fortis malar hospital
-
ముప్పావు గంట తర్వాత మళ్లీ కొట్టుకున్న గుండె
చెన్నై : మృత్యుద్వారం వరకు చేరుకున్న రోగికి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. ఆగిపోయిన గుండెను 45 నిముషాల తరువాత పనిచేసేలా చేయడంతోపాటు మరో గుండెను అమర్చడం ద్వారా విజయవంతంగా ప్రాణం పోశారు. చెన్నైలోని ఫోర్టిస్ మలర్ ఆస్పత్రిలో ఈ వైద్యఅద్భుతం చోటుచేసుకుంది. గుజరాత్ కు చెందిన జయసుఖ్‌భాయ్ టక్కర్(38) కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్య పరిభాషలో డిలేటెడ్ కార్డియోమైయోపతి అనే వ్యాధి క్రమేణా గుండెపోటుకు దారితీసి ప్రాణాలను హరిస్తుంది. టక్కర్‌కు ఈ వ్యాధి ముదిరిపోవడంతో గుండె పనిచేయటం ఆగిపోయే స్థితికి చేరుకున్నాడు. వెంటనే అతనిని బంధువులు విమానంలో చెన్నైలోని ఫోర్టిస్మలర్ ఆస్పత్రిలో చేర్చారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స అనివార్యమని వైద్యులు పరీక్షల్లో తేల్చారు. గుండె మార్పిడి కోసం దాత కోసం ఎదురుచూస్తుండగా టక్కర్ గుండె అకస్మాత్తుగా ఆగిపోయింది. అత్యవసర చికిత్సలు అన్నీ చేసినా ఫలితం దక్కలేదు. ఎక్స్ట్రాకొర్పొరియల్ కార్డియో పల్మనరీ రీసక్సిటేషన్(ఈసీపీఆర్) చికిత్సను వెంటనే ప్రయోగించడంతో 45 నిమిషాల విరామం తరువాత రోగి గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. అయితే గుండె కొట్టుకోవడం ప్రారంభించినా పదిరోజుల పాటూ రోగి అపస్మారక స్థితిలోనే ఉండిపోయాడు. ఈలోగా గుండెను హైదరాబాద్‌లో సిద్ధంగా ఉన్నట్లు గుర్తించి, అక్కడి వైద్యునితో పరీక్షలు నిర్వహించి కొరియర్ ద్వారా చెన్నైకి తెప్పించారు. ఈ ఏడాది జనవరి 29న గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికాగా రోగి బాగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం రోగి పూర్తి కోలుకున్నాడని వైద్యులు నిర్ధారించారు. ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ కేఆర్ బాలకృష్ణన్, వైద్యులు సంజీవ్ అగర్వాల్, సురేష్‌రావు, రవికుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అపూర్వమైన ఈ ఘటనను వివరించారు.మీడియా సమావేశంలో రోగి జయసుఖ్ భాయ్ టక్కర్ పాల్గొన్నారు. -
షూటింగ్ స్పాట్ లో కుప్పకూలిన మురగదాస్!
చెన్నై: సినీ దర్శకుడు ఏఆర్ మురగదాస్ అనారోగ్య కారణాలతో సోమవారం ఆస్పత్రి పాలయ్యారు. ఫుడ్ పాయిజనింగ్, లో బీపీ కారణాలతో అస్వస్థతకు గురైన మురగదాస్ ను ఆస్పత్రిలో చేర్పించినట్టు తెలుస్తోంది. షూటింగ్ స్పాట్ లోనే సృహతప్పి పడిపోయిన ఆయనను చెన్నైలోని ఫోర్టిస్ మలార్ ఆస్పత్రికి తరలించారు. విజయ్, సమంతాలతో నిర్మిస్తున్న కత్తి షూటింగ్ తిరువన్మియూర్ లో జరుగుతోంది. అక్కడే మురగదాస్ సృహతప్పడంతో ఆస్పత్రికి తరలించినట్టు తెలుస్తోంది. మురగదాస్ ఆరోగ్యంపై ఆందోళన పడాల్సిన అవసరం లేదని చిత్ర యూనిట్ ఓ ప్రకటనలో తెలిపింది. -
ఓ గుండె కోసం.. ఆగిపోయిన నగరం!!
ముఖ్యమంత్రి, గవర్నర్ లాంటి వాళ్లు ఎక్కడికైనా వెళ్లాలంటే మధ్యలో ట్రాఫిక్ అంతా ఆపేసి మరీ వారిని ఆగమేఘాల మీద పంపిస్తారు. అదే సామాన్యుడు ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతుందటే మాత్రం ఆస్పత్రికి వెళ్లడానికి కూడా గంటల తరబడి సమయం పడుతుంది. కానీ.. చెన్నైలో మాత్రం అందుకు విభిన్నంగా జరిగింది. ఓ సామాన్య రోగి ప్రాణాలు కాపాడాలని రెండు ఆస్పత్రుల వైద్యులు, పోలీసులు కలిసి చేసిన 'ఆపరేషన్' నూటికి నూరుశాతం విజయవంతం అయ్యింది. ట్రాఫిక్ అవరోధాలన్నింటినీ దాటుకుని సరిగ్గా పావుగంటలోనే గుండెను ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి తరలించి.. దాన్ని రోగికి అమర్చి ప్రాణాలు కాపాడారు. అచ్చం 'ట్రాఫిక్' సినిమాలో చూపించినట్లుగా సాగిన ఈ ఆపరేషన్.. నూటికి నూరుశాతం విజయవంతం అయ్యింది. సాధారణంగా అయితే మనిషి గుండెను బయటకు తీసిన తర్వాత అది సురక్షిత పరిస్థితుల్లో కూడా 4గంటలే ఉపయోగపడుతుంది. ఉదయం 5.45 గంటల సమయంలో ఓ రోగి దాదాపుగా బ్రెయిన్ డెడ్ పరిస్థితిలో ఉన్నాడని, అతడి గుండెను తీసుకోవచ్చని ప్రభుత్వాస్పత్రి నుంచి చెన్నైలోని ఫోర్టిస్ మలార్ ఆస్పత్రికి ఫోన్ వచ్చింది. అప్పటికే అక్కడ ఓ రోగి ఎన్నాళ్లుగానో గుండెమార్పిడి కోసం వేచి చూస్తున్నాడు. అదే సమయంలో పోలీసులకు కూడా విషయం చెప్పారు. ప్రభుత్వాస్పత్రి నుంచి ఫోర్టిస్ ఆస్పత్రికి 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మధ్యలో ప్రధానమైన 12 ప్రాంతాల్లో పోలీసులు మోహరించారు. ఎక్కడా రెడ్‌లైట్ అనేది వెలగకుండా ఉండేలా ట్రాఫిక్ మొత్తాన్ని నియంత్రించారు. ప్రభుత్వాస్పత్రి వద్ద 6.44 గంటలకు అంబులెన్సు బయల్దేరింది. దాని ముందుగా పోలీసు పైలట్ వాహనం కూడా వెళ్లింది. సిగ్నల్ పాయింట్లు దాటే సమయంలో కూడా ఆ వాహనాల వేగం దాదాపుగా గంటకు 100 కిలోమీటర్లు!! సాధారణంగా కనీసం 45 నిమిషాలు పట్టే ఆ దూరం దాటడానికి అంబులెన్సుకు పట్టిన సమయం.. కేవలం 13 నిమిషాలు. 6.57 గంటలకల్లా ఫోర్టిస్ ఆస్పత్రికి 'గుండె' భద్రంగా చేరింది. అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్యులు చకచకా శస్త్రచికిత్స చేసి, గుండెను మార్చేశారు.