heart transplantation
-
గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలింపు..
-
గ్రీన్ ఛానెల్..గుండె మార్పిడి.. వైజాగ్ - తిరుపతి
-
హ్యాట్సాఫ్ ఏపీ పోలీస్
-
పంది గుండె అమర్చిన మరో వ్యక్తి మృతి
పంది గుండెను అమర్చిన మరో వ్యక్తి మరణించాడు. లారెన్స్ ఫాసెట్(58) అనే వ్యక్తికి సెప్టెంబర్ 20న జన్యుపరంగా మార్పులు చేసిన పంది గుండెను ట్రాన్స్‌ప్లాంటేషన్ చేశారు. దాదాపు 40 రోజుల తర్వాత గుండె వైఫల్యం చెందడంతో లారెన్స్ మృతి చెందారని మేరీల్యాండ్ మెడికల్ స్కూల్ వైద్యులు తెలిపారు. గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన నెలరోజుల వరకు చక్కగా పనిచేసిందని వెల్లడించాడు. ఆ తర్వాత గుండె పనితీరు క్షీణించడం మొదలయ్యిందని పేర్కొన్నారు. 'గుండె మార్పిడి చేసిన తర్వాత లారెన్స్ ఆరోగ్యంగా గడిపారు. ఫిజికల్ థెరపీలో కూడా పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేశారు. భార్య యాన్‌తో కార్డ్స్ కూడా ఆడేవారు. కానీ ఇటీవల గుండె పనితీరులో వైఫల్యం కనిపించింది. మానవ అవయవాల మార్పిడి విధానంలో ఇది అతి క్లిష్టమైన పద్దతి. ఆరు వారాలపాటు ఆరోగ్యంగా గడిపారు. కానీ సోమవారం ప్రాణాలు కోల్పోయారు.' అని మేరీల్యాండ్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు. లారెన్స్ నావీలో పనిచేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్‌లో టెక్నీషియన్‌గా రిటైర్ట్ అయ్యారు. గుండె సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు ఉండటంతో హర్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కి మేరీల్యాండ్ ఆస్పత్రి వైద్యులు నిరాకరించారు. ఎట్టకేలకు గుండె మార్పిడి చేయగా ఇన్నాళ్లు బతికారని లారెన్స్ భార్య యాన్ తెలిపారు. జంతువుల అవయవాలను మానవులకు మార్పిడి చేసే పద్దతిని జెనోట్రాన్స్ప్లాంటేషన్ అని పిలుస్తారు. ఇది మానవ అవయవ దాతల కొరత సమస్యను తగ్గిస్తుంది. ఈ ప్రక్రియ సవాలుగా మారింది. రోగి రోగనిరోధక వ్యవస్థ మార్పిడి అవయవం పనితీరుకు సరిపోలడం క్లిష్టతరమైంది. పంది భాగాలను జన్యుపరంగా మార్పు చేయడం వల్ల మానవ అవయవాలలాగా పనిచేస్తాయని వైద్యులు భావించారు. ఇదీ చదవండి: హోటల్‌కు వచ్చిన మహిళకు చేదు అనుభవం -
విజయవంతంగా గుండె మార్పిడి
-
సీఎం జగన్ ఛాపర్ లో గుండె తరలింపు
-
పద్మావతి ఆస్పత్రిలో ఆరో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్
తిరుపతి: తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో ఆరో హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతమైంది. 33 ఏళ్ల వ్యక్తికి గుండె మార్పిడి ఆపరేషన్‌ను వైద్యులు నిర్వహించారు. గుంటూరులో బ్రెయిన్‌డెడ్ అయిన 19 ఏళ్ల యువకుడి గుండెను అమర్చారు. హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం గుంటూరు నుంచి ప్రత్యేక చాపర్‌లో గుండెను తిరుపతి పద్మావతి ఆస్పత్రికి తరలించారు. గుండె తరలింపునకు సీఎం జగన్ చొరవతో ప్రత్యేక చాపర్‌ను ఏర్పాటు చేశారు. సీఎం జగన్ చొరవతో రెండేళ్ల కిందటే టీటీడీ ఆధ్వర్యంలో హార్ట్ ఆస్పత్రిని ఏర్పాటు చేశారు. ఈ రెండేళ్లలోనే 1900 గుండె ఆపరేషన్లను ఈ ఆస్పత్రిలో నిర్వహించారు. దేశం నలుమూలలతో పాటు బంగ్లాదేశ్ నుంచి కూడా తిరుపతికి రోగులు వస్తున్నారు. పద్మావతి మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి అనతికాలంలోనే ది బెస్ట్‌గా గుర్తింపు సాధించింది. ఇదీ చదవండి: వ్యవసాయ ఉత్పత్తులకు ముందే మద్ధతు ధరలు : మంత్రి కాకాణి -
హరీష్ రావును అభినందిస్తూ ట్వీట్ చేసిన కేటీఆర్.. ఎందుకంటే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వైద్యారోగ్యశాఖ మంత్రి హరీష్ రావుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు సాక్షిలో ‘సర్కార్ సర్జరీ.. సూపర్’ అనే శీర్షికతో ప్రచురితమైన వార్త క్లిప్‌ను ట్విటర్లో షేర్ చేశారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సర్కారు దవాఖాన సూపర్ అనే స్థాయికి రావడం గర్వకారణమని కొనియాడారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ, నిమ్స్ ఆసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ కింద1539 కిడ్నీ, 51 కాలేయ మార్పిడి సర్జరీలు జరిగినట్లు తెలిపారు. హార్ట్ ట్రాన్స్‌ప్లంట్ జరగడం.. స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌ప్లంట్ సెంటర్ ఏర్పాటు అదే విధంగా బేరియాట్రిక్ సర్జరీలు కూడా చేయడం అభనందనీయమన్నారు. ఇందుకు కృషి చేస్తున్న మంత్రి హరీష్‌రావు, వైద్య బృందానికి అభినందనలు అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే పరిస్థితి నుండి ముఖ్యమంత్రి కెసిఆర్ గారి ప్రభుత్వ హయాంలో సర్కారు దవాఖాన సూపర్ అనే స్థాయికి రావడం గర్వకారణం 👏 1539 కిడ్నీ, 51 లివర్, హార్ట్ Transplants జరగడం, State Organ Transplant Centre ఏర్పాటు అదే విధంగా Bariatric surgeries కూడా చెయ్యడం… https://t.co/NBDNQAmVJI pic.twitter.com/S9MClqz6X9 — KTR (@KTRBRS) March 12, 2023 -
శ్రీ పద్మావతి హెర్ట్ కేర్ సెంటర్ లో తొలి హార్ట్ ట్రాన్స్ ప్లాంటెషన్ విజయవంతం
-
బైక్‌పై నుంచి కళ్లు తిరిగి పడి మహిళ బ్రెయిన్ డెడ్.. పేద గుండెకు పునర్జన్మ
తిరుపతి తుడా/అక్కిరెడ్డిపాలెం (విశాఖపట్నం): విశాఖపట్నానికి చెందిన ఓ మహిళకు బ్రెయిన్ డెడ్ కావటంతో కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారు. దీంతో ఆమె గుండెను శుక్రవారం ప్రత్యేక విమానంలో తిరుపతికి తీసుకొచ్చి గుండెజబ్బుతో బాధపడుతున్న 15ఏళ్ల బాలుడికి ఆరోగ్యశ్రీ కింద శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సాలయంలో పూర్తి ఉచితంగా శస్త్రచికిత్స చేసి అమర్చారు. నిజానికి.. 2021 అక్టోబర్ 11న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ చికిత్సాలయాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఈ నేపథ్యంలో.. తొలిసారి ఇక్కడి వైద్యులు గుండెమార్పిడి చేశారు. ఈ యజ్ఞం పూర్వాపరాలు ఇవిగో.. పేద రైతుకు పెద్ద కష్టం.. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ రైతుకూలీ నెలరోజుల క్రితం అనారోగ్యంతో ఉన్న తన పదిహేనేళ్ల కుమారుణ్ణి పద్మావతి ఆస్పత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు అతని గుండెకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారించి మార్పిడి అనివార్యమని తేల్చిచెప్పారు. జీవన్‌దాన్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి చికిత్స అందిస్తూ వస్తున్నారు. వారం క్రితం ఆ బాలుడి పరిస్థితి మరింత విషమించింది. విశాఖపట్నంలో మహిళకు బ్రెయిన్ డెడ్ ఇంతలో.. విశాఖపట్నంలోని భెల్ (హెచ్‌పీవీపీ)లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న జంజూరు ఆనందరావు భార్య సన్యాసమ్మ (48) టౌన్షిప్లో ఉంటున్నారు. వీరి ఇద్దరి కుమారులూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. సంక్రాంతి సందర్భంగా సన్యాసమ్మ పెందుర్తి సమీప గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ నెల 17న తన కుమారుడితో బైక్‌పై తిరిగి వస్తుండగా కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయమవడంతో షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు శుక్రవారం ఉదయం వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించటంతో వైద్యులు జీవన్‌దాన్ సైట్‌కు సమాచారమిచ్చారు. స్పందించిన సీఎంఓ.. సన్యాసమ్మ గుండె తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి అమర్చే అవకాశముందన్న సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం రెండు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, వైద్యులను అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక విమానంలో గుండెను తరలించేందుకు ఏర్పాట్లుచేసింది. ఆగమేఘాలపై గుండె తరలింపు మరోవైపు.. తిరుపతి నుంచి ముగ్గురు వైద్యులతో కూడిన బృందం విశాఖకు వెళ్లి సన్యాసమ్మ గుండెను వేరుచేసి ప్రత్యేక బాక్సులో భద్రపరిచారు. దాన్ని శరవేగంగా తిరుపతి తరలించేందుకు అన్ని ఏర్పాట్లుచేశారు. నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు డీసీపీ ఆనంద్‌కుమార్, ట్రాఫిక్ ఏడీసీపీ శ్రావణ్‌కుమార్, నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 33 మంది సిబ్బంది భద్రతా, ట్రాఫిక్ ఆంక్షలను పర్యవేక్షించారు. షీలానగర్ ఆస్పత్రి నుంచి ఎయిర్‌పోర్టు వరకు నాలుగు కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ నియంత్రించారు. ఆ తర్వాత.. ►9.18 గంటలకు : ఆస్పత్రిలో అంబులెన్స్ బయల్దేరింది. ► 9.20 : ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ► 10.05 : అప్పటికే సిద్ధంగా ఉన్న ఇండిగో విమానం గుండెను తీసుకుని బయల్దేరింది. ►11.31 : రేణిగుంట విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయింది. ► 11.35 : విమానాశ్రయం నుంచి బాక్సును బయటకు తీసుకొచ్చారు. ► 11.56 : టీటీడీ అంబులెన్స్‌లో 21.5 కి.మీ. దూరాన్ని 21 నిమిషాల్లో తిరుపతిలోని శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌కు తీసుకొచ్చారు. ►11.57 : ఒక నిమిషంలోనే ఆస్పత్రిలోకి గుండెను చేర్చారు. ►అప్పటికే ఆపరేషన్‌కు అవసరమైన ఏర్పాట్లను ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో సిద్ధంచేసి ఉంచారు. ►ఆరుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం 4.15 గంటలపాటు శ్రమించి గుండె మార్పిడి శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తిచేసింది. అందరి సహకారంతోనే.. దాత కుటుంబ సభ్యులు, ప్రభుత్వం, ప్రభుత్వ విభాగాలు, వైద్యుల ఉమ్మడి కృషితోనే ఇది సాధ్యమైంది. గుండెను తగిన జాగ్రత్తలతో భద్రపరిస్తే ఆరు గంటల వరకు పనిచేస్తుంది. సన్యాసమ్మ గుండెను మూడు గంటల్లోపే తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అమర్చిన గుండె పూర్తి సామర్థ్యంతో పనిచేసి బాలుడు కోలుకునేందుకు వారం రోజులు పడుతుంది. – డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి ఆమెలేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా సన్యాసమ్మ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా. ఇప్పటివరకు నేను, పెద్దబ్బాయి చైతన్య, చిన్నబాబు జయప్రకా‹Ùలు తేరుకోలేదు. ఇద్దరు కుమారులను కంటికి రెప్పలా చూసుకుని మురిసిపోయేది. వారికి ఏది కావాలన్నా నాతో గొడవపడి మరీ సాధించేది. – జంజూరు ఆనందరావు, సన్యాసమ్మ భర్త, భెల్ ఉద్యోగి -
సగం గుండెతో జన్మించిన చిన్నారి.. పుట్టిన నాలుగో రోజు నుంచే మూడు ఓపెన్ సర్జరీలు
న్యూయార్క్: అమెరికాలో ఐదేళ్ల చిన్నారి అరుదైన వ్యాధితో పోరాడుతోంది. ఆ చిన్నారి పుట్టుకతోనే సగం గుండెతో జన్మించింది. ఆ చిట్టితల్లి పేరు కేథరీన్ లాంగే. ఆమె హైపోప్లాస్టిక్ లెఫ్ట్ హార్ట్ సిండ్రోమ్‌తో జన్మించింది. ఈ గుండె లోపం కారణంగా ఆ చిన్నారికి గుండె ఎడమ భాగం అభివృద్ధి చెందదు. పాపం ఆ చిన్నారి తల్లిదండ్రులు మాత్రం ఆమెకు నయమవుతుందేమోనన్న ఆశతో వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. ఈ అరుదైన వ్యాధిని ఆ చిన్నారి తల్లి 20 వారాల గర్భవతిగా ఉన్నప్పుడే గుర్తించారు వైద్యులు. ఈ విషయాన్ని వైద్యులు ఆ తల్లిదండ్రులకు తెలియజేశారు కూడా. పైగా మెక్సికోలో ఈ అరుదైన వ్యాధికి శస్త్ర చికిత్స చేసే వైద్యులు కూడా లేరని కొలరాడోకి వెళ్లాల్సి ఉంటుందని తెలిపారు. ఆ చిన్నారి పుట్టిన నాలుగు రోజునే ఒక ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. ఆ తర్వాత నాలుగు నెలల వయసులో మరోకటి, రెండున్నర ఏళ్లలో మరొక ఓపెన్ హార్ట్ సర్జరీ చేశారు. అంతేకాదు ఆ చిన్నారికి దాదాపు 10 హార్ట్ కాథెటరైజేషన్లు(గుండె కొట్టుకునేలా చేసే డివైజ్‌లు) జరిగాయి. కేవలం గత 12 నెలల్లో 40 సార్లుకు పైగా రక్తం తీశారు. ఇప్పడూ 11వ హార్ట్ కాథెటరైజేషన్ ప్రక్రియకు సిద్ధమైందని తెలిపారు. ప్రస్తుతం ఆ చిన్నారి గుండె జబ్బుతో పాటు, లివర్ లీకేజ్‌తో బాధపడుతోంది. దీన్ని ప్రోటీన్ లాసింగ్ ఎంట్రోపతి అని పిలుస్తారు. ఐతే ఆ చిన్నారి తల్లిదండ్రులు మాత్రం ఆ చిన్నారి బతుకుందనే ఆశతో ఉన్నారు. ఒకవేళ వైద్యుల ప్రయత్నాలు విఫలమైతే ప్రత్యక్ష గుండె మార్పిడి చేయాల్సి ఉంటుందని అన్నారు. (చదవండి: భూమిని ఢీ కొట్టిన జెట్ విమానం.. మంటల్లో సైతం ఎగిరి..) -
గుండెమార్పిడి శస్త్రచికిత్సల్లో కొత్త పుంతలు
గుండె మార్పిడి శస్త్రచికిత్సల్లో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. మానవుల నుంచి మానవులకు గుండెమార్పిడి ఎప్పటినుంచో జరుగుతున్నదే. కానీ... ఓ వ్యక్తి బ్రెయిన్‌డెడ్ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. అందుకే జంతువుల నుంచి కూడా గుండె సేకరించి, మనుషులకు అమర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదట్లో ఓ చింపాంజీ నుంచి గుండె సేకరించి, ఓ చిన్నారికి అమర్చగా ఆమె18 నెలలు బతికింది. అలాగే ఇటీవల పంది నుంచి గుండె సేకరించి అమర్చిన వ్యక్తి రెండు నెలల పాటు జీవించాడు. ఇది కొద్దిపాటి పురోగతే. కానీ మరింత ప్రగతి సాధించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. గుండెమార్పిడి శస్త్రచికిత్సల్లో కొత్తపుంతలు చోటు చేసుకుంటున్నాయి. అవేమిటో చూద్దాం. గుండెమార్పిడి అనే మాట వినగానే భయాందోళన కలిగే రోజులు పోయాయి. గుండె పూర్తిగా విఫలమైన తర్వాత... ఇక అన్ని మార్గాలూ మూసుకుపోయినప్పుడు అత్యుత్తమ చివరిప్రయత్నంగా గుండె మార్పిడి చికిత్సను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారుగా మూడువేల గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. అయితే డిమాండ్‌కు అనుగుణంగా దాతలు అందుబాటులో లేనందున అనేకమంది బాధితులు గుండె మార్పిడి కోసం వేచి ఉండాల్సి వస్తోంది. గుండెమార్పిడి శస్త్రచికిత్సల పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేనందువల్ల అవసరమైనప్పుడు గుండె మార్పిడిని ఆశ్రయించడానికీ లేదా అవయవ దాతలుగా నమోదు కావడానికి ఎక్కువమంది ముందుకు రావడం లేదు. గుండెమార్పిడి పురోగతిలో రకరకాల మైలురాళ్లివి... ∙డొనేషన్ ఆఫ్టర్ సర్క్యులేటరీ డెత్: మామూలుగా అవయవ దానం చేయాలంటే మెదడు చనిపోయినప్పటికీ గుండె కొట్టుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యం. కొన్నిసార్లు మెదడు చనిపోయిన తర్వాత అవయవాల్ని దానం కోసం బయటకు తీసే లోపలే గుండె కొట్టుకోవడం ఆగిపోతే మాత్రం ఆ అవయవాలు దానానికి పనికిరావు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి అమల్లోకి వచ్చిన ప్రక్రియే ‘డొనేషన్ ఆఫ్టర్ సర్క్యులేటరీ డెత్’! దీనివల్ల అవయదానం చేసేటప్పటికి గుండె ఆగిపోయినప్పటికీ అవయవాల్ని దానం కోసం వినియోగించుకోగలుగుతారు. మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్: గుండెమార్పిడి అవసరమైన వ్యక్తులలో గుండె బాగా బలహీనంగా ఉంటుంది. అందువల్ల శరీరంలోని అన్ని అవయవాలకు రక్తసరఫరా తక్కువగా ఉంటుంది. ఈ కారణంగా గుండె మార్పిడి తర్వాత కూడా గుండె తప్ప మిగతా అవయవాలు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు గుండె మార్పిడి శస్త్రచికిత్సకు ముందుగా... గుండెకి మరింత ఆలంబనగా ఉండేందుకు కొన్ని ఉపకరణాలు ఉపయోగపడతాయి. ఇవే‘మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్’ పరికరాలు. వీటిలో ఐ.ఏ.బి.పి., ఇంపెల్లా, ఎక్మో, ఎల్ వాడ్లు వంటివి ప్రధానమైనవి. వైఫల్యం చాలా ఎక్కువగా ఉన్న గుండెలకు మెకానికల్ సపోర్ట్ ఇవ్వడం ద్వారా ఈ పరికరాలు గుండె మార్పిడి ప్రక్రియ సఫలమయ్యే అవకాశాన్ని మరింత పెంచుతాయి. ఏబీఓ ఇన్‌కంపాటిబుల్ ట్రాన్స్‌ప్లాంట్: సాధారణంగా గుండెమార్పిడికి ముందు డోనార్ వయసు, జెండర్, బరువు జాగ్రత్తగా పరిశీలిస్తారు. వీటితోపాటు బ్లడ్ గ్రూప్ కూడా మ్యాచ్ అయ్యే విధంగా దాతను ఎంపిక చేసుకోవడం అవసరం. అయితే ఇప్పుడిప్పుడే బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోయినా ట్రాన్స్‌ప్లాంట్ చేసే అవకాశం ఉందని వైద్యులు గుర్తిస్తున్నారు. ప్రయాణంలోనూ బ్రతికి ఉండే గుండె: సాధారణంగా దాత నుంచి తీసుకున్న గుండెను స్వీకర్త దగ్గరికి తీసుకు వెళ్లడానికి ఐస్ బాక్స్‌ను ఉపయోగిస్తారు. ఇందులో స్వీకర్తకు అమర్చేందుకు 6 గంటల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ‘ఆర్గాన్ కేర్ సిస్టమ్’ అనే కీలక ఉపకరణం అందుబాటులోకి వచ్చింది. దాంతో దాత నుంచి బయటకు తీసిన తర్వాత కూడా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. అందువల్ల ఎక్కువ సమయం పాటు గుండె బతికే ఉంటుంది. ఇతర జీవజాతుల నుంచి గుండె మార్పిడి: మనుషుల నుంచి సేకరించే అవయవాలు గుండె మార్పిడికి సరిపోకపోవడంతో ఇతర జీవజాతుల నుంచి స్వీకరించిన గుండెని మనిషికి అమర్చడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఒకేసారి రెండు ట్రాన్స్ప్లాంట్లు: అవసరాన్ని బట్టి కొంతమంది రోగుల్లో గుండెతోపాటు ఊపిరితిత్తులనూ మార్చాల్సి రావచ్చు. మరికొంతమందిలో గుండెతోపాటుగా కిడ్నీ లేదా లివర్ మార్చాల్సిన అవసరం పడవచ్చు. గతంలో పేషెంట్స్‌కి ఒకేసారి రెండు ట్రాన్స్ప్లాంట్లు చేయడం చాలా కష్టసాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు వేర్వేరు వైద్యవిభాగాలకు చెందిన ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్లు కలిసి పనిచేయడంతో ఇలాంటి ట్రాన్స్ప్లాంట్లూ సులువవుతున్నాయి. రిజెక్షన్ నివారణకు కొత్త పద్ధతులు సాధారణంగా బయట నుంచి వచ్చిన కొత్త గుండెను స్వీకర్త శరీరం అంత తేలిగ్గా అంగీకరించదు. అది తన సొంత అవయవం కాదంటూ నిరాకరిస్తూ ఉంటుంది. దీన్ని వైద్యపరిభాషలో ‘రిజెక్షన్’ అంటారు. దీన్ని నివారించడానికి ఇప్పుడు కొత్త కొత్త మందులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో సీఎస్ఐ ( సైరోలిమస్, టాక్రోలిమస్ వంటివి), ఎంటార్ ఇన్హిబిటార్స్, వాటితోపాటు స్టెరాయిడ్స్ కూడా ముఖ్యమైనవి. ఈ మధ్యనే చెక్–పాయింట్ మాలిక్యూల్స్ కూడా ‘ట్రాన్ప్లాంట్స్ రిజెక్షన్’ని నివారించడానికి ఉపయోగిస్తున్నారు. ఇవి కాకుండా థైమస్ గ్రంథి పనిచేయని పిల్లల్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్తోపాటు అదే దాత నుంచి సేకరించిన థైమస్ ట్రాన్స్‌ప్లాంట్ కూడా చేసినట్లయితే రిజెక్షన్ తక్కువగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది. రిజెక్షన్‌ని గుర్తించడానికి తేలిక మార్గాలు: గతంలో గుండెమార్పిడి తర్వాత రిజెక్షన్‌ని గుర్తించడానికి... దాత గుండె బయాప్సీ మాత్రమే ఒకే ఒక మార్గం. అయితే ఇప్పుడు కొత్త కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. జీన్ ఎక్స్ప్రెషన్ ప్రొఫైల్ (జీఈపీ) ద్వారా ఓ మామూలు రక్తపరీక్షతోనే రిజెక్షన్‌ను గుర్తించవచ్చు. అది మాత్రమే కాకుండా దాత మూత్రం, రక్తంలో ‘సెల్ ఫ్రీ డిఎన్ఏ’ గుర్తించడం ద్వారా కూడా రిజెక్షన్‌ని తెలుసుకోవచ్చు. ఇమ్యూన్ టాలరెన్స్: మన రోగనిరోధక శక్తే... మనలోకి వచ్చిన కొత్త అవయవాన్ని నిరాకరిస్తూ ఉంటుంది. ఇలా జరగకుండా చూసేందుకు ట్రాన్స్‌ప్లాంట్ సమయంలో ఇమ్యూనిటీని తగ్గించే మందులు వాడుతుంటారు. ఇలాంటి మందులేమీ వాడకుండానూ, అలాగే రిజెక్షన్ కూడా రాకుండా చూసే పద్థతులను ‘ఇమ్యూన్ టాలరె¯Œ ్స’ అని పిలుస్తారు. దీన్ని సాధించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాత తాలూకు బోన్ మ్యారోను కూడా గుండెతో ట్రాన్స్‌ప్లాంట్ చేయడం వల్ల కూడా‘ఇమ్యూన్ టాలరె¯Œ ్స’కి అవకాశముంటుందని ఇటీవలి కొన్ని కొత్త పరిశోధనల వల్ల తెలుస్తోంది. ఇప్పుడు సక్సెస్ రేటూ ఎక్కువే... అందుకు కారణాలివి... మన దేశంలోనూ గతంలో పోలిస్తే ఇప్పుడు మరింత మెరుగ్గా, మరింత ఎక్కువ విజయవంతంగా గుండెమార్పిడి శస్త్రచికిత్సలో జరుగుతున్నాయి. ఈ శస్త్రచికిత్స తర్వాత దాదాపు 88 శాతం మంది మొదటి ఏడాది బతికే అవకాశం ఉంటుంది. అంతేకాదు గుండెస్వీకర్తల్లో దాదాపు 75 శాతం మంది ఐదేళ్లకు పైగా జీవించడం విశేషం. ఈ సక్సెస్ రేటు ఇంత మెరుగ్గా ఉండటానికి అనేక కారణాలు దోహదపడుతున్నాయి. అందులో ముఖ్యమైనవి... గతంలో పోలిస్తే మరింత మెరుగైన రీతిలో జరుగుతున్న శస్త్రచికిత్స ప్రక్రియలూ, అలాగే శస్త్ర చికిత్సల తరువాత వాడే కొత్త మందులు ప్రధానమైన కారణాలు. తగ్గుతున్న ఖర్చులు: గతంలో గుండెమార్పిడి శస్త్రచికిత్స అంటే... దాదాపు 35 నుంచి 40 లక్షలు అయ్యేవి. ఇప్పుడీ ప్రక్రియ అనేక ఆసుపత్రుల్లోకి అందుబాటులో రావడంతో రూ. 20 లక్షలకే చేయడం సాధ్యపడుతోంది. దీంతోపాటు ట్రాన్స్‌ప్లాంట్ అనంతర చికిత్స తాలూకు ఖర్చులూ కొంతమేర తగ్గడంతో... ఇది మరింత ఎక్కువమంది బాధితులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇలా కొత్తపురోగతులు వస్తుండటంతో ఖర్చు తగ్గుతుండటం అనేది చాలామంది బాధితులకు కనిపిస్తున్న ఓ భవిష్యత్ ఆశారేఖ. -డా. ఎంఎస్ఎస్ ముఖర్జీ, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ -
పెనువిషాదం. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూత
వైద్య శాస్త్రంలో మరో చారిత్రక ఘట్టం అవుతుందనుకున్నది కాస్త విషాదంగా మిగిలింది. పంది గుండె అమర్చిన వ్యక్తి కన్నుమూశాడు. జనవరి 7వ తేదీన 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి ఈ సర్జరీ జరిగింది. కానీ, ఆ ఆనందం రెండు నెలల్లోనే ముగిసింది. మేరీల్యాండ్(అమెరికా)కు చెందిన డేవిడ్ బెన్నెట్‌కు రెండు నెలల క్రితం అమెరికాలోని మేరీల్యాండ్ ఆసుపత్రిలో గుండెమార్పిడి శస్త్రచికిత్స చేశారు. ప్రపంచ వైద్య చరిత్రలోనే తొలిసారిగా జన్యుమార్పిడి చేసిన పంది నుంచి సేకరించిన గుండెను ఆయనకు విజయవంతంగా అమర్చారు. దీంతో దీనిని పెద్ద ముందడుగుగా భావించారు. కొన్ని రోజులుగా బెన్నెట్ ఆరోగ్యం క్షీణిస్తూ వస్తుండడంతో ఆయనను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా కృషి చేశారు. అయితే, ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. మంగళవారం బెన్నెట్ మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. తండ్రి మృతి విషయాన్ని బెన్నెట్ కుమారుడు బెన్నెట్ జూనియర్ నిర్ధారించారు. 1984లోనూ ఇలాంటి ప్రయోగమే జరగ్గా అది కూడా విఫలమైంది. 1984లో బబూన్(కోతి జాతికి చెందినది) గుండెను ఓ నవజాత శిశువుకు అమర్చగా.. సర్జరీ విజయవంతం అయినప్పటికీ ఆ పసికందు మాత్రం 20 రోజులే జీవించగలిగింది. అయితే, ఈసారి పందిగుండె అమర్చుకున్న బెన్నెట్ రెండు నెలలు జీవించడం కొంత మెరుగైన ఫలితంగా భావించినా.. ఇప్పుడదీ విషాదమే అయ్యింది. -
ఒక ప్రాణం.. మూడు వేల కిలోమీటర్ల ప్రయాణం
అన్నిదానాల్లోకెల్లా అవయవదానం గొప్పదంటారు వైద్యులు. ఎందుకంటే.. ఒకరు కన్నుమూసినా.. మరికొందరి ప్రాణాలు నిలబెట్టొచ్చు కాబట్టి. పరిస్థితులు ఎలాంటివైనా పోతూ పోతూ.. ఇంకోన్ని ప్రాణాలు నిలబెట్టినవాళ్లకు, నిలబెడుతున్నవాళ్లకు జోహార్లు. ఇదిలా ఉండగా.. ఎక్కడో దేశం చివర ఉన్న ఓ పేషెంట్ కోసం ఈ చివర ఉన్న దాత నుంచి గుండె ప్రయాణించిన ఘట్టం ఇది.. జమ్ము కశ్మీర్ శ్రీనగర్‌లో ఉండే షాజాదీ ఫాతిమా(33).. గుండె సంబంధిత జబ్బుతో బాధపడుతోంది. నానాటికీ ఆమె పరిస్థితి దిగజారడంతో గుండె మార్పిడి తప్పనిసరిగా మారింది. ఎంజీఎం హెల్త్‌కేర్‌లో ఫాతిమాను చేర్పించి.. ఆమెకు సరిపోయే గుండె కోసం దేశం మొత్తం జల్లెడ పట్టారు. ఈలోపు జనవరి 26న తమిళనాడు తిరుచురాపల్లిలో బ్రెయిన్ డెడ్ అయిన 18 ఏళ్ల టీనేజర్ గుండె.. ఫాతిమాకు మ్యాచ్ అయ్యింది. దీంతో గ్రీన్ కారిడార్ ద్వారా తమిళనాడు నుంచి కశ్మీర్‌కు తరలించారు. హై రిస్క్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ద్వారా ఫాతిమాకు గుండెను అమర్చారు. కొన్నాళ్లకు.. పూర్తిగా కోలుకున్న ఫాతిమా సంతోషకరమైన జీవితాన్ని మొదలుపెట్టింది. ఫాతిమా అవివాహిత. సోదరుడితో ఉంటూ కూలీ పనులు చేసుకుంటోంది. తన ఆరోగ్య సమస్యపై కనీసం మందులు కూడా కొనుక్కోలేని స్థితి ఆమెది. అందుకే ఐశ్వర్య ట్రస్ట్ అనే ఎన్జీవో ముందుకు వచ్చి సాయం చేసింది. ఫండింగ్ ద్వారా గుండె మార్పిడి చేయించింది. ప్రాణాలను నిలబెట్టే ఇటువంటి మార్పిడికి చాలామంది సమన్వయం, మద్దతు అవసరం. నిజంగా ఫాతిమా కేసు సమిష్టి కృషి ప్రతిఫలం. -
వ్యాక్సీన్ తీసుకోని రోగికి గుండె మార్పిడి శస్త్రచికిత్స నిరాకరించిన వైద్యులు
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. రెండు, మూడు నెలలకొకసారి తన రూపంతారం మార్చుకుని ప్రజలపై దాడి చేస్తోంది. ఈ నేపథ్యంలో అన్ని ప్రభుత్వాలు వ్యాక్సినేషన్‌ను కచ్చితం చేశాయి. ఎక్కడికి వెళ్లినా... కరోనా వ్యాక్సిన్ వేసుకుంటేనే అనుమతులు ఇస్తున్నారు. అయితే ఈ నిబంధన కారణంగా కొన్ని అనర్థాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. గుండె మార్పిడి ఆపరేషన్ చేయాల్సిన ఓ వ్యక్తికి కరోనా వ్యాక్సిన్ తీసుకోలేదని సుపత్రి వర్గాలు నిరాకరించాయి. ఈ సంఘటన అమెరికాలోని బోస్టన్‌లో గల ఓ ఆస్పత్రిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. డీజే ఫెర్గుసన్ అనే అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి గుండె మార్పిడి చికిత్స అత్యవసరంగా చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే డీజే ఫెర్గుసన్‌ను బోస్టన్‌లో ఉన్నటు వంటి.. బ్రిఘం & ఉమెన్స్ ఆస్పత్రిలో చేర్పించారు. గుండె మార్పిడి చికిత్స కోసం ఆసుపత్రి నిబంధనల ప్రకారం.. అన్ని ఫార్మాలిటీలు పూర్తి చేశారు. అంతలోనే ఆస్పత్రి ట్విస్ట్ ఇచ్చింది. డీజే ఫెర్గుసన్.. ఇంత వరకు సింగిల్ డోస్ కూడా వేసుకోలేదని, అతను వ్యాక్సిన్ వేసుకుంటేనే తాము చికిత్స చేస్తామని ఆస్పత్రి వైద్యులు తేల్చి చెప్పారు. దీంతో డీజే ఫెర్గుసన్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. చదవండి: మనిషి చర్మంపై ఒమిక్రాన్ ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా? అత్యవసర సమయంలో ఇలాంటి నిబంధనలు ఎంటని నిలదీశారు. తాను అస్సలు వ్యాక్సిన్ వేసుకోబోనని అటు డీజే ఫెర్గుసన్ మొండి పట్టు పట్టారు. ఇంకేముంది.. తాము ఆపరేషన్ చేయలేమని ఆస్పత్రి సిబ్బంది కుండ బద్దలు కొట్టారు. వ్యాక్సిన్ వేయించుకుంటేనే తాము ఆపరేషన్ చేస్తామని వైద్యులు చెప్పారు. ఇప్పుడు ఈ సంఘటన వివాదంగా మారింది. కాగా అమెరికా జనాభాలో 63 శాతం మంది ప్రజలు రెండు డోసుల టీకాను తీసుకోగా, 40 శాతం మంది అమెరికన్లు బూస్టర్ డోస్‌ను కూడా వేసుకున్నారు. చదవండి: అరుణాచల్ యువకుడిని అప్పగించేందుకు ఓకే చెప్పిన చైనా -
చారిత్రక ఘట్టం.. పంది గుండె మనిషికి!
Pig Heart Transplantation To Human: వైద్య శాస్త్రంలో మరో చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. మనిషికి పంది గుండెను విజయవంతంగా అమర్చారు అమెరికన్ వైద్యులు. తద్వారా అవయవాల కొరత, అవి దొరక్క చనిపోతున్న వేల మందికి ప్రాణదానం చేసే అవకాశం లభించినట్లయ్యింది. శుక్రవారం బాల్టిమోర్ ‘మేరీలాండ్ మెడికల్ స్కూల్ ఆస్పత్రిలో ఈ అరుదైన ఘట్టం చోటు చేసుకుంది. పంది నుంచి తీసిన గుండెను మనిషికి అమర్చారు. ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు వైద్యులు. జన్యుపరంగా మార్పు చేయబడిన పంది గుండెను అమర్చడం ద్వారా పేషెంట్‌కు ప్రాణదానం చేసినట్లయ్యింది. 57 ఏళ్ల డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి ఈ సర్జరీ జరిగింది. సంప్రదాయ మార్పిడికి పేషెంట్ పరిస్థితి అనుకూలించని తరుణంలోనే ఈ నిర్ణయం తీసుకున్నారు వైద్యులు. ఇందుకోసం అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అత్యవసర అనుమతులు జారీ చేసింది. ప్రస్తుతం డేవిడ్ కోలుకుంటున్నాడని, ఇంకొన్నాళ్లు అబ్జర్వేషన్లో ఉంచాలని చెప్తున్నారు. పేషెంట్ గనుక పూర్తిగా కొలుకుంటే గనుక అద్భుతమే అవుతుంది. వైద్య శాస్త్రంలో ఇదొక చారిత్రక ఘట్టమని చెబుతున్నారు వైద్యులు. తద్వారా భవిష్యత్తులో ఆర్గాన్ డొనేషన్స్ కొరతను పరిష్కరించడానికి ఒక మార్గం దొరికినట్లు అయ్యింది. ఇదిలా ఉంటే బ్రెయిన్ డెడ్ అయి కృత్రిమ లైఫ్ సపోర్ట్‌పై కోలుకోలేని స్థితిలో ఉన్న వ్యక్తికి పంది కిడ్నీని అమర్చిన సంగతి తెలిసిందే. కిందటి ఏడాది అక్టోబర్‌లో న్యూయార్క్ యూనివర్సిటీ లాన్‌గోన్ హెల్త్ మెడికల్ సెంటర్లో వైద్యులు ఈ ఆపరేషన్ చేయగా.. పేషెంట్ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నాడు. వేలల్లో మరణాలు అమెరికాలో ప్రతీ ఏడాది సగటున ఆరు వేల మందికి పైగా పేషెంట్లు.. గుండె మార్పిడికి ముందే చనిపోతున్నారు. అవయవాల కొరతే అందుకు ప్రధాన కారణం. ప్రస్తుతం అమెరికాలో లక్షా పదివేల మందికి పైగా గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం ఎదురు చూస్తున్నట్లు తెలుస్తోంది. 1984లో బబూన్(కోతి జాతికి చెందినది) గుండెను ఓ నవజాత శిశువుకు అమర్చగా.. సర్జరీ విజయవంతం అయినప్పటికీ ఆ పసికందు మాత్రం 20 రోజులే జీవించగలిగింది. అయితే ఇప్పుడా పరిస్థితి మారింది. ఇక పంది శరీరాకృతి, ఎదుగుదల, పైగా మాంసం తింటారు కాబట్టి ఆధారంగా.. అవయవాలు తీసుకోవడానికి ఉత్తమమైందని అమెరికన్ డాక్టర్లు భావిస్తున్నారు. సంబంధిత వార్త: పేషెంట్‌కు పంది కిడ్నీ అమర్చారు -
కామినేని ఆసుపత్రి నుంచి కిమ్స్ ఆసుపత్రికి 15 నిమిషాల్లో గుండెను తరలించిన అధికారులు
-
డాక్టర్ జ్ఞానేశ్ టక్కర్: 500కు పైగా ఊపిరితిత్తులు, గుండె మార్పిడి సర్జరీలు
రాంగోపాల్‌పేట్/సాక్షి, హైదరాబాద్: యశోద ఆస్పత్రికి చెందిన సీనియర్ హార్ట్–లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జికల్ డైరెక్టర్ జ్ఞానేశ్ టక్కర్ 500కు పైగా ఊపిరితిత్తులు, గుండె మార్పిడి శస్త్రచికిత్సలు చేసి అరుదైన మైలురాయిని అధిగమించారు. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన అతితక్కువ మంది వైద్యుల్లో ఒకరిగా నిలిచారు. యూఎస్‌లో ప్రముఖ వైద్యుల్లో ఒకరిగా కొనసాగుతున్న డాక్టర్ జ్ఞానేశ్ భారత్‌కు వచ్చి తొలిసారి ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. మొదటిసారిగా చిన్న గాటుతో డబుల్ ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స కూడా ఆయనే చేశారు. (చదవండి: ఉన్నట్టుండి కాళ్లు చచ్చుబడ్డాయి, ఆస్పత్రికి తీసుకెళ్లగా) కాగా, అరుదైన ఘనత సాధించడంతో బుధవారం సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో కేక్ కట్ చేసిన జ్ఞానేశ్‌ను ఘనంగా సత్కరించారు. ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ పవన్ గోరుకంటి మాట్లాడుతూ.. ‘యశోద’వైద్యరంగంలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు పొందిందన్నారు. కోవిడ్ సమయంలో తీవ్ర అనారోగ్యం బారిన పడిన రోగుల ప్రాణాలు కాపాడిందని తెలిపారు. ముఖ్యంగా దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి విషమ పరిస్థితుల్లో ఎయిర్ అంబులెన్స్‌లో వచి్చన వందకు పైగా రోగులకు అత్యాధునిక వైద్యం అందించి రక్షించినట్లు వివరించారు. చదవండి: వైద్యురాలికి ఊపిరితిత్తుల మార్పిడి.. లక్నో టు హైదరాబాద్ -
కనకారెడ్డికి పునర్జన్మ
సాక్షి, హైదరాబాద్: అవయవమార్పిడి ద్వారా గుండె ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్న కనకారెడ్డి పూర్తి ఆరోగ్యంతో కోలుకుని డిశ్చార్జికి సిద్ధంగా ఉన్నారు. జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్లో ఈ నెల 2న గ్రీన్ చానెల్ సాయంతో ఎల్బీ నగర్ కామినేనిలో బ్రెయిన్‌డెడ్ అయిన దాత గుండెను తెచ్చి మరో వ్యక్తికి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన విషయం తెలిసిందే. ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ చేసిన డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే సోమవారం మీడియాతో మాట్లాడారు. మెట్రో రైల్ ద్వారా అవయవాలను తరలించడం ప్రపంచంలో ఇదే మొదటిసారన్నారు. 8గంటల పాటు గుండె మార్పిడి జరిగిందని, ప్రస్తుతం కనకారెడ్డి ఆరోగ్యంగా ఉన్నా రని తెలిపారు. ఈ సర్జరీ జరగడానికి జీవన్దాత ఆర్గనైజేషన్ ఎంతో కృషి చేసిందన్నారు. ఇలాంటి సర్జరీల్లో 75శాతమే సక్సెస్ రేటు ఉంటుందని, ఇప్పటి వరకు నగరంలో 60 ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీలు జరగ్గా అందులో 42 అపోలో హాస్పిటల్లోనే జరిగా యన్నారు. అవయవదానం చేసిన రైతు నర్సిరెడ్డి కుటుంబానికి తగిన సాయం అందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను గోఖలే కోరారు. నగర ట్రాఫిక్ పోలీస్ అడిషనల్ కమిషనర్ అనిల్ కుమార్ మాట్లాడుతూ... గత సంవత్సరం ప్రత్యేక పరిస్థితుల్లో 25 సార్లు గ్రీన్ చానెల్‌ను ఏర్పాటు చేశామని, భవిష్యత్‌లోనూ పోలీస్ వ్యవస్థ నుంచి సహకారం అందిస్తా మన్నారు. చికిత్స జరిగిన 2 రోజుల వరకు తనకు ఏ విషయం తెలియదని, దేవుడిలా డాక్టర్లు తనకు పునర్జన్మనిచ్చారని కనకారెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. గుండె దానం చేసిన రైతు కుటుంబానికి ఎప్పటికీ రుణపడి ఉంటానన్నారు. కార్యక్రమంలో అపోలో గ్రూప్ ప్రెసిడెంట్ డాక్టర్ కె.హరిప్రసాద్, హెచ్ఎంఆర్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్వీఎస్ రెడ్డి, ఎల్అండ్టీ మెట్రో సీఈవో అనిల్‌కుమార్, ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన అపోలో బృందం పాల్గొన్నారు. చదవండి: (హైదరాబాద్ మెట్రో రైల్లో తొలిసారి గుండె తరలింపు) -
మరో ఎనిమిదేళ్లలో రోబోటిక్ గుండె..
లండన్ : హృద్రోగాలకు అత్యాధునిక పద్ధతుల్లో చికిత్సలు అందుబాటులోకి వస్తున్న క్రమంలో 2028 నాటికి గుండె మార్పిడి స్ధానంలో రోబోటిక్ హార్ట్‌ను అమర్చే ప్రక్రియ ఊపందుకోనుంది. ఈ దిశగా నెదర్లాండ్స్, కేంబ్రిడ్జి, లండన్‌లకు చెందిన వైద్య నిపుణులు సాఫ్ట్ రోబోట్ హార్ట్‌ను అభివృద్ధి చేస్తున్నారు. మూడేళ్లలోగా జంతువుల్లో తొలి నమూనాగా దీన్ని ఇంప్లాంట్ చేసే లక్ష్యంతో వారు పరిశోధనలు ముమ్మరం చేశారు. గుండె జబ్బుల చికిత్సను కొత్తపుంతలు తొక్కించే ఆవిష్కరణలకు ఇచ్చే 30 మిలియన్ యూరోలు చెల్లించే ప్రైజ్‌కు ఎంపికైన నాలుగు ప్రాజెక్టుల్లో రోబోటిక్ హార్ట్ ఒకటిగా ఎన్నికైంది. రోటోటిక్ హార్ట్‌తో పాటు గుండె జబ్బుకు వ్యాక్సిన్ రూపకల్పన, గుండె లోపాలను సరిచేసే జన్యు చికిత్స, గుండె జబ్బులు, హార్ట్ ఎటాక్, స్ర్టోక్స్ను ముందే పసిగట్టే వేరబుల్ టెక్నాలజీలు ఈ ప్రతిష్టాత్మక బహుమతికి ఎంపికయ్యాయి. ఈ బహుమతిని స్పాన్సర్ చేస్తున్న బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్‌కు40 దేశాల నుంచి 75 దరఖాస్తులు అందాయి. ఇక పరిశోధకులు అభివృద్ధి చేస్తున్న రోబోటిక్ గుండె శరీరమంతటికీ రక్తాన్ని పంప్ చేసే సామర్ధ్యం కలిగి ఉంటుంది. మానవులకు ఈ గుండెను అమర్చే ప్రక్రియ మరో ఎనిమిదేళ్లలో అంటే 2028 నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేందుకు పరిశోధకులు శ్రమిస్తున్నారు. చదవండి : 9.7 కి.మీ.. 12 నిమిషాలు -
9.7 కి.మీ.. 12 నిమిషాలు
సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి–బంజారాహిల్స్‌లో ఉన్న కేర్ ఆస్పత్రి మధ్య మార్గం..అనునిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనాల సరాసరి స్పీడు 25కు మించదు. పగటి పూట, పీక్ అవర్స్‌లో ఆ వేగం 20కు చేరదు. ఈ సమయానికి అదనంగా ట్రాఫిక్ జామ్స్, సిగ్నల్ టైమింగ్స్ ఉంటాయి. ఎలా చూసినా కనీసం 40 నుంచి 50 నిమిషాలు ప్రయాణానికి పడుతుంది. అయితే ఆ మార్గంలో ‘ప్రయాణించాల్సిన’ గుండె (లైవ్ హార్ట్) కోసం నగర ట్రాఫిక్ పోలీసులు బుధవారం ‘గ్రీన్ ఛానల్’ ఇచ్చారు. ఫలితంగా ఈ 9.7 కిమీ మార్గాన్ని అంబులెన్స్ కేవలం 12 నిమిషాల్లో అధిగమించింది. దీనికి పైలెట్‌గా వాహనంలో వెళ్లిన స్థానిక ట్రాఫిక్ పోలీసుల నుంచి ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమష్టిగా, సమన్వయంతో పని చేయడంతోనే ఇది సాధ్యమైందని నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ ప్రకటించారు. ఉదయం మొదలైన ‘ఆపరేషన్’... నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య, పశ్చిమ, ఉత్తర మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ అన్నీ బుధవారం ఉదయం ఒక్కసారిగా మోగాయి. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి గుండె మార్పిడి చేయాల్సి ఉందని, ఆ శస్త్రచికిత్స ఉదయం 10 గంటలకు ప్రారంభంకానుండగా... డోనర్ ఇస్తున్న గుండె ఉదయం 9.31 గంటలకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరనుంది అన్నది వాటిలో వినిపించిన సందేశం సారాంశం. దీంతో అన్నిస్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. ఉదయం 9.00 గంటల నుంచే ఈ రూట్లో ఉన్న జంక్షన్స్‌లో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు మొదలయ్యాయి. టీసీసీసీ నుంచి నిరంతర పర్యవేక్షణ... డోనర్ ఇచ్చిన గుండెతో కూడిన బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్ ఈ రెండు ఆస్పత్రులకు మధ్య ఉన్న 9.7 కిమీ దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం తమ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్ళడానికి సిద్ధమైంది. అలానే ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో ఉండే అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంత పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి వీరంతా తీవ్ర ఉత్కంఠతో గడిపారు. ఇదీ ప్రయాణించిన మార్గం... ఉదయం 9.31 గంటలకు ‘లైవ్ హార్ట్ బాక్స్’తో కూడిన అంబులెన్స్ సికింద్రాబాద్ యశోద నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి ఆనంద్ టాకీస్, రసూల్‌పుర, ప్రకాష్‌నగర్, బేగంపేట, పంజగుట్ట మీదుగా ప్రయాణించి సరిగ్గా 9.43 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని కేర్ ఆస్పత్రికి చేరింది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ దాదాపు పూర్తిగా ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంతో కేవలం 12 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. ఈ కాస్సేపు అంబులెన్స్ సైరన్‌కు పోటీగా ట్రాఫిక్ పోలీసులు వైర్లెస్ సెట్స్ నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. విలువైన ప్రాణం కాపాడటానికి ట్రాఫిక్ పోలీసులు చూపిన చొరవను బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి యాజమాన్యం కొనియాడింది. -
సీఎం కాన్వాయ్‌నే ఆపేశారు..
పూణే : గుండె మార్పిడి ఆపరేషన్ కోసం తరలిన అంబులెన్స్‌కు దారిఇచ్చేందుకు ఏకంగా తన కాన్వాయ్‌ను నిలిపివేసిన పూణే ట్రాఫిక్ పోలీసులను మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ అభినందించారు. ఆర్గాన్ ట్రాన్స్‌ప్లాంటేషన్‌కు గ్రీన్ కారిడార్‌ను రూపొందించిన పుణే పోలీసులు ఇలా వేగంగా అవయవాలను సంబంధిత ఆస్పత్రికి చేర్చడం ఇది వందో సారి కావడం గమనార్హం. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం పూణే రుబీ హాల్ క్లినిక్‌లో శుక్రవారం సాయంత్రం జరగాల్సిన ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం సోలాపూర్‌కు చెందిన ఓ ఆస్పత్రి నుంచి చార్టర్డ్ విమానంలో పూణేలోని లోహెగావ్ విమానాశ్రయానికి చేరుకున్న దాత గుండె చేరుకుంది. రుబీ హాల్ ఆస్పత్రికి తరలాల్సిన గుండెను సరిగ్గా సాయంత్రం 5.45 గంటలకు గ్రీన్ కారిడార్‌పైకి తీసుకురాగా, అదే సమయంలో సీఎం కాన్వాయ్ ఎయిర్పోర్ట్ నుంచి నగరంలోకి వెళుతోంది. సీఎం కాన్వాయ్‌ను వేచిఉండాలని, గ్రీన్ కారిడార్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని తాము కోరామని అధికారులు తెలిపారు. పూణే ట్రాఫిక్ పోలీసులు చర్యను ప్రశంసిస్తూ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ట్వీట్ చేశారు. రోగి సకాలంలో గుండె మార్పిడి చికిత్సను పొంది సత్వరమే కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. -
గుండె చప్పుడు ఆగరాదని..
సాక్షి, సిటీబ్యూరో: నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్ మార్గంలో వాహనాల వేగం 20 కి.మీ మించదు. అలాంటిది మంగళవారం ఓ గుండె చప్పుడు ఆగరాదని ట్రాఫిక్ పోలీసులు ‘గ్రీన్ చానెల్’ ఇచ్చారు. దీంతో ఓ గుండె, ఊపిరితిత్తుల (లైవ్ ఆర్గాన్స్)ను గ్లోబల్ ఆస్పత్రి నుంచి శంషాబాద్‌లోని విమానాశ్రయం మధ్య గల 29 కి.మీ దూరాన్ని అంబులెన్స్‌లో కేవలం 22 నిమిషాల్లో తరలించారు. దీనికి పైలెట్‌గా వాహనంలో వెళ్లిన బృందం మొదలు ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయడంతో సాధ్యమైంది. మధ్యాహ్నం మొదలైన ‘ఆపరేషన్’.. నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య, పశ్చిమ మండలాల అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ అన్నీ మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మోగాయి. లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో ఉన్న ఓ జీవన్మృతుడి గుండె, ఊపిరితిత్తులను దానం చేశారని, అవి శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నైకు చేరాల్సి ఉంది. చెన్నైలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు ఇవి చేరాలి. అప్పటికే ఆయా ఆస్పత్రుల్లో వీటిని రిసీవ్ చేసుకోవాల్సిన రోగులకు ఆపరేషన్స్ మొదలయ్యాయి. లైవ్ ఆర్గాన్స్‌తో అంబులెన్స్ మధ్యాహ్నం 3.23 గంటలకు లక్డీకాపూల్‌లోని ఆస్పత్రి నుంచి బయలుదేరుతుందని సెట్స్‌లో వినిపించిన సందేశం. దీంతో అన్నిస్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. 3 గంటల నుంచే ఈ రూట్లో ఉన్న జంక్షన్స్‌లో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు చేపట్టారు. ‘సెంటర్’ నుంచి పర్యవేక్షణ డోనర్ ఇచ్చిన గుండె, ఊపిరితిత్తులు గల బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్ విమానాశ్రయం వరకు ఉన్న 29 కి.మీ. దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్లడానికి సిద్ధమైంది. ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలోను పోలీస్ అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంతం పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రయాణించిన మార్గం ఇలా.. మధ్యాహ్నం 3.23 గంటలకు ‘లైవ్ ఆర్గాన్స్ బాక్స్’తో అంబులెన్స్ గ్లోబల్ ఆస్పత్రి నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి మాసబ్‌ట్యాంక్, మెహదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా ప్రయాణించి 3.45కు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ చానల్’ ఇవ్వడంతో కేవలం 22 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న విమానంలో ఈ రెండు లైవ్ ఆర్గాన్స్ చెన్నై వెళ్లిపోయాయి. ట్రాఫిక్ పోలీసుల సహకారం వల్లే ఈ ‘ఆపరేషన్’ సాధ్యమైందని గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్‌కు లేఖ రాసింది. -
అవయవదానం.. నిలిచిన ప్రాణం
పశ్చిమగోదావరి, టి.నరసాపురం: ఓ యువకుడి అవదాయ దానం బాలుడి ప్రాణం నిలిపింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలుడికి పునర్జన్మను ప్రసాదించింది. హైదరాబాద్‌లో అపోలో వైద్యులు గుండె మార్పిడి చేసి జిల్లాకు చెందిన బాలుడి ప్రాణాలు నిలబెట్టారు. వివరాలిలా ఉన్నాయి.. టి.నరసాపురం మండలం మక్కినవారిగూడానికి చెందిన 15 ఏళ్ల బాలుడు పంబి సతీష్‌కుమార్ గుండె వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న తల్లిదండ్రులు నారాయణ, లక్ష్మి తమ కుమారుడికి వైద్యం చే యించాలని మండల నాయకుడు పిన్నమనేని మధును ఆశ్రయించారు. డాక్టర్ గోఖలే ఔదార్యం పిన్నమనేని మధు అపోలో డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేను సంప్రదించారు. సతీష్‌ను పరీక్షించిన డాక్టర్ గోఖలే గుండె మార్చాలని రూ.21 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ ద్వారా సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. రెండు విడతల్లో రూ.16 లక్షలు మంజూరుకాగా మిగిలిన రూ.5 లక్షలను డాక్టర్ గోఖలే భరించారు. ఇదంతా ఒక ఎత్తయితే బాలుడికి మార్పిడి చేసేందుకు ఓ యువకుడు గుండె అవయవదానం చేయ డంతో వీరి పని సులువయ్యింది. సూర్యాపేటకు చెందిన బి.వీరాంజనేయులు అనే యువకుడు రో డ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరాంజనేయులు బ్రెయిన్ డెడ్ కావడంతో అతడి తల్లిదండ్రులను అవయవదానం కోసం వైద్యులు ఒప్పించారు. ఆ యువకుడి గుండెను ఈనెల 15న 8 గంటల పాటు శ్రమించి సతీష్‌కుమార్‌కు అమర్చారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో సతీష్‌కుమార్ కోలుకున్నాడు. రెండు నెలలపాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందాలని వైద్యులు సూచించడంతో అక్కడే ఉన్నాడని మధు తెలిపారు. డాక్టర్ గోఖలే ఏడాదిపాటు మందులకు అయ్యే ఖర్చు రూ.2 లక్షలను భరించడానికి ముందుకు వచ్చారన్నారు. గతంలో మండలానికి చెందిన తెల్లమేకల వరలక్ష్మి గుండె ఆపరేషన్‌కు రూ.8 లక్షలు, కుంజా వెంగళరావు గుండె చికిత్సకు రూ.6 లక్షలు డాక్టర్ గోఖలే భరించారని గుర్తుచేశారు. ఆయన్ను హైదరాబాద్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపినట్టు మధు చెప్పారు. -
జీజీహెచ్‌లో గుండె మార్పిడి విజయవంతం
గుంటూరు జీజీహెచ్‌లో శుక్రవారం గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతం చేశారు. కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ఆధ్వర్యంలో వైద్యులు నిండు ప్రాణాన్ని నిలబెట్టారు. బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి గుండెను.. ఆగిపోతున్న మరో యువకుడి ప్రాణానికి అడ్డు పెట్టి.. అతని గొంతులో అమృతం పోశారు. లబ్ డబ్ అంటూ కొట్టుకుంటున్న ఆ గుండెలో ఆ వైద్యులు ఆరాధ్యులై నిలిచారు. గుంటూరు మెడికల్: గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆస్పత్రిలో శుక్రవారం చేసిన గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతమైనట్లు సహృదయ ట్రస్ట్ నిర్వాహకులు, కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే చెప్పారు. శుక్రవారం రాత్రి జీజీహెచ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. నెల్లూరు జిల్లా కొండాపురానికి చెందిన 27 ఏళ్ల చిమ్మిలి హరిబాబులు మూడేళ్లుగా ఇస్కిమిక్ కార్డియో మయోపతి(గుండె జబ్బుతో) వ్యాధితో బాధపడుతున్నాడు. అతనికి గుండెమార్పిడి ఆపరేషన్ చేస్తేనే బతికే అవకాశం ఉన్నట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించి, జీవన్‌ధాన్‌లో పేరు నమోదు చేయించారు. కృష్ణాజిల్లా నందిగామకు చెందిన పిన్నెల్లి జగదీష్ (22)కు గురువారం బ్రెయిన్‌డెడ్ అయినట్లు నిర్ధారించిన మణిపాల్ ఆస్పత్రి వైద్యులు గుంటూరు వైద్యులకు సమాచారం ఇచ్చారు. ఈ నెల 1వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో జగదీష్ తీవ్రంగా గాయపడి మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో గురువారం వైద్యులు బ్రెయిన్‌డెడ్ అయినట్లు నిర్ధారించారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు మణిపాల్ హాస్పటల్‌కు డాక్టర్ గోఖలే వైద్య బృందం వెళ్లి గుండెను సేకరించి గుంటూరు జీజీహెచ్‌కు మధ్యాహ్నం 12.30 గంటలకు తీసుకువచ్చారు. తనతో పాటుగా మత్తు వైద్యనిపుణులు డాక్టర్ కోనేరు సుధాకర్, డాక్టర్ సుబ్రహ్మణ్యం, సర్జన్లు డాక్టర్ రమణ, డాక్టర్ మోతీలాల్, డాక్టర్ మనోజ్‌లు సుమారు 9 గంటల సేపు జరిగిన గుండె మార్పిడి ఆపరేషన్‌లో పాల్గొన్నట్లు చెప్పారు. సాయంత్రం 6.30 గంటలకు ఆపరేషన్ ముగిసిందని, గుండె ఫిట్ అయ్యిందని, రక్తసరఫరా బాగుందన్నారు. ప్రస్తుతం హరిబాబులును వెంటిలేటర్‌పై ఉంచామని, శనివారం వెంటిలేటర్ తీసివేస్తామన్నారు. హరిబాబులుకు ఆపరేషన్ చేసేందుకు గుండె దొరకక చనిపోతాడని పది రోజుల కిందట భావించామన్నారు. గుండె దానం చేసిన జగదీష్ రక్తం బి–పాజిటివ్ అని, హరిబాబులు ఎబి–పాజిటివ్ గ్రూప్‌కు చెందిన వ్యక్తిగా పేర్కొన్నారు. జగదీష్ కళ్ళు, లివర్, కిడ్నీలను కూడా సేకరించామన్నారు. గ్రీన్‌కారిడార్ ద్వారా గుండెను మణిపాల్ ఆస్పత్రి నుంచి సకాలంలో తీసుకొచ్చేందుకు పోలీస్ సిబ్బంది ఎంతో సహకరించారని తెలిపారు. చరిత్ర సృష్టించిన జీజీహెచ్.. ఎయిమ్స్ లాంటి కేంద్ర సంస్థల్లో మినహా ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాలుగు గుండె మార్పిడి ఆపరేషన్లు జరగలేదని, కేవలం గుంటూరు జీజీహెచ్‌లోనే తాము చేశామని డాక్టర్ గోఖలే చెప్పారు. ఈ ఆపరేషన్‌తో దేశంలోనే గుండె మార్పిడి ఆపరేషన్లు అధికంగా చేసిన ప్రభుత్వ ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ చరిత్ర సృష్టించిందన్నారు. జీజీహెచ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్ల కోసం ఎదురుచూస్తున్న వారు చాలా మంది ఉన్నారని, అవయవదానంపై ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలన్నారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డీఎస్ రాజునాయుడు మాట్లాడుతూ ఆగస్టు 6 నుంచి 13 వరకు వరల్డ్ ఆర్గాన్డే సందర్భంగా అవయవదానంపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వరల్డ్ హార్ట్ ట్రాన్స్‌ప్లాంట్ డే రోజునే తమ ఆస్పత్రిలో గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతం అవ్వటం చాలా గర్వంగా ఉందన్నారు. గుండె మార్పిడి శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేను, మత్తు వైద్య నిపుణులు డాక్టర్ కోనేరు సుధాకర్‌ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జొన్నలగడ్డ యాస్మిన్, ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కో–ఆర్డినేటర్ డాక్టర్ వడ్లమూడి శ్రీనివాసరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజునాయుడు సన్మానించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మోతీలాల్, పలువురు వైద్య సిబ్బంది పాల్గొన్నారు.