Green Channel
-
గ్రీన్ ఛానల్ ద్వారా గుండె తరలింపు..
-
కర్నూలు: కృష్ణవేణి బ్రెయిన్ డెడ్.. అవయవాల తరలింపునకు గ్రీన్ ఛానల్
కర్నూలు, సాక్షి: తాను మరణించినా.. అవయవదానంతో మరికొందరికి ప్రాణం పోయాలనే ఆలోచన ఈరోజుల్లో కొంతమందికే కలుగుతోంది. అలాగే తమ వాళ్లు మరణించినా.. అంత దుఖంలోనూ అవయవదానానికి ముందుకు వచ్చే వాళ్లకు నిజంగా హ్యాట్సాఫ్. తాజాగా.. కర్నూలులో బ్రెయిన్ డెడ్ అయిన ఓ మహిళ నుంచి అవయవాల్ని దానం చేసేందుకు ముందుకు వచ్చింది ఆమె కుటుంబం. ప్రొద్దుటూరు చెందిన కృష్ణవేణి(38) కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బ్రెయిన్ డెడ్‌కి గురైంది. అయితే ఆమె కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకొచ్చారు. దీంతో కిడ్నీని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి, అలాగే లివర్, గుండెలను తిరుపతికి తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ హెలికాఫ్టర్‌లో గ్రీన్ ఛానెల్ ద్వారా తిరుపతికి అవయవాల్ని తరలించారు. స్విమ్స్‌లో లివర్ మార్పిడి సర్జరీ, అలాగే.. పద్మావతి హృదాయాలంలో హార్ట్ సర్జరీల ద్వారా ఇద్దరు పెషెంట్లకు కృష్ణవేణి అవయవాల్ని అమర్చనున్నారు. ఇదిలా ఉంటే.. శ్రీపద్మావతి హార్ట్ కేర్ సెంటర్లో ఇవాళ జరగబోయేది 14 వ హార్ట్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ కావడం విశేషం. తమ బిడ్డ అవయవాల ద్వారా మరికొందరికి పునర్జన్మ కలగడం పట్ల కృష్ణవేణి కుటుంబ సభ్యులు కన్నీళ్లతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
హ్యాట్సాఫ్ ఏపీ పోలీస్
-
సీఎం జగన్ చొరవ.. హెలికాప్టర్లో గుండె తరలింపు..
సాక్షి, తిరుపతి: ఏపీలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గుండె ఆపరేషన్ కోసం విశాఖ నుంచి తిరుపతికి గుండెను విమానంలో తరలించారు. దీని కోసం గ్రీన్‌ఛానల్‌ను ఏర్పాటు చేశారు. వివరాల ప్రకారం.. ఏపీలో గుండె ఆపరేషన్ కోసం గ్రీన్‌ఛానెల్‌ను ఏర్పాటు చేశారు. మొదట గుండెను శ్రీకాకుళం నుంచి విశాఖకు హెలికాప్టర్లో అక్కడి నుంచి తిరుపతికి విమానంలో గుండె తరలింపు జరుగుతోంది. రాగోలు జెమ్స్ మెడికల్ కాలేజీలో అవయవదానంలో భాగంగా గుండెను తిరుపతికి తరలిస్తున్నారు. అయితే, సీఎం జగన్ చొరవతో 20 నిమిషాల్లోనే వైజాగ్‌కు గుండెను అధికారులు తరలించారు. మరికాసేపట్లో తిరుపతి విమానాశ్రయానికి గుండెను తరలించనున్నారు. ఇక తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి గుండెను గ్రీన్‌చానల్ ద్వారా పద్మావతి ఆసుపత్రికి తరలించనున్నారు. ఇక, విశాఖ నుంచి తరలించిన గుండెను పేషంట్ లహరికి(11)కి అమర్చనున్నారు వైద్యులు. కాగా, లహరి తెలంగాణలోని వనస్థలిపురంలోకి ఎన్జీవో కాలనీకి చెందిన చిన్నారి. అయితే, జూన్ నెలలో లహరికి గుండె సమస్యను గుర్తించారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రిలో రెండు నెలల పాటు చికిత్స అందించారు. ఈ సందర్భంగా లహరి తండ్రి సత్యనారాయణ మాట్లాడుతూ.. నిమ్స్‌లో చికిత్స కోసం మూడు లక్షలు ఖర్చు చేశాము. తెలంగాణలో కంటే ఏపీలోనే రెస్పాన్స్ బాగుంది అని ఇక్కడికి వచ్చాము. నవంబర్ ఆరో తేదీన పద్మావతి చిల్డ్రన్ హార్ట్ కేర్ సెంటర్ జాయిన్ చేశాము అని చెప్పుకొచ్చారు. -
తను మరణించినా.. ముగ్గురికి ఊపిరి పోశాడు
కాకినాడ రూరల్: తను మరణించినా.. తన అవయవాల ద్వారా పలువురికి ఊపిరి పోశారు కాకినాడకు చెందిన పెంకే గోవిందకుమార్ (50). కాకినాడ ట్రస్ట్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో చికిత్స కోసం చేరిన గోవిందకుమార్ బ్రెయిన్ డెడ్ అయింది. దీంతో ఆయన కుటుంబ సభ్యుల అంగీకారంతో ఆస్పత్రి వైద్యులు రాజశేఖరన్, ప్రశాంత్, యు.కిషోర్‌కుమార్, కల్యాణి, శ్రీకాంత్, గణేష్ ఆదిమూలం, డీవీఎస్ సోమయాజులు, వై.కల్యాణ్ చక్రవర్తి, ఎస్‌సీహెచ్‌ఎస్ రామకృష్ణ, సనా ప్రవీణ తదితరులు రాత్రి 8 గంటలకు దాత నుంచి అవయవాలు సేకరించారు. ఒక కిడ్నీని ఆస్పత్రిలోనే రోగికి విజయవంతంగా అమర్చారు. రాత్రి 10 గంటల సమయంలో మరో కిడ్నీని విశాఖపట్నంలోని కేర్ ఆస్పత్రికి, కాలేయాన్ని (లివర్) గుంటూరు జిల్లా తాడేపల్లి వద్ద మణిపాల్ ఆస్పత్రికి అంబులెన్సుల్లో తరలించారు. దీనికోసం జిల్లా ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు గ్రీన్ చానల్ ఏర్పాటు చేశారు. అంబులెన్సులు గమ్యానికి సజావుగా చేరేలా ఎస్పీ కార్యాలయంలోని స్పెషల్ బ్రాంచ్ కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షించారు. అవయవాల తరలింపును ట్రస్ట్ ఆస్పత్రి వైద్యుడు రామకృష్ణ సమన్వయం చేశారు. ట్రాన్స్‌ప్లాంటేషన్ కో–ఆర్డినేటర్‌గా స్వాతి వ్యవహరించారు. -
బైక్‌పై నుంచి కళ్లు తిరిగి పడి మహిళ బ్రెయిన్ డెడ్.. పేద గుండెకు పునర్జన్మ
తిరుపతి తుడా/అక్కిరెడ్డిపాలెం (విశాఖపట్నం): విశాఖపట్నానికి చెందిన ఓ మహిళకు బ్రెయిన్ డెడ్ కావటంతో కుటుంబ సభ్యులు అవయవ దానానికి ముందుకొచ్చారు. దీంతో ఆమె గుండెను శుక్రవారం ప్రత్యేక విమానంలో తిరుపతికి తీసుకొచ్చి గుండెజబ్బుతో బాధపడుతున్న 15ఏళ్ల బాలుడికి ఆరోగ్యశ్రీ కింద శ్రీ పద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సాలయంలో పూర్తి ఉచితంగా శస్త్రచికిత్స చేసి అమర్చారు. నిజానికి.. 2021 అక్టోబర్ 11న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ చికిత్సాలయాన్ని ప్రజలకు అంకితం చేశారు. ఈ నేపథ్యంలో.. తొలిసారి ఇక్కడి వైద్యులు గుండెమార్పిడి చేశారు. ఈ యజ్ఞం పూర్వాపరాలు ఇవిగో.. పేద రైతుకు పెద్ద కష్టం.. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ రైతుకూలీ నెలరోజుల క్రితం అనారోగ్యంతో ఉన్న తన పదిహేనేళ్ల కుమారుణ్ణి పద్మావతి ఆస్పత్రికి తీసుకొచ్చాడు. వైద్యులు అతని గుండెకు తీవ్ర ఇన్ఫెక్షన్ సోకినట్లు నిర్ధారించి మార్పిడి అనివార్యమని తేల్చిచెప్పారు. జీవన్‌దాన్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసి చికిత్స అందిస్తూ వస్తున్నారు. వారం క్రితం ఆ బాలుడి పరిస్థితి మరింత విషమించింది. విశాఖపట్నంలో మహిళకు బ్రెయిన్ డెడ్ ఇంతలో.. విశాఖపట్నంలోని భెల్ (హెచ్‌పీవీపీ)లో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న జంజూరు ఆనందరావు భార్య సన్యాసమ్మ (48) టౌన్షిప్లో ఉంటున్నారు. వీరి ఇద్దరి కుమారులూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. సంక్రాంతి సందర్భంగా సన్యాసమ్మ పెందుర్తి సమీప గ్రామంలో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ నెల 17న తన కుమారుడితో బైక్‌పై తిరిగి వస్తుండగా కళ్లు తిరిగి పడిపోయింది. దీంతో ఆమె తలకు బలమైన గాయమవడంతో షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి తరలించారు. ఆమెకు బ్రెయిన్ డెడ్ అయినట్లు శుక్రవారం ఉదయం వైద్యులు చెప్పారు. కుటుంబ సభ్యులు అవయవదానానికి అంగీకరించటంతో వైద్యులు జీవన్‌దాన్ సైట్‌కు సమాచారమిచ్చారు. స్పందించిన సీఎంఓ.. సన్యాసమ్మ గుండె తిరుపతి పద్మావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడికి అమర్చే అవకాశముందన్న సమాచారం తెలిసిన వెంటనే ముఖ్యమంత్రి కార్యాలయం రెండు జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు, వైద్యులను అప్రమత్తం చేసింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ గ్రీన్ ఛానల్ ద్వారా ప్రత్యేక విమానంలో గుండెను తరలించేందుకు ఏర్పాట్లుచేసింది. ఆగమేఘాలపై గుండె తరలింపు మరోవైపు.. తిరుపతి నుంచి ముగ్గురు వైద్యులతో కూడిన బృందం విశాఖకు వెళ్లి సన్యాసమ్మ గుండెను వేరుచేసి ప్రత్యేక బాక్సులో భద్రపరిచారు. దాన్ని శరవేగంగా తిరుపతి తరలించేందుకు అన్ని ఏర్పాట్లుచేశారు. నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ ఆదేశాల మేరకు డీసీపీ ఆనంద్‌కుమార్, ట్రాఫిక్ ఏడీసీపీ శ్రావణ్‌కుమార్, నలుగురు సీఐలు, ఐదుగురు ఎస్ఐలు, 33 మంది సిబ్బంది భద్రతా, ట్రాఫిక్ ఆంక్షలను పర్యవేక్షించారు. షీలానగర్ ఆస్పత్రి నుంచి ఎయిర్‌పోర్టు వరకు నాలుగు కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ నియంత్రించారు. ఆ తర్వాత.. ►9.18 గంటలకు : ఆస్పత్రిలో అంబులెన్స్ బయల్దేరింది. ► 9.20 : ఎయిర్‌పోర్టుకు చేరుకుంది. ► 10.05 : అప్పటికే సిద్ధంగా ఉన్న ఇండిగో విమానం గుండెను తీసుకుని బయల్దేరింది. ►11.31 : రేణిగుంట విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయింది. ► 11.35 : విమానాశ్రయం నుంచి బాక్సును బయటకు తీసుకొచ్చారు. ► 11.56 : టీటీడీ అంబులెన్స్‌లో 21.5 కి.మీ. దూరాన్ని 21 నిమిషాల్లో తిరుపతిలోని శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌కు తీసుకొచ్చారు. ►11.57 : ఒక నిమిషంలోనే ఆస్పత్రిలోకి గుండెను చేర్చారు. ►అప్పటికే ఆపరేషన్‌కు అవసరమైన ఏర్పాట్లను ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి పర్యవేక్షణలో సిద్ధంచేసి ఉంచారు. ►ఆరుగురు డాక్టర్లతో కూడిన వైద్య బృందం 4.15 గంటలపాటు శ్రమించి గుండె మార్పిడి శస్త్రచికిత్సను దిగ్విజయంగా పూర్తిచేసింది. అందరి సహకారంతోనే.. దాత కుటుంబ సభ్యులు, ప్రభుత్వం, ప్రభుత్వ విభాగాలు, వైద్యుల ఉమ్మడి కృషితోనే ఇది సాధ్యమైంది. గుండెను తగిన జాగ్రత్తలతో భద్రపరిస్తే ఆరు గంటల వరకు పనిచేస్తుంది. సన్యాసమ్మ గుండెను మూడు గంటల్లోపే తిరుపతి ఆసుపత్రికి తరలించారు. అమర్చిన గుండె పూర్తి సామర్థ్యంతో పనిచేసి బాలుడు కోలుకునేందుకు వారం రోజులు పడుతుంది. – డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డి ఆమెలేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా సన్యాసమ్మ లేని జీవితాన్ని ఊహించుకోలేకపోతున్నా. ఇప్పటివరకు నేను, పెద్దబ్బాయి చైతన్య, చిన్నబాబు జయప్రకా‹Ùలు తేరుకోలేదు. ఇద్దరు కుమారులను కంటికి రెప్పలా చూసుకుని మురిసిపోయేది. వారికి ఏది కావాలన్నా నాతో గొడవపడి మరీ సాధించేది. – జంజూరు ఆనందరావు, సన్యాసమ్మ భర్త, భెల్ ఉద్యోగి -
విశాఖ : గ్రీన్ ఛానల్ ద్వారా అవయవాల తరలింపు (ఫొటోలు)
-
అర్ధరాత్రి ఆపన్నహస్తం.. గ్రీన్‌ఛానెల్‌తో గుండెను తరలించిన మెట్రో
సాక్షి,హైదరాబాద్: నగరవాసులకు అవసరమైన సహాయం చేయడానికి తామెప్పుడూ ముందే ఉంటామని మరోసారి ఎల్&టీ హైదరాబాద్ మెట్రో రైల్ నిరూపించింది. గతంలో ఫిబ్రవరి 2021లో ఏ విధంగా అయితే జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ నుంచి ఓ ప్రాణం కాపాడటానికి గుండెను తరలించాలని ఎల్&టీ ఎంఆర్హెచ్ఎల్ ఎస్ఓఎస్కు కాల్ వచ్చిందో అదే తరహాలో మరోసారి కాల్ వచ్చింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ మెట్రో.. సెప్టెంబర్ 26న తెల్లవారుజూమున గ్రీన్ ఛానెల్ ఏర్పాటుచేయడంతో నాగోల్ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ మెట్రో స్టేషన్‌కు గుండెను రవాణా చేసింది. కాగా, గుండె తరలింపులో భాగంగా ఎల్బీనగర్లోని కామినేని హాస్పిటల్ డాక్టర్లు , ఇతర మెడికోలు.. రాత్రి ఒంటి గంట సమయంలో నాగోల్ మెట్రోస్టేషన్ వద్దకు గుండెను తీసుకువచ్చారు. అనంతరం, గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేసి కేవలం 25 నిమిషాల్లోనే గుండెను ప్రత్యేక రైలు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ స్టేషన్‌కు చేర్చారు. తర్వాత, అంబులెన్స్ సాయంతో ఆసుపత్రికి చేర్చారు. ఈ స్పెషల్ ఆపరేషన్ కోసం లైన్-3 సెక్యూరిటీ అధికారులతో పాటుగా మెట్రో అధికారులు ఎలాంటి అవాంతరాలు లేకుండా కొనసాగేలా చేశారు. ఈ సందర్భంగా ఎల్&టీ ఎంఆర్హెచ్ఎల్ ఎండీ సీఈఓ కెవీబీ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రయాణీకుల సేవకు హైదరాబాద్ మెట్రో రైల్ కట్టుబడి ఉంటుంది. అవసరమైన సమయంలో వారికి సేవ చేసేందుకు కట్టుబడి ఉంది. మా అవసరం ఎక్కువగా ఉన్నవారికి, అవసరమైన సమయంలో తోడుండాలనేది మా సిద్ధాంతం. ఈసారి కూడా మేము గ్రీన్‌ఛానెల్ ఏర్పాటుచేయడంతో పాటుగా వీలైనంత త్వరగా గుండెను తరలించి, ఓ ప్రాణం కాపాడాము. ప్రాణంతో ఉన్న అవయవాన్ని తరలించడంలో తోడ్పడిన డాక్టర్లు, హెచ్ఎంఆర్ సిబ్బందికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాము’ అని అన్నారు. కాగా, ఆదివారం రాత్రి ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన క్రికెట్ మ్యాచ్ సందర్భంగా మెట్రో రైలు సేవలు అర్ధరాత్రి వరకు అందుబాటులోనే ఉన్నాయి. ఓవైపు.. క్రికెట్ అభిమానులకు తరలిస్తూనే.. అటు మెట్రో అధికారులు గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయడం విశేషం. మ్యాచ్ సందర్భంగా దాదాపు 20వేల మంది క్రికెట్ ఫ్యాన్స్ మెట్రో ప్రయాణించినట్టు సమాచారం. -
Hyderabad Metro: అర్ధరాత్రి ఆపన్నహస్తం.. గ్రీన్‌ఛానెల్‌తో గుండెను తరలించిన మెట్రో
-
గుంటూరు జిల్లా మంగళగిరిలో గ్రీన్ ఛానల్
-
యశోద నుంచి నిమ్స్‌కు గుండె తరలింపు.. 15 నిముషాలల్లో 11 కి.మీ
సాక్షి, హైదరాబాద్: గ్రీన్ ఛానల్ ద్వారా మలక్‌పేటలోని యశోద ఆసుపత్రి నుంచి పంజగుట్ట నిమ్స్‌కు బుధవారం ప్రత్యేక అంబులెన్స్‌లో గుండెను తరలించారు. నిమ్స్ ఆసుపత్రిలో ఓ వ్యక్తికి ఈరోజు వైద్యులు గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయనున్నారు. రెండు ఆస్పత్రుల మధ్య దూరం 11కి.మీ కాగా కేవలం 15 నిమిషాల్లో అంబులెన్స్ నిమ్స్ ఆసుపత్రికి చేరుకుంది. గుండెను తరలించే క్రమంలో ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అధికారులు, పోలీసులు ముందే ఏర్పాట్లు చేశారు. చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా? : రేవంత్‌రెడ్డి బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి గుండె సేకరణ ఈ నెల 12వ తేదీన గొల్లగూడెం వద్ద కానిస్టేబుల్ వీరబాబు రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్ అదుపుతప్పి వీరబాబు కింద పడిపోవడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఖమ్మం జిల్లాకు చెందిన కానిస్టేబుల్ వీరబాబు బ్రెయిన్ డెడ్‌కు గురైనట్లు మంగళవారం యశోద వైద్యులు ప్రకటించారు. కానిస్టేబుల్ గుండె దానానికి ఆయన కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. గుండె కోసం జీవన్‌దాన్‌లో 30 ఏళ్ల వయసున్న ఓ పెయింటర్ నమోదు చేసుకున్నాడు. దీంతో కానిస్టేబుల్ గుండెను ఆ వ్యక్తికి నిమ్స్ వైద్యులు ఇవాళ అమర్చనున్నారు. నిమ్స్‌లో గతంలోనూ పలుమార్లు గుండె మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగిన సంగతి తెలిసిందే. చదవండి: వివాదస్పదంగా మారిన యూపీ సీఎం ‘అబ్బాజాన్’ వ్యాఖ్యలు -
గ్రీన్ చానెల్లో ఆక్సిజన్ ట్యాంకర్
అనంతపురం: ఆక్సిజన్ నిల్వల విషయంలో అధికార యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలు చేపడుతోంది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, కేన్సర్ ఆస్పత్రుల్లో ఆక్సిజన్ నిల్వలపై ఓ అంచనాకు వచ్చిన అధికారులు కర్ణాటక నుంచి ఆగమేఘాలపై ఆక్సిజన్ ట్యాంకర్ తెప్పించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారి జిల్లాలోని తోర్నకల్ జిందాల్ ఫ్యాక్టరీ నుంచి జిల్లా కేంద్రానికి 16 టన్నుల (13 కిలోలీటర్లు) ఆక్సిజన్ ట్యాంకరు రావాల్సి ఉండగా.. ఎస్పీ సత్య ఏసుబాబు ఆదేశాల మేరకు అనంతపురం డీఎస్పీ వీర రాఘవరెడ్డి నేతృత్వంలో బుధవారం గ్రీన్‌చానెల్ ద్వారా ట్యాంకర్‌ను తీసుకురావడం విశేషం. దాదాపు 160 కిలోమీటర్ల దూరం ఉన్న జిందాల్ నుంచి ట్యాంకర్ ఇక్కడికి రావాలంటే సుమారు ఐదు గంటలు పడుతుంది. అయితే ఎక్కడా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడకుండా గ్రీన్‌చానెల్ ద్వారా కేవలం 3 గంటల్లోపే అనంతపురానికి చేర్చారు. తెల్లవారుజామున 5.50 గంటలకు బయలుదేరిన వాహనం 9 గంటలకంతా ఇక్కడికి వచ్చేసింది. కరోనా నేపథ్యంలో కర్ఫ్యూ అమలవుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే వాహనాలకు అనుమతి ఉంటుంది. ఈ కారణంగా ఉదయం పూట ట్రాఫిక్ చాలా ఎక్కువగా ఉంటుంది. అయినా ఎక్కడా ఇబ్బంది లేకుండా పోలీసులు పటిష్ట చర్యలు చేపట్టారు. చెక్‌పోస్టు వద్ద కూడా ఆక్సిజన్ ట్యాంకరుకు ఆటంకం కలగకుండా జాగ్రత్తపడ్డారు. -
36 కిమీ..28 నిమిషాలు!
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ విభాగం అధికారులు సైబరాబాద్ పోలీసుల సహకారంతో మరోసారి ‘గ్రీన్ ఛానల్’ ఇచ్చారు. శుక్రవారం ఉదయం శంషాబాద్‌లోని విమానాశ్రయం నుంచి సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రికి లైవ్ ఆర్గాన్స్ అయిన ఊపిరితిత్తుల్ని తరలిస్తున్న అంబులెన్స్‌ల కోసం ఈ పని చేశారు. ఫలితంగా ఈ 36.8 కిమీ దూరాన్ని అంబులెన్స్ కేవలం 28 నిమిషాల్లో అధిగమించాయి. ఇతర రాష్ట్రంలోని ఓ డోనర్ ఇచ్చిన ఊపిరితిత్తులతో కూడిన విమానం శుక్రవారం శంషాబాద్ విమానాశ్రయానికి వచ్చింది. ఈ లైవ్ ఆర్గాన్స్ బాక్సుల్ని తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్‌లు అక్కడకు చేరుకున్నాయి. చదవండి: 11.5 కిమీ.. 9 నిమిషాలు అక్కడ నుంచి ఉదయం 11.11 గంటలకు బయలుదేరాయి. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం తమ వాహనంలో అంబులెన్స్‌లకు ఎస్కార్ట్‌గా ముందు వెళ్ళింది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ దాదాపు పూర్తిగా ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంతో నిరాటంకంగా సాగి 11.39 గంటలకు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రికి చేరింది. ఈ ఏడాది ఇప్పటి వరకు నగర ట్రాఫిక్ పోలీసులు మొత్తం 13 సార్లు లైవ్ ఆర్గాన్స్‌తో కూడిన అంబులెన్సుల కోసం గ్రీన్‌ఛానల్ ఇచ్చినట్లు సిటీ ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ తెలిపారు. -
11.5 కిమీ.. 9 నిమిషాలు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లోని అపోలో హాస్పిటల్ – సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్ మధ్య మార్గం.. అనునిత్యం రద్దీగా ఉంటుంది.. ఈ మార్గంలో వాహనాల సరాసరి స్పీడు గంటకు 25 కిలోమీటర్లు మించదు.. పగటి పూట, పీక్ అవర్స్‌లో ఆ వేగం 20 కిలో మీటర్లకు చేరదు. అయితే ఆ మార్గంలో ‘ప్రయాణించాల్సిన’ మూడు లైవ్ ఆర్గాన్స్ కోసం నగర ట్రాఫిక్ పోలీసులు శనివారం ‘గ్రీన్ ఛానల్’ ఇచ్చారు. ఫలితంగా ఈ 11.5 కిమీ మార్గాన్ని అంబులెన్స్ కేవలం 9 నిమిషాల్లో అధిగమించింది. దీనికి పైలెట్‌గా వాహనంలో వెళ్లిన స్థానిక ట్రాఫిక్ పోలీసుల నుంచి ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమష్టిగా, సమన్వయంతో పని చేయడంతోనే ఇది సాధ్యమైందని నగర ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్ తెలిపారు. వీరి కృషిని అభినందిస్తూ నగర కొత్వాల్ అంజనీకుమార్ ట్వీట్ చేశారు. ఉదయం మొదలైన ‘ఆపరేషన్’.. నగర ట్రాఫిక్ విభాగంలోని పశ్చిమ, ఉత్తర మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ అన్నీ శనివారం ఉదయం ఒక్కసారిగా మోగాయి. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఓ రోగికి కిడ్నీ, లంగ్స్, లివర్ మార్పిడి చేయాల్సి ఉందని, ఆ శస్త్ర చికిత్స ఉదయం 9.30 గంటలకు ప్రారంభం కానుండగా.. డోనర్ ఇస్తున్న ఆ అవయవాలు ఉదయం 9 గంటలకు జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి బయలుదేరనుంది అన్నది వాటిలో వినిపించిన సారాంశం. దీంతో అన్ని స్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. ఉదయం 8 గంటల నుంచే ఈ రూట్లో ఉన్న జంక్షన్స్‌లో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు మొదలయ్యాయి. టీసీసీసీ నుంచి నిరంతర పర్యవేక్షణ.. డోనర్ ఇచ్చిన అవయవాలతో కూడిన బాక్స్‌లను తీసుకువెళ్తున్న అంబులెన్స్ ఈ రెండు ఆస్పత్రులకు మధ్య ఉన్న 11.5 కిలోమీటర్ల దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఓ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం తమ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్లేందుకు సిద్ధమైంది. అలా నే ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలో ఉండే అధికారు లు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లో ఉన్న ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంత పర్యవేక్షించ డానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ఉద యం 8 గంటల నుంచి వీరంతా తీవ్ర ఉత్కంఠతో గడిపారు. ఇదీ ప్రయాణించిన మార్గం.. శనివారం ఉదయం 9 గంటలకు ‘లైవ్ ఆర్గాన్ బాక్స్’లతో కూడిన అంబులెన్స్ జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రి నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి పంజగుట్ట, బేగంపేట రసూల్‌పురా, ప్రకాష్‌నగర్ మీదుగా ప్రయాణించి సరిగ్గా 9.09 గంటలకు కిమ్స్ ఆస్పత్రికి చేరింది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ దాదాపు పూర్తిగా ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ ఛానల్’ ఇవ్వడంతో కేవలం 9 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. ఈ కాసేపు అంబులెన్స్ సైరన్‌కు పోటీగా ట్రాఫిక్ పోలీసులు వైర్లెస్ సెట్స్ నిరంతరాయంగా మోగుతూనే ఉన్నాయి. విలువైన ప్రా ణం కాపాడేందుకు ట్రాఫిక్ పోలీ సులు చూపిన చొరవను ఆ యా ఆస్పత్రి యాజమాన్యాలు కొనియాడాయి. -
29 కిలోమీటర్లు...26 నిమిషాలు!
సాక్షి, సిటీబ్యూరో: లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రి–శంషాబాద్‌లోని విమానాశ్రయం మధ్య ఉన్న 29 కిమీ మార్గాన్ని లైవ్ ఆర్గాన్స్‌తో కూడిన అంబులెన్స్ కేవలం 26 నిమిషాల్లో అధిగమించింది. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ ప్రయాణానికి ఎలాంటి ఆటంకాలు ఏర్పడకుండా ట్రాఫిక్ పోలీసులు గ్రీన్ ఛానల్ ఇచ్చినట్లు అదనపు సీపీ అనిల్‌కుమార్ తెలిపారు. నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య, పశ్చిమ మండలాలకు చెందిన అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ సోమవారం అర్ధరాత్రి ఒక్కసారిగా మోగాయి. లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో ఉన్న డోనర్ తన గుండె, ఊపిరి తిత్తులను దానం చేశారని, అవి శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నైకు చేరాల్సి ఉందని సమాచారం అందింది. చెన్నైలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు ఇవి చేరాల్సి ఉంది. అప్పటికే ఆయా ఆస్పత్రుల్లో వీటిని రిసీవ్ చేసుకోవాల్సిన రోగులకు ఆపరేషన్స్ మొదలయ్యాయి. లైవ్ ఆర్గాన్స్‌తో కూడిన అంబులెన్స్ తెల్లవారుజామున 3 గంటలకు లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రి నుంచి బయలుదేరగా అధికారులు అప్రమత్తమై ప్రత్యేక సిబ్బందిని రంగంలోకి దింపారు. తెల్లవారుజామున 2 గంటల నుంచే ఈ రూట్లో ఉన్న జంక్షన్లలో ప్రత్యేక చర్యలు మొదలయ్యాయి. డోనర్ ఇచ్చిన గుండె, ఊపిరి తిత్తులతో కూడిన బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్ విమానాశ్రయం వరకు ఉన్న 29 కిమీ దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక సిద్ధం చేశారు. తెల్లవారుజామున సాధారణ రోడ్లలో ట్రాఫిక్ ఎక్కువగా ఉండకపోయినప్పటికీ... ఎయిర్పోర్ట్ రూట్లో కచ్చితంగా ఉంటుంది. దీనికితోడు ఇతర జంక్షన్లలోనూ దూసుకువచ్చే వాహనాల వద్ద ప్రమాదాలు, ఆటంకాలు లేకుండా చూసేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఓ సబ్–ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా వెళ్లడానికి సిద్ధమైంది. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంతం పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజామున 2.58 గంటలకు ‘లైవ్ ఆర్గాన్స్ బాక్స్’తో కూడిన అంబులెన్స్ గ్లోబల్ ఆస్పత్రి నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి మాసబ్‌ట్యాంక్, మెహదీపట్నం, పీవీ నర్సింహ్మారావు ఎక్స్‌ప్రెస్ వే మీదుగా సరిగ్గా 3.24 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ప్రమాదాలకు ఆస్కారం లేకుండా కాపు కాశారు. అప్పటికే సిద్ధంగా ఉన్న విమానంలో ఈ రెండు లైవ్ ఆర్గాన్స్ చెన్నై వెళ్లిపోయాయి. -
గుండె చప్పుడు ఆగరాదని..
సాక్షి, సిటీబ్యూరో: నిత్యం రద్దీగా ఉండే లక్డీకాపూల్ మార్గంలో వాహనాల వేగం 20 కి.మీ మించదు. అలాంటిది మంగళవారం ఓ గుండె చప్పుడు ఆగరాదని ట్రాఫిక్ పోలీసులు ‘గ్రీన్ చానెల్’ ఇచ్చారు. దీంతో ఓ గుండె, ఊపిరితిత్తుల (లైవ్ ఆర్గాన్స్)ను గ్లోబల్ ఆస్పత్రి నుంచి శంషాబాద్‌లోని విమానాశ్రయం మధ్య గల 29 కి.మీ దూరాన్ని అంబులెన్స్‌లో కేవలం 22 నిమిషాల్లో తరలించారు. దీనికి పైలెట్‌గా వాహనంలో వెళ్లిన బృందం మొదలు ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్లో విధులు నిర్వర్తిస్తున్న వారి వరకు పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పని చేయడంతో సాధ్యమైంది. మధ్యాహ్నం మొదలైన ‘ఆపరేషన్’.. నగర ట్రాఫిక్ విభాగంలో మధ్య, పశ్చిమ మండలాల అధికారులు, సిబ్బంది చేతుల్లోని వైర్లెస్ సెట్స్ అన్నీ మంగళవారం మధ్యాహ్నం ఒక్కసారిగా మోగాయి. లక్డీకాపూల్‌లోని గ్లోబల్ ఆస్పత్రిలో ఉన్న ఓ జీవన్మృతుడి గుండె, ఊపిరితిత్తులను దానం చేశారని, అవి శంషాబాద్ విమానాశ్రయం నుంచి చెన్నైకు చేరాల్సి ఉంది. చెన్నైలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఆస్పత్రులకు ఇవి చేరాలి. అప్పటికే ఆయా ఆస్పత్రుల్లో వీటిని రిసీవ్ చేసుకోవాల్సిన రోగులకు ఆపరేషన్స్ మొదలయ్యాయి. లైవ్ ఆర్గాన్స్‌తో అంబులెన్స్ మధ్యాహ్నం 3.23 గంటలకు లక్డీకాపూల్‌లోని ఆస్పత్రి నుంచి బయలుదేరుతుందని సెట్స్‌లో వినిపించిన సందేశం. దీంతో అన్నిస్థాయిల అధికారులు అప్రమత్తమై రంగంలోకి దిగారు. 3 గంటల నుంచే ఈ రూట్లో ఉన్న జంక్షన్స్‌లో ట్రాఫిక్ నియంత్రణ, సమన్వయానికి అవసరమైన చర్యలు చేపట్టారు. ‘సెంటర్’ నుంచి పర్యవేక్షణ డోనర్ ఇచ్చిన గుండె, ఊపిరితిత్తులు గల బాక్స్‌ను తీసుకువెళ్తున్న అంబులెన్స్ విమానాశ్రయం వరకు ఉన్న 29 కి.మీ. దూరాన్ని సాధ్యమైనంత త్వరగా అధిగమించాలనే లక్ష్యంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగారు. ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం ఓ వాహనంలో అంబులెన్స్‌కు ఎస్కార్ట్‌గా ముందు వెళ్లడానికి సిద్ధమైంది. ఈ మధ్యలో ఉన్న ప్రతి కూడలిలోను పోలీస్ అధికారులు సంసిద్ధులయ్యారు. బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని ట్రాఫిక్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ (టీసీసీసీ) సిబ్బంది ఈ ‘ప్రయాణం’ ఆద్యంతం పర్యవేక్షించడానికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు అనుగుణంగా సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రయాణించిన మార్గం ఇలా.. మధ్యాహ్నం 3.23 గంటలకు ‘లైవ్ ఆర్గాన్స్ బాక్స్’తో అంబులెన్స్ గ్లోబల్ ఆస్పత్రి నుంచి బయలుదేరింది. అక్కడ నుంచి మాసబ్‌ట్యాంక్, మెహదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్ వే మీదుగా ప్రయాణించి 3.45కు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. ఈ మార్గంలో ఉన్న అన్ని జంక్షన్లనూ ఆపేసిన ట్రాఫిక్ పోలీసులు ఈ అంబులెన్స్, పైలెట్ వాహనాలకు ‘గ్రీన్ చానల్’ ఇవ్వడంతో కేవలం 22 నిమిషాల్లో గమ్యం చేరుకున్నాయి. అప్పటికే సిద్ధంగా ఉన్న విమానంలో ఈ రెండు లైవ్ ఆర్గాన్స్ చెన్నై వెళ్లిపోయాయి. ట్రాఫిక్ పోలీసుల సహకారం వల్లే ఈ ‘ఆపరేషన్’ సాధ్యమైందని గ్లోబల్ ఆస్పత్రి యాజమాన్యం ట్రాఫిక్ చీఫ్ అనిల్‌కుమార్‌కు లేఖ రాసింది. -
పోర్టు సిగలో మరో నగ
- సముద్ర రవాణాకు ‘గ్రీన్‌చానల్ ’ - విశాఖ పోర్టు సిద్ధం చేస్తున్న కొత్త బెర్త్ - రూ.90 కోట్లతో తొమ్మిది నెలల్లో పూర్తి - 1.5 మిలియన్ టన్నుల టర్నోవర్ లక్ష్యం సాక్షి, విశాఖపట్నం: విశాఖ పోర్టులో మరో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టుకు బీజం పడనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెర్తులను అభివృద్ధి చేయడంతో పాటు కొత్తగా గ్రీన్‌చానల్ బెర్త్‌ను నిర్మించేందుకు పోర్టు ట్రస్ట్ సన్నాహాలు చేస్తుంది. ఏడాదిలోగా దీన్ని పూర్తిచేస్తే భారీ నౌకలు సైతం నేరుగా ఇన్నర్ చానల్‌కు వెళ్లే వెసులుబాటు కలుగుతుంది. దీని వల్ల ఎగుమతులు, దిగుమతులు గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం 11 మీటర్ల లార్డ్స్(నౌక) మాత్రమే ఇన్నర్ ఛానల్లోకి వెళ్లగలుగుతున్నాయి. అంతకన్నా పెద్దవి వస్తే వాటిని అవుటర్‌లో లైట్నింగ్ చేయాల్సి వస్తోంది. కనీసం 18.5 మీటర్ల డ్రాఫ్ట్ ఉంటే తప్ప సూపర్ కేప్ వెళ్లలేవు. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని తొలి దశలో 14.5 లార్డ్స్ వచ్చేలా హార్బర్‌ను విస్తరించనున్నారు. పాతవి ఐదు బెర్త్‌లు తొలగించి వాటి స్థానంలో కొత్త బెర్త్‌లు నిర్మించనున్నారు. దానిలో భాగంగా గ్రీన్‌చానల్ బెర్త్ సిద్ధమవుతోంది. పోర్టులో ప్రస్తుతం ఇన్నర్ హార్బర్లో 18, అవుటర్‌లో 6 బెర్త్‌లు ఉన్నాయి. అవుటర్‌లో ఎస్పిఎం క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే వెసులుబాటు ఉంది. తొమ్మిది నెలల్లో గ్రీన్ చానల్ బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురావడానికి తొలి విడత రూ.45 కోట్లు, మలివిడత రూ.45 కోట్లు పెట్టుబడి పెట్టనున్నారు. దీనిలో 30 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ నుంచి కేటాయిస్తుంది. ఈ బెర్త్ అందుబాటులోకి వస్తే 1.5 మిలియన్ టన్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసే వెసులుబాటు కలుగుతుంది. పోర్టులో ప్రస్తుతం ఆధునికీకరణ పనులు జరుగుతున్న ఇ1 బెర్త్ నుంచి థర్మల్ కోల్‌ను దిగుమతి చేస్తున్నారు. ఓఆర్1,2 బెర్త్‌ల ద్వారా పెట్రోలియం, ఆయిల్, లూబ్రికెంట్స్‌ను ఎగుమతి, దిగుమతి చేస్తున్నారు. గ్రీన్‌చానల్ బెర్త్ నుంచి ఆహార ఉత్పత్తులు, ఇనుము, సిమెంట్ లావాదేవీలు నిర్వహించనున్నట్లు పోర్టు వర్గాల సమాచారం. యూరప్ దేశాలలో 40 శాతం సరుకు రవాణా నౌకలపై జరుగుతుంటే మన దేశంలో 7 శాతం మాత్రమే జరుగుతోంది. నిజానికి ఒక టన్ను సరుకు రోడ్డు మార్గంలో రవాణా చేయడానికి అయ్యే ఖర్చులో సగానికే నౌకలపై తరలించవచ్చు. పైగా పెరుగుతున్న రద్దీకి అనుగుణంగా రహదారులు విస్తరించాలంటే ఖర్చుతో పాటు భూ సమస్యలు తలెత్తుతాయి. నౌకామార్గానికి అలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ కారణాలతో కేంద్ర ప్రభుత్వం తీర ప్రాంత పోర్టులను అభివృద్ధి చేసి సముద్ర రవాణాను ప్రోత్సహించాలని నిర్ణయించింది. దానిలో భాగంగానే విశాఖ పోర్టుకు నిధుల సాయం చేయడం ద్వారా గ్రీన్‌చానల్ బెర్త్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. -
గ్రీన్ చానల్ కింద షాదీ ముబారక్!
ట్రెజరీ ఆంక్షలు లేకుండా నిధులు హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం షాదీ ముబారక్ పథకానికి గ్రీన్ చానల్‌ను వ ర్తింపజేసింది. ట్రెజరీ ఆంక్షలను లేకుండా నిధుల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిరుపేద ముస్లిం యువతుల వివాహాలకు ఆర్థిక తోడ్పాటు కోసం ఈ పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పట్టణ లబ్ధిదారుల వార్షిక ఆదా య పరిమితి రూ. 2 లక్షలు, గ్రామీణ లబ్ధిదారుల వార్షిక ఆదాయ పరిమితిని రూ. 2 లక్షల నుంచి 1.50 లక్షకు తగ్గించింది. జనన ధ్రువీకరణపత్రం తప్పనిసరి అనే నిబంధనను సడలించి రేషన్, ఓటరు ఐడీ, ఆధార్ కార్డులను వయస్సు ధ్రువీకరణ కోసం సమర్పించవచ్చని స్పష్టం చేసింది. గత ఏడాది పథకం ఆరంభంలో ఎదురైన అవరోధాలను అధిగమించేందుకు చర్య లు చేపట్టడంతో షాదీ ముబారక్ పథకానికి గ్ర హణం వీడినట్లయింది. లబ్ధిదారులకు నిధులు మంజూరైనా ట్రెజరీ శాఖ ప్రతినెల 5 నుంచి 18 తేదీ వరకు మాత్రమే బిల్లులను ఆమోదించడంతో సకాలంలో లబ్ధి అందడంలేదు. తాజాగా ట్రెజరీల ద్వారా నిధులు విడుద లై బ్యాంకు ఖాతాల్లో జమా అవుతాయి. పెళ్లి తర్వాత కూడా.. షాదీ ముబారక్ పథకం కోసం పెళ్లి తర్వాత కూడా దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం వెసలుబాటు కల్పించింది. వివాహానికి సంబంధిం చిన ఫొటోను ఆన్లైన్లో దాఖలు చేయాల్సి ఉంటుంది. 2014 అక్టోబర్ 2 తర్వాత ఆడబిడ్డల పెళ్లి చేసిన నిరుపేద కుటుంబాలు ఈ ఆర్థిక సహాయానికి అర్హులు. పెళ్లికి ముందు దరఖాస్తు చేసుకుంటే మాత్రం వివాహ ఆహ్వానపత్రం, ఇతర పత్రాలను సమర్పించాలి. 2015-16 ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన కేవలం 40 రోజుల్లో షాదీ ముబారక్ పథకం కింద 6,913 నిరుపేద కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే 2,335 మందికి, గత ఆర్థిక సంవత్సరం 5,839 కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే 5,414 మందికి లబ్ధిఅందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. దళారులను నమ్మవద్దు షాదీ ముబారక్ పథకం కింద రూ.51 వేల ఆర్థిక సహాయం కోసం ఆన్లైన్లో నేరుగా దరఖాస్తు చేసుకోవాలి. వివాహానికి ముందు కానీ, తర్వాత కానీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటు ఉంది. దళారులను నమ్మవద్దు. మీ సేవా కేంద్రాల ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. హెల్ప్‌లైన్ నంబర్ 040-24760452 కు ఫోన్‌చేసి సహకారం పొందవచ్చు. -మహ్మద్ జలాలోద్దీన్ అక్బర్, డెరైక్టర్, మైనార్టీ సంక్షేమ శాఖ -
డబుల్ ట్రబుల్
ట్రాఫిక్‌పై ఉమ్మడి రాజధాని ప్రభావం హైదరాబాద్: ‘ఉమ్మడి’ నగరం హైదరాబాద్‌లో ఇప్పుడు అంతా డబుల్. ఇద్దరు ముఖ్యమంత్రులు, ఇద్దరు ప్రతిపక్ష నేతలు, ఇద్దరు స్పీకర్లు, నలుగురు ఉప ముఖ్యమంత్రులు, అన్ని శాఖలకు ఇద్దరేసి చొప్పున మంత్రుల రాకపోకలతో నగరంలో ట్రాఫిక్ సీన్ మారిపోయింది. సిటీ ఉమ్మడి రాజధాని కావడంతో పోలీసు విభాగంపై భారం రెండింతలయింది. వీవీఐపీలు రాకపోకలు సాగించే మార్గాల్లో ట్రాఫిక్ ఇక్కట్లు తప్పటం లేదు. అయితే ఉమ్మడి ప్రముఖుల అంశం అత్యంత సున్నితమైందని, ఏమరుపాటు వహిస్తే అనవసర అపార్థాలకు తావిచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ ఇబ్బందులు భరించక తప్పదంటూ ఉన్నతాధికారులు చెప్పకనే చెబుతున్నారు. రెట్టింపైన ప్రముఖుల జాబితా... సిటీ ఉమ్మడి రాజధాని కావడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు చెందిన ఈ అత్యంత ప్రముఖులంతా అత్యధిక సమయం నగరంలోనే ఉండాల్సిన పరిస్థితి. దీంతో ట్రాఫిక్ ఆపాల్సిన సందర్భాలు పెరుగుతున్నాయి. అత్యంత ప్రముఖులుగా పరిగణించే రాజ్యాంగ, రాజకీయ హోదా కలిగిన వారి కాన్వాయ్‌ల కదలికల నేపథ్యంలో సిటీ రోడ్లు, కీలక జంక్షన్లలో ట్రాఫిక్ ఆపడం అనివార్యంగా మారింది. దీన్నే సాంకేతిక పరిభాషలో ‘గ్రీన్ ఛానల్’ కల్పించడం అంటారు. అంటే ఎలాంటి అడ్డంకులు లేకుండా ప్రముఖులు వెళ్లడానికి కల్పించే సౌకర్యం. వారి హోదా మాత్రమే కాకుండా భద్రతాకారణాల దృష్ట్యా ఇది అనివార్యం. వీరు ప్రయాణిస్తున్న వాహనాలు, కాన్వాయ్‌లు ఆయా ప్రాంతాలను దాటి వెళ్లే వరకు ఆ పరిధిలోని మార్గంలో ఇతర వాహనాలను అనుమతించరు. ఒకప్పుడు ఈ కాన్వాయ్‌లు ప్రయాణిస్తున్న సందర్భంలో వాటి దిశకు వ్యతిరేకంగా వచ్చే వాహనాలను సైతం ఆపేవారు. ఈ పరిస్థితుల్ని చక్కదిద్దినప్పటికీ రోజూ కనిష్టంగా 40 చోట్ల వాహనాలను ఆపాల్సి వచ్చేది. ప్రస్తుతం ఉమ్మడి రాజధానిలో పెరిగిన ప్రముఖుల కారణంగా ఈ సంఖ్య 80కి చేరింది. రద్దీ ప్రాంతాల్లోనే అత్యధికం... నగరంలోని ప్రముఖుల నివాసాలు, కార్యాలయాలు, పరిపాలన తదితర కార్యకలాపాలు సాగించే ప్రాంతాలు ఎక్కువ పశ్చిమ(బంజారాహిల్స్, జూబ్లీహిల్స్), మధ్య మండలం (అబిడ్స్, ముషీరాబాద్, సైఫాబాద్). ఈ ప్రాంతాల్లోనే ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువ. పీక్ అవర్స్‌గా పిలిచే రద్దీ వేళల్లోనే ఉంటున్నాయి. మరోపక్క సాఫ్ట్వేర్ హబ్‌గా ఉన్న హైటెక్ సిటీ చుట్టుపక్కల ప్రాంతాలకు నగరం నుంచి ప్రయాణించే వాహనాలు పశ్చిమ మండలం మీదుగానే వెళ్తుంటాయి. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆపితే సాధారణ స్థితికి తీసుకురావడానికి 30 నుంచి 40 నిమిషాల సమయం పడుతోంది. ఆ మండలాలపై అధిక భారం... ఉమ్మడి రాజధాని ప్రభావం నగరంలో ఉండే ప్రముఖుల్లో దాదాపు 80 శాతం మంది నివసించే పశ్చిమ మండలంతో పాటు ఉభయ రాష్ట్రాల శాసనసభలు ఉన్న మధ్య మండల పోలీసులపై అత్యధికంగా ఉంటోంది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలతో సహా ఇతర మంత్రులు పశ్చిమ మండలంలోనే ఉంటున్నారు. అలాగే అసెంబ్లీ సమావేశాలు ఒకే సముదాయంలో జరుగుతున్నాయి. వీటికి పూర్తిస్థాయిలో భద్రత ఏర్పాటు చేయడంతో పాటు భారీ స్థాయిలో సిబ్బందిని మోహరిస్తున్నారు. గతంలో ఏటా నెలరోజులకు పైగా అసెంబ్లీ బందోబస్తును నిర్వహిస్తే, ఇకపై రెండు నెలలకు పైగా నిర్వహించాల్సి ఉంటుంది. ఈ భారం మధ్య మండల పోలీసులపై పడుతోంది. అలాగే రెట్టింపైన ప్రముఖుల నివాసాలకు భద్రత, బందోబస్తు కల్పించడం పశ్చిమ మండల అధికారులపై పడుతున్న మరో భారం. అంతర్గత భద్రత అప్పగించే ప్రతిపాదన... ఉమ్మడి రాజధాని దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ సచివాలయం, ఇతర కార్యాలయాలతో పాటు ముఖ్యమంత్రి, మంత్రుల, అధికారుల నివాసాలు 10 ఏళ్లు హైదరాబాద్‌లోనే కొనసాగనున్నాయి. అయితే వీటి భద్రత ఏపీ అధికారులే చూసుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులు భావిస్తున్నారు. జంట కమిషనర్లు ప్రతిపాదించినట్లు అదనపు సిబ్బందిని ప్రభుత్వం కేటాయించినా.. భర్తీ చేయడం తక్షణం సాధ్యం కాని నేపథ్యంలో ఈ ప్రతిపాదన తెరపైకి వస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు మార్షల్స్ సహా బందోబస్తుకు ఏపీ నుంచి కొందరు అధికారుల్ని రప్పించారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కీలక కార్యాలయాల వద్ద భద్రత, బందోబస్తు విధుల్లో ఉండేందుకు సిబ్బందిని రొటేషన్ పద్దతిపైన ఏపీ నుంచి తీసుకువస్తే ఈ భారం తగ్గుతుందని అధికారులు భావిస్తున్నారు. వ్యక్తిగత భద్రతా అధికారుల్ని సైతం అక్కడ నుంచే పంపేలా చూడాలని ప్రతిపాదించనున్నారు. అలాగే, నిర్దిష్టమైన ఫిర్యాదు వచ్చినప్పుడు మాత్రమే ఆ కార్యాలయం ఏ ఠాణా పరిధిలో ఉంటే వారు కలగజేసుకుంటారు. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఏపీ భవన్లో ఇదే పద్ధతి కొనసాగుతోంది. వీళ్లొస్తే మన బండి ఆగాల్సిందే.. ⇒ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ⇒ తెలంగాణ, ఏపీముఖ్యమంత్రులు ⇒ శాసనసభ, మండలిల్లోని నలుగురు ప్రతిపక్ష నేతలు ⇒ ఉభయసభల ఇద్దరు స్పీకర్లు, ఇద్దరు డిప్యూటీ స్పీకర్లు ⇒ 2 రాష్ట్రాల నలుగురు డిప్యూటీ సీఎంలు ⇒ తెలంగాణ, ఏపీ హోం మంత్రులు ⇒ ఇరు రాష్ట్రాల డీజీపీలు రోజుకు ఎన్నిసార్లంటే... ఈ 19 మంది ఒక్కసారి కార్యాలయాలకు వెళ్లి రావాలన్నా 38 సార్లు ఆపాల్సిందే.అసెంబ్లీ సమావేశాలుంటే ఈ సంఖ్య మరింత పెరుగుతుంది.సభలు, సమావేశాలు, ప్రత్యేక సందర్భాల్లో 80 సార్లకు పైగా ఆపాల్సిన పరిస్థితి.అత్యధికంగా ట్రాఫిక్‌ను పీక్ అవర్స్‌లో రద్దీ ప్రాంతాల్లోనే ఆపాల్సి వస్తోంది. -
మునిసిపాలిటీల్లో గ్రీన్ చానల్
సాక్షి, కర్నూలు: అధికారుల అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడక్కర్లేదు. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగక్కర్లేదు. పత్రాలన్నీ పక్కాగా ఉంటే.. ఏడు రోజుల్లోనే అనుమతి లభిస్తుంది. బిల్టర్లు, డెవలపర్లే కాదు.. సామాన్యులూ అనుమతులు పొందొచ్చు. పురపాలక సంఘాలు అందించే సేవల్లో పారదర్శకతను తీసుకొచ్చే సరికొత్త విధానానికి పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. నెలాఖరులోగా జిల్లాలో కర్నూలు కార్పొరేషన్‌తోపాటు ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నంద్యాల మునిసిపాలిటీల్లో ఆరంభమయ్యే ‘గ్రీన్ చానల్’పై సాక్షి కథనం.. స్థానిక సంస్థల నుంచి అనుమతులు తెచ్చుకోవడానికి ఇప్పటి వరకు కార్యాలయం చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. సమస్య చేతపట్టుకొని.. శ్రమకోర్చి వచ్చినా.. కుంటిసాకులతో అధికారులు, సిబ్బంది పనుల్లో తీవ్ర జాప్యం చేసేవారు. సామాన్యుడి నుంచి బడాబాబులు వరకు ఎంతవారైనా అనుమతులు విషయంలో అధికారుల ముందు ‘మా పని ఎంత వరకు వచ్చిందం’టూ ప్రాథేయపడాల్సి వచ్చేది. వారి దయాదాక్షిణ్యాల మీద అనుమతులు అధారపడేవి. ఇలాంటి ఇబ్బందులు నివారించేందుకు గ్రీన్ చానల్ విధానం అమలుకు పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాజధానిలో ఇటీవలే ప్రారంభించిన ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీల్లో అమలుకు మంత్రి యోచిస్తున్నారు. మునిసిపాలిటీల్లో రెవెన్యూ, ఇంజనీరింగ్, ఆరోగ్య, పట్టణ ప్రణాళిక, పారిశుద్ధ్య విభాగాలకు దీనిని వర్తింపజేశారు. ఈ విధానం కింద నిర్ధేశించిన సేవల్లో జాప్యం జరిగితే అధికారి నుంచి అపరాధ రుసుం పొందే వీలుంటుంది. ప్రతి సమస్య పరిష్కారంలో జాప్యానికి రోజువారీ చార్జీలను వసూలు చేసుకునే అవకాశం కల్పించారు. పని చేస్తుంది ఇలా... గ్రీన్‌చానల్ వల్ల భవన నిర్మాణ అనుమతులకు రోజుల తరబడి నిరీక్షణ అవసరం ఉండదు. ఇకపై వారం రోజుల్లో ఎలాంటి అనుమతులైన అమోదమా? తిరస్కారమా? అన్న వివరాలు తెలుస్తాయి. ఈ ప్రక్రియలో భాగంగా భవన నిర్మాణ అనుమతులు పొందేటప్పుడు దరఖాస్తుదారుడు సమర్పించాల్సిన వివరాలను తెలియజేస్తోంది. ఎలా దరఖాస్తు చేయాలి, ఫీజు, నిర్ణీత రుసుం వసూలు తదితర వివరాలు అందిస్తోంది. భవన నిర్మాణ వివరాలు, అనుమతులు, బ్యాంకు లింకేజీ వివరాలను సూచిస్తూ గ్రీన్ చానల్ కేంద్రం ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారుడు సంబంధిత డాక్యుమెంట్లతో గ్రీన్‌చానల్ సిబ్బంది వద్దకు వెళితే.. నిబంధనల ప్రకారం దస్త్రాన్ని రూపొందిస్తారు. నిన్నటివరకు ప్రణాళిక విభాగం అధికారులు నిర్వహించే ప్రాథమిక పరిశీలను వీరే పూర్తి చేస్తారు. అనంతరం ఆ దస్త్రాన్ని ప్రణాళిక విభాగ అధికారులు సూపర్ చెక్ చేస్తారు. ఇలా వారం రోజుల్లోగా దరఖాస్తు ఆమోదమా లేక తిరస్కారమా స్పష్టం చేస్తారు. ఆమోదిస్తే వెంటనే అందుకు సంబంధించిన ఫీజులు వసూలు చేస్తారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి పరిశీలిన, అనుమతులు జారీ పూర్తవుతుంది. తొలివిడతలో పట్టణ ప్రణాళిక విభాగానికి గ్రీన్ చానల్‌ను అనుసంధానం చేయనున్నారు. సేవలు సులభం పురపాలక సంఘాల్లో గ్రీన్ చానల్ అమలుతో సేవల్లో పారదర్శకత ఉంటుంది. వేగంగా దరఖాస్తులు పరిశీలన జరుగుతుంది. ఆన్లైన్ ద్వారా ధ్రువపత్రాలు జారీ ఉంటుంది. అలాగే మునిపిపాలిటీల్లో ఆదాయమూ పెరిగే అవకాశం ఉంది. - మురళికృష్ణ, పురపాలక ప్రాంతీయ సంచాలకులు -
పాత స్కీమ్‌కే కొత్త కలర్!
= ‘గ్రీన్ చానెల్’ పెరిట హెచ్ఎండీఏ హడావుడి = 20 రోజుల్లో అమల్లోకి తెచ్చేందుకు కసరత్తు = తొలుత లేఅవుట్స్ అప్రూవల్తో ప్రారంభం సాక్షి, సిటీబ్యూరో : ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వ విభాగాల్లో కొత్త విధానాలు, సరికొత్త స్కీంలను ప్రవేశపెట్టడం సర్వసాధారణం. ప్రత్యేకించి ఐఏఎస్ అధికారులు పరిపాలనలో తనదైన ముద్ర వేసేందుకు, ప్రభుత్వంలో మంచి గుర్తింపు పొందేందుకు గట్టిగా కృషి చేస్తుంటారు. అయితే... హెచ్ఎండీఏ ఉన్నతాధికారుల తీరు మాత్రం ఇందుకు పూర్తి భిన్నం. అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట వేయలేక ఏకంగా జోనల్ వ్యవస్థకు మంగళం పలికిన హెచ్ఎండీఏ కమిషనర్ తాజాగా ‘గీన్ చానెల్’ పేరిట ఓ స్కీమ్‌ను అమలు చేసేందుకు హడావుడి చేస్తున్నారు. వివిధ అనుమతులకు సంబంధించి సత్వర పరిష్కారం కోసం ఈ పథకాన్ని ప్రవేశ పెడుతున్నట్లు ప్రభుత్వానికి నమ్మబలికి అనుమతి పొందారు. విచిత్రం ఏమిటంటే... గతంలో వైఎస్ హయాంలో ప్రవేశపెట్టిన ‘గ్రీన్ చానెల్’ స్కీమ్‌కే కాస్త అటూ ఇటు మార్పులు చేసి దాన్ని మళ్లీ కొత్తగా ప్రవేశ పెడుతున్నారు. భవన నిర్మాణాలు, లేఅవుట్లకు సంబంధించి పర్మిషన్ల మంజూరులో జాప్యం లేకుండా చూసేందుకు అప్పట్లో వైఎస్ ఫాస్ట్ ట్రాక్ క్లియరెన్స్ కోసం 2009 జూన్ 18న ‘గ్రీన్ చానెల్’ స్కీమ్‌ను హెచ్ఎండీఏలో ప్రారంభించారు. ఆ తర్వాత పాలకులు పట్టించుకోకపోవడంతో అధికారులు ఆ స్కీమ్‌కు పాతర వేశారు. అయితే.. ప్రస్తుత కమిషనర్ హెచ్ఎండీఏలో తాను సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు భ్రమ కల్పిస్తూ పాత స్కీంలకే కొత్త రంగులద్దుతుండటం గమనార్హం. గ్రీన్ చానెల్ అంటే.. కొత్త లేఅవుట్లు, భవనాలకు సంబంధించి అనుమతుల మంజూరులో జాప్యాన్ని నివారించేదుకు ‘గ్రీన్ చానెల్’ను ప్రవేశపెట్టాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఇందులో భాగంగా లెసైన్స్డ్ ఆర్కిటెక్ట్స్, డాక్యుమెంట్ ఆడిటర్స్‌ను హెచ్ఎండీఏలో నమోదు చేసుకొంటారు. వీరి ద్వారా పరిశీలించిన దరఖాస్తులను హెచ్ఎండీఏ వెంటనే ఆమోదిస్తుంది. అనంతరం దరఖాస్తుదారు చెల్లించాల్సిన డెవలప్మెంట్ చార్జీలు, ఇతర పత్రాల వివరాలను 7 రోజుల్లోగా వారికి లేఖ ద్వారా తెలియజేస్తారు. ఆ తర్వాత సంబంధిత పత్రాల స్వీకరణ, తనఖా వంటి ప్రక్రియను పూర్తిచేసి వెంటనే తుది అనుమతి పత్రం అందిస్తారు. ఈ విధానాన్ని 20 రోజుల్లో అమల్లోకి తేవాలన్నది లక్ష్యం. తొలుత లేఅవుట్ అప్రూవల్ కోసం గ్రీన్ చానెల్ ప్రక్రియను ప్రవేశపెట్టాలనుకొంటున్నారు. ఇప్పటికే ఏపీ బార్‌కౌన్సిల్, కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్టివ్లతో సమావేశం నిర్వహించిన హెచ్ఎండీఏ త్వరలో టెండర్ ప్రక్రియ ద్వారా లెసైన్స్డ్ ఆర్కిటెక్ట్స్, డాక్యుమెంట్ ఆడిటర్లను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. అయితే... ఈ లెసైన్స్డ్ ఆర్కిటెక్ట్స్, డాక్యుమెంట్ ఆడిటర్స్‌కు చెల్లించాల్సిన ఫీజును సైతం దరఖాస్తుదారు నుంచే వసూలు చేయాలని నిర్ణయించారు. అపకీర్తిని తొలగించుకునేందుకే... హెచ్ఎండీఏలో ఏ పని కావాలన్నా... చేయి తడపాల్సిందే! ఇక్కడ ప్రతి పనికీఓ రేటు ఉంటోందన్నది బహిరంగ రహస్యమే. పైసలివ్వనిదే ఫైల్ కదలదన్న అపకీర్తి చాలాకాలంగా ఉంది. ఇక్కడి సిబ్బందే కాదు... కొందరు అధికారులు సైతం ఆమ్యామ్యాలకే అధిక ప్రాధాన్యమిస్తారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎల్ఆర్ఎస్- బీపీఎస్ దరఖాస్తులకేగాక, కొత్త లేఅవుట్లు, నూతన భవనాలకు సంబంధించి అనుమతులు పొందాలంటే చెప్పులు అరిగిపోవాల్సిందే. ఈ అపకీర్తిని తొలగించుకొనేందుకు అధికారులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ‘గ్రీన్ చానెల్’ పేరిట పాత స్కీమ్‌నే తెరపైకి తెచ్చారని స్వయంగా హెచ్ఎండీఏ సిబ్బందే వ్యాఖ్యానిస్తున్నారు. ప్లానింగ్ విభాగంలో వేళ్లూనుకొన్న అవినీతిని అడ్డుకోకుండా ఇలాంటి ప్రయోగాలు ఎన్ని చేసినా ప్రయోజనం ఉండదంటున్నారు. అక్రమాలపై ఫిర్యాదులు అందినా పట్టించుకోని ఉన్నతాధికారులు పాత స్కీమ్ అమలుకు అర్రులు చాస్తుండటం వారి చిత్తశుద్ధికి అద్దం పడుతోంది. -
మందుల బిల్లులకూ దిక్కులేదు!
సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశాఖ పరిస్థితి మరింతగా దిగజారింది. ప్రభుత్వం మందుల కొనుగోలు బిల్లులు కూడా చెల్లించలేని స్థితికి చేరింది. మందుల కొనుగోలుకు, సరఫరాకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది ఉండదని, మందులకు సంబంధించిన నిధులు గ్రీన్‌చానల్‌లో ఉన్నాయని చెప్పే సర్కారు ఇప్పుడు చేతులెత్తేసింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సరఫరా అయిన మందుల బిల్లులు ఇప్పటి వరకూ చెల్లించలేదు. సుమారు రూ.64.44 కోట్లు బకాయిలు ఉన్నా పట్టించుకోలేదు. సాధారణంగా రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ) నుంచి చెక్కులు వెళ్లిన రెండ్రోజుల్లోనే నిధులు విడుదలయ్యేవి. కానీ 2013 జూలై 29వ తేదీన ఆర్థికశాఖకు పంపిన చెక్కులకు ఇప్పటికీ అనుమతి రాలేదు. తొలుత సచివాలయంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖకు చెక్కులు వెళతాయి. అక్కడ్నుంచి చెక్కులు నగదు నిల్వల పరిశీలనకు ఆర్థికశాఖకు పంపిస్తారు. ఆర్థిక శాఖకు వెళ్లిన చెక్కులు ఇప్పటికీ రాలేదు. మందులు, శస్త్రచికిత్సల ఉపకరణాలకు సంబంధించిన 8 చెక్కులు ఆర్థికశాఖకు వెళితే ఇప్పటి వరకూ ఒక్క చెక్కుకు సంబంధించిన బిల్లుకు కూడా అనుమతి రాలేదు. దీంతో మందుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని, గతేడాది చివరి త్రైమాసికం బిల్లులకే దిక్కులేకుంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో పెట్టిన బిల్లుల పరిస్థితి ఏంటని అధికారులు వాపోతున్నారు. ఆర్థికశాఖను నిధులపై ఏపీఎంఎస్ఐడీసీ అధికారులు పలు దఫాలు అడిగినా స్పందించలేదు. భారీగా తగ్గిన కొనుగోలు ప్రభుత్వం వద్ద నిధులు లేకనో.. నిధుల వినియోగంలో పొదుపు పాటించడమో తెలియదు గానీ ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.80 కోట్లకు మందులు కొనుగోలు చేయాల్సి ఉండగా, కేవలం రూ.20 కోట్లకు మాత్రమే ఆర్డర్లు పెట్టారు. గతంలో తీసుకున్న మందులు చాలా ఉన్నాయని, వాటిలో చాలా రకాల ఔషధాలు కాలపరిమితి తీరేందుకు చేరువగా ఉన్నందున వాటిని ముందుగా వినియోగిస్తేనే కొనుగోలు చేస్తామని ఏపీఎంఎస్ఐడీసీ అధికారి అన్నట్టు తెలిసింది. అయితే వర్షాలు కురుస్తూ మలేరియా, డెంగీ, తదితర దోమకాటు జ్వరాలు ప్రబలుతున్న తరుణంలో తగినన్ని మందులు లేకపోతే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.