సాక్షి, కర్నూలు: అధికారుల అనుమతుల కోసం నెలల తరబడి వేచి చూడక్కర్లేదు. కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగక్కర్లేదు. పత్రాలన్నీ పక్కాగా ఉంటే.. ఏడు రోజుల్లోనే అనుమతి లభిస్తుంది. బిల్టర్లు, డెవలపర్లే కాదు.. సామాన్యులూ అనుమతులు పొందొచ్చు. పురపాలక సంఘాలు అందించే సేవల్లో పారదర్శకతను తీసుకొచ్చే సరికొత్త విధానానికి పురపాలక శాఖ శ్రీకారం చుట్టింది. నెలాఖరులోగా జిల్లాలో కర్నూలు కార్పొరేషన్‌తోపాటు ఆదోని, ఎమ్మిగనూరు, డోన్, నంద్యాల మునిసిపాలిటీల్లో ఆరంభమయ్యే ‘గ్రీన్ చానల్’పై సాక్షి కథనం..
స్థానిక సంస్థల నుంచి అనుమతులు తెచ్చుకోవడానికి ఇప్పటి వరకు కార్యాలయం చుట్టూ ప్రజలు ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. సమస్య చేతపట్టుకొని.. శ్రమకోర్చి వచ్చినా.. కుంటిసాకులతో అధికారులు, సిబ్బంది పనుల్లో తీవ్ర జాప్యం చేసేవారు. సామాన్యుడి నుంచి బడాబాబులు వరకు ఎంతవారైనా అనుమతులు విషయంలో అధికారుల ముందు ‘మా పని ఎంత వరకు వచ్చిందం’టూ ప్రాథేయపడాల్సి వచ్చేది. వారి దయాదాక్షిణ్యాల మీద అనుమతులు అధారపడేవి.
ఇలాంటి ఇబ్బందులు నివారించేందుకు గ్రీన్ చానల్ విధానం అమలుకు పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాజధానిలో ఇటీవలే ప్రారంభించిన ఈ విధానాన్ని రాష్ట్రవ్యాప్తంగా అన్ని మునిసిపాలిటీల్లో అమలుకు మంత్రి యోచిస్తున్నారు. మునిసిపాలిటీల్లో రెవెన్యూ, ఇంజనీరింగ్, ఆరోగ్య, పట్టణ ప్రణాళిక, పారిశుద్ధ్య విభాగాలకు దీనిని వర్తింపజేశారు. ఈ విధానం కింద నిర్ధేశించిన సేవల్లో జాప్యం జరిగితే అధికారి నుంచి అపరాధ రుసుం పొందే వీలుంటుంది. ప్రతి సమస్య పరిష్కారంలో జాప్యానికి రోజువారీ చార్జీలను వసూలు చేసుకునే అవకాశం కల్పించారు.
పని చేస్తుంది ఇలా...
గ్రీన్‌చానల్ వల్ల భవన నిర్మాణ అనుమతులకు రోజుల తరబడి నిరీక్షణ అవసరం ఉండదు. ఇకపై వారం రోజుల్లో ఎలాంటి అనుమతులైన అమోదమా? తిరస్కారమా? అన్న వివరాలు తెలుస్తాయి. ఈ ప్రక్రియలో భాగంగా భవన నిర్మాణ అనుమతులు పొందేటప్పుడు దరఖాస్తుదారుడు సమర్పించాల్సిన వివరాలను తెలియజేస్తోంది. ఎలా దరఖాస్తు చేయాలి, ఫీజు, నిర్ణీత రుసుం వసూలు తదితర వివరాలు అందిస్తోంది.
భవన నిర్మాణ వివరాలు, అనుమతులు, బ్యాంకు లింకేజీ వివరాలను సూచిస్తూ గ్రీన్ చానల్ కేంద్రం ప్రజలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటుంది. దరఖాస్తుదారుడు సంబంధిత డాక్యుమెంట్లతో గ్రీన్‌చానల్ సిబ్బంది వద్దకు వెళితే.. నిబంధనల ప్రకారం దస్త్రాన్ని రూపొందిస్తారు. నిన్నటివరకు ప్రణాళిక విభాగం అధికారులు నిర్వహించే ప్రాథమిక పరిశీలను వీరే పూర్తి చేస్తారు. అనంతరం ఆ దస్త్రాన్ని ప్రణాళిక విభాగ అధికారులు సూపర్ చెక్ చేస్తారు. ఇలా వారం రోజుల్లోగా దరఖాస్తు ఆమోదమా లేక తిరస్కారమా స్పష్టం చేస్తారు. ఆమోదిస్తే వెంటనే అందుకు సంబంధించిన ఫీజులు వసూలు చేస్తారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి పరిశీలిన, అనుమతులు జారీ పూర్తవుతుంది. తొలివిడతలో పట్టణ ప్రణాళిక విభాగానికి గ్రీన్ చానల్‌ను అనుసంధానం చేయనున్నారు.
సేవలు సులభం
పురపాలక సంఘాల్లో గ్రీన్ చానల్ అమలుతో సేవల్లో పారదర్శకత ఉంటుంది. వేగంగా దరఖాస్తులు పరిశీలన జరుగుతుంది. ఆన్‌లైన్ ద్వారా ధ్రువపత్రాలు జారీ ఉంటుంది. అలాగే మునిపిపాలిటీల్లో ఆదాయమూ పెరిగే అవకాశం ఉంది.
- మురళికృష్ణ,
పురపాలక ప్రాంతీయ సంచాలకులు
మునిసిపాలిటీల్లో గ్రీన్ చానల్
Published Wed, Feb 12 2014 3:09 AM | Last Updated on Sat, Sep 2 2017 3:35 AM
Advertisement