సాక్షి, సిటీబ్యూరో: సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రి–బంజారాహిల్స్‌లో ఉన్న కేర్ ఆస్పత్రి మధ్య మార్గం..అనునిత్యం రద్దీగా ఉండే ఈ మార్గంలో వాహనాల సరాసరి స్పీడు 25కు మించదు. పగటి పూట, పీక్ అవర్స్‌లో ఆ వేగం 20కు చేరదు. ఈ సమయానికి అదనంగా ట్రాఫిక్ జామ్స్, సిగ్నల్ టైమింగ్స్ ఉంటాయి. ఎలా చూసినా కనీసం 40 నుంచి 50 నిమిషాలు ప్రయాణానికి పడుతుంది. అయితే ఆ మార్గంలో ‘ప్రయాణించాల్సిన’ గుండె (లైవ్ హార్ట్) కోసం నగర ట్రాఫిక్ పోలీసులు బుధవారం ‘గ్రీన్ ఛానల్’ ఇచ్చారు. ఫలితంగా ఈ 9.7 కిమీ మార్గాన్ని అంబులెన్స్ కేవలం 12 నిమిషాల్లో అధిగమించింది. దీనికి పైలెట్‌గా వాహనంలో వెళ్లిన స్థానిక ట్రాఫిక్ పోలీసుల నుంచి ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమష్టిగా, సమన్వయంతో పని చేయడంతోనే ఇది సాధ్యమైందని నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ ప్రకటించారు.
ఉదయం మొదలైన ‘ఆపరేషన్’...
నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య, పశ్చిమ, ఉత్తర మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్‌లెస్ సెట్స్ అన్నీ బుధవారం ఉదయం ఒక్కసారిగా మోగాయి. బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఓ రోగికి గుండె మార్పిడి చేయాల్సి ఉందని, ఆ శస్త్రచికిత్స ఉదయం 10 గంటలకు ప్రారంభంకానుండగా... డోనర్ ఇస్తున్న గుండె ఉదయం 9.31 గంటలకు సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి నుంచి బయలుదేరనుంది అన్నది వాటిలో వినిపించిన సందేశం సారాంశం. దీంతో అన్నిస్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. ఉదయం 9.00 గంటల నుంచే ఈ రూట్‌లో ఉన్న జంక్షన్స్‌లో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు మొదలయ్యాయి.
టీసీసీసీ నుంచి నిరంతర పర్యవేక్షణ...
డోనర్ ఇచ్చిన గుండెతో కూడిన బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్ ఈ రెండు ఆస్పత్రులకు మధ్య ఉన్న 9.7 కిమీ దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఓ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలోని బృందం తమ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్ళడానికి సిద్ధమైంది. అలానే ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో ఉండే అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంత పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఉదయం 9 గంటల నుంచి వీరంతా తీవ్ర ఉత్కంఠతో గడిపారు.
ఇదీ ప్రయాణించిన మార్గం...
ఉదయం 9.31 గంటలకు ‘లైవ్ హార్ట్ బాక్స్’తో కూడిన అంబులెన్స్ సికింద్రాబాద్ యశోద నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి ఆనంద్ టాకీస్, రసూల్‌పుర, ప్రకాష్‌నగర్, బేగంపేట, పంజగుట్ట మీదుగా ప్రయాణించి సరిగ్గా 9.43 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నెం.1లోని కేర్ ఆస్పత్రికి చేరింది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ దాదాపు పూర్తిగా ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంతో కేవలం 12 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. ఈ కాస్సేపు అంబులెన్స్ సైరన్‌కు పోటీగా ట్రాఫిక్ పోలీసులు వైర్‌లెస్ సెట్స్ నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. విలువైన ప్రాణం కాపాడటానికి ట్రాఫిక్ పోలీసులు చూపిన చొరవను బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రి యాజమాన్యం కొనియాడింది.
Comments
Please login to add a commentAdd a comment