సాక్షి, సంగారెడ్డి: మానసిక వికలాంగులు మరణశయ్యపై ఊగిసలాడుతున్నారు. తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నా కనీస వైద్యం అందక మృత్యువుకు చేరువవుతున్నారు. సంగారెడ్డిలోని జిల్లా కేంద్రాస్పత్రి ప్రాంగణంలో ఉన్న మానసిక వికలాంగుల పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న రోగుల్లో 20 మంది తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతూ రోజులు లెక్కబెడుతున్నారు. గడిచిన నెల రోజుల వ్యవధిలో ఇద్దరు రోగులు మృతి చెందారు.
2004లో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఈ పునరావాస కేంద్రంలో 497 మంది మానసిక వికలాంగులను ఆశ్రయం కల్పించగా.. అందు లో ఏకంగా 80 మంది తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 61 మంది రోగులు ఆశ్రయం పొందుతుండగా.. అందులో 40 మంది వివిధ రకాల శారీరక అనారోగ్యంతో బాధపడుతున్నవారే. క్షయతో పాటు కాలేయ సంబంధిత వ్యాధులతో అందులో 20 మంది బక్కచిక్కిపోయి ఉన్నారు.
పరిస్థితి దయనీయం..
ఇంటిగ్రేటెడ్ న్యూలైఫ్ సొసైటీ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్‌మెంట్(ఇన్‌సెడ్) అనే స్వచ్ఛంద సంస్థ 2004 నుంచి ఆస్పత్రి ప్రాంగణంలో మానసిక వికలాంగుల కోసం పునరావాస కేంద్రాన్ని నిర్వహిస్తోంది. 2007లో అప్పటి కలెక్టర్ పియూష్ కుమార్ పునరావాస కేంద్రం దుస్థితి చూసి చలించిపోయారు. వెంటనే డీఆర్డీఏ నుంచి రూ.25 లక్షల నిధులు కేటాయించడంతో పాటు ఆస్పత్రి ఆవరణలోనే 2 ఎకరాల స్థలాన్ని కేటాయించి సొంత భవనాన్ని సమకూర్చారు. ఆస్పత్రి ఇన్‌పేషంట్ల కోసం వండే భోజనం నుంచే 90 మంది మానసిక వికలాంగులకు రోజూ మూడు పూటల భోజనాన్ని సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రారంభమైన నాటినుంచి ఈ కేంద్రంలో 333 మంది పురుష, 164 మంది మహిళలు కలిపి మొత్తం 497 మంది రోగులకు ఆశ్రయం కల్పించారు. మతిస్థిమితం లేక రోడ్లపై తిరుగుతుంటే పట్టుకుని తీసుకొచ్చిన రోగులే అధికమంది ఉన్నారు. ఇలా రోడ్లపై తిరుగుతూ కామాంధులకు చిక్కి బలైన మతిస్థిమితం లేని నలుగురు మహిళలు ఇక్కడ చేరిన తర్వాత బిడ్డలను ప్రసవించడం వారి దయనీయ స్థితిని తెలియజేస్తోంది. ప్రస్తుతం నలుగురు బాలబాలికలు పిచ్చితల్లులతో పాటే మానసిక కేంద్రంలో ఉంటూ చదువుకుంటున్నారు. రెండు రోజుల కింద ఈ మహిళా రోగి క్షయ వ్యాధితో మరణించడంతో పిల్లలిద్దరూ అనాథలుగా మారారు.
దయలేని వైద్య దేవుళ్లు ..
అనారోగ్యంతో బాధపడుతున్న మానసిక రోగులను ఎవరైనా మానవతావాదులు పెద్దాస్పత్రిలో చేర్పిస్తే.. ఆస్పత్రి వర్గాలు వైద్య సేవలందించకుండానే బలవంతంగా పునరావాస కేంద్రానికి పంపించి చేతులు దులుపుకుంటున్నారు. చనిపోయిన 80 మందిలో 59 మంది రోడ్లపై నుంచి తీసుకువచ్చినవాళ్లు ఉండగా..మిగిలిన 21 మంది పెద్దాస్పత్రికి వైద్యం కోసం వచ్చి ఇలా పునరావాస కేంద్రానికి చేరినవాళ్లే ఉన్నారు. ముఖ్యంగా రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి వ్యాధిని నిర్ధారించకుండానే ఈ కేంద్రానికి పంపిస్తుండడం.. ఆ తర్వాత వారి ఆరోగ్య పరిస్థితిని పట్టించుకోకపోవడంతో చాలామంది రోగులు మృత్యువాత పడ్డారు. వైద్యులెవరూ ఈ పునరావాస కేంద్రాన్ని సందర్శించి రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. కొత్త కలెక్టర్ బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో గత నెల 15వ తేదీన ఓ వైద్యుడు పునరావాస కేంద్రం నుంచి రోగుల కేస్ షీట్లను తెప్పించుకుని వైద్య పరీక్షలు జరిపించినట్లు సంతకాలు చేయడం గమనార్హం. ఇక పునరావాస కేంద్రం భవనానికి ప్రహరీ గోడలు లేకపోవడంతో 139 మంది రోగులు తప్పించుకుని పారిపోయారు.