తిరుపతిలోని శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌లో వైద్యుల ఘనత
తిరుపతి తుడా: స్థానిక టీటీడీ శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌లో శుక్రవారం ఓ యువకుడికి వైద్యులు విజయవంతంగా గుండె మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. ఐదు గంటలు శ్రమించి వైద్యులు ఆ యువకుడి ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలు... కాకినాడకు చెందిన ఓ యువకుడు(24) గుండె సంబంధ సమస్యతో బాధపడుతూ రెండు నెలలుగా తిరుపతిలోని శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. అతని గుండె సామర్థ్యం పూర్తిగా క్షీణించిందని వైద్యులు నిర్ధారించారు. అతనికి గుండె మార్పిడి అనివార్యమని గుర్తించారు.
ఈ మేరకు నెల రోజుల కిందట ఆ యువకుడి వివరాలను అవయవదాన్ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. గుండె అందుబాటులోకి వచ్చే వరకు ఆ యువకుడిని వైద్యుల బృందం పర్యవేక్షిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నానికి చెందిన ఓ యువకుడు(39) ఇటీవల రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడగా, కుటుంబ సభ్యులు అక్కడే ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆ యువకుడి బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించడంతో అతని అవయవాలు దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు.
ఈ మేరకు అవయవదాన్ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశారు. దీంతో శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్ వైద్యులు విశాఖ వెళ్లి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి గుండెను సేకరించి ప్రత్యేక విమానంలో శుక్రవారం మధ్యాహ్నం 1.55 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి గ్రీన్ చానల్ ద్వారా 19 నిమిషాల్లో శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌కు చేర్చారు. వెంటనే 2.15 గంటలకు ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో వైద్యులు గుండె మార్పిడి శస్త్రచికిత్సను ప్రారంభించి, సాయంత్రం 7.15 గంటలకు విజయవంతంగా పూర్తిచేశారు. ఈ సందర్భంగా వైద్యులను పలువురు అభినందించారు.
15 మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు
గుండె మార్పిడి ఆపరేషన్లలో తిరుపతికి దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. మహా నగరాల్లో అత్యున్నత ప్రమాణాలు కలిగిన కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే చేస్తున్న గుండె మార్పిడి శస్త్రచికిత్సలను టీటీడీ ఆధ్వర్యాన నిర్వహిస్తున్న టీటీడీ శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌లోనూ విజయవంతంగా చేపడుతున్నారు. ఈ ఆస్పత్రిని ప్రారంభించిన అనతికాలంలోనే 2,560 మందికి పైగా చిన్నారులకు గుండె సంబంధిత శస్త్ర చికిత్సలను చేశారు. అదేవిధంగా శుక్రవారంతో 15 మందికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలను విజయవంతంగా పూర్తిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment