heart transplant
-
విజయవంతంగా యువకుడి గుండె మార్పిడి
తిరుపతి తుడా: స్థానిక టీటీడీ శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్లో శుక్రవారం ఓ యువకుడికి వైద్యులు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. ఐదు గంటలు శ్రమించి వైద్యులు ఆ యువకుడి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలు... కాకినాడకు చెందిన ఓ యువకుడు(24) గుండె సంబంధ సమస్యతో బాధపడుతూ రెండు నెలలుగా తిరుపతిలోని శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్లో చికిత్స పొందుతున్నాడు. అతని గుండె సామర్థ్యం పూర్తిగా క్షీణించిందని వైద్యులు నిర్ధారించారు. అతనికి గుండె మార్పిడి అనివార్యమని గుర్తించారు. ఈ మేరకు నెల రోజుల కిందట ఆ యువకుడి వివరాలను అవయవదాన్ వెబ్సైట్లో నమోదు చేశారు. గుండె అందుబాటులోకి వచ్చే వరకు ఆ యువకుడిని వైద్యుల బృందం పర్యవేక్షిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడు(39) ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు అక్కడే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆ యువకుడి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించడంతో అతని అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు.ఈ మేరకు అవయవదాన్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేశారు. దీంతో శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ వైద్యులు విశాఖ వెళ్లి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి గుండెను సేకరించి ప్రత్యేక విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 1.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి గ్రీన్ చానల్ ద్వారా 19 నిమిషాల్లో శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌కు చేర్చారు. వెంటనే 2.15 గంటలకు ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో వైద్యులు గుండె మార్పిడి శస్త్రచికిత్సను ప్రారంభించి, సాయంత్రం 7.15 గంటలకు విజయవంతంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా వైద్యులను పలువురు అభినందించారు. 15 మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు గుండె మార్పిడి ఆపరేషన్లలో తిరుపతికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. మహా నగరాల్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే చేస్తున్న గుండె మార్పిడి శస్త్రచికిత్సలను టీటీడీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న టీటీడీ శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్లోనూ విజయవంతంగా చేపడుతున్నారు. ఈ ఆస్పత్రిని ప్రారంభించిన అనతికాలంలోనే 2,560 మందికి పైగా చిన్నారులకు గుండె సంబంధిత శస్త్ర చికిత్సలను చేశారు. అదేవిధంగా శుక్రవారంతో 15 మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు. -
మారిన గుండెతో 4 దశాబ్దాలు
ఆమ్స్టర్డ్యామ్: గుండె కండరాల సమస్య కారణంగా అవయవాలకు అతని గుండె సరిగా రక్తాన్ని సరఫరా చేయలేని పరిస్థితి. ఈ దుస్థితి ఇలాగే ఉంటే మరో 6 నెలలకు మించి బతకవు అని వైద్యులు కరాఖండిగా చెప్పేశారు. అదేకాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె ఈయనకు సరిగ్గా సరిపోయింది. వెంటనే హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీతో ఈయనకు వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. 1984లో గుండె మార్పిడి చేయించుకున్నాక ఇప్పటికీనిక్షేపంగా ఉన్నారు. ప్రపంచంలో గుండె మార్పిడి చేయించుకున్న తర్వాత అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన నెదర్లాండ్స్ వాసి, 57 ఏళ్ల బెర్ట్ జాన్సెన్ కథ ఇది. ప్రస్తుతం గ్లైడర్ పైలెట్‌గా పనిచేస్తున్న ఇతనికి గుండె మార్పిడి చికిత్స జరిగి నేటికి 39 ఏళ్ల 8 నెలల 29 రోజులు. 17 ఏళ్లకు ఫ్లూ వ్యాధి సోకినపుడు వైద్యులు పరీక్షలు చేసి కార్డియో మయోపతి అనే సమస్య ఉందని గుర్తించారు. త్వరగా గుండె మార్చకపోతే ప్రాణానికే ప్రమాదమని తేల్చారు. లండన్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె సరిపోలడంతో ఆయనకు ఆ గుండెను అమర్చారు. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే 16 ఏళ్లకు మించి బతకరనేది అవాస్తవం. గుండె మార్పిడి అద్భుతం అనేందుకు నేనే నిలువెత్తు నిదర్శనం. బర్త్‌డేను అయినా పెద్దగా పట్టించుకోనుగానీ ఆపరేషన్ జరిగిన తేదీ నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు’ అని జాన్సెన్ వ్యాఖ్యానించారు. ‘గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండాలి’ అని ఆపరేషన్ చేసిన ప్రఖ్యాత వైద్యుడు మ్యాగ్డీ యాకూబ్ చెప్పారు. ‘40 ఏళ్ల క్రితం నెదర్లాండ్స్‌లో ఇలాంటి ఆపరేషన్ సౌకర్యాలు లేవు. అందుకే జాన్సెన్ను లండన్‌లోని హేర్ఫీల్డ్ ఆస్పత్రిలో గుండెమార్పిడి చేశా’ అని చెప్పారు. -
హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ సక్సెస్
-
హృదయాలయం.. నిరుపేదల గుండె గుడి
సాక్షి, తిరుపతి : శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం.. నిరుపేదల పాలిట గుండె‘గుడి’గా పూజింపబడుతోంది. చిన్నవయస్సులో హృద్రోగ సమస్యతో ఆస్పత్రిలో చేరిన నిరుపేద చిన్నారులకు గుండె మార్పిడి చేసి పునర్జన్మ ప్రసాదిస్తోంది. వెల కట్టలేని గుండెను ఉచితంగా అమర్చి శభాష్ అనిపించుకుంటోంది. రూ.లక్షల విలువచేసే గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోలేక అనేకమంది చిన్నారులు ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి వారికి పునర్జన్మనివ్వటమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ గొప్ప సత్సంకల్పంతో తిరుపతిలో చిన్నపిల్లల ఆస్పత్రి ఏర్పాటుచేయాలని భావించారు. ఆ బాధ్యతను టీటీడీకి అప్పగించారు. దీంతో కార్డియాక్ కేర్ సెంటర్‌కు టీటీడీ శ్రీకారం చుట్టింది. ఈ ఆస్పత్రి తన మానసపుత్రికగా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ 2021 సెప్టెంబర్ 11న శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. కేవలం ఎనిమిది నెలల్లోనే దీన్ని అందుబాటులోకి తెచ్చారు. అంతేకాక.. అతికొద్ది కాలంలోనే 1,908 గుండె శస్త్రచికిత్సలను ఇక్కడి వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారు. ఈ ఆస్పత్రిలో తొలిసారి గుండెమార్పిడి చికిత్సను కూడా చేయడంతో ఆస్పత్రి కీర్తి ఒక్కసారిగా రెపరెపలాడింది. ఇలా ఇప్పటికి రెండు గుండెమార్పిడి శస్త్రచిత్సలను విజయవంతంగా నిర్వహించింది. తాజాగా.. శ్రీకాకుళంలో బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి గుండెను రోడ్డు మార్గంలోవిశాఖకు తరలించి అక్కడ నుంచి ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో రేణిగుంట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి నిమిషాల వ్యవధిలో తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి తీసుకొచ్చి నెల్లూరుకు చెందిన చిన్నారికి అమర్చారు. ఈ నేపథ్యంలో.. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి ఉత్తమ పీడియాట్రిక్ కార్డియాక్ సెంటర్‌గా గుర్తించి ఆసియా టుడే రీసెర్చ్ అండ్ మీడియా సంస్థ ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డును ఇటీవల ప్రకటించింది. హైదరాబాద్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా ఆస్పత్రి డైరెక్టర్ డా.ఎన్. శ్రీనాధరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స ఇలా.. తిరుపతిలోని టీటీడీ శ్రీపద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సాలయంలో ఈ ఏడాది జనవరి 20న తొలిసారి ఓ చిన్నారికి గుండెమార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. జనవరి 16న జంజూరు సన్యాసమ్మ (48) రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై బ్రెయిన్‌డెడ్ అయ్యింది. షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో ఉన్న ఆమె అవయవదానం చేశారు. ఆమె గుండెను అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం కేఎస్సార్ అగ్రహారం గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలుడికి అమర్చి చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు. దేశంలోని ప్రముఖ వైద్య నిపుణుల సేవలు.. ఇక ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రముఖ గుండె సంబంధిత వైద్య నిపుణులు, ఇతర వైద్య సిబ్బందితో పాటు ఎకో స్కానింగ్, మెడికల్ ల్యాబ్, ఎక్స్‌రే, క్యాథ్‌ల్యాబ్, అడ్వాన్స్డ్ ల్యాబ్ అందుబాటులో ఉన్నాయి. దేశంలోని ప్రముఖ చిన్నపిల్లల గుండె వైద్య నిపుణులు సైతం శ్రీపద్మావతి చిన్నపిల్లల కార్డియాక్ కేర్ సెంటర్‌కు వచ్చి తమ సేవలు అందిస్తున్నారు. వైఎస్సార్ మాట.. అభం శుభం తెలియని ఏ పసిబిడ్డ కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడకూడదు. వ్యాధిబారిన పడ్డ నా బిడ్డను కాపాడుకోలేకపోయాననే వేదన ఏ ఒక్కరూ పడకూడదు. ఇందుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరించాలి. ఆ బాధ్యత నాది అంటూ చిన్నపిల్లల గుండె సంబంధిత చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి వివిధ ప్రముఖ ఆసుపత్రుల్లో అందించేలా దివంగత వైఎస్ కృషిచేశారు. 2003లో చెప్పిన ఆ మాటలను కార్యరూపం దాల్చేలా 2004లో నిర్ణయం తీసుకుని పసిగుండెలకు సాంత్వన చేకూర్చారు. కొండంత అండగా టీటీడీ.. సీఎం ఆదేశాలతో ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావడంలో టీటీడీ అప్పటి ఈఓ కేఎస్ జవహర్‌రెడ్డి, ప్రస్తుత ఈఓ ఏవీ ధర్మారెడ్డి, ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డిలు ఎంతో కృషిచేశారు. ఆస్పత్రి నిర్వహణ, వైద్య సదుపాయాల కోసం రూ.25 కోట్లను టీటీడీ విడుదల చేసింది. 2022–23 వార్షిక ఏడాదికి ప్రాణదాన పథకం ద్వారా వైద్యఖర్చుల కోసం రూ.15 కోట్లను విడుదల చేసి టీటీడీ పెద్దన్న పాత్ర పోషించింది. చిన్నారి గుండెలకు శ్రీవారి అభయం తోడవడంతో అనతికాలంలోనే మంచి గుర్తింపు లభించింది. ముందుకొస్తున్న దాతలు.. మరోవైపు.. ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు ప్రారంభమైన ఎనిమిది నెలల వ్యవధిలోనే ఇక్కడి వైద్య సేవలను గుర్తించి దాతలు ముందుకొస్తున్నారు. శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయం స్కీమ్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఇక్కడి పిల్లల వైద్యం కోసం ఖర్చుచేయాలని టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు టీటీడీ ఇచ్చిన పిలుపునకు వివిధ రాష్ట్రాలకు చెందిన 150 మందికి పైగా దాతలు ముందుకొచ్చారు. రూ.లక్ష నుంచి పది లక్షల వరకు ఈ స్కీమ్‌లో జమచేశారు. ఈ పథకం కింద లక్షపైన ఇచ్చే భక్తులకు వీఐపీ బ్రేక్ (5 మందికి) దర్శన సదుపాయం కల్పిస్తోంది. మరింత మంది దాతలు ముందుకొచ్చి చిన్నారి గుండెలకు అండగా నిలవాలని టీటీడీ పిలుపునిచ్చింది. ఆయన తనయుడిగా.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడుగా సీఎం వైఎస్ జగన్ నాలుగడుగులు ముందుకేసి చిన్నపిల్లల గుండె సంరక్షణ బాధ్యత నాది అంటూ ఓ ఆస్పత్రిని నిర్మించాలని సంకల్పించారు. ఆయన చెప్పిన అనతికాలంలోనే టీటీడీ సహకారంతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ ఉన్న ప్రతి ఒక్కరికీ ఖరీదైన గుండె సంబంధిత చికిత్సలను ఉచితంగా అందజేస్తున్నారు. టీటీడీ సంపూర్ణ సహకారంతో ఆస్పత్రి విజయవంతంగా వైద్యసేవలందిస్తూ అనతి కాలంలోనే దేశం నలుమూలలా వ్యాప్తి చెందింది. వరంగా మారిన ఆరోగ్యశ్రీ.. నిజానికి.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ప్రత్యేకించి చిన్నపిల్లల హార్ట్‌కేర్ సెంటర్ లేదు. గుండె సంబంధిత చికిత్సలనగానే రూ.లక్షలతో కూడుకున్న వైద్యం అన్న భయం జనంలో ఉండేది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేదలకు వరంగా మారింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక గుండెకు గుడి కట్టారు. మహానగరాలకు వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమతలేని ఎన్నో పేద గుండెలకు పునర్జన్మనిస్తున్నారు. తిరుపతిలోని శ్రీపద్మావతి చిల్డ్రన్ కార్డియాక్ కేర్ సెంటర్లో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఉచితంగా శస్త్రచికిత్సలను అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేకున్నా ఇక్కడ వైద్య ఖర్చులు (పరికరాలు, మందులు) భరిస్తే ఎవరికైనా శస్త్రచికిత్సలను చేపడుతున్నారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా వివిధ రాష్ట్రాల్లోని పేదల పిల్లలకు సైతం ఉచితంగానే శస్త్రచికిత్సలను అందిస్తున్నారు. అనతికాలంలోనే వందల మందికి పునర్జన్మ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, టీటీడీ సహకారంతో రూ.12 లక్షలు ఖర్చయ్యే గుండె మార్పిడి శస్త్రచికిత్సలను ఉచితంగా చేస్తున్నాం. అనతి కాలంలోనే వందల మందికి వైద్యులు పునర్జన్మనిచ్చారు. ఈ ఆస్పత్రిని ఆదర్శంగా తీసుకుని అలిపిరి వద్ద సుమారు రూ.450 కోట్ల వ్యయంతో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నాం. డిసెంబర్లో దీనిని ప్రారంభించేందుకు కృషిచేస్తున్నాం. – డాక్టర్ శ్రీనాథరెడ్డి, డైరెక్టర్, శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ -
AP: గుండె మార్పిడితో బాలుడికి పునర్జన్మ
తిరుపతి తుడా: తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం వైద్యులు నిరుపేద కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలుడికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. రాష్ట్రంలో ఓ చిన్నారికి గుండె మార్పిడి చికిత్సను తొలిసారిగా చేపట్టిన రికార్డును ఇక్కడి వైద్యులు సొంతం చేసుకున్నారు. 48 ఏళ్ల మహిళ గుండెను 15 సంవత్సరాల బాలుడికి అమర్చి శభాష్ అనిపించారు. టీటీడీ పరిధిలోని వైద్యుల కృషిని యావత్ ప్రజానీకం శభాష్ అంటూ కొనియాడుతోంది. గతంలో విశాఖపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వేదికగా 40 ఏళ్లు పైబడిన ముగ్గురికి గుండె మార్పిడి చేశారు. ఆ తర్వాత తిరుపతిలో చేపట్టిన గుండె మార్పిడి శస్త్ర చికిత్స చరిత్ర సృష్టించింది. బ్రెయిన్ డెడ్ మహిళ నుంచి.. అన్నమయ్య జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడు ఎం.విశ్వేశ్వరకు జనవరి 20న గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేపట్టారు. విశాఖపట్నంకు చెందిన 48 ఏళ్ల మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె గుండెను గ్రీన్ చానల్ ద్వారా తిరుపతి తీసుకువచ్చి శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో బాలుడికి అమర్చారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డితో కూడిన వైద్యుల బృందం విజయవంతంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్సను చేపట్టింది. 21 రోజులపాటు ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో ఆ బాలుడికి చికిత్సను అందించారు. బాలుడు పూర్తిగా కోలుకోవడంతో నాలుగైదు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నారు. ఆదుకున్న ఆరోగ్యశ్రీ అన్నమయ్య జిల్లాకు చెందిన నరసయ్య, రాధ దంపతులు సాధారణ రైతు కూలీ కుటుంబానికి చెందిన వారు. వీరికి ముగ్గురు పిల్లలు. మొదటి సంతానమైన విశ్వేశ్వర గుండె పూర్తిగా క్షీణించి అనారోగ్యానికి గురి కావడంతో శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి తీసుకువచ్చారు. గుండెకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకినట్టు గుర్తించిన వైద్యులు గుండెమార్పిడి అనివార్యమని తేల్చారు. విశాఖకు చెందిన సన్యాసమ్మ గుండెను బాలుడికి అమర్చి పునర్జన్మను ఇచ్చారు. రూ.40 లక్షల వరకు ఖర్చయ్యే వైద్యాన్ని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించారు. వైద్యుల విజ్ఞప్తి మేరకు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం రూ.10 లక్షలను విడుదల చేసింది. గుండె మార్పిడి అనంతరం బాలుడిని పలకరించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించింది. ఆ బాలుడు గోవింద నామస్మరణ చేస్తూ పులకించిపోయాడు. బాలుడి తల్లిదండ్రులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. -
నిమ్స్‌లో గుండె మార్పిడి సక్సెస్
లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రిలో గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. బ్రెయిన్ డెడ్‌గా మారిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను శనివారం ఉదయం కేవలం 3 గంటల వ్యవధిలోనే మరో వ్యక్తికి అమర్చినట్లు ఆస్పత్రి సీటీ సర్జన్ హెచ్ఓడీ డాక్టర్ ఎం. అమరేష్‌రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా రేకుర్తికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు అస్తాపురం మల్లయ్య (51) ఈ నెల16న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు చికిత్స పొందిన మల్లయ్య ఈ నెల 18న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో జీవన్‌దాన్ బృందం అవయవ దానంపై ఆయన కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించింది. మృతుడి భార్య హేమలత, కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించారు. ఈ క్రమంలో రెండు కిడ్నీలు, లివర్, గుండె, కళ్లను వైద్యులు సేకరించారు. అప్పటికి గుండె మార్పిడి కోసం నిమ్స్ ఆస్పత్రిలో ఎదురు చూస్తున్న శంకర్ గౌడ్ అనే వ్యక్తికి మల్లయ్య నుంచి సేకరించిన గుండెను అమర్చినట్టు నిమ్స్ తెలిపారు. -
మరణించిన కుమారుడి గుండె చప్పుడు విని..
వాషింగ్టన్: చెట్టంత ఎదిగిన బిడ్డ చేతికి అందివచ్చే సమయంలో మరణిస్తే.. ఆ తల్లిదండ్రులు అనుభవించే బాధ వర్ణించడానికి మాటలు చాలవు. జీవితాంతం ఆ కడుపుకోత వారిని బాధపెడుతూనే ఉంటుంది. ఇలాంటి కష్ట సమయంలో కూడా కొందరు తమలోని మానవత్వాన్ని చాటుకుంటారు. తమను వదిలిపోయిన బిడ్డ అవయవాలను దానం చేసి.. మరి కొందరి కడుపుకోతను దూరం చేస్తారు. వారిలో తమ బిడ్డను చూసుకుంటారు. అమెరికాకు చెందిన జాన్ రెయిడ్ కూడా ఇదే పని చేశాడు. 2019 లో డిన్విడ్డీ కౌంటీలో జరిగిన బహుళ వాహన ప్రమాదంలో జాన్ రెయిడ్ కుమారుడు(16) మరణించాడు. దాంతో అతడి అవయవాలను దానం చేసి మరి కొందరికి ప్రాణం పోశాడు జాన్ రెయిడ్. ఇలా అవయవాలు పొందిన వారిలో రాబర్ట్ ఓ'కానర్ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. మసాచుసెట్స్‌కు చెందిన రాబర్ట్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్నాడు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ తప్పనిసరి అని వైద్యులు తెలిపారు. దాంతో జాన్ రెయిడ్ కుమారుడి గుండెని అతడికి అమర్చారు. (చదవండి: ఐదుగురికి లైఫ్ ఇచ్చిన చిన్నారి) ఆపరేషన్ విజయవంతం అయ్యి.. రాబర్ట్ కోలుకుని ఇంటికి వెళ్లాడు. తర్వాత తనకు గుండెని దానం చేసి పునర్జన్మ ఇచ్చిన వారికి కృతజ్ఞతలు తెలపాలని భావించాడు. దాంతో తన హార్ట్‌బీట్‌ని రికార్డు చేసి.. ఓ టెడ్డీ బేర్ బొమ్మలో అమర్చి.. దాన్ని రెయిడ్‌కు బహుమతిగా పంపాడు. రాబర్ట్ పంపిన గిఫ్ట్బాక్స్ని ఒపెన్ చేసిన రెయిడ్ దానిలోని టెడ్డీ బేర్ బొమ్మను బయటకు తీసి చెవి దగ్గర పెట్టుకుని హార్ట్‌బీట్‌ని విన్నాడు. ఒక్కసారిగా కుమారుడే తన దగ్గర ఉన్నట్లు భావోద్వేగానికి గురయ్యాడు రెయిడ్. గుండె చప్పుడు వింటూ కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈ దృశ్యాన్ని రెయిడ్ భార్య వీడియో తీసి ట్విట్టర్లో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇక టెడ్డీ బేర్ షర్ట్ మీద ‘బెస్ట్ డాడ్ ఎవర్’ అని ఉంది. ఆ కోట్ని వాస్తవం చేసి చూపారు అంటూ నెటిజనులు రెయిడ్ని ప్రశంసిస్తున్నారు. -
వచ్చేస్తోంది 3 డి గుండె!
త్రీడీ ప్రింటింగ్... గోడ గడియారం మొదలుకొని జెట్ ఇంజిన్ విడిభాగాల వరకూ దేన్నైనా కళ్లముందు ఇట్టే తయారు చేసివ్వగల ఈ సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు ఇంకో ఘనతను సాధించింది. కార్నెగీ మెలన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల పరిశోధనల పుణ్యమా అని త్వరలోనే మనిషి గుండె కూడా ఈ పద్ధతిలో తయారు కానుంది! గుండెతోపాటు అనేక ఇతర అవయవాలకు ఆధారమైన కొలేజన్ను త్రీడీ టెక్నాలజీ ద్వారా ముద్రించేందుకు కార్నెగీ మెలన్ వర్సిటీ శాస్త్రవే త్తలు సరికొత్త పద్ధతిని ఆవిష్కరించారు. ఫలితంగా గుండెలోని భాగాలతోపాటు పూర్తిస్థాయిలో పనిచేసే గుండెను కూడా ముద్రించేందుకు వీలు ఏర్పడింది. ‘ఫ్రెష్’తో సాధ్యమైందిలా... ఇల్లు కట్టేందుకు ఇటుకలు ఎంత అవసరమో.. కాంక్రీట్ స్తంభాలు కూడా అంతే అవసరం అన్నది మనకు తెలుసు. ఇటుకలు మన శరీర కణాలైతే.. ఆ కణాలన్నింటినీ ఒక ఆకారంలో పట్టి ఉంచేందుకు ఉపయోగపడే ఒక ప్రొటీన్... కొలేజన్. ఇది జీవ రసాయన సమాచార ప్రసారానికి, తద్వారా కణాలు పనిచేసేందుకూ ఉపయోగపడుతుంది. ఈ ఎక్స్ట్రా సెల్యులార్ మ్యాట్రిక్స్ ప్రొటీన్ల మధ్య ఆయా కణాలు వృద్ధి చెందడం ద్వారా అవయవాలు తయారవుతాయన్నమాట. అత్యంత సంక్లిష్టమైన ఈ ప్రొటీన్ నిర్మాణానికి ఇప్పటివరకూ జరిగినవి విఫల ప్రయత్నాలే. ఫ్రీఫామ్ రివర్సిబుల్ ఎంబెడ్డింగ్ ఆఫ్ సస్పెండెడ్ హైడ్రోజెల్స్ (ఫ్రెష్) అనే సరికొత్త పద్ధతిని ఉపయోగించడం ద్వారా శాస్త్రవేత్తలు తాజాగా ఈ పరిమితులన్నింటినీ అధిగమించగలిగారు. లక్షల గుండెలు అవసరం.. ప్రపంచవ్యాప్తంగా గుండె మార్పిడి కోసం ఎదురు చూస్తున్న వారు కొన్ని లక్షల మంది ఉన్నట్లు అంచనా. అవయవ దాతల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో కృత్రిమ గుండె తయారీ అవసరం పెరిగిపోతోంది. ఫ్రెష్ పద్ధతి ద్వారా కణాలు, కొలేజన్ సాయంతో గుండె కవాటాలు, అచ్చం గుండె మాదిరిగానే కొట్టుకునే జఠరికలను కూడా తయారు చేయవచ్చునని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఆడమ్ ఫైన్‌బర్గ్ తెలిపారు. ఎమ్మారై స్కాన్ల ద్వారా రోగుల గుండె నిర్మాణ వివరాలు సేకరించి అచ్చంగా అలాగే ఉండే కృత్రిమ గుండెలను తయారు చేయవచ్చునని చెప్పారు. కొలేజన్ ద్రవ రూపంలో ఉండటం వల్ల దాన్ని త్రీడీ ప్రింటింగ్‌లో ఉపయోగించుకోవడం ఒక సవాలుగా మారిందని... ఉపయోగించిన వెంటనే ఆకారం మారిపోవడం దీనికి కారణమని ఈ ప్రయోగాల్లో పాల్గొన్న మరో శాస్త్రవేత్త ఆండ్రూ హడ్సన్ చెప్పారు. ఫ్రెష్ పద్ధతిలో కొలేజన్ను హైడ్రోజెల్ పదార్థంలో పొరలు పొరలుగా అమరుస్తామని ఫలితంగా కొంత సమయం తరువాత గట్టిపడి తన ఆకారాన్ని నిలుపుకునేందుకు అవకాశం ఏర్పడిందని ఆయన వివరించారు. నిర్మాణం పూర్తయిన తరువాత హైడ్రోజెల్‌ను సులువుగా తొలగించవచ్చునని చెప్పారు. మానవ అవయవాలను పెద్ద ఎత్తున తయారు చేసేందుకు ఈ కొలేజన్ నిర్మాణాలు ఎంతో కీలకమని అన్నారు. కొలేజన్తోపాటు ఫిబ్రిన్, అల్గినైట్, హైలోరోనిక్ యాసిడ్ వంటి ఇతర పదార్థాలను ఫ్రెష్ పద్ధతిలో ఉపయోగించవచ్చు. అన్నింటి కంటే ఆసక్తికరమైన అంశం ఏమిటంటే ఈ పద్ధతికి సంబంధించిన వివరాలన్నీ అందరికీ అందుబాటులో ఉండటం. తద్వారా విద్యార్థులు మొదలుకొని శాస్త్రవేత్తల వరకూ ఎవరైనా ఈ రంగంలో ప్రయోగాలు చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు. అయితే పూర్తిస్థాయి కృత్రిమ అవయవాలు అందుబాటులోకి వచ్చేందుకు మరిన్ని పరిశోధనల అవసరముందని, ఇందుకు కొంత సమయం పట్టవచ్చునని ఫైన్‌బర్గ్ చెప్పారు. -
గుండె మార్పిడి కోసం భారత్‌కు...
కరాచీ: పాకిస్తాన్ హాకీ దిగ్గజం మన్సూర్ అహ్మద్ గుండె మార్పిడి కోసం భారత్ రావాలనుకుంటున్నారు. 49 ఏళ్ల స్టార్ గోల్‌కీపర్ అహ్మద్ 1994 ప్రపంచకప్‌ను పాక్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అయితే గత కొంతకాలంగా మన్సూర్ హృద్రోగంతో బాధపడుతున్నాడు. ఐదేళ్ల క్రితం గుండె కవటాలు మూసుకుపోవడంతో స్టంట్లు అమర్చారు. అయితే ఇపుడు అవి మళ్లీ మూసుకుపోవడంతో అక్కడి హృద్రోగ నిపుణులు గుండె మార్పిడి శస్త్ర చికిత్సే పరిష్కారమన్నారు. అమెరికా, భారత్‌లలోని ప్రఖ్యాత హార్ట్ స్పెషాలిటీ హాస్పిటల్లను సంప్రదించాలని సూచించారు. పొరుగునే ఉన్న భారత్‌లో గుండెమార్పిడి ఆపరేషన్లు విజయవంతం కావడంతో ఇక్కడికి రావాలని మన్సూర్ ఆశిస్తున్నారు. ఆయన చికిత్స కోసం ఇప్పటికే క్రికెటర్ ఆఫ్రిది ఫౌండేషన్ స్పందించి చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. వీసా కోసం కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు వినతి పంపారు. -
ఆమె జీవితం ధన్యం
విశాఖ క్రైం : ఆమె భౌతికంగా ఈ లోకం నుంచి దూరమైనా... మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ సజీవంగానే ఉంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కాటేసినా... పుట్టెడు దుఃఖంలోనూ ఆమె కుటుంబ సభ్యులు మానవతా దృక్పథంతో అవయవాలు దానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ ఘటన నగరంలో ఆదివారం చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై ఆదివారం మృతి చెందిన ఇప్పిలి లక్ష్మి అవయవాలను ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. తాను చనిపోయినప్పటికీ కొందరి బతుకుల్లో అయినా వెలుగులు నింపాలని భావించిన లక్ష్మి... తాను చనిపోతే తన అవయవాలు దానం చేయండి అని కుటుంబ సభ్యుల నుంచి ముందుగానే హామీ తీసుకున్నారు. లక్ష్మి కోరికను భర్త ఇప్పిలి నరసింహస్వామి, కుమారుడు హేమవెంకట కుమార్ నెరవేర్చారు. వివరాల్లోకి వెళ్తే... ఈ నెల 13న ఉదయం విశాఖ కైలాసపురానికి చెందిన ఇప్పిలి లక్ష్మి (58) ఆంజనేయస్వామి గుడికి వెళుతుండగా ఒక ద్విచక్ర వాహనదారుడు అతివేగంగా వచ్చి ఆమెను బలంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు ఆమెను విశాఖలోని ఎన్ఆర్ఐ ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం ఆమె బ్రెయిన్ డెడ్ అయినట్లు కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను జీవన్‌దాన్ ట్రస్ట్‌కు దానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయా ఏర్పాట్లను లక్ష్మి భర్త ఇప్పిలి నరసింహస్వామి, కుమారుడు హేమవెంకట కుమార్‌లతో పాటు కుమార్తెలు, అల్లుల్లు పర్యవేక్షించారు. లక్ష్మి మృతదేమాన్ని సోమవారం ఉదయం కుటుంబ సభ్యులకు అందజేయనున్నట్లు సమాచారం. పుట్టెడు దుఖంలోనూ ఆ కుటుంబ సభ్యులు లక్ష్మికి ఇచ్చిన మాట నెరవేర్చారు. అంత విషాదంలోనూ వారి ఔదార్యాన్ని చూసి అనేక మంది వైద్యులు, నగర వాసులు ప్రసంసలు కురిపించారు. ప్రమాదంపై నాలుగో పట్టణ సీఐ బి.తిరుమలరావు ఆదేశాల మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ ఎర్రాజీరావు తెలిపారు. అమ్మ కోరిక నెరవేర్చేందుకే అమ్మ ప్రమాదానికి గురైనట్లు సమాచారం రాగానే తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. కొన్ని రోజులుగా ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో ఉంచి చికిత్స అందిస్తున్నాం. అయితే ఆదివారం బ్రెయిన్‌డెడ్ కావడంతో అమ్మ కోరిక మేరకు కుటుంబ సభ్యులమంతా కలిసి ఆమె అవయవాలు దానం చేసేందుకు ఏర్పాటు చేశాం. చెన్నై ఆస్పత్రిలో గుండె సమస్యతో బాధపడుతున్న ఒక వ్యక్తికి అమర్చేందుకు గుండెను తరలించనున్నారు. లివర్‌ను విశాఖలోని ఫినాకిల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి, కిడ్నీలను ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తికి అందజేస్తున్నాం. – ఇప్పిలి హేమవెంకట కుమార్ (లక్ష్మి కుమారుడు) -
హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ తప్పదా?
కార్డియాలజీ కౌన్సెలింగ్ నా వయసు 55 ఏళ్లు. అటవీశాఖలో పనిచేస్తున్నాను. రెండునెలల కిందట డ్యూటీలో భాగంగా కొండప్రాంతంలో ఉండగా హఠాత్తుగా కుప్పకూలడంతో హుటాహుటిన వరంగల్‌కు తరలించి ఆసుపత్రిలో చేర్పించారు. హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా అలా జరిగిందన్నారు. ఇప్పుడు పరిస్థితిని అదుపు చేశామనీ, అయితే గుండెమార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలని డాక్టర్లు సూచించారు. జీవన్‌దాన్‌లో పేరు కూడా నమోదు చేసుకున్నాం. నాకు ఇప్పటికే షుగర్, హైబీపీ సమస్యలు ఉన్నాయి. హార్ట్‌ట్రాన్స్‌ప్లాంటేషన్ నన్నెంతకాలం కాపాడుతుంది? దయచేసి వివరించండి. – కె.ఆర్. సమ్మారావు, హనమకొండ అధిక రక్తపోటు, డయాబెటిస్ మీ గుండెకు బాగా నష్టం కలిగించినట్లు కనిపిస్తోంది. మీ ఆహారపు అలవాట్లు, ఇతర వ్యాధులతో వచ్చే ఇన్ఫెక్షన్ల వంటివి కూడా ఉంటే అవి కూడా మీ సమస్యకు తోడై ఉండవచ్చు. ఇవన్నీ హార్ట్‌ఫెయిల్యూర్‌కు దారితీస్తాయి. మీరు అలసిపోయినప్పుడు / పడుకున్నప్పుడు, శ్వాస అందకపోవడం, మితిమీరిన అలసట, ఒళ్లు వాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. గుండె ఇక ఏమాత్రం పనిచేయలేని స్థితి (ఎండ్ స్టేజ్ హార్ట్ ఫెయిల్యూర్)కి చేరుకున్నందున గుండెమార్పిడే మీకు ప్రాణరక్షణ అవకాశం. మీరు తెలిపిన వివరాల ప్రకారం కాలేయం, మూత్రపిండాలు, ఊపిరితిత్తులకు సంబంధించి తీవ్రమైన వ్యాధులేవీ లేవు కాబట్టి మీరు నిర్భయంగా హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు వెళ్లవచ్చు. సాధారణంగా హార్ట్ ఫెయిల్యూర్ వ్యాధిగ్రస్తులు చాలామంది హఠాత్తుగా కన్నుమూస్తుంటారు. గుండెకొట్టుకోవడంలో అసాధారణమైన హెచ్చుతగ్గులు ఇందుకు దారితీస్తుంటాయి. మీరు ఇప్పటికే జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేసుకున్నందున, మీరు చెప్పిన వివరాల ప్రకారం పరిస్థితి తీవ్రంగా ఉన్నందువల్ల అధిక ప్రాధాన్యతతో బ్రెయిన్‌డెడ్ వ్యక్తి నుంచి మీకు గుండె కేటాయింపు జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఎలాంటి అనుమానాలు పెట్టుకోకుండా గుండెమార్పిడి అవకాశాన్ని ఉపయోగించుకోండి. కార్డియోమయోపతి అంటే ఏమిటి..? నా వయసు 38 ఏళ్లు. ఈ మధ్య కొంతకాలం నుంచి తరచూ శ్వాస అందని పరిస్థితి ఏర్పడుతోంది. విపరీతమైన అలసటతో పాటు కాళ్లవాపు కూడా కనిపిస్తోంది. నెల కిందట స్పృహతప్పి పడిపోయాను. మా ఫ్యామిలీ డాక్టర్‌కు చూపించుకుంటే కార్డియాలజిస్ట్ వద్దకు పంపారు. ఆయన ‘కార్డియో మయోపతి’ కావచ్చని అంటూ పరీక్షలు చేయిస్తున్నారు. ఈ వ్యాధి ఏమిటి? చికిత్స ఏమిటి? దయచేసి వివరంగా తెలపండి. – బి. నర్సిమ్ములు, ఆర్మూరు కార్డియో మయోపతీ గుండె కండరాలకు సంబంధించిన వ్యాధి. ప్రారంభంలో ఎలాంటి ప్రత్యేక లక్షణాలూ వ్యక్తం కావు. మీలో కనిపిస్తున్న లక్షణాలు కార్డియోమయోపతినే సూచిస్తున్నాయి. దీన్ని గుర్తించి చికిత్స చేయడంలో జాప్యం జరిగితే అది అకాలమరణానికి దారితీయవచ్చు. చాలా కారణాల వల్ల డయలేటెడ్ కార్డియోమయోపతి రావడానికి అవకాశం ఉంటుంది. కొన్ని కుటుంబాలలో ఈ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుంటుంది. కార్డియో మయోపతిలో మూడు ప్రధాన రకాలు కనిపిస్తాయి. అవి డయలేటెడ్ కార్డియో మయోపతి, హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి, రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి. వైరస్‌లతో ఇన్ఫెక్షన్, అదుపుతప్పిన అధిక రక్తపోటు (హైబీపీ), గుండె కవాటాలకు సంబంధించిన సమస్యలు, మితిమీరి మద్యపానం ఈ వ్యాధికి దారితీసే ప్రధాన కారణాలు. కొన్ని కుటుంబాలలో జన్యువుల మార్పు లేదా మ్యూటేషన్ కారణంగా వంశపారంపర్యంగా డయలేటెడ్ కార్డియోమయోపతి కనిపిస్తుంది. తల్లిదండ్రుల్లో ఒకరికి డయలేటెడ్ కార్డియోమయోపతి ఉంటే పిల్లల్లో సగం మందికి ఈ వ్యాధి సంక్రమిస్తుంది. చాలా సందర్భాల్లో డయలేటెడ్ కార్డియోమయోపతి నెమ్మదిగా అభివృద్ధిచెందుతుంది. కానీ కొంతమందిలో వ్యాధి నిర్ధారణ కావడానికి ముందే తీవ్రమైన లక్షణాలు వ్యక్తమవుతుంటాయి. శ్వాస తీసుకోవడం కష్టం ఉండటం, పొట్ట – చీలమండ వాపు, విపరీతమైన అలసట, గుండెదడ డయలేటెడ్ కార్డియోమయోపతిలో కనిపించే ప్రథమ లక్షణాలు. కార్డియోమయోపతి కారణంగా గుండె కొట్టుకోవడంలో తీవ్రమైన హెచ్చుతగ్గులు (అరిథ్మియాసిస్), ఛాతీలో నొప్పి, రక్తం గడ్డకట్టడం వంటి మరికొన్ని సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున వాటి తీవ్రతను బట్టి చికిత్స చేస్తారు. అధిక రక్తపోటు, గుండెస్పందనల్లో విపరీతమైన హెచ్చుతగ్గులను మందులతో అదుపు చేస్తారు. గుండెకొట్టుకోవడంలో అసాధారణ మార్పును అదుపుచేయడానికి అవసరమైతే పేస్‌మేకర్ అమర్చుతారు. ఇక కార్డియోమయోపతిలోని మిగతా రెండు రకాలు పూర్తిగా వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధులు. హైపర్ ట్రోఫిక్ రకంలో గుండెకండరాలు, గుండెగోడలు మందంగా తయారవుతాయి. రెస్ట్రిక్టివ్ రకంలో గుండెగదుల్లో రక్తం భర్తీ అయ్యేందుకు అవసరమైన ఒత్తిడికి సంబంధించిన లోటు ఏర్పడుతుంది. హైపర్ట్రోఫిక్ కార్డియోమయోపతి వ్యాధిగ్రస్తుల్లో గుండె కండరాలు, గోడలు మందంగా మారడం అందరిలో ఒకేలా ఉండదు. మొత్తం కార్డియోమయోపతి కేసుల్లో హైపర్ట్రోఫిక్ రకానికి చెందినవి 4 శాతం ఉంటే, రెస్ట్రిక్టెడ్ కార్డియోమయోపతి కేసులు ఒక శాతం మాత్రమే ఉంటాయి. హైపోట్రోఫిక్, రెస్ట్రిక్టివ్ రకాల కార్డియోమయోపతీలో చికిత్స ప్రధానంగా వ్యాధి లక్షణాలను అదుపు చేయడం, పరిస్థితి విషమించకుండా అదుపు చేయడం లక్ష్యంగా జరుగుతుంది. గుండె ఏ మేరకు నష్టపోయింది, ఎలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయన్న అంశాల ఆధారంగా డాక్టర్లు చికిత్సను నిర్ణయిస్తారు. అధికరక్తపోటు, గుండెకొట్టుకోవడంలో అసాధారణ పరిస్థితి వంటి లక్షణాలను అదుపు చేయడానికి డాక్టర్లు మందులు ఇస్తారు. హృదయస్పందనలు నిరంతరం సక్రమంగా జరిగేలా చూడటానికి అవసరాన్ని బట్టి పేస్‌మేకర్‌ను అమర్చుతారు. గుండెకొట్టుకోవడంలోని లోటుపాట్లు ప్రాణాపాయానికి దారితీసేలా కనిపిస్తే దాన్ని సరిచేయడానికి ఐసీడీ (ఇంప్లాంటబుల్ కార్డియాక్ డిఫిబ్రిలేటర్) పరికరాన్ని అమర్చుతారు. డాక్టర్ పి.వి. నరేష్కుమార్, సీనియర్ కార్డియో థొరాసిక్, హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సికింద్రాబాద్. -
1300 కిలోమీటర్లు.. ఓ గుండె ప్రయాణించిన దూరం!
ముంబై నుంచి చెన్నైకి.. 1300 కిలోమీటర్లు ప్రయాణించి.. ఓ గుండె మరో మనిషికి ప్రాణం పోసింది. అవయవ దానంపై స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన పెంచుతుండడంతో దాని ఆవశ్యకతను ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. తాజాగా ముంబయిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను ఏకంగా 1300 కిలోమీటర్ల దూరంలోని ఓ వ్యక్తికి అమర్చి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఇందుకు ఎయిర్పోర్ట్ అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది, వైద్యులు ఎంతో సహకారం అందించారు. నవీ ముంబైకి చెందిన చేతన్ టేలర్ ఓ చిరు వ్యాపారి. అతను తీవ్ర అస్వస్థతతో 20 రోజుల క్రితం అపోలో ఆస్పత్రిలో చేరాడు. అతని మెదడులో రక్తస్రావం అవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దాన్ని ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు అతని కుటుంబసభ్యులకు తెలిపారు. అలాగే అవయవదానం గురించి చేతన్ భార్య, కుమారుడికి అవగాహన కల్పించడంతో వారు చేతన్ గుండెను దానం చేసేందుకు ముందుకొచ్చారు. చేతన్ కుటుంబసభ్యులు గుండె దానానికి ఒప్పుకోవడంతో నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ రంగంలోకి దిగింది. చెన్నైలోని నివసిస్తున్న లెబనాన్‌కు చెందిన 61 ఏళ్ల వ్యాపారవేత్తకు ఆ గుండె సరిపోతుందని తెలియడంతో చేతన్ హృదయాన్ని నవీ ముంబై నుంచి చెన్నైకి తరలించారు. గుండెను తరలించే క్రమంలో అధికారులు ఎక్కడిక్కడ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో ఆస్పత్రి నుంచి కేవలం 40 నిమిషాల్లో గుండెను ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేర్చారు. చార్టెడ్ విమానంలో అక్కడి నుంచి 4 గంటల్లో చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రికి తీసుకొచ్చి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు. -
1300 కిలోమీటర్లు..ఓ గుండె ప్రయాణించిన దూరం!
-
చిన్ని గుండెకు ఎంత కష్టం!
► గుండె పెరుగుదలతో బాధపడుతున్న పీయూష్ ► గుండె మార్పిడి శస్త్రచికిత్స తప్పనిసరి ► రూ.30 లక్షలు ఖర్చవుతాయన్న వైద్యులు ► దాతల సహకారం కోరుతున్న బాబు తల్లి డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ) : ఆడుతూ.. పాడుతూ తిరిగే బాలుడికి పెద్ద కష్టం వచ్చింది. పదేళ్ల పీయూష్‌కు చిన్ని గుండె మోయలేని భారవైుంది. బాబు గుండె పెరిగిందని, గుండె మార్పిడి తప్పనిసరి అని వైద్యులు తెలిపారు. భర్త మరణంతో కుంగిన బాబు తల్లి జి.పద్మావతి తన బిడ్డను కాపాడాలంటూ దాతల సహకారం కోరుతోంది. వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో శని వారం ఆమె విలేకరుల సమావే శంలో తన ఆవేదన తెలిపింది. పద్మావతి భర్త భిలాయ్‌లోని మహేంద్రటెక్లో పని చేసేవారు. వారికి బాబు పీయూష్ కుమార్, పాప భార్గవి ఉన్నారు. తొమ్మిది నెలల క్రితం అనారోగ్యంతో భర్త మరణించారు. ఆదరించాల్సిన అత్తామామలు అక్కడి నుంచి పంపించేయడంతో పద్మావతి పిల్లలతో సహా విశాఖలో చెల్లెలు ఇంటికి వచ్చేశారు. పీయూష్‌ను సమీపంలోని పాఠశాలలో చేర్పించి చదివిస్తున్నారు. ఆర్నెల్ల క్రితం పీయూష్‌కు కడుపునొప్పి రావడంతో ఓ వైద్యుడిని సంప్రదించగా ఆయన హృద్రోగ నిపుణుడిని కలవాలని సూచించారు. కేజీహెచ్‌లో పరీక్షించిన డాక్టర్లు బాబు గుండె మూడింతలైందని, రక్తప్రసరణ కష్టమవుతోందని చెప్పారు. బాబు బతకాలంటే గుండె మార్పిడి శస్త్రచికిత్స తప్పనిసరని, ఇందుకు రూ.30 లక్షలు ఖర్చవుతాయని చెప్పడంతో తల్లి కన్నీరుమున్నీరవుతోంది. తన వద్ద ఉన్న కొద్ది సొమ్మును వైద్యానికే ఖర్చు చేశానని, దికు్కతోచని స్థితిలో దాతల సహకారం కోరుతున్నానని చెప్పారు. సాయం చేయాలనుకునేవారు జి.పద్మావతి, అకౌంట్ నంబరు 20324336 423, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మర్రిపాలెం శాఖ, ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎస్బీఐ/015 630కు జమ చేయవచ్చని లేదా 75873 29589, 79976 37887 నంబర్లలో సంప్రదించి సాయం చేయవచ్చని కోరుతున్నారు. -
జీజీహెచ్‌లో రెండో గుండె మార్పిడి ఆపరేషన్ సక్సెస్
వివరాలు వెల్లడించిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గుంటూరు రూరల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో చేసిన రెండో గుండెమార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయిందని కార్డియాలజిస్ట్ డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే తెలిపారు. ఆదివారం గుంటూరులో విలేకరులతో ఆయన మాట్లాడారు. ఈ నెల 4న హీరామూన్బాయి అనే మహిళకు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేశామన్నారు. ఆమె గుండె ఆదివారం నుంచీ సజావుగా పనిచేస్తోందని, మరో రెండు రోజుల్లో ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. నెల్లూరు నుంచి గుండెను గుంటూరుకు తరలించేందుకు సహకరించి హెలికాప్టర్‌ను ఇచ్చిన కృష్ణపట్నం పోర్టు ఎండీ శశిధర్, సీఈవో అనిల్‌కు, 25 మంది రక్తదాతలకు, ప్రత్యేక సౌకర్యాలు కల్పించిన ఐజీ సునీల్‌కుమార్‌కు, గుండె మార్పిడికి సహకరించిన జీవన్‌దాన్ డాక్టర్ కృష్ణమూర్తికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలోని సౌకర్యాలను వినియోగించుకోగా మందులు తదితరాలకు రూ.20 లక్షలు, హెలికాప్టర్ కోసం రూ.5 లక్షలు.. మొత్తం రూ.25 లక్షలు ఖర్చయిందన్నారు. ఇలాంటి శస్త్ర చికిత్సల నిర్వహణకు ప్రభుత్వం కూడా తోడ్పాటునందించాలని కోరారు. -
గుంటూరుకు గుండె తరలింపు
-
ఆరోగ్యశ్రీలోకి ‘అవయవ మార్పిడి’
- అందులో భాగంగా కొత్తగా 25 వైద్య సేవలు - ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రతిపాదనలు - గుండె మార్పిడికి అధికంగా రూ. 16.50 లక్షల ప్యాకేజీ సాక్షి, హైదరాబాద్: అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ వైద్యసేవల్లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గుండె, లివర్, ఊపిరితిత్తులు, స్టెమ్‌సెల్ వంటి కీలకమైన అవయవ మార్పిడి ఆపరేషన్లను నిర్వహించనున్నారు. వీటిలో అత్యధికంగా గుండె మార్పిడి చికిత్సకు రూ.16.50 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు. ఈ అవయవ మార్పిడుల తర్వాత కూడా రోగులకు అవసరమైన వైద్య సేవలనూ ఉచితంగానే నిర్వహించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న వైద్య సేవలకు అదనంగా మరో 25 వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. కొత్తగా అమలుపరిచే ైవె ద్య సేవలు, అందుకు చెల్లించాల్సిన చార్జీలకు సంబంధించిన ప్రతిపాదనలను ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రభుత్వానికి పంపించింది. -
అవయవ దాతను పిండేశారు!
- అవయవాలను దానం చేసిన ఏడుకొండలు కుటుంబం - బాధితుడి కుటుంబానికి దక్కని స్వాంతన - అతడి వైద్యానికి రూ.1.20 లక్షల బిల్లు వేసిన కార్పొరేట్ ఆసుపత్రి - బిల్లు చెల్లించడానికి అప్పులు చేసి రోడ్డున పడ్డ నిరుపేద కుటుంబం సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యానికి రూ.లక్షల్లో ఫీజు చెల్లించడానికి అప్పులు చేసి రోడ్డున పడింది ఓ అవయవ దాత కుటుంబం. బ్రెయిన్ డెడ్‌కు గురై ఆరు అవయవాలను దానం చేసిన వ్యక్తి కుటుంబానికి సర్కారు పైసా సాయం కూడా అందించలేదు. రాష్ట్రంలోనే మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి(జీజీహెచ్) చరిత్ర సష్టించిందని గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం ఆ గుండెను ఇచ్చిన కుటుంబాన్ని మాత్రం విస్మరించింది. శస్త్రచికిత్సను విజయవంతం చేసిన డాక్టర్ ఆళ్ల గోపాలకష్ణ గోఖలేను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు ఘనంగా సత్కరించారు. ఆరుగురికి అవయవదానం చేసిన కుటుంబాన్ని కనీసం గుర్తించలేదు. తమ లాంటి పేదలను ప్రభుత్వం ఆదుకోవాలని, వైద్యం ఖర్చులనైనా భరించాలని అవయవదాత భార్య, బిడ్డలు కోరుతున్నారు. ఏడుకొండలు కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి ముఖ్యమంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో కలిశారు. సహాయం అందించాలని కోరారు. పేద కుటుంబానికి చేయూతనివ్వాలని ఎమ్మెల్యే బొండా ఉమా కోరగా పరిశీలిద్దామని చంద్రబాబు ముక్తాయించారు. అసలేం జరిగిందంటే...: విజయవాడ సింగ్‌నగర్ ప్రాంతంలో నివసించే ఇమడాబత్తిన ఏడుకొండలు(44) డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. మే 13వ తేదీన మోటారుసైకిల్‌పై వెళుతూ బీఆర్టీఎస్ రోడ్డులో బస్సు ఢీకొని గాయాలపాలయ్యాడు. వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. అక్కడి వైద్యం తీరుతో బెంబేలెత్తిన ఏడుకొండలు కుటుంబం అతడిని వెంటనే మంగళగిరి ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో చేర్చింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ఫోన్లో వాకబు చేసిన తరువాత బ్రెయిన్ డెడ్ అని 19వ తేదీన డాక్టర్లు చెప్పారు. అవయవదానం గురించి ఏడుకొండలు కుటుంబానికి జీవన్‌దాన్ ట్రస్టు ప్రతినిధి వివరించారు. ఏడుకొండలుకు చెందిన ఆరు అవయవాలను దానం చేయడానికి అతడి భార్య నాగమణి, పిల్లలు జాహ్నవి, దీపక్ అంగీకరించారు. గుండెను గుంటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మరో డ్రైవర్‌కు అమర్చారు. ఒక మూత్రపిండాన్ని ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో రోగికి అమర్చారు. మరో మూత్రపిండాన్ని విజయవాడలోని అరుణ్ కిడ్నీ సెంటర్‌కు, కాలేయాన్ని తాడేపల్లెలోని మణిపాల్ ఆసుపత్రికి, రెండు కళ్లను వాసన్ ఐ కేర్‌కు జీవన్‌దాన్ ట్రస్టు అందజేసింది. గుండె మార్పిడికి రూ.35 లక్షలు ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో ఏడుకొండలుకు వైద్యం అందించినందుకు యాజమాన్యం రూ.1.20 లక్షలు వసూలు చేసింది. బాధితుడి కుటుంబం అప్పులు చేసి మరీ ఈ సొమ్మును చెల్లించింది. కర్మకాండలతోపాటు ఇతరత్రా ఖర్చులకు రూ.80 వేలకు పైగా అయ్యింది. ఏడుకొండలు నుంచి తీసుకున్న అవయవాలను ఇతర రోగులకు అమర్చడానికి కార్పొరేట్ ఆసుపత్రులు రూ.కోటికి పైగా వసూలు చేస్తాయి. ప్రైవేట్ ఆసుపత్రుల్లో గుండె మార్పిడికి రూ.30 లక్షల నుంచి రూ.35 లక్షల వరకు అవుతుందని జీజీహెచ్ వైద్యులు చెప్పారు. ఒక మూత్రపిండం మార్పిడికి రూ.30 లక్షల నుంచి రూ.38 లక్షలు, కాలేయం మార్పిడికి రూ.30 లక్షలకు పైగా, కంటి మార్పిడికి రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షలు తీసుకుంటున్నాయి. రోగి వయస్సు, ఆరోగ్య పరిస్థితులను బట్టి వైద్య ఖర్చుల్లో తేడాలు ఉంటాయి. అవయవ దాతను రోగి సమకూర్చుకుంటే బిల్లుల్లో మార్పులు ఉంటాయి. గొప్ప ఆశయంతో అవయవాలను దానం చేసినప్పటికీ బాధితుల కుటుంబాలు రూ.లక్షల్లో బిల్లులను చెల్లించాల్సి వస్తోంది. అవయవ దానం చేసిన పేదల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తే బాగుంటుందనే అభిప్రాయం వారి కుటుంబాల నుంచి వ్యక్తవుతోంది. మా కుటుంబం వీధిన పడింది ‘‘ఎన్ఆర్ఐ ఆసుపత్రిలో వైద్యం, ఇతరత్రా అవసరాలకు రూ.రెండు లక్షలకు పైగా ఖర్చయ్యింది. డబ్బు లేక అప్పులు చేయాల్సి వచ్చింది. నా భర్త చనిపోవడంతో మా కుటుంబం వీధిన పడింది. మా కుమార్తె జాహ్నవి సీఏ చేయడానికి సిద్ధమవుతోంది. కుమారుడు దీపక్‌ను ఇంటర్మీడియట్లో చేర్చా ల్సి ఉంది. అవయవదానం చేసినందుకు మేము డబ్బులు ఆశించడం లేదు. ఆరు కుటుంబాలకు మేలు జరిగిందనే సంతృప్తి మిగిలింది. అవయవదానం చేసిన నిరుపేదల ఆసుపత్రి బిల్లులైనా ప్రభుత్వం చెల్లించగలిగితే మాలాంటి వారు ఆర్థిక సమస్యల నుంచి కొంతవరకు గట్టెక్కుతారు. తద్వారా అవయవదానం చేయడానికి నిరుపేద కుటుంబాలు ముందుకొస్తాయి’’ - నాగమణి, అవయవ దాత ఏడుకొండలు భార్య -
డాక్టర్ గోఖలేకు సీఎం సన్మానం
విజయవాడ : గుంటూరు ప్రభుత్వాస్పత్రి (జీజీహెచ్)లో ఒకరికి గుండె మార్పిడి చేసి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా జరిపిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలేను సీఎం చంద్రబాబు నాయుడు క్యాంపు కార్యాల యంలో శనివారం ఘనంగా సన్మానించి అభినందించారు. ఎంసెట్ ఫలి తాలను ప్రకటించడంలో, నీట్ ఆర్డినెన్స్ జారీచేయడంలో కృషిచేసిన సీఎం చంద్రబాబునాయుడును వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. ఎంసెట్ మెడికల్ ఫలితాల విడుదల కోర్టు తీర్పు నేపథ్యంలో సీఎం విద్యార్థులు నష్టపోకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి సరైన విధంగా చర్యలు తీసుకున్నారని కామినేని సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, కామినేని , ప్రత్తిపాటి పాల్గొన్నారు. సందర్శకులకు సీఎం చేయూత సమస్యలతో వచ్చిన పలువురు సందర్శకులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సాయం చేశారు. విజయవాడకు చెందిన చందన సీఎంను కలిసి తన భర్తకు హెచ్ఐవీ ఉందని, కుమారుడు మానసిక వికలాంగుడని, కూలికి వెళ్లి కుటుంబాన్ని పోషిస్తున్నాని వివరించగా, సీఎం స్పందించి ఇల్లు మంజూరు చేసి, రూ.25 వేల ఆర్థిక సాయం అందించాలని అదికారులను ఆదేశించారు. మచిలీపట్నానికి చెందిన భారత్ గ్యాస్ డీలర్ బడే వెంకటేశ్వరరావు తాను భాగస్వామి చేతిలో మోసపోయానని, న్యాయం చేయాలని కోరగా ఆ మేరకు సీఎం హామీ ఇచ్చారు. -
ఏడుకొండలుకు గుండె ఇచ్చిన ఏడుకొండలు
► దాత, గ్రహీత ఇద్దరి పేర్లూ ఏడుకొండలే ► నవ్యాంధ్రలో తొలి గుండె మార్పిడి ► గుంటూరు జీజీహెచ్ ఘనత సాక్షి, గుంటూరు: నవ్యాంధ్రప్రదేశ్‌లో గుండె మార్పిడి శస్త్రచికిత్స చేసిన మొట్టమొదటి ప్రభుత్వాస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు దేశంలోని నాలుగు ప్రభుత్వాస్పత్రుల్లో ఈ తరహా శస్త్రచికిత్సలు జరుగుతుండగా.. ఐదో ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోయినప్పటికీ దాతల సహకారం, సొంత ఖర్చులతో ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే శుక్రవారం గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఉదయం 11.30 గంటలకు గుండె మార్పిడి శస్త్రచికిత్స ప్రారంభించి సాయంత్రం 4.30 గంటలకు ముగించారు. డాక్టర్ గోఖలే నేతృత్వంలో జరిగిన ఈ ఆపరేషన్‌లో డాక్టర్ సుధాకర్, సుబ్రహ్మణ్యం, భరద్వాజ్, శ్రీనివాస్, షరీఫ్, అనూష పాల్గొన్నారు. గుండెను సేకరించిన వైనం.. విజయవాడ అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఇమడాబత్తుని ఏడుకొండలు(44) ఈ నెల 13న రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. 19న ఆయన బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇదే సమయంలో గుంటూరు నగర శివారులోని స్వర్ణభారతినగర్‌కు చెందిన ఉప్పు ఏడుకొండలు జీజీహెచ్‌లో ఆరు నెలలుగా గుండె జబ్బుతో బాధపడుతూ చికిత్స పొందుతున్నాడు. గుండె పనితీరు పూర్తిగా దెబ్బతినడంతో గుండె మార్పిడి చేయాలని డాక్టర్ గోఖలే నిర్ణయించారు. దాతల కోసం ఐదు నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్‌డెడ్ అయిన ఇమడాబత్తుని ఏడుకొండలు కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. దాత, స్వీకర్తల బ్లడ్ గ్రూప్ మ్యాచింగ్ అవడంతో గుండెను గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ఉప్పు ఏడుకొండలుకు అమర్చాలని నిర్ణయించారు. ఎన్ఆర్ఐ ఆస్పత్రిలో బ్రెయిన్‌డెడ్ అయిన ఇమడాబత్తుని ఏడుకొండలుకు శుక్రవారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకూ శస్త్రచికిత్స చేసి నుంచి గుండెను సేకరించారు. గుండె తరలింపునకు ప్రత్యేక అనుమతులు గుండెను ఎలాంటి ఇబ్బందులు లేకుండా 15 నిమిషాల్లో గుంటూరు జీజీహెచ్‌కు తరలించేందుకు సహకరించాలంటూ వైద్యులు గుంటూరు ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠిని కోరారు. స్పందించిన ఆయన శుక్రవారం ఉదయం నుంచి మంగళగిరి- గుంటూరు మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా ‘గ్రీన్‌చానల్’ ఏర్పాటు చేశారు. దీంతో 11 నిమిషాల్లోనే గుండెను గుంటూరుకు తరలించి, విజయవంతంగా శస్త్రచికిత్స పూర్తి చేశారు. -
చరిత్ర సృష్టించారు
గుండెమార్పిడిలో గుంటూరు జీజీహెచ్ వైద్యుల రికార్డు బ్రెయిన్‌డెడ్ వ్యక్తి గుండె మరొకరికి అమరిక పేద కుటుంబంలో వెలుగులు నింపిన వైద్యులు రూ.30 లక్షల వ్యయమయ్యే ఆపరేషన్ ఉచితంగా.. ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శస్త్రచికిత్స ఉద్విగ్న క్షణాల నడుమ విజయవంతం .. గుండెమార్పిడిలో మొట్టమొదటి ప్రభుత్వాస్పత్రిగా జీజీహెచ్‌కు గుర్తింపు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే కృషి ఫలితమేనంటూ అభినందనలు మొన్న జాయింట్ రీ ప్లేస్మెంట్.. నిన్న కిడ్నీ మార్పిడి.. నేడు గుండె మార్పిడితో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి చరిత్ర సృష్టించింది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే లభించే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను జీజీహెచ్‌లో పేదలకు ఉచితంగా అందిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండెమార్పిడి చేసిన మొట్టమొదటి ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ రికార్డు నిలిచింది. డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో శుక్రవారం జీజీహెచ్‌లో గుండెమార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు. గుంటూరు మెడికల్ : సహృదయ హెల్త్, మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్టు చైర్మన్, ప్రముఖ గుండె మార్పిడి శస్త్రచికిత్స నిపుణుడు ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే సుమారు రూ.30 లక్షలు ఖరీదుచేసే గుండె మార్పిడి ఆపరేషన్‌ను గుంటూరుకు చెందిన ఉప్పు ఏడుకొండలుకు ఉచితంగా చేశారు. ప్రభుత్వం గుండెమార్పిడి ఆపరేషన్ చేసేందుకు డాక్టర్ గోఖలేకు అనుమతులు ఇచ్చినప్పటికీ నిధులు మంజూరు చేయలేదు. దీంతో దాతల సహాయంతో సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా గుండెమార్పిడి ఆపరేషన్ జరిగింది. జీజీహెచ్‌లో సహృదయ ట్రస్టు 2015 మార్చి 18 నుంచి గుండె ఆపరేషన్లు నిర్వహిస్తోంది. సుమారు 200 వరకు గుండె ఆపరేషన్లు ట్రస్టు ఆధ్వర్యంలో జరిగాయి. మొట్టమొదటి గుండెమార్పిడి సర్జన్ గోఖలే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్లు చేసిన వ్యక్తిగా డాక్టర్ గోఖలే పేరు రికార్డుల్లో ఉంది. సుమారు పదివేలకు పైగా గుండె శస్త్రచికిత్సలు చేయగా, 22 వరకూ గుండెమార్పిడి ఆపరేషన్లు చేశారు. 2015లో ఉగాది పురస్కారం, 2016లో పద్మశ్రీ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది. అవరోధాలు అధిగమించి.. జీజీహెచ్‌లో డాక్టర్ గోఖలే ఆధ్వర్యంలో సహృదయ ట్రస్టు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. 2015 జనవరి నుంచే గుండె మార్పిడి ఆపరేషన్ చేసేందుకు పలువురు రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి సిద్ధం చేసుకున్నారు. సుమారు పదిమంది వరకూ గుండెమార్పిడి ఆపరేషన్ రోగులకు పరీక్షలు పూర్తయ్యాయి. బ్రెయిన్‌డెడ్ కేసు నుంచి గుండెను సేకరించి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న గుండె రోగులకు అమర్చేందుకు రెండుసార్లు ప్రయత్నాలు చేశారు. జీజీహెచ్‌కు వచ్చిన బ్రెయిన్ డెడ్ కేసును నిర్ధారణ చేసేందుకు వైద్యులు సకాలంలో స్పందించకపోవడం వల్ల ఆ రెండు కేసులూ చనిపోయాయి. వైద్యుల మధ్య సహకారలోపం వల్లే రెండు నెలల క్రితం నుంచి గుండెమార్పిడి ఆపరేషన్ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలోనే బ్రెయిన్‌డెడ్ కేసు నుంచి గుండెను తీసుకొచ్చి విజయవంతంగా ఆపరేషన్ చేశారు. ఆ ఇంట ఆనందం పునర్జన్మనిచ్చారు నా భర్త ఉప్పు ఏడుకొండలుకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి వైద్యులు, డాక్టర్ గోఖలే పునర్జన్మనిచ్చారు. కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న నా భర్తకు నగరంలోని పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా తగ్గలేదు. గుండె మార్పిడి ఆపరేషన్ చేయాలని, అందుకోసం రూ.30 లక్షల వరకూ ఖర్చవుతుందని ప్రైవేట్ వైద్యులు చెప్పారు. ఆయన డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని పోషించేందుకు జీతం సరిపోకపోవడంతో నేను కూడా ఇళ్లల్లో పనులు చేస్తూ ఆయనకు చేదోడువాదోడుగా ఉంటున్నాను. అనారోగ్యంతో ఏడాదిగా డ్రైవర్ ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబ పోషణే కష్టంగా మారింది. అంతమొత్తంలో డబ్బు ఖర్చు పెట్టలేక నా భర్తపై ఆశలు వదిలేసుకున్నాను. నా భర్త ఓ డాక్టర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తుండటంతో ఆయన సూచన మేరకు ఆరు నెలల క్రితం జీజీహెచ్‌కు వచ్చాం. డాక్టర్ గోఖలే ఆరునెలలుగా మాకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ గుండెమార్పిడి ఆపరేషన్ చేస్తామని భరోసా ఇచ్చారు. గుండెకోసం ఇన్ని రోజులు వేచి ఉన్నాం. ఈ శుక్రవారం జీవితంలో నాకు మరిచిపోలేని రోజు. జీజీహెచ్ వైద్యులకు, డాక్టర్ గోఖలేకు రుణపడి ఉంటాను. - ఓర్ప (ఉప్పు ఏడుకొండలు భార్య) ఇద్దరూ ఏడుకొండలే.. ఇద్దరూ డ్రైవర్లే.. విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఇమడాబత్తుని ఏడుకొండలు (44) ఈనెల 13న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈనెల 19వ తేదీన మంగళగిరి ఎన్నారై వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. ఆయన భార్య నాగమణి అవయవదానం చేసేందుకు ముందుకు రావడంతో గుంటూరు స్వర్ణభారతి నగర్ సీబ్లాక్ మూడో వీధికి చెందిన ఉప్పు ఏడుకొండలుకు విజయవంతంగా గుండె అమర్చారు. గుండెదానం చేసినవారు, గుండెను స్వీకరించిన వారు ఇద్దరి పేర్లు ఏడుకొండలు కాగా, ఇద్దరూ డ్రైవర్లే కావడం మరో విశేషం. ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ ఆపరేషన్ జరిగింది. డాక్టర్ గోఖలేతో పాటు సర్జన్లు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, మత్తు వైద్య నిపుణుడు సుధాకర్, డాక్టర్ భరద్వాజ్, డాక్టర్ షరీఫ్, డాక్టర్ అనూష ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. - గుంటూరు మెడికల్ ఓ ఇంట అంతులేని విషాదం.. మరో ఇంట అవధుల్లేని ఆనందం.. ఓ కంట విషాదాశ్రు ప్రవాహం.. మరో కంట ఆనంద బాష్ప జలపాతం.. హృదయంలో అటు ఉద్వేగం.. ఇటు ఉత్తేజం.. అర్థంతరంగా ముగిసిన ఓ జీవన పయనం ఆరిపోతున్న ఆరు దీపాలను వెలిగించింది. ఈ ప్రాణదానంతో ఆగిపోతున్న ఓ గుండె ఊపిరిపోసుకుని పేద కుటుంబానికి చిరుదివ్వె అయ్యింది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై మంగళగిరి ఎన్నారైలో చికిత్స పొందుతున్న విజయవాడకు చెందిన ఇమడాబత్తుని ఏడుకొండలు గుండెను గుంటూరు జీజీహెచ్‌లో మరణానికి చేరువైన ఉప్పు ఏడుకొండలుకు అమర్చి ప్రాణదానం చేశారు. ఇద్దరు ఏడుకొండలు మధ్య సాగిన ఈ గుండెమార్పిడి శస్త్రచికిత్సను ఊపిరి తెగే ఉద్రిక్త క్షణాల మధ్య గుంటూరు జీజీహెచ్ వైద్యులు శుక్రవారం విజయవంతంగా పూర్తిచేశారు. -
నిరుపేదను.. గుండెమార్పిడి చేయండి: జ్యోతి
పంజగుట్ట (హైదరాబాద్): గుండె జబ్బుతో బాధపడుతున్న తనను ఆదుకోవాలని ఓ నిరుపేద యువతి నిమ్స్ జీవన్‌దాన్‌లో దరఖాస్తు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల శ్రీరామ్పూర్కు చెందిన ఆర్ జ్యోతి (23) గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఆమె ఇటీవల నిమ్స్‌లో వైద్య పరీక్షలు నిర్వహించుకోగా గుండె మార్పిడి చేయాల్సిన అవసరముందని వైద్యులు సూచించారు. దీంతో నిమ్స్ జీవన్‌దాన్ పథకంలో గుండె దాత కోసం ఆమె దరఖాస్తు పెట్టుకుంది. తన తల్లిదండ్రులు ఇద్దరూ అనారోగ్యంతో మృతి చెందారని, తనకు సాయం చేయాల్సిందిగా నిమ్స్ జివన్దాన్ ప్రతినిధి అనూరాధను వేడుకుంది. జ్యోతిని అన్నివిధాలా ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని అనురాధ తెలిపారు. -
అరుదైన ఆపరేషన్ విజయవంతం
-
ఆపరేషన్ సక్సెస్
-
‘మరణించిన గుండె’ల మార్పిడి!
ప్రపంచంలోనే తొలిసారిగా ఈ తరహా శస్త్రచికిత్స హార్ట్ ఇన్ ఎ బాక్స్ పరికరం సాయంతో గుండెకు పునరుజ్జీవం సిడ్నీ: ప్రపంచ వైద్య చరిత్రలోకెల్లా అత్యుద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. అత్యంత సంక్లిష్టమైన గుండె మార్పిడి శస్త్ర చికిత్సా విధానంలో నూతనాధ్యాయానికి తెరలేచింది. మరణించిన రోగి శరీరం నుంచి ఇతరులకు అమర్చేందుకు పనికిరానిదిగా భావించే ఏకైక అవయవమైన గుండెకు సైతం మరణం లేదని తేలింది. నూతన సాంకేతిక పరిజ్ఞానం సాయంతో చలనంలేని గుండెను పునరుజ్జీవింపజేయడం సాధ్యమని నిరూపణ అయింది. ఇప్పటివరకూ బ్రెయిన్ డెడ్ రోగుల నుంచి ‘బతికున్న గుండె’లను (గుండెలు ఇంకా కొట్టుకుంటున్నప్పుడే) సేకరించి హృద్రోగులకు దాదాపు నాలుగు గంటల్లోగా అమర్చే పద్ధతి పలు దేశాల్లో అమల్లో ఉండగా అందుకు పూర్తి భిన్నంగా ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ఓ వైద్య బృందం ప్రపంచంలోనే తొలిసారిగా ‘మరణించిన’ గుండెలను (కొట్టుకోవడం ఆగిపోయిన గుండెలను) ముగ్గురు హృద్రోగులకు విజయవంతంగా అమర్చింది. ముగ్గురు రోగులు మరణించి 20 నిమిషాలయ్యాక ఆ మృతదేహాల నుంచి సేకరించిన మూడు గుండెలను హృద్రోగులకు అమర్చి వారికి పునర్జన్మ ప్రసాదించింది. ఈ ఘనత సాధించిన వైద్య బృందంలో భారత సంతతి సర్జన్ కూడా ఉన్నారు. సిడ్నీలోని సెయిట్ విన్సెంట్ హాస్పిటల్‌కు వైద్యులు ఈ ఆపరేషన్ల కోసం ‘హార్ట్ ఇన్ ఎ బాక్స్’ పరికరం సాయం తీసుకున్నారు. మరణించిన రోగుల నుంచి సేకరించిన గుండెలను తొలుత ఈ పరికరంలో భద్రపరిచి అవి వెచ్చదనం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పరికరంలో గుండెలు తిరిగి కొట్టుకోవడాన్ని పునరుద్ధరింపజేశారు. ఈ క్రమంలో గుండె కండరానికి నష్టాన్ని వీలైనంత తగ్గించేందుకు ఒక రకమైన పోషక ద్రావణాన్ని ఉపయోగించారు. ఆపై వాటిని ముగ్గురు రోగులకు శస్త్ర చికిత్సల ద్వారా అమర్చారు. -
‘గుండె’లదిరే వేగం
బెంగళూరు నుంచి చెన్నైకి గుండె తరలింపు సాక్షి, చెన్నై/బెంగళూరు: భారత వైద్య రంగంలో ఓ అరుదైన ఘటన బుధవారం ఆవిష్కృతమైంది. చెన్నైలోని అడయార్ ఫోర్టిస్ ఆస్పత్రిలో కొన ప్రాణంతో ఓ గుండె బలహీనంగా కొట్టుకుంటోంది. ఆ ప్రాణాన్ని నిలబెట్టాలంటే వెంటనే గుండె మార్పిడి చేయాలి. ఇందుకోసం బెంగళూరులోని బీజీఎస్ ఆస్పత్రిలో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ(32) నుంచి సేకరించిన గుండెను తీసుకుని వైద్య బృందం మధ్యాహ్నం 3.30 గంటలకు వేగంగా విమానాశ్రయానికి చేరుకుంది. ప్రత్యేక విమానంలో 4.25 గంటలకు(మొత్తం 55నిమిషాలు) చెన్నై విమానాశ్రయానికి రాగా, అక్కడి నుంచి ఫోర్టిస్ ఆస్పత్రికి 4.37 గంటలకు చేరుకుంది. వైద్యులు వెంటనే శస్త్రచికిత్స ప్రారంభించారు. అందరి ప్రయత్నాలు, ప్రార్థనలు ఫలించి చివరికి 40 ఏళ్ల రోగి ప్రాణం నిలబడింది. గుండె మార్పిడి చికిత్స విజయవంతం అయినట్లు ఫోర్టిస్ ఆసత్ప్రి ఫ్యాకల్టీ డెరైక్టర్ హరీష్మణియన్ ప్రకటించారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో ‘వేగం’ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. గుండె ను దాత నుంచి సేకరించిన తర్వాత 6 గంటల్లోపే తిరిగి అమర్చాలి. రసాయనాల సాయంతో ఆరు గంటలు మాత్రమే అది నిల్వ ఉంటుంది. ఈ నేపథ్యంలో దాత నుంచి గుండెను సేకరించడం దగ్గర నుంచి రోగికి అమర్చే వరకు సుదీర్ఘమైన ప్రక్రియ ను నిర్ణీత సమయంలోనే అందరి సహకారంతో పూర్తి చేయగలిగారు. రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య గుండెను అత్యంత వేగంగా తరలించడంలో ట్రాఫిక్ పోలీసుల సంపూర్ణ సహకారం, ప్రజల తోడ్పాటు కూడా మరువలేనిది. అత్యంత ప్రముఖుల(వీవీఐపీ)కు మాత్రమే ట్రాఫిక్‌ను నిలిపివేసి మార్గాన్ని సుగమం చేసే పోలీసులు... ఇక్కడ మాత్రం ఓ సామాన్యుడి ప్రాణాన్ని నిలబెట్టేందుకు తమవంతు పూర్తి సహకారం అందించారు. బెంగళూరులో బీజీఎస్ ఆస్పత్రి నుంచి స్థానిక అంతర్జాతీయ విమానాశ్రయం వరకు ఉన్న దూరం 42 కిలోమీటర్లు. సాధారణంగా అయితే ఈ దూరాన్ని అధిగమించడానికి గంటన్నర పడుతుంది. కానీ, ట్రాఫిక్ పోలీసులు వాహనాలను ఎక్కడివక్కడ నిలిపివేయడంతో... కేవలం 40 నిమిషాల్లోనే వైద్య బృందం విమానాశ్రయానికి చేరుకోగలిగింది. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో వైద్య బృందం చెన్నై విమానాశ్రయంలో దిగింది. బెంగళూరు పోలీసుల వలే చెన్నై నగర ట్రాఫిక్ పోలీసులు కూడా వాహనాలను పూర్తిగా నియంత్రించి దారిని క్లియర్ చేయడంతో... విమానాశ్రయం నుంచి అడయార్ ఫోర్టిస్ ఆస్పత్రి వరకు 14 కిలోమీటర్ల దూరాన్ని 7 నిమిషాల్లోనే అంబులెన్స్ అధిగమించగలిగింది. సాధారణంగా అయితే, ఇందుకు 40 నిమిషాల సమయం తీసుకుంటుంది. దీనికితోడు వైద్యుల కృషి వెరసి శస్త్రచికిత్స విజయవంతం అయింది. గతంలో ఒకే నగరంలోని రెండు వేర్వేరు ఆస్పత్రుల మధ్య గుండెను తరలించిన సందర్భా లు ఉన్నాయి. కానీ, రెండు రాష్ట్రాల రాజధానుల మధ్య గుండెను తరలించడమనేది చాలా అరుదు. ‘‘ఎనిమిది మంది వైద్య నిపుణులు కాలంతో పరుగులు తీసి నాలుగు గంటల్లోనే రోగికి గుండెను అమర్చారు. ఆపరేషన్ విజయవంతమయింది’’ - హరీష్, ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి డెరైక్టర్, చెన్నై ‘‘గుండె మార్పిడి తర్వాత రోగి 20 ఏళ్ల పాటు ఆరోగ్యంతో జీవించవచ్చు’’. - ఎన్.కె. వెంకటరామన్, వైస్ ప్రెసిడెంట్, బీజీఎస్ ఆస్పత్రి, బెంగళూరు -
ఓ గుండె కోసం.. ఆగిపోయిన నగరం!!
ముఖ్యమంత్రి, గవర్నర్ లాంటి వాళ్లు ఎక్కడికైనా వెళ్లాలంటే మధ్యలో ట్రాఫిక్ అంతా ఆపేసి మరీ వారిని ఆగమేఘాల మీద పంపిస్తారు. అదే సామాన్యుడు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుందటే మాత్రం ఆస్పత్రికి వెళ్లడానికి కూడా గంటల తరబడి సమయం పడుతుంది. కానీ.. చెన్నైలో మాత్రం అందుకు విభిన్నంగా జరిగింది. ఓ సామాన్య రోగి ప్రాణాలు కాపాడాలని రెండు ఆస్పత్రుల వైద్యులు, పోలీసులు కలిసి చేసిన 'ఆపరేషన్' నూటికి నూరుశాతం విజయవంతం అయ్యింది. ట్రాఫిక్ అవరోధాలన్నింటినీ దాటుకుని సరిగ్గా పావుగంటలోనే గుండెను ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలించి.. దాన్ని రోగికి అమర్చి ప్రాణాలు కాపాడారు. అచ్చం 'ట్రాఫిక్' సినిమాలో చూపించినట్లుగా సాగిన ఈ ఆపరేషన్.. నూటికి నూరుశాతం విజయవంతం అయ్యింది. సాధారణంగా అయితే మనిషి గుండెను బయటకు తీసిన తర్వాత అది సురక్షిత పరిస్థితుల్లో కూడా 4గంటలే ఉపయోగపడుతుంది. ఉదయం 5.45 గంటల సమయంలో ఓ రోగి దాదాపుగా బ్రెయిన్ డెడ్ పరిస్థితిలో ఉన్నాడని, అతడి గుండెను తీసుకోవచ్చని ప్రభుత్వాస్పత్రి నుంచి చెన్నైలోని ఫోర్టిస్ మలార్ ఆస్పత్రికి ఫోన్ వచ్చింది. అప్పటికే అక్కడ ఓ రోగి ఎన్నాళ్లుగానో గుండెమార్పిడి కోసం వేచి చూస్తున్నాడు. అదే సమయంలో పోలీసులకు కూడా విషయం చెప్పారు. ప్రభుత్వాస్పత్రి నుంచి ఫోర్టిస్ ఆస్పత్రికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో ప్రధానమైన 12 ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ఎక్కడా రెడ్‌లైట్ అనేది వెలగకుండా ఉండేలా ట్రాఫిక్ మొత్తాన్ని నియంత్రించారు. ప్రభుత్వాస్పత్రి వద్ద 6.44 గంటలకు అంబులెన్సు బయల్దేరింది. దాని ముందుగా పోలీసు పైలట్ వాహనం కూడా వెళ్లింది. సిగ్నల్ పాయింట్లు దాటే సమయంలో కూడా ఆ వాహనాల వేగం దాదాపుగా గంటకు 100 కిలోమీటర్లు!! సాధారణంగా కనీసం 45 నిమిషాలు పట్టే ఆ దూరం దాటడానికి అంబులెన్సుకు పట్టిన సమయం.. కేవలం 13 నిమిషాలు. 6.57 గంటలకల్లా ఫోర్టిస్ ఆస్పత్రికి 'గుండె' భద్రంగా చేరింది. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్యులు చకచకా శస్త్రచికిత్స చేసి, గుండెను మార్చేశారు. -
ఉత్కంఠగా గుండె మార్పిడి
సాక్షి, చెన్నై: రాష్ట్ర రాజధాని నగరం చెన్నైలో సోమవారం సాయంత్రం కాసేపు ఉత్కంఠ భరిత వాతావరణం నెల కొంది. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ తమ బిడ్డ హృదయాన్ని ఓ దంపతులు దానం చేశారు. మరో యువతికి దాన్ని అమర్చడం లక్ష్యంగా అంబులెన్స్‌లో బయలుదేరిన ఆ హృదయం 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న గమ్యస్థానాన్ని 13 నిమిషాల్లో చేరింది. అవయవదానాల మీద ఇటీవల రాష్ట్రంలో అవగాహన పెరుగుతోంది. ప్రమాదం బారిన పడ్డ తమ వారి అవయవాలను మరొకరికి దానం చేస్తున్న కుటుంబాల సంఖ్య పెరుగుతోంది. ఆ కోవలో కాంచీపురం జిల్లా మదురాం తకం సమీపంలో ఈనెల 11న జరిగిన రోడ్డు ప్రమాదంలో లోకనాథన్(27)గాయపడ్డారు. తలకు బలమైన గాయం తగలడంతో కోమాలోకి వెళ్లాడు. చెన్నై రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రిలో ఉన్న తమ బిడ్డ బతకడం అనుమానం కావడంతో అతడి అవయవాలను దానం చేయడానికి తల్లిదండ్రులు యోగీశ్వర న్, రాజ్యలక్ష్మి నిర్ణయించారు. అదే సమయంలో అడయార్‌లోని ఓ ఆస్పత్రిలో హృదయ మార్పిడి కోసం ముంబైకు చెందిన ఓ యువతి హోబి(21) ఎదురు చూస్తుండడంతో లోకనాథన్ హృదయా న్ని ఆమెకు ఇచ్చేందుకు నిర్ణయించారు. ఉత్కంఠ: సోమవారం సాయంత్రం లోకనాథన్ శరీరానికి పోస్టుమార్టం ఆరంభం అయింది. అతడి అవయవాలను బయటకు తీసి ప్రత్యేక బాక్సుల్లో భద్రపరిచారు. అతడి హృదయాన్ని అడయార్‌లోని మలర్ ఆస్పత్రిలో ఉన్న ఆ యువతికి అమర్చేందుకు ఏర్పాట్లు చేశారు. హృదయాన్ని సకాలంలో ఆ ఆస్పత్రికి చేర్చడం లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు అలర్ట్ అయ్యారు. సెంట్రల్ సమీపంలోని జీహెచ్ నుంచి ఎంఎంసీ, మెరీనా తీరం మీదుగా పట్టిన వాక్కం, ఎంఆర్ సీ నగర్ సిగ్నల్ గుండా అడయార్‌లోని ఆస్పత్రికి తరలించేందుకు సర్వం సిద్ధం చేశారు. ఆ మార్గాల్లో ఆగమేఘాలపై ట్రాఫిక్ మార్పులు చేశారు. పది నిమిషాల్లో ఆ హృదయాన్ని అడయార్‌కు తరలించే విధంగా రెడీ అయ్యారు. జీహెచ్ నుంచి లోకనాథన్ హృదయం తో అంబులెన్స్ బయలుదేరేందుకు పది నిమిషాల ముందుగా ఆ మార్గాల్లో ట్రాఫిక్‌ను ఎక్కడికక్కడ నిలిపి వేశారు. సినీ ఫక్కీలో తీవ్ర ఉత్కంఠ నడుమ సరిగ్గా పదమూడు నిమిషాల్లో అడయా ర్ ఆస్పత్రికి ఆ హృదయాన్ని చేర్చారు. అప్పటికే హోబీకి శస్త్ర చికిత్స ఏర్పాట్లు చేసి ఉండడంతో, హృదయం రాగానే ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారు. ఇద్ద రు సీనియర్ శస్త్ర చికిత్సా నిపుణుల పర్యవేక్షణలో హోబీకి లోకనాథన్ గుండెను అమర్చే హృదయ మార్పిడి శస్త్ర చికిత్స జరుగుతోంది. ఈ శస్త్ర చికిత్స విజయవంతం కావాలన్న కాంక్షతో సర్వత్రా ఎదురు చూస్తున్నారు. -
గుండె మార్పిడి జరిగిన విద్యార్థి మృతి
కారంపూడి, న్యూస్‌లైన్: రాష్ట్రంలో తొలి గుండె మార్పిడి జరిగిన విద్యార్థి మృతి చెందాడు. వైద్యులు పునర్జన్మ ప్రసాదించారన్న సంబరం కొద్దినెలలు కూడా నిలువలేదు. గుంటూరు జిల్లా కారంపూడి మండలం పెదకొదమగుండ్లకు చెందిన బి ఫార్మసీ విద్యార్థి వీరాంజనేయులు డైలేటెడ్ కార్డియోపతి వ్యాధితో బాధపడున్నాడు. గత ఏడాది నవంబరు 11న హైదరాబాద్‌లోని అపోలో ఆస్ప త్రి వైద్యులు అతనికి ఆపరేషన్ నిర్వహించి, గుండె మార్పిడి చేశారు. యశోదా ఆసుపత్రిలో మెదడులో రక్తనాళాలు చిట్లడం వల్ల కొద్ది సమయంలో చనిపోబోతున్న వ్యక్తి నుంచి గుండెతీసి వీరాంజనేయులుకు అమర్చారు. అపోలో వైద్యులు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విదేశాల లో రూ.కోటి పైన ఖర్చుయ్యే ఆపరేషన్‌ను ఉచితంగా చేసి అతడికి ప్రాణం పోశారు. వాస్తవానికి మన రాష్ట్రంలో మొదటసారి జరిగిన అరుదైన ఆపరేషన్‌గా వైద్యరంగంలో ఇది అప్పట్లో సంచలనం అయింది. అప్పటి నుంచి ఇంటి దగ్గరే వుంటున్నాడు. ఆదివారం ఉన్నట్టుండి వీరాంజనేయులు అస్వస్థతకు గురవడంతో డాక్టర్ సలహాపై హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ వైద్యసేవలు అందిస్తుండగా మృతి చెందాడు. -
ప్రఖ్యాత గ్రూట్ షర్ ఆసుపత్రి సీఈఓగా భావనా పాటిల్
రోగుల అవసరాలను తెలుసుకుని తదనుగుణంగా వారికి సేవలందిస్తానని దక్షిణాఫ్రికాలోని ప్రముఖ ఎన్నారై వైద్యురాలు భావనా పాటిల్ శుక్రవారం కేప్‌టౌన్‌లో వెల్లడించారు. ఆ దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గ్రూట్ షర్ ఆసుపత్రి కార్యనిర్వహాణాధికారిగా ఇటీవలే నూతన పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆసుపత్రిలో శస్త్ర చికిత్స చేయించుకునే రోగుల సంఖ్య నానాటికి పెరుగుతుందన్నారు. ఈ నేపథ్యంలో ఆసుపత్రిలో శస్త్ర చికిత్సలు చేసే సమయాన్ని మరింత పెంచుతామన్నారు. గత ఎనిమిదేళ్లుగా ఇదే ఆసుపత్రిలో మెడికల్ మేనేజర్‌గా భావనా విధులు నిర్వర్తిస్తున్నారని వెస్టరన్ కేప్ ప్రోవెన్షియల్ మినిస్టర్ ఫర్ హెల్త్ త్యియునస్ బొతా తెలిపారు. అలాగే ఆమె ఆధ్వర్యంలోనే శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని చెప్పారు. శస్త్ర చికిత్సల నిర్వహాణలో ఆమెకు సుదీర్ఘ అనుభవం ఉందని, ఈ నేపథ్యంలో భావనా పాటిల్‌ను ఆ పదవికి ఎంపిక చేసినట్లు వెల్లడించారు. ఆ పదవికి భావన సరైన వ్యక్తి అని ప్రోవెన్షియల్ కేబినెట్ ప్రగాఢంగా విశ్వసిస్తుందని బొతా చెప్పారు. భావనా పాటిల్ స్టెలెన్‌బాష్ యూనివర్శిటీ నుంచి ఫ్యామిలీ మెడిసన్లోమాస్టర్ డిగ్రీ అందుకున్నారు. అనంతరం జోహెన్స్‌బర్గ్‌లోని విట్వాటర్స్టాండ్ యూనివర్శిటీ నుంచి బయైథిక్స్తోపాటు హెల్త్ లా లోకూడా మాస్టర్ డిగ్రీని కూడా అందుకున్నారు. ఫ్యామిలీ హెల్త్ స్పెషలిస్ట్‌గా భావన పాటిల్ ఆ దేశ మెడికల్ కౌనిల్స్లో రిజిస్టర్ చేయించుకున్నారు. దక్షిణాఫ్రికాలోని గ్రూట్ షర్ అసుపత్రిని 1938లో స్థాపించారు. 1967లో డిసెంబర్ 3న ఆ ఆసుపత్రిలోనే ప్రముఖ వైద్యుడు క్రిస్టియన్ బెర్నార్డ్ ప్రపంచంలోనే మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్ర చికిత్స నిర్వహించిన సంగతి తెలిసిందే.