ముప్పావు గంట తర్వాత మళ్లీ కొట్టుకున్న గుండె
చెన్నై : మృత్యుద్వారం వరకు చేరుకున్న రోగికి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారు. ఆగిపోయిన గుండెను 45 నిముషాల తరువాత పనిచేసేలా చేయడంతోపాటు మరో గుండెను అమర్చడం ద్వారా విజయవంతంగా ప్రాణం పోశారు. చెన్నైలోని ఫోర్టిస్ మలర్ ఆస్పత్రిలో ఈ వైద్యఅద్భుతం చోటుచేసుకుంది. గుజరాత్ కు చెందిన జయసుఖ్‌భాయ్ టక్కర్(38) కొంతకాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. వైద్య పరిభాషలో డిలేటెడ్ కార్డియోమైయోపతి అనే వ్యాధి క్రమేణా గుండెపోటుకు దారితీసి ప్రాణాలను హరిస్తుంది. టక్కర్‌కు ఈ వ్యాధి ముదిరిపోవడంతో గుండె పనిచేయటం ఆగిపోయే స్థితికి చేరుకున్నాడు. వెంటనే అతనిని బంధువులు విమానంలో చెన్నైలోని ఫోర్టిస్‌మలర్ ఆస్పత్రిలో చేర్చారు.
గుండె మార్పిడి శస్త్రచికిత్స అనివార్యమని వైద్యులు పరీక్షల్లో తేల్చారు. గుండె మార్పిడి కోసం దాత కోసం ఎదురుచూస్తుండగా టక్కర్ గుండె అకస్మాత్తుగా ఆగిపోయింది. అత్యవసర చికిత్సలు అన్నీ చేసినా ఫలితం దక్కలేదు. ఎక్స్‌ట్రాకొర్పొరియల్ కార్డియో పల్మనరీ రీసక్సిటేషన్(ఈసీపీఆర్) చికిత్సను వెంటనే ప్రయోగించడంతో 45 నిమిషాల విరామం తరువాత రోగి గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది. అయితే గుండె కొట్టుకోవడం ప్రారంభించినా పదిరోజుల పాటూ రోగి అపస్మారక స్థితిలోనే ఉండిపోయాడు.
ఈలోగా గుండెను హైదరాబాద్‌లో సిద్ధంగా ఉన్నట్లు గుర్తించి, అక్కడి వైద్యునితో పరీక్షలు నిర్వహించి కొరియర్ ద్వారా చెన్నైకి తెప్పించారు. ఈ ఏడాది జనవరి 29న గుండె మార్పిడి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తికాగా రోగి బాగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం రోగి పూర్తి కోలుకున్నాడని వైద్యులు నిర్ధారించారు. ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి కార్డియాక్ సైన్సెస్ డైరెక్టర్ డాక్టర్ కేఆర్ బాలకృష్ణన్, వైద్యులు సంజీవ్ అగర్వాల్, సురేష్‌రావు, రవికుమార్ మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అపూర్వమైన ఈ ఘటనను వివరించారు.మీడియా సమావేశంలో రోగి జయసుఖ్ భాయ్ టక్కర్ పాల్గొన్నారు.