సాక్షి, హైదరాబాద్: ఆరోగ్యశాఖ పరిస్థితి మరింతగా దిగజారింది. ప్రభుత్వం మందుల కొనుగోలు బిల్లులు కూడా చెల్లించలేని స్థితికి చేరింది. మందుల కొనుగోలుకు, సరఫరాకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది ఉండదని, మందులకు సంబంధించిన నిధులు గ్రీన్‌చానల్‌లో ఉన్నాయని చెప్పే సర్కారు ఇప్పుడు చేతులెత్తేసింది. ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరిలో సరఫరా అయిన మందుల బిల్లులు ఇప్పటి వరకూ చెల్లించలేదు. సుమారు రూ.64.44 కోట్లు బకాయిలు ఉన్నా పట్టించుకోలేదు. సాధారణంగా రాష్ట్ర మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) నుంచి చెక్కులు వెళ్లిన రెండ్రోజుల్లోనే నిధులు విడుదలయ్యేవి. కానీ 2013 జూలై 29వ తేదీన ఆర్థికశాఖకు పంపిన చెక్కులకు ఇప్పటికీ అనుమతి రాలేదు. తొలుత సచివాలయంలోని స్టేట్‌బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ శాఖకు చెక్కులు వెళతాయి. అక్కడ్నుంచి చెక్కులు నగదు నిల్వల పరిశీలనకు ఆర్థికశాఖకు పంపిస్తారు. ఆర్థిక శాఖకు వెళ్లిన చెక్కులు ఇప్పటికీ రాలేదు. మందులు, శస్త్రచికిత్సల ఉపకరణాలకు సంబంధించిన 8 చెక్కులు ఆర్థికశాఖకు వెళితే ఇప్పటి వరకూ ఒక్క చెక్కుకు సంబంధించిన బిల్లుకు కూడా అనుమతి రాలేదు. దీంతో మందుల సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని, గతేడాది చివరి త్రైమాసికం బిల్లులకే దిక్కులేకుంటే ఈ ఏడాది ఏప్రిల్‌లో పెట్టిన బిల్లుల పరిస్థితి ఏంటని అధికారులు వాపోతున్నారు. ఆర్థికశాఖను నిధులపై ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులు పలు దఫాలు అడిగినా స్పందించలేదు.
భారీగా తగ్గిన కొనుగోలు
ప్రభుత్వం వద్ద నిధులు లేకనో.. నిధుల వినియోగంలో పొదుపు పాటించడమో తెలియదు గానీ ఈ సంవత్సరం మొదటి త్రైమాసికంలో రూ.80 కోట్లకు మందులు కొనుగోలు చేయాల్సి ఉండగా, కేవలం రూ.20 కోట్లకు మాత్రమే ఆర్డర్లు పెట్టారు. గతంలో తీసుకున్న మందులు చాలా ఉన్నాయని, వాటిలో చాలా రకాల ఔషధాలు కాలపరిమితి తీరేందుకు చేరువగా ఉన్నందున వాటిని ముందుగా వినియోగిస్తేనే కొనుగోలు చేస్తామని ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారి అన్నట్టు తెలిసింది. అయితే వర్షాలు కురుస్తూ మలేరియా, డెంగీ, తదితర దోమకాటు జ్వరాలు ప్రబలుతున్న తరుణంలో తగినన్ని మందులు లేకపోతే పరిస్థితి విషమిస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
మందుల బిల్లులకూ దిక్కులేదు!
Published Mon, Aug 19 2013 12:23 AM | Last Updated on Fri, Sep 1 2017 9:54 PM
Advertisement