
ముంబై నుంచి చెన్నైకి.. 1300 కిలోమీటర్లు ప్రయాణించి.. ఓ గుండె మరో మనిషికి ప్రాణం పోసింది. అవయవ దానంపై స్వచ్ఛంద సంస్థలు ప్రజల్లో అవగాహన పెంచుతుండడంతో దాని ఆవశ్యకతను ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. తాజాగా ముంబయిలో బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను ఏకంగా 1300 కిలోమీటర్ల దూరంలోని ఓ వ్యక్తికి అమర్చి వైద్యులు అరుదైన ఘనత సాధించారు. ఇందుకు ఎయిర్‌పోర్ట్ అధికారులు, ట్రాఫిక్ సిబ్బంది, వైద్యులు ఎంతో సహకారం అందించారు.
నవీ ముంబైకి చెందిన చేతన్ టేలర్ ఓ చిరు వ్యాపారి. అతను తీవ్ర అస్వస్థతతో 20 రోజుల క్రితం అపోలో ఆస్పత్రిలో చేరాడు. అతని మెదడులో రక్తస్రావం అవుతున్నట్లు వైద్యులు గుర్తించారు. దాన్ని ఆపేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరకు బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు అతని కుటుంబసభ్యులకు తెలిపారు. అలాగే అవయవదానం గురించి చేతన్ భార్య, కుమారుడికి అవగాహన కల్పించడంతో వారు చేతన్ గుండెను దానం చేసేందుకు ముందుకొచ్చారు.
చేతన్ కుటుంబసభ్యులు గుండె దానానికి ఒప్పుకోవడంతో నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ రంగంలోకి దిగింది. చెన్నైలోని నివసిస్తున్న లెబనాన్‌కు చెందిన 61 ఏళ్ల వ్యాపారవేత్తకు ఆ గుండె సరిపోతుందని తెలియడంతో చేతన్ హృదయాన్ని నవీ ముంబై నుంచి చెన్నైకి తరలించారు. గుండెను తరలించే క్రమంలో అధికారులు ఎక్కడిక్కడ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో ఆస్పత్రి నుంచి కేవలం 40 నిమిషాల్లో గుండెను ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేర్చారు. చార్టెడ్ విమానంలో అక్కడి నుంచి 4 గంటల్లో చెన్నై ఫోర్టిస్ ఆస్పత్రికి తీసుకొచ్చి విజయవంతంగా శస్త్ర చికిత్స పూర్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment