గుండె మార్పిడి చేయించుకున్న బాలుడితో డాక్టర్ గోఖలే, (అంతరచిత్రం) అవయవదానం చేసిన వీరాంజనేయులు
పశ్చిమగోదావరి, టి.నరసాపురం: ఓ యువకుడి అవదాయ దానం బాలుడి ప్రాణం నిలిపింది. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న బాలుడికి పునర్జన్మను ప్రసాదించింది. హైదరాబాద్‌లో అపోలో వైద్యులు గుండె మార్పిడి చేసి జిల్లాకు చెందిన బాలుడి ప్రాణాలు నిలబెట్టారు. వివరాలిలా ఉన్నాయి.. టి.నరసాపురం మండలం మక్కినవారిగూడానికి చెందిన 15 ఏళ్ల బాలుడు పంబి సతీష్‌కుమార్ గుండె వ్యాధితో బాధపడుతున్నాడు. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగిస్తున్న తల్లిదండ్రులు నారాయణ, లక్ష్మి తమ కుమారుడికి వైద్యం చే యించాలని మండల నాయకుడు పిన్నమనేని మధును ఆశ్రయించారు.
డాక్టర్ గోఖలే ఔదార్యం
పిన్నమనేని మధు అపోలో డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలేను సంప్రదించారు. సతీష్‌ను పరీక్షించిన డాక్టర్ గోఖలే గుండె మార్చాలని రూ.21 లక్షలు ఖర్చవుతుందని చెప్పారు. దీంతో తల్లిదండ్రులు ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ ద్వారా సీఎం సహాయనిధికి దరఖాస్తు చేసుకున్నారు. రెండు విడతల్లో రూ.16 లక్షలు మంజూరుకాగా మిగిలిన రూ.5 లక్షలను డాక్టర్ గోఖలే భరించారు. ఇదంతా ఒక ఎత్తయితే బాలుడికి మార్పిడి చేసేందుకు ఓ యువకుడు గుండె అవయవదానం చేయ డంతో వీరి పని సులువయ్యింది.
సూర్యాపేటకు చెందిన బి.వీరాంజనేయులు అనే యువకుడు రో డ్డు ప్రమాదానికి గురై హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరాంజనేయులు బ్రెయిన్ డెడ్ కావడంతో అతడి తల్లిదండ్రులను అవయవదానం కోసం వైద్యులు ఒప్పించారు. ఆ యువకుడి గుండెను ఈనెల 15న 8 గంటల పాటు శ్రమించి సతీష్‌కుమార్‌కు అమర్చారు. శస్త్రచికిత్స విజయవంతం కావడంతో సతీష్‌కుమార్ కోలుకున్నాడు. రెండు నెలలపాటు ఆస్పత్రిలోనే ఉండి చికిత్స పొందాలని వైద్యులు సూచించడంతో అక్కడే ఉన్నాడని మధు తెలిపారు. డాక్టర్ గోఖలే ఏడాదిపాటు మందులకు అయ్యే ఖర్చు రూ.2 లక్షలను భరించడానికి ముందుకు వచ్చారన్నారు. గతంలో మండలానికి చెందిన తెల్లమేకల వరలక్ష్మి గుండె ఆపరేషన్‌కు రూ.8 లక్షలు, కుంజా వెంగళరావు గుండె చికిత్సకు రూ.6 లక్షలు డాక్టర్ గోఖలే భరించారని గుర్తుచేశారు. ఆయన్ను హైదరాబాద్‌లో కలిసి కృతజ్ఞతలు తెలిపినట్టు మధు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment