ఆరోగ్యశ్రీలోకి ‘అవయవ మార్పిడి’
- అందులో భాగంగా కొత్తగా 25 వైద్య సేవలు
- ప్రభుత్వానికి ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రతిపాదనలు
- గుండె మార్పిడికి అధికంగా రూ. 16.50 లక్షల ప్యాకేజీ
సాక్షి, హైదరాబాద్: అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను ఆరోగ్యశ్రీ వైద్యసేవల్లో చేర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా గుండె, లివర్, ఊపిరితిత్తులు, స్టెమ్‌సెల్ వంటి కీలకమైన అవయవ మార్పిడి ఆపరేషన్లను నిర్వహించనున్నారు. వీటిలో అత్యధికంగా గుండె మార్పిడి చికిత్సకు రూ.16.50 లక్షలు చెల్లించాలని నిర్ణయించారు.
ఈ అవయవ మార్పిడుల తర్వాత కూడా రోగులకు అవసరమైన వైద్య సేవలనూ ఉచితంగానే నిర్వహించనున్నారు. ప్రస్తుతం అమల్లో ఉన్న వైద్య సేవలకు అదనంగా మరో 25 వైద్య సేవలను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. కొత్తగా అమలుపరిచే ైవె ద్య సేవలు, అందుకు చెల్లించాల్సిన చార్జీలకు సంబంధించిన ప్రతిపాదనలను ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రభుత్వానికి పంపించింది.