నెల్లూరు (బారకాసు): శస్త్ర చికిత్స చేసి.. రోగి కడుపులో కత్తెర వదిలేసి కుట్లు వేసిన ప్రభుత్వ వైద్యుల తీరు సర్వత్రా చర్చనీయాంశమైంది. నగరంలోని నారాయణరెడ్డిపేట కొత్త కాలువ సమీపంలోని రైస్ మిల్లులో పని చేస్తున్న ఎస్.చలపతి అనే కూలీ ఎడతెగకుండా వస్తున్న కడుపు నొప్పితో బాధపడుతుండగా.. నెల్లూరు సర్వజనాస్పత్రి వైద్యులు గతనెల 3న శస్త్ర చికిత్స చేసిన విషయం విదితమే. అతని కడుపులో టీబీ క్రిములు చేరాయని.. దానివల్ల పేగులు దెబ్బతిన్నాయని గుర్తించిన వైద్యులు వాటిని తొలగించేందుకు ఆపరేషన్ నిర్వహించారు. జనరల్ సర్జన్ విభాగాధిపతి డాక్టర్ పద్మశ్రీ, డాక్టర్ పద్మజారాణి, డాక్టర్ సాయిసుదీప్, మత్తు డాక్టర్ వేణుగోపాల్ ఇందులో పాల్గొన్నారు. ఆపరేషన్ చేయడానికి ఉపయోగించిన కత్తెర (ఫోర్‌సెప్స్)ను రోగి కడుపులోనే వదిలేసి కుట్లు వేసేశారు. చలపతిని 20 రోజులపాటు ఆస్పత్రి వార్డులోనే ఉంచి వైద్య సేవలందించారు. అనంతరం అతడిని డిశ్చార్జి చేయగా.. చలపతి ఇంటికి వెళ్లినప్పటి నుంచి మూత్రం సక్రమంగా రాకపోవడం,
కడుపు ఉబ్బరం, నొప్పి పెరిగాయి. దీంతో చలపతిని అతడి భార్య జానకమ్మ ఈనెల 27న తిరిగి పెద్దాస్పత్రికి తీసుకొచ్చింది. నొప్పి తగ్గకపోగా.. బాగా పెరిగిపోయిందని చెప్పడంతో విధుల్లో ఉన్న వైద్యులు అతడికి మరోసారి ఎక్స్‌రే తీయించారు. అతని కడుపులో కత్తెర ఉన్నట్టు స్పష్టంగా కనిపించడంతో కంగుతిన్నారు. ఈ విషయాన్ని బయటకు పొక్కనివ్వకుండా.. కడుపులో పేగులు మడత పడ్డాయని, మరోసారి ఆపరేషన్ చేసి సరిచేస్తామని చెప్పారు. ఈనెల 28న చలపతికి రెండోసారి ఆపరేషన్ చేసి కత్తెరను తొలగించి వార్డుకు తరలించారు. అతడికి వైద్య సేవలందించేందుకు వచ్చిన ఇతర వైద్యులు ఈ విషయాన్ని గుర్తించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
బాధ్యులెవరో!
కడుపులో కత్తెర ఉంచి కుట్లు వేసిన వ్యవహారంలో తప్పిదం ఎవరిది, ఈ ఘటన పొరపాటున జరిగిందా లేక నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఆపరేషన్ చేసే సమయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, చలపతి విషయంలో వైద్య బృందం ఏవిధంగా వ్యవహరించిందనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనపై ఇప్పటికే ప్రాథమిక విచారణ జరిపిన వైద్యాధికారులు కలెక్టర్‌కు నివేదిక అందజేశారు.
పాటించాల్సిన నిబంధనలివీ
రోగి ఆరోగ్య పరిస్థితిని సమీక్షించిన అనంతరం సదరు వ్యక్తికి శస్త్ర చికిత్స అవసరమని భావిస్తే అందుకు అవసరమైన చర్యలు చేపడతారు. ప్రమాణాలను అనుసరించి ఒక్కొక్క శస్త్ర చికిత్సను ఒక్కొక్క రకంగా చేయాల్సి ఉంటుంది. కొన్నిరకాల శస్త్ర చికిత్సలను సహాయ వైద్యులు (అసిస్టెంట్ డాక్టర్స్) లేకుండానే ప్రధాన వైద్యులు చేస్తారు. కానీ.. పొట్టను కోసి ఆపరేషన్ చేయాల్సిన కేసుల విషయంలో మాత్రం ప్రధాన వైద్యునికి అసిస్టెంట్ డాక్టర్లు సహకరిస్తారు. చేయాల్సిన ఆపరేషన్ ఎలాంటిదనే అంశాన్ని ప్రధాన వైద్యుడు నిర్ధారించుకున్న అనంతరం ఆ విషయాన్ని శస్త్ర చికిత్స నిపుణుల బృందానికి, సహచర వైద్యులకు, నర్సులకు ముందు రోజునే తెలియజేయాల్సి ఉంటుంది. దీని ఆధారంగా వైద్య బృందం తగిన పరికరాలు, మందులు, ఇతర సామగ్రితో ఆపరేషన్ చేసేందుకు సిద్ధమవుతుంది.
రోగికి తగిన పరీక్షలు నిర్వహించి.. ఆపరేషన్ థియేటర్‌కు తరలిస్తారు. ఆపరేషన్ చేసే ప్రాంతం మినహా రోగి శరీరాన్ని క్లాత్‌తో మూసేస్తారు. ఆ తరువాత అనస్థిస్ట్ ఆ రోగికి మత్తు ఇస్తారు. అతడు మత్తులోకి జారుకున్నాడన్న విషయాన్ని నిర్ధారించుకున్న అనంతరం శస్త్రచికిత్సకు అవసరమైన పరికరాలు అంటే గాజు పీసులు, మాప్, కత్తెరలు, బ్లేడ్స్, బ్లేడ్ హ్యాండిల్, ఫోర్‌సెప్స్, నీడిల్స్‌ను వినియోగిస్తారు. ఆపరేషన్ సందర్భంలో ఏయే పరికరాలను వినియోగిస్తున్నారు, ఎన్ని వినియోగిస్తున్నారనే విషయాన్ని రికార్డులో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వైద్యులు అడిగే పరికరాలను నర్సులు అందిస్తుంటారు. శస్త్రచికిత్స పూర్తయిన అనంతరం ఆ విషయాన్ని ప్రధాన వైద్యుడు ప్రకటిస్తారు. అనంతరం ఆపరేషన్ కోసం వినియోగించిన పరికరాలన్నీ ఉన్నాయా లేవా అనే విషయాన్ని ముందే రికార్డు చేసుకున్న జాబితా ఆధారంగా విధిగా సరి చూసుకోవాలి. ప్రాథమిక సూచిక (చెక్ లిస్ట్) ఆధారంగా అన్ని పరికరాలు సరిపోయాయని నిర్ధారించుకున్న అనంతరమే రోగి శరీరానికి కుట్లు వేయాల్సి ఉంటుంది.
ఇక్కడేం జరిగింది
చలపతికి జనరల్ సర్జన్ విభాగాధిపతి డాక్టర్ పద్మశ్రీతోపాటు డాక్టర్ పద్మజారాణి, డాక్టర్ సాయిసుదీప్, మత్తు డాక్టర్ వేణుగోపాల్‌తోపాటు ముగ్గురు నర్సులతో కూడిన బృందం శస్త్ర చికిత్స నిర్వహించింది. ఈ క్రమంలో అవసరమైన పరికరాలను డాక్టర్ పద్మశ్రీకి నర్సులు అందజేశారు. అయితే, శస్త్ర చికిత్స మొదలైన కొద్దిసేపటికే ఆ బృందంలోని డాక్టర్ పద్మజారాణి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చేశారని చెబుతున్నారు. ఆ తరువాత శస్త్రచికిత్స ప్రక్రియలో డాక్టర్ పద్మశ్రీ ఉపయోగించిన పరికరాలను కాకుండా సమీపంలో అందుబాటులో ఉన్న అదనపు పరికరాలను కూడా వాడారని సమాచారం. అనంతరం శస్త్రచికిత్స పూర్తిచేసి కుట్లు వేసిన వైద్యులు పని ముగించారు. ఆ తరువాత నర్సు నమోదు చేసుకున్న పరికరాల సంఖ్యను చెక్‌లిస్ట్‌తో సరిచూసుకున్నప్పుడు సరిపోయినట్లుగా గుర్తించింది. అయితే చలపతి శరీరంలో ఉండిపోయిన ఫోర్‌సెప్స్ (కత్తెర)ను అదనపు పరికరంగా గుర్తించాల్సి ఉంది. ఈ పరికరాన్ని ఆపరేషన్ చేసే సమయంలో అదనంగా వినియోగించినట్టు చెబుతున్నారు. ఒక్కోసారి ఇలాగే జరుగుతుంటాయని కొందరు వైద్యులు చెబుతున్నారు. ఏదిఏమైనప్పటికీ చలపతికి ఆపరేషన్ నిర్వహించిన సందర్భంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని పలువురు వైద్యులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇంతటి నిర్లక్ష్యం వహించిన వైద్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పొరపాటు పునరావృత్తం కాకుండా కఠినమైన చర్యలు తీసుకుంటే కాని ఇతర వైద్యులు జాగ్రత్తగా వ్యవహరించే అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
భయంగా ఉందయ్యా
నా భర్తకు ఆరోగ్యం బాగాలేక చాలా ఇబ్బంది పడ్డారు. ఇక్కడి ప్రభుత్వాస్పత్రిలో మంచి వైద్యం చేస్తారని చెబితే తీసుకొచ్చి చూపించా. డాక్టర్లు పరీక్షలు చేసి పేగులు పాడైపోయాయని, ఆపరేషన్ చేయాలని చెప్పారు. సరే చేయండని డాక్టర్లకు చెప్పాను. ఈ నెల 3వ తేదీన ఆపరేషన్ చేశారు. ఆ తరువాత 20 రోజుల పాటు ఇక్కడే ఉన్నాం. ఇంటికి తీసుకెళ్లిన మరుసటి రోజు నుంచి కడుపునొప్పి, ఉబ్బరం, మూత్రం సరిగా రాకపోవడతో ఇబ్బంది పడ్డాడు. దీంతో మళ్లీ ఆస్పత్రికి తీసుకొచ్చాను. డాక్టర్లు చూసి కడుపులో పేగులు మడతపడి ఉన్నాయని, ఏమీ కాదని చెప్పారు. ఈనెల 28న రెండోసారి ఆపరేషన్ చేశారు. ఆయితే, అసలు సంగతి ఏమిటనేది నాకు సరిగా తెలియడం లేదు. ఆయనను చూస్తుంటే ఏమవుతుందోనని భయమేస్తోందయ్యా.
– ఎస్.జానకమ్మ, చలపతి భార్య
Comments
Please login to add a commentAdd a comment