జూబ్లీహిల్స్‌: లైసెన్స్‌డ్‌ గన్‌కు పని చెప్పమంటావా..? | Property Disputes: Threat To Global Hospital Chairman Kancharla Ravindranath | Sakshi
Sakshi News home page

జూబ్లీహిల్స్‌: లైసెన్స్‌డ్‌ గన్‌కు పని చెప్పమంటావా..?

Jun 30 2021 8:46 AM | Updated on Jun 30 2021 4:13 PM

Property Disputes: Threat To Global Hospital Chairman Kancharla Ravindranath - Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: తాము కోరుకున్న విధంగా ఆస్తి పంపకాలు చేయకపోతే అంతం చేస్తామంటూ గ్లోబల్‌ హాస్పిటల్స్‌ గ్రూప్‌ ఫౌండర్‌  చైర్మన్, డైరెక్టర్‌ డా.కంచర్ల రవీంద్రనాథ్‌ను బెదిరించిన వ్యవహారంలో ఆయన అల్లుడు, వియ్యంకుడిపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 25లో ఉంటున్న డా.రవీంద్రనాథ్‌కు ఇటీవల ఆస్తి పంపకాల్లో కుటుంబ సభ్యులతో గొడవలు జరుగుతున్నాయి. తన ఆస్తుల్లో సుమారు 70 శాతం గ్లోబల్‌ యూనివర్సిటీ ఫౌండేషన్‌కు ఇస్తానని డాక్టర్‌ రవీంద్రనాథ్‌ చెప్పడంతో కుటుంబ సభ్యులు అభ్యంతరం తెలిపారు.

ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి ఎమ్మెల్యే కాలనీలో నివసించే అల్లుడు పొట్లపల్లి సూరజ్‌తేజ్‌ జూబ్లీహిల్స్‌లోని డాక్టర్‌ రవీంద్రనాథ్‌ ఇంటికి వచ్చాడు. రావడంతోనే ఇద్దరి మధ్య ఆస్తుల విషయమై గొడవ జరిగింది. తాము చెప్పినట్లు ఆస్తులను సమానంగా పంచకపోతే అంతు చూస్తానని, తన వద్ద లైసెన్స్‌డ్‌ గన్‌ కూడా ఉందని దానికి పని చెప్పమంటావా అంటూ బెదిరించాడు. చెన్నైలో ఉంటున్న తన కుమారుడి మామ(వియ్యంకుడు) పరుచూరి రాజారావుతో చేతులు కలిపిన అల్లుడు సూరజ్‌తేజ్‌ కొంత కాలంగా తన ఫోన్‌ను కూడా హ్యాక్‌ చేసి తన కదలకలను గమనిస్తున్నాడని మూడో వ్యక్తికి తాను మాట్లాడుతున్న విషయాలను చేరవేస్తున్నారన్నాడు.

వారి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ డాక్టర్‌ రవీంద్రనాథ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. తనను చంపేందుకు కుట్ర జరుగుతోందని, తన అడ్డు తొలగించుకునేందుకు అల్లుడు, వియ్యంకుడు కిరాయి మనుషులను ఏర్పాటు చేశారని ఆరోపించాడు. మూడు నెలల్లోగా ఆస్తుల పంపకాలు చేయకపోతే హత్య చేసేందుకు కూడా వెనుకాడబోమని బెదిరింపులకు పాల్పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు.  పోలీసులు నిందితుడు సూరజ్‌తేజ్, వియ్యంకుడు రాజారావులపై కేసు నమోదు చేసి గాలింపు చేపట్టారు. 

చదవండి: బల్దియా చరిత్రలోనే మొదటిసారి.. ప్రతిపక్షాల విమర్శలు
విచ్చలవిడిగా డ్రోన్ల వినియోగం.. హైదరబాద్‌కూ ముప్పు! 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement