గ్లోబల్ ఆస్పత్రి నుంచి అవయవాలతో బయలుదేరిన అంబులెన్స్
సాక్షి, సిటీబ్యూరో: నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్ మార్గంలో వాహనాల వేగం 20 కి.మీ మించదు. అలాంటిది మంగళవారం ఓ గుండె చప్పుడు ఆగరాదని ట్రాఫిక్ పోలీసులు ‘గ్రీన్ చానెల్’ ఇచ్చారు. దీంతో ఓ గుండె, ఊపిరితిత్తుల (లైవ్ ఆర్గాన్స్)ను గ్లోబల్ ఆస్పత్రి నుంచి శంషాబాద్‌లోని విమానాశ్రయం మధ్య గల 29 కి.మీ దూరాన్ని అంబులెన్స్‌లో కేవలం 22 నిమిషాల్లో తరలించారు. దీనికి పైలెట్‌గా వాహనంలో వెళ్లిన బృందం మొదలు ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయడంతో సాధ్యమైంది.
మధ్యాహ్నం మొదలైన ‘ఆపరేషన్’..
నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య, పశ్చిమ మండలాల అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్‌లెస్ సెట్స్ అన్నీ మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మోగాయి. లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో ఉన్న ఓ జీవన్మృతుడి గుండె, ఊపిరితిత్తులను దానం చేశారని, అవి శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నైకు చేరాల్సి ఉంది. చెన్నైలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు ఇవి చేరాలి. అప్పటికే ఆయా ఆస్పత్రుల్లో వీటిని రిసీవ్ చేసుకోవాల్సిన రోగులకు ఆపరేషన్స్ మొదలయ్యాయి. లైవ్ ఆర్గాన్స్‌తో అంబులెన్స్ మధ్యాహ్నం 3.23 గంటలకు లక్డీకాపూల్‌లోని ఆస్పత్రి నుంచి బయలుదేరుతుందని సెట్స్‌లో వినిపించిన సందేశం. దీంతో అన్నిస్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. 3 గంటల నుంచే ఈ రూట్‌లో ఉన్న జంక్షన్స్‌లో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు చేపట్టారు.
‘సెంటర్’ నుంచి పర్యవేక్షణ
డోనర్ ఇచ్చిన గుండె, ఊపిరితిత్తులు గల బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్ విమానాశ్రయం వరకు ఉన్న 29 కి.మీ. దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఓ ఇన్‌స్పెక్టర్ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్లడానికి సిద్ధమైంది. ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలోను పోలీస్ అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంతం పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
ప్రయాణించిన మార్గం ఇలా..
మధ్యాహ్నం 3.23 గంటలకు ‘లైవ్ ఆర్గాన్స్ బాక్స్’తో అంబులెన్స్ గ్లోబల్ ఆస్పత్రి నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి మాసబ్‌ట్యాంక్, మెహదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా ప్రయాణించి 3.45కు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ చానల్’ ఇవ్వడంతో కేవలం 22 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న విమానంలో ఈ రెండు లైవ్ ఆర్గాన్స్ చెన్నై వెళ్లిపోయాయి. ట్రాఫిక్ పోలీసుల సహకారం వల్లే ఈ ‘ఆపరేషన్’ సాధ్యమైందని గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్‌కు లేఖ రాసింది.
Comments
Please login to add a commentAdd a comment