెండ్ అఖిల భారత స్థాయి స్టైపెండ్‌తో పోలిస్తే అత్యంత తక్కువ. రాష్ట్రంలో మొదటి సంవత్సరం పీజీ విద్యార్థులకు రూ. 20,700, రెండో సంవత్సరం వారికి రూ. 21,700, మూడో సంవత్సరం వారికి రూ. 23 వేలు స్టైపెండ్ ఇస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ పీజీలకు అదే వరుసలో రూ. 26 వేలు, రూ. 27 వేలు, రూ. 28 వేలు ఇస్తున్నారు. అదే అఖిల భారత స్థాయి స్టైపెండ్ ఇస్తున్న నిమ్స్‌లో పీజీలకు రూ. 50 వేల వరకు, సూపర్ స్పెషాలిటీ వారికి రూ. 60 వేల వరకు ఆయా కేటగిరీల్లో ఇస్తున్నారు. నిమ్స్ స్వయం ప్రతిపత్తి సంస్థ కావడంతో అక్కడ కేంద్ర సంస్థల స్థాయిలో ఇస్తున్నారు. ఎయిమ్స్‌లోనూ ఆ స్థాయిలోనే స్టైపెండ్ ఇస్తున్నారు. అలాగే నిమ్స్, ఎయిమ్స్‌లలో పీజీ విద్యార్థులకు రెసిడెన్షియల్ వసతి కల్పించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పీజీ వైద్యుల సేవలను బోధనాసుపత్రుల్లో కేవలం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకే ఉపయోగించుకుంటున్నారు.
 
 అదే ఎయిమ్స్, నిమ్స్‌ల్లో ఉదయం 8 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వారి సేవలను వినియోగించుకుంటున్నారు. అంతేకాదు విడతల వారీగా 24 గంటలూ వారి సేవలు అందుతాయి. అందువల్ల వారికి స్టైపెండ్ ఎక్కువ ఇస్తూనే రెసిడెన్షియల్ వసతి ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల్లోనూ పీజీలకు అటువంటి వసతి సౌకర్యం కల్పించి స్టైపెండ్ పెంచాలని పీజీ విద్యార్థులు కోరుతున్నారు. దానివల్ల నిరంతరం రోగులకు సేవలు అందుతాయంటున్నారు. 2012లో జూడాలు సమ్మె చేసినప్పుడు ఈ డిమాండ్ చర్చకు వచ్చినప్పుడు అప్పటి ప్రభుత్వం రెసిడెన్షియల్ వసతి కల్పిస్తామని హామీ ఇచ్చింది. కానీ అది అమలులోకి రాలేదు. కాగా, ఈ అంశాలను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లకా్ష్మరెడ్డి దృష్టికి ‘సాక్షి’ తీసుకెళ్లగా తప్పనిసరి ప్రభుత్వ వైద్య సేవల్లో ఉన్న పీజీ పూర్తయిన డాక్టర్లకు ఐదు నెలలుగా గౌరవ వేతనం ఎందుకు అందడంలేదో పరిశీలించి చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఇప్పటివరకు కొన్ని ఇబ్బందులు తలెత్తినా ఇకముందు జరగకుండా తగు చర్యలు తీసుకుంటానన్నారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement