ఝాన్సీ: ఉత్తరప్రదేశ్‌లో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బట్టబయలైంది. ఝాన్సీ పట్టణంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి కాలును తొలగించిన వైద్యులు.. ఆ కాలును తలగడగా వినియోగించి మరోసారి అమానవీయంగా వ్యవహరించారు. క్యాజువాలిటీ వార్డ్‌లో స్ట్రెచర్‌పై పడుకున్న రోగి.. ఆయన తలగడగా తొలగించిన కాలున్న వీడియోను ఓ స్థానిక టీవీ ప్రసారం చేసింది. దీంతో ఈ ఆసుపత్రి డాక్టర్ల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఓ స్కూలు బస్సుకు క్లీనర్‌గా పనిచేస్తున్న వ్యక్తిని.. శనివారం బస్సు ప్రమాదంలో కాలు విరగటంతో హుటాహుటిన ఝాన్సీ ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. అయితే ఇన్‌ఫెక్షన్ శరీరమంతా వ్యాపించకుండా ఉండేందుకు డాక్టర్లు వెంటనే కాలు తీసేశారు. అనంతరం, బెడ్‌పై కాకుండా స్ట్రెచర్‌పైనే ఆ వ్యక్తికి చికిత్సనందించిన డాక్టర్లు.. ఆ వ్యక్తికి ఆయన కాలునే తలగడగా పెట్టారు. దీన్ని స్థానిక మీడియా బయటపెట్టడంతో ఈ విషయం ప్రభుత్వ ఉన్నతాధికారుల వరకూ వెళ్లింది.
దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. అయితే, తొలగించిన కాలు ఎలా గదిలోకి వచ్చిందో తెలియదని డాక్టర్లంటున్నారు. ఈ ఘటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారులు ఆసుపత్రిలోనే కాలు తొలగించామని, లోపలకు ఎలా వచ్చిందో తెలియదని చెబుతుండగా.. ప్రమాదం జరిగిన చోటే కాలు తెగిపోయిందని, కుటుంబ సభ్యులు దీన్ని తీసుకొచ్చి ఉంటారని మరికొందరంటున్నారు. అయితే.. ఈ ఆసుపత్రిలో స్వీపర్లు, వార్డ్‌బాయ్‌లే చిన్న చిన్న సర్జరీలు చేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment