శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో గుండె మార్పిడి చేయించుకున్న విశ్వేశ్వరకు వైద్య సదుపాయాలు అందిస్తున్న వైద్య సిబ్బంది
తిరుపతి తుడా: తిరుపతిలోని శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం వైద్యులు నిరుపేద కుటుంబానికి చెందిన 15 ఏళ్ల బాలుడికి గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేసి పునర్జన్మ ప్రసాదించారు. రాష్ట్రంలో ఓ చిన్నారికి గుండె మార్పిడి చికిత్సను తొలిసారిగా చేపట్టిన రికార్డును ఇక్కడి వైద్యులు సొంతం చేసుకున్నారు.
48 ఏళ్ల మహిళ గుండెను 15 సంవత్సరాల బాలుడికి అమర్చి శభాష్ అనిపించారు. టీటీడీ పరిధిలోని వైద్యుల కృషిని యావత్ ప్రజానీకం శభాష్ అంటూ కొనియాడుతోంది. గతంలో విశాఖపట్నం ప్రభుత్వ ఆస్పత్రి వేదికగా 40 ఏళ్లు పైబడిన ముగ్గురికి గుండె మార్పిడి చేశారు. ఆ తర్వాత తిరుపతిలో చేపట్టిన గుండె మార్పిడి శస్త్ర చికిత్స చరిత్ర సృష్టించింది.
బ్రెయిన్ డెడ్ మహిళ నుంచి..
అన్నమయ్య జిల్లాకు చెందిన 15 ఏళ్ల బాలుడు ఎం.విశ్వేశ్వరకు జనవరి 20న గుండె మార్పిడి శస్త్ర చికిత్స చేపట్టారు. విశాఖపట్నంకు చెందిన 48 ఏళ్ల మహిళ బ్రెయిన్ డెడ్ కావడంతో ఆమె కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఆమె గుండెను గ్రీన్ చానల్ ద్వారా తిరుపతి తీసుకువచ్చి శ్రీపద్మావతి చిన్న పిల్లల హృదయాలయంలో బాలుడికి అమర్చారు.
ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డితో కూడిన వైద్యుల బృందం విజయవంతంగా గుండె మార్పిడి శస్త్ర చికిత్సను చేపట్టింది. 21 రోజులపాటు ఆస్పత్రిలోని ప్రత్యేక వార్డులో ఆ బాలుడికి చికిత్సను అందించారు. బాలుడు పూర్తిగా కోలుకోవడంతో నాలుగైదు రోజుల్లో డిశ్చార్జి చేయనున్నారు.
ఆదుకున్న ఆరోగ్యశ్రీ
అన్నమయ్య జిల్లాకు చెందిన నరసయ్య, రాధ దంపతులు సాధారణ రైతు కూలీ కుటుంబానికి చెందిన వారు. వీరికి ముగ్గురు పిల్లలు. మొదటి సంతానమైన విశ్వేశ్వర గుండె పూర్తిగా క్షీణించి అనారోగ్యానికి గురి కావడంతో శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి తీసుకువచ్చారు. గుండెకు తీవ్ర ఇన్‌ఫెక్షన్ సోకినట్టు గుర్తించిన వైద్యులు గుండెమార్పిడి అనివార్యమని తేల్చారు.
విశాఖకు చెందిన సన్యాసమ్మ గుండెను బాలుడికి అమర్చి పునర్జన్మను ఇచ్చారు. రూ.40 లక్షల వరకు ఖర్చయ్యే వైద్యాన్ని వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అందించారు. వైద్యుల విజ్ఞప్తి మేరకు యుద్ధప్రాతిపదికన ప్రభుత్వం రూ.10 లక్షలను విడుదల చేసింది. గుండె మార్పిడి అనంతరం బాలుడిని పలకరించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నం ఫలించింది. ఆ బాలుడు గోవింద నామస్మరణ చేస్తూ పులకించిపోయాడు. బాలుడి తల్లిదండ్రులు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment