నెదర్లాండ్స్‌లోని తన నివాసంలో భార్య పెట్రాతో బెర్ట్ జాన్సెన్
గిన్నిస్ ప్రపంచ రికార్డ్ సృష్టించిన నెదర్లాండ్స్ వ్యక్తి
ఆమ్‌స్టర్‌డ్యామ్: గుండె కండరాల సమస్య కారణంగా అవయవాలకు అతని గుండె సరిగా రక్తాన్ని సరఫరా చేయలేని పరిస్థితి. ఈ దుస్థితి ఇలాగే ఉంటే మరో 6 నెలలకు మించి బతకవు అని వైద్యులు కరాఖండిగా చెప్పేశారు. అదేకాలంలో రోడ్డు ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె ఈయనకు సరిగ్గా సరిపోయింది. వెంటనే హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీతో ఈయనకు వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు.
1984లో గుండె మార్పిడి చేయించుకున్నాక ఇప్పటికీనిక్షేపంగా ఉన్నారు. ప్రపంచంలో గుండె మార్పిడి చేయించుకున్న తర్వాత అత్యధిక కాలం జీవించి ఉన్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డు సృష్టించిన నెదర్లాండ్స్ వాసి, 57 ఏళ్ల బెర్ట్ జాన్సెన్ కథ ఇది. ప్రస్తుతం గ్లైడర్ పైలెట్‌గా పనిచేస్తున్న ఇతనికి గుండె మార్పిడి చికిత్స జరిగి నేటికి 39 ఏళ్ల 8 నెలల 29 రోజులు. 17 ఏళ్లకు ఫ్లూ వ్యాధి సోకినపుడు వైద్యులు పరీక్షలు చేసి కార్డియో మయోపతి అనే సమస్య ఉందని గుర్తించారు.
త్వరగా గుండె మార్చకపోతే ప్రాణానికే ప్రమాదమని తేల్చారు. లండన్ ప్రమాదంలో మరణించిన వ్యక్తి గుండె సరిపోలడంతో ఆయనకు ఆ గుండెను అమర్చారు. ‘హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే 16 ఏళ్లకు మించి బతకరనేది అవాస్తవం. గుండె మార్పిడి అద్భుతం అనేందుకు నేనే నిలువెత్తు నిదర్శనం.
బర్త్‌డేను అయినా పెద్దగా పట్టించుకోనుగానీ ఆపరేషన్ జరిగిన తేదీ నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు’ అని జాన్సెన్ వ్యాఖ్యానించారు. ‘గుండె మార్పిడి చేయించుకున్న వ్యక్తి జీవనశైలి ఆరోగ్యకరంగా ఉండాలి’ అని ఆపరేషన్ చేసిన ప్రఖ్యాత వైద్యుడు మ్యాగ్డీ యాకూబ్ చెప్పారు. ‘40 ఏళ్ల క్రితం నెదర్లాండ్స్‌లో ఇలాంటి ఆపరేషన్ సౌకర్యాలు లేవు. అందుకే జాన్సెన్‌ను లండన్‌లోని హేర్‌ఫీల్డ్ ఆస్పత్రిలో గుండెమార్పిడి చేశా’ అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment