గుండెమార్పిడి శస్త్రచికిత్సల్లో కొత్త పుంతలు | Heart Transplantation Advanced Procedures | Sakshi
Sakshi News home page

Heart Transplantation: గుండెమార్పిడి శస్త్రచికిత్సల్లో కొత్త పుంతలు

Published Sun, Apr 24 2022 12:43 PM | Last Updated on Sun, Apr 24 2022 12:46 PM

Heart Transplantation Advanced Procedures - Sakshi

గుండె మార్పిడి శస్త్రచికిత్సల్లో కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. మానవుల నుంచి మానవులకు గుండెమార్పిడి ఎప్పటినుంచో జరుగుతున్నదే. కానీ... ఓ వ్యక్తి బ్రెయిన్‌డెడ్‌ అయినప్పుడు మాత్రమే ఇది సాధ్యం. అందుకే జంతువుల నుంచి కూడా గుండె సేకరించి, మనుషులకు అమర్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మొదట్లో ఓ చింపాంజీ నుంచి గుండె సేకరించి, ఓ చిన్నారికి అమర్చగా ఆమె18 నెలలు బతికింది. అలాగే ఇటీవల పంది నుంచి గుండె సేకరించి అమర్చిన వ్యక్తి రెండు నెలల పాటు జీవించాడు. ఇది కొద్దిపాటి పురోగతే. కానీ మరింత ప్రగతి సాధించేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. గుండెమార్పిడి శస్త్రచికిత్సల్లో కొత్తపుంతలు చోటు చేసుకుంటున్నాయి. అవేమిటో చూద్దాం. 

గుండెమార్పిడి అనే మాట వినగానే భయాందోళన కలిగే రోజులు పోయాయి. గుండె పూర్తిగా విఫలమైన తర్వాత... ఇక అన్ని మార్గాలూ మూసుకుపోయినప్పుడు అత్యుత్తమ చివరిప్రయత్నంగా గుండె మార్పిడి చికిత్సను ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఏటా సుమారుగా మూడువేల గుండె మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయి. అయితే డిమాండ్‌కు అనుగుణంగా దాతలు అందుబాటులో లేనందున అనేకమంది బాధితులు గుండె మార్పిడి కోసం వేచి ఉండాల్సి వస్తోంది. గుండెమార్పిడి శస్త్రచికిత్సల పట్ల ప్రజల్లో సరైన అవగాహన లేనందువల్ల అవసరమైనప్పుడు గుండె మార్పిడిని ఆశ్రయించడానికీ లేదా అవయవ దాతలుగా నమోదు కావడానికి ఎక్కువమంది ముందుకు రావడం లేదు.

గుండెమార్పిడి పురోగతిలో రకరకాల మైలురాళ్లివి... 
∙డొనేషన్‌ ఆఫ్టర్‌ సర్క్యులేటరీ డెత్‌: మామూలుగా అవయవ దానం చేయాలంటే మెదడు చనిపోయినప్పటికీ గుండె కొట్టుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది సాధ్యం. కొన్నిసార్లు  మెదడు చనిపోయిన తర్వాత అవయవాల్ని దానం కోసం బయటకు తీసే లోపలే గుండె కొట్టుకోవడం ఆగిపోతే మాత్రం ఆ అవయవాలు దానానికి పనికిరావు. ఈ సమస్యను ఎదుర్కోవడానికి అమల్లోకి వచ్చిన ప్రక్రియే ‘డొనేషన్‌ ఆఫ్టర్‌ సర్క్యులేటరీ డెత్‌’! దీనివల్ల అవయదానం చేసేటప్పటికి గుండె ఆగిపోయినప్పటికీ అవయవాల్ని దానం కోసం వినియోగించుకోగలుగుతారు. 

మెకానికల్‌ సర్క్యులేటరీ సపోర్ట్‌: గుండెమార్పిడి అవసరమైన వ్యక్తులలో గుండె బాగా బలహీనంగా ఉంటుంది. అందువల్ల శరీరంలోని అన్ని అవయవాలకు రక్తసరఫరా తక్కువగా ఉంటుంది.  ఈ కారణంగా గుండె మార్పిడి తర్వాత కూడా గుండె తప్ప మిగతా అవయవాలు ఫెయిల్‌ అయ్యే అవకాశం ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేందుకు గుండె మార్పిడి శస్త్రచికిత్సకు ముందుగా... గుండెకి మరింత ఆలంబనగా ఉండేందుకు కొన్ని ఉపకరణాలు ఉపయోగపడతాయి. ఇవే‘మెకానికల్‌ సర్క్యులేటరీ సపోర్ట్‌’ పరికరాలు. వీటిలో ఐ.ఏ.బి.పి., ఇంపెల్లా, ఎక్మో, ఎల్‌ వాడ్లు వంటివి ప్రధానమైనవి. వైఫల్యం చాలా ఎక్కువగా ఉన్న గుండెలకు మెకానికల్‌ సపోర్ట్‌ ఇవ్వడం ద్వారా ఈ పరికరాలు గుండె మార్పిడి ప్రక్రియ సఫలమయ్యే అవకాశాన్ని మరింత పెంచుతాయి. 

ఏబీఓ ఇన్‌కంపాటిబుల్‌ ట్రాన్స్‌ప్లాంట్‌: సాధారణంగా గుండెమార్పిడికి ముందు డోనార్‌ వయసు, జెండర్, బరువు జాగ్రత్తగా పరిశీలిస్తారు. వీటితోపాటు బ్లడ్‌ గ్రూప్‌ కూడా మ్యాచ్‌ అయ్యే  విధంగా దాతను ఎంపిక చేసుకోవడం అవసరం. అయితే ఇప్పుడిప్పుడే బ్లడ్‌ గ్రూప్‌ మ్యాచ్‌ కాకపోయినా ట్రాన్స్‌ప్లాంట్‌ చేసే అవకాశం ఉందని వైద్యులు గుర్తిస్తున్నారు. 

ప్రయాణంలోనూ బ్రతికి ఉండే గుండె: సాధారణంగా దాత నుంచి తీసుకున్న గుండెను స్వీకర్త దగ్గరికి తీసుకు వెళ్లడానికి ఐస్‌ బాక్స్‌ను ఉపయోగిస్తారు. ఇందులో స్వీకర్తకు అమర్చేందుకు 6 గంటల వ్యవధి మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ‘ఆర్గాన్‌ కేర్‌ సిస్టమ్‌’ అనే కీలక ఉపకరణం అందుబాటులోకి వచ్చింది. దాంతో దాత నుంచి బయటకు తీసిన తర్వాత కూడా గుండె కొట్టుకుంటూనే ఉంటుంది. అందువల్ల ఎక్కువ సమయం పాటు గుండె బతికే ఉంటుంది. 

ఇతర జీవజాతుల నుంచి గుండె మార్పిడి: మనుషుల నుంచి సేకరించే అవయవాలు గుండె మార్పిడికి సరిపోకపోవడంతో ఇతర జీవజాతుల నుంచి స్వీకరించిన గుండెని మనిషికి అమర్చడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. 

ఒకేసారి రెండు ట్రాన్స్‌ప్లాంట్లు: అవసరాన్ని బట్టి కొంతమంది రోగుల్లో గుండెతోపాటు ఊపిరితిత్తులనూ మార్చాల్సి రావచ్చు. మరికొంతమందిలో గుండెతోపాటుగా కిడ్నీ లేదా లివర్‌  మార్చాల్సిన అవసరం పడవచ్చు. గతంలో పేషెంట్స్‌కి ఒకేసారి రెండు ట్రాన్స్‌ప్లాంట్లు చేయడం చాలా కష్టసాధ్యమయ్యేది. కానీ ఇప్పుడు వేర్వేరు వైద్యవిభాగాలకు చెందిన ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్లు కలిసి పనిచేయడంతో ఇలాంటి ట్రాన్స్‌ప్లాంట్లూ సులువవుతున్నాయి.  

రిజెక్షన్‌ నివారణకు కొత్త పద్ధతులు
సాధారణంగా బయట నుంచి వచ్చిన కొత్త గుండెను స్వీకర్త శరీరం అంత తేలిగ్గా అంగీకరించదు. అది తన సొంత అవయవం కాదంటూ నిరాకరిస్తూ ఉంటుంది. దీన్ని వైద్యపరిభాషలో ‘రిజెక్షన్‌’ అంటారు. దీన్ని నివారించడానికి ఇప్పుడు కొత్త కొత్త మందులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటిలో సీఎస్‌ఐ ( సైరోలిమస్, టాక్రోలిమస్‌ వంటివి), ఎంటార్‌ ఇన్హిబిటార్స్, వాటితోపాటు స్టెరాయిడ్స్‌ కూడా ముఖ్యమైనవి. ఈ మధ్యనే చెక్‌–పాయింట్‌ మాలిక్యూల్స్‌ కూడా ‘ట్రాన్‌ప్లాంట్స్‌ రిజెక్షన్‌’ని నివారించడానికి ఉపయోగిస్తున్నారు. ఇవి కాకుండా థైమస్‌ గ్రంథి పనిచేయని పిల్లల్లో హార్ట్‌ ట్రాన్స్‌ప్లాంట్‌తోపాటు అదే దాత నుంచి సేకరించిన థైమస్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ కూడా చేసినట్లయితే రిజెక్షన్‌ తక్కువగా ఉంటుందని పరిశోధనల ద్వారా తెలుస్తోంది.

రిజెక్షన్‌ని గుర్తించడానికి తేలిక మార్గాలు: గతంలో గుండెమార్పిడి తర్వాత రిజెక్షన్‌ని గుర్తించడానికి... దాత గుండె బయాప్సీ మాత్రమే ఒకే ఒక మార్గం. అయితే ఇప్పుడు కొత్త కొత్త మార్గాలు అందుబాటులోకి వస్తున్నాయి. జీన్‌ ఎక్స్‌ప్రెషన్‌ ప్రొఫైల్‌ (జీఈపీ) ద్వారా ఓ మామూలు రక్తపరీక్షతోనే రిజెక్షన్‌ను గుర్తించవచ్చు. అది మాత్రమే కాకుండా దాత మూత్రం, రక్తంలో  ‘సెల్‌ ఫ్రీ డిఎన్‌ఏ’ గుర్తించడం ద్వారా కూడా రిజెక్షన్‌ని తెలుసుకోవచ్చు.

ఇమ్యూన్‌ టాలరెన్స్‌: మన రోగనిరోధక శక్తే... మనలోకి వచ్చిన కొత్త అవయవాన్ని నిరాకరిస్తూ ఉంటుంది. ఇలా జరగకుండా చూసేందుకు ట్రాన్స్‌ప్లాంట్‌ సమయంలో ఇమ్యూనిటీని తగ్గించే మందులు వాడుతుంటారు. ఇలాంటి మందులేమీ వాడకుండానూ, అలాగే రిజెక్షన్‌ కూడా రాకుండా చూసే పద్థతులను ‘ఇమ్యూన్‌ టాలరె¯Œ ్స’ అని పిలుస్తారు. దీన్ని సాధించడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. దాత తాలూకు బోన్‌ మ్యారోను కూడా గుండెతో ట్రాన్స్‌ప్లాంట్‌ చేయడం వల్ల కూడా‘ఇమ్యూన్‌ టాలరె¯Œ ్స’కి అవకాశముంటుందని ఇటీవలి కొన్ని కొత్త పరిశోధనల వల్ల తెలుస్తోంది. 

ఇప్పుడు సక్సెస్‌ రేటూ ఎక్కువే... అందుకు కారణాలివి... 
మన దేశంలోనూ గతంలో పోలిస్తే ఇప్పుడు మరింత మెరుగ్గా, మరింత ఎక్కువ విజయవంతంగా గుండెమార్పిడి శస్త్రచికిత్సలో జరుగుతున్నాయి. ఈ శస్త్రచికిత్స తర్వాత దాదాపు 88 శాతం మంది మొదటి ఏడాది బతికే అవకాశం ఉంటుంది.  అంతేకాదు గుండెస్వీకర్తల్లో దాదాపు 75 శాతం మంది ఐదేళ్లకు పైగా జీవించడం విశేషం. ఈ సక్సెస్‌ రేటు ఇంత మెరుగ్గా ఉండటానికి అనేక కారణాలు దోహదపడుతున్నాయి. అందులో ముఖ్యమైనవి... గతంలో పోలిస్తే మరింత మెరుగైన రీతిలో జరుగుతున్న శస్త్రచికిత్స ప్రక్రియలూ, అలాగే  శస్త్ర చికిత్సల తరువాత వాడే కొత్త మందులు ప్రధానమైన కారణాలు. 

తగ్గుతున్న ఖర్చులు: గతంలో గుండెమార్పిడి శస్త్రచికిత్స అంటే... దాదాపు 35 నుంచి 40 లక్షలు అయ్యేవి. ఇప్పుడీ ప్రక్రియ అనేక ఆసుపత్రుల్లోకి అందుబాటులో రావడంతో రూ. 20 లక్షలకే చేయడం సాధ్యపడుతోంది. దీంతోపాటు ట్రాన్స్‌ప్లాంట్‌ అనంతర చికిత్స తాలూకు ఖర్చులూ కొంతమేర తగ్గడంతో... ఇది మరింత ఎక్కువమంది బాధితులకు అందుబాటులోకి వచ్చే అవకాశముంది. ఇలా కొత్తపురోగతులు వస్తుండటంతో ఖర్చు తగ్గుతుండటం అనేది చాలామంది బాధితులకు కనిపిస్తున్న ఓ భవిష్యత్‌ ఆశారేఖ.
-డా. ఎంఎస్‌ఎస్‌ ముఖర్జీ, సీనియర్‌ కన్సల్టెంట్‌ కార్డియాలజిస్ట్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement