ఓ గుండె కోసం.. ఆగిపోయిన నగరం!! | chennai city halts for a heart transplant | Sakshi
Sakshi News home page

ఓ గుండె కోసం.. ఆగిపోయిన నగరం!!

Published Tue, Jun 17 2014 11:00 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 AM

ఓ గుండె కోసం.. ఆగిపోయిన నగరం!!

ఓ గుండె కోసం.. ఆగిపోయిన నగరం!!

ముఖ్యమంత్రి, గవర్నర్ లాంటి వాళ్లు ఎక్కడికైనా వెళ్లాలంటే మధ్యలో ట్రాఫిక్ అంతా ఆపేసి మరీ వారిని ఆగమేఘాల మీద పంపిస్తారు. అదే సామాన్యుడు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుందటే మాత్రం ఆస్పత్రికి వెళ్లడానికి కూడా గంటల తరబడి సమయం పడుతుంది. కానీ.. చెన్నైలో మాత్రం అందుకు విభిన్నంగా జరిగింది. ఓ సామాన్య రోగి ప్రాణాలు కాపాడాలని రెండు ఆస్పత్రుల వైద్యులు, పోలీసులు కలిసి చేసిన 'ఆపరేషన్' నూటికి నూరుశాతం విజయవంతం అయ్యింది. ట్రాఫిక్ అవరోధాలన్నింటినీ దాటుకుని సరిగ్గా పావుగంటలోనే గుండెను ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలించి.. దాన్ని రోగికి అమర్చి ప్రాణాలు కాపాడారు. అచ్చం 'ట్రాఫిక్' సినిమాలో చూపించినట్లుగా సాగిన ఈ ఆపరేషన్.. నూటికి నూరుశాతం విజయవంతం అయ్యింది.

సాధారణంగా అయితే మనిషి గుండెను బయటకు తీసిన తర్వాత అది సురక్షిత పరిస్థితుల్లో కూడా 4గంటలే ఉపయోగపడుతుంది. ఉదయం 5.45 గంటల సమయంలో ఓ రోగి దాదాపుగా బ్రెయిన్ డెడ్ పరిస్థితిలో ఉన్నాడని, అతడి గుండెను తీసుకోవచ్చని ప్రభుత్వాస్పత్రి నుంచి చెన్నైలోని ఫోర్టిస్ మలార్ ఆస్పత్రికి ఫోన్ వచ్చింది. అప్పటికే అక్కడ ఓ రోగి ఎన్నాళ్లుగానో గుండెమార్పిడి కోసం వేచి చూస్తున్నాడు. అదే సమయంలో పోలీసులకు కూడా విషయం చెప్పారు. ప్రభుత్వాస్పత్రి నుంచి ఫోర్టిస్ ఆస్పత్రికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది.

మధ్యలో ప్రధానమైన 12 ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ఎక్కడా రెడ్లైట్ అనేది వెలగకుండా ఉండేలా ట్రాఫిక్ మొత్తాన్ని నియంత్రించారు. ప్రభుత్వాస్పత్రి వద్ద 6.44 గంటలకు అంబులెన్సు బయల్దేరింది. దాని ముందుగా పోలీసు పైలట్ వాహనం కూడా వెళ్లింది. సిగ్నల్ పాయింట్లు దాటే సమయంలో కూడా ఆ వాహనాల వేగం దాదాపుగా గంటకు 100 కిలోమీటర్లు!! సాధారణంగా కనీసం 45 నిమిషాలు పట్టే ఆ దూరం దాటడానికి అంబులెన్సుకు పట్టిన సమయం.. కేవలం 13 నిమిషాలు. 6.57 గంటలకల్లా ఫోర్టిస్ ఆస్పత్రికి 'గుండె' భద్రంగా చేరింది. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్యులు చకచకా శస్త్రచికిత్స చేసి, గుండెను మార్చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement