32 కిలోమీటర్లు.. 29 నిమిషాలు.. ఓ జర్నీ!
గుర్గావ్ నుంచి ఢిల్లీకి ఉన్న దూరం.. దాదాపు 32 కిలోమీటర్లు. కానీ, రోడ్డు మార్గంలో వెళ్లాలంటే కనీసం గంటన్నర నుంచి రెండు గంటల వరకు పడుతుంది. కానీ అరగంట కంటే తక్కువ సమయంలోనే ఆ దూరాన్ని దాటుకెళ్లి ఓ 16 ఏళ్ల కుర్రాడికి ప్రాణదానం చేశారు. గుర్గావ్ లోని ఎస్కార్ట్ ఆస్పత్రి నుంచి ఢిల్లీలోని ఎస్కార్ట్ ఆస్పత్రికి గుండెను తరలించాల్సి వచ్చింది. 30 ఏళ్ల వ్యక్తి ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ స్థితికి చేరుకున్నాడు. అతడి గుండెను దానం చేసేందుకు కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. దాంతో ఆస్పత్రి వర్గాలు వెంటనే గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేయాలని గుర్గావ్ పోలీసులను కోరాయి.
వెంటనే.. ఎప్పుడూ అత్యంత రద్దీగా ఉండే ఆ మార్గం మొత్తం ఖాళీ అయిపోయింది. 23 మంది పోలీసు సిబ్బందితో కూడిన రెండు పోలీసు వాహనాలను అంబులెన్సుతో పాటు పంపారు. దారిలో ఉన్న మొత్తం అందరు ట్రాఫిక్ సిబ్బందికి గ్రీన్ కారిడార్ విషయాన్ని తెలియజేశారు. దాంతో కేవలం 29 నిమిషాల్లోనే అంబులెన్సు గమ్యానికి చేరుకుంది. అది వెళ్లే మార్గంలో మొత్తం అన్నీ గ్రీన్ సిగ్నళ్లే ఉంచారు. ఇంతకుముందు చెన్నై బెంగళూరు నగరాల మధ్య కూడా ప్రత్యేక విమానంలో పంపారు.