
చరిత్ర సృష్టించారు
గుండెమార్పిడిలో గుంటూరు జీజీహెచ్ వైద్యుల రికార్డు
బ్రెయిన్‌డెడ్ వ్యక్తి గుండె మరొకరికి అమరిక
పేద కుటుంబంలో వెలుగులు నింపిన వైద్యులు
రూ.30 లక్షల వ్యయమయ్యే ఆపరేషన్ ఉచితంగా..
ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు శస్త్రచికిత్స
ఉద్విగ్న క్షణాల నడుమ విజయవంతం ..
గుండెమార్పిడిలో మొట్టమొదటి ప్రభుత్వాస్పత్రిగా జీజీహెచ్‌కు గుర్తింపు
డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే కృషి ఫలితమేనంటూ అభినందనలు
మొన్న జాయింట్ రీ ప్లేస్‌మెంట్.. నిన్న కిడ్నీ మార్పిడి.. నేడు గుండె మార్పిడితో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి చరిత్ర సృష్టించింది. కార్పొరేట్ ఆస్పత్రుల్లో మాత్రమే లభించే సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను జీజీహెచ్‌లో పేదలకు ఉచితంగా అందిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో గుండెమార్పిడి చేసిన మొట్టమొదటి ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ రికార్డు నిలిచింది. డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో శుక్రవారం జీజీహెచ్‌లో గుండెమార్పిడి ఆపరేషన్ విజయవంతంగా నిర్వహించారు.
గుంటూరు మెడికల్ : సహృదయ హెల్త్, మెడికల్ అండ్ ఎడ్యుకేషనల్ ట్రస్టు చైర్మన్, ప్రముఖ గుండె మార్పిడి శస్త్రచికిత్స నిపుణుడు ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే సుమారు రూ.30 లక్షలు ఖరీదుచేసే గుండె మార్పిడి ఆపరేషన్‌ను గుంటూరుకు చెందిన ఉప్పు ఏడుకొండలుకు ఉచితంగా చేశారు. ప్రభుత్వం గుండెమార్పిడి ఆపరేషన్ చేసేందుకు డాక్టర్ గోఖలేకు అనుమతులు ఇచ్చినప్పటికీ నిధులు మంజూరు చేయలేదు. దీంతో దాతల సహాయంతో సహృదయ ట్రస్టు ఆధ్వర్యంలో ఉచితంగా గుండెమార్పిడి ఆపరేషన్ జరిగింది. జీజీహెచ్‌లో సహృదయ ట్రస్టు 2015 మార్చి 18 నుంచి గుండె ఆపరేషన్లు నిర్వహిస్తోంది. సుమారు 200 వరకు గుండె ఆపరేషన్లు ట్రస్టు ఆధ్వర్యంలో జరిగాయి.
మొట్టమొదటి గుండెమార్పిడి సర్జన్ గోఖలే
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా గుండె, ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్లు చేసిన వ్యక్తిగా డాక్టర్ గోఖలే పేరు రికార్డుల్లో ఉంది. సుమారు పదివేలకు పైగా గుండె శస్త్రచికిత్సలు చేయగా, 22 వరకూ గుండెమార్పిడి ఆపరేషన్లు చేశారు. 2015లో ఉగాది పురస్కారం, 2016లో పద్మశ్రీ అవార్డుతో ప్రభుత్వం సత్కరించింది.
అవరోధాలు అధిగమించి..
జీజీహెచ్‌లో డాక్టర్ గోఖలే ఆధ్వర్యంలో సహృదయ ట్రస్టు ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఉచితంగా గుండె మార్పిడి ఆపరేషన్ చేయాలని నిర్ణయించుకున్నారు. 2015 జనవరి నుంచే గుండె మార్పిడి ఆపరేషన్ చేసేందుకు పలువురు రోగులకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి సిద్ధం చేసుకున్నారు. సుమారు పదిమంది వరకూ గుండెమార్పిడి ఆపరేషన్ రోగులకు పరీక్షలు పూర్తయ్యాయి. బ్రెయిన్‌డెడ్ కేసు నుంచి గుండెను సేకరించి జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న గుండె రోగులకు అమర్చేందుకు రెండుసార్లు ప్రయత్నాలు చేశారు. జీజీహెచ్‌కు వచ్చిన బ్రెయిన్ డెడ్ కేసును నిర్ధారణ చేసేందుకు వైద్యులు సకాలంలో స్పందించకపోవడం వల్ల ఆ రెండు కేసులూ చనిపోయాయి. వైద్యుల మధ్య సహకారలోపం వల్లే రెండు నెలల క్రితం నుంచి గుండెమార్పిడి ఆపరేషన్ వాయిదా పడుతూ వచ్చింది. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలోనే బ్రెయిన్‌డెడ్ కేసు నుంచి గుండెను తీసుకొచ్చి విజయవంతంగా ఆపరేషన్ చేశారు.
ఆ ఇంట ఆనందం పునర్జన్మనిచ్చారు
నా భర్త ఉప్పు ఏడుకొండలుకు గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రి వైద్యులు, డాక్టర్ గోఖలే పునర్జన్మనిచ్చారు. కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న నా భర్తకు నగరంలోని పలు ఆస్పత్రుల్లో వైద్యం చేయించినా తగ్గలేదు. గుండె మార్పిడి ఆపరేషన్ చేయాలని, అందుకోసం రూ.30 లక్షల వరకూ ఖర్చవుతుందని ప్రైవేట్ వైద్యులు చెప్పారు. ఆయన డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ముగ్గురు పిల్లలతో కుటుంబాన్ని పోషించేందుకు జీతం సరిపోకపోవడంతో నేను కూడా ఇళ్లల్లో పనులు చేస్తూ ఆయనకు చేదోడువాదోడుగా ఉంటున్నాను. అనారోగ్యంతో ఏడాదిగా డ్రైవర్ ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబ పోషణే కష్టంగా మారింది. అంతమొత్తంలో డబ్బు ఖర్చు పెట్టలేక నా భర్తపై ఆశలు వదిలేసుకున్నాను. నా భర్త ఓ డాక్టర్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తుండటంతో ఆయన సూచన మేరకు ఆరు నెలల క్రితం జీజీహెచ్‌కు వచ్చాం. డాక్టర్ గోఖలే ఆరునెలలుగా మాకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ గుండెమార్పిడి ఆపరేషన్ చేస్తామని భరోసా ఇచ్చారు. గుండెకోసం ఇన్ని రోజులు వేచి ఉన్నాం. ఈ శుక్రవారం జీవితంలో నాకు మరిచిపోలేని రోజు. జీజీహెచ్ వైద్యులకు, డాక్టర్ గోఖలేకు రుణపడి ఉంటాను. - ఓర్ప (ఉప్పు ఏడుకొండలు భార్య)
ఇద్దరూ ఏడుకొండలే.. ఇద్దరూ డ్రైవర్లే..
విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన ఇమడాబత్తుని ఏడుకొండలు (44) ఈనెల 13న రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఈనెల 19వ తేదీన మంగళగిరి ఎన్నారై వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా నిర్ధారించారు. ఆయన భార్య నాగమణి అవయవదానం చేసేందుకు ముందుకు రావడంతో గుంటూరు స్వర్ణభారతి నగర్ సీబ్లాక్ మూడో వీధికి చెందిన ఉప్పు ఏడుకొండలుకు విజయవంతంగా గుండె అమర్చారు. గుండెదానం చేసినవారు, గుండెను స్వీకరించిన వారు ఇద్దరి పేర్లు ఏడుకొండలు కాగా, ఇద్దరూ డ్రైవర్లే కావడం మరో విశేషం. ఉదయం 11 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకూ ఆపరేషన్ జరిగింది. డాక్టర్ గోఖలేతో పాటు సర్జన్లు డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, మత్తు వైద్య నిపుణుడు సుధాకర్, డాక్టర్ భరద్వాజ్, డాక్టర్ షరీఫ్, డాక్టర్ అనూష ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. - గుంటూరు మెడికల్
ఓ ఇంట అంతులేని విషాదం.. మరో ఇంట
అవధుల్లేని ఆనందం.. ఓ కంట విషాదాశ్రు ప్రవాహం.. మరో కంట ఆనంద బాష్ప జలపాతం.. హృదయంలో అటు ఉద్వేగం.. ఇటు ఉత్తేజం.. అర్థంతరంగా ముగిసిన ఓ జీవన పయనం ఆరిపోతున్న ఆరు దీపాలను వెలిగించింది. ఈ ప్రాణదానంతో ఆగిపోతున్న ఓ గుండె ఊపిరిపోసుకుని పేద కుటుంబానికి చిరుదివ్వె అయ్యింది. రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలై మంగళగిరి ఎన్నారైలో చికిత్స పొందుతున్న విజయవాడకు చెందిన ఇమడాబత్తుని ఏడుకొండలు గుండెను గుంటూరు జీజీహెచ్‌లో మరణానికి చేరువైన ఉప్పు ఏడుకొండలుకు అమర్చి ప్రాణదానం చేశారు. ఇద్దరు ఏడుకొండలు మధ్య సాగిన ఈ గుండెమార్పిడి శస్త్రచికిత్సను ఊపిరి తెగే ఉద్రిక్త క్షణాల మధ్య గుంటూరు జీజీహెచ్ వైద్యులు శుక్రవారం విజయవంతంగా పూర్తిచేశారు.