జీజీహెచ్‌లో.. మరో అద్భుతం
* రెండోసారి గుండె మార్పిడి ఆపరేషన్
* చరిత్ర సృష్టించిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే బృందం
* జాతీయస్థాయిలో ఇనుమడించిన ఆస్పత్రి ప్రతిష్ట
* సహకరించని ప్రభుత్వం.. సహృదయంతో ముందుకొస్తున్న దాతలు
అరవయ్యేళ్ల సుదీర్ఘ చరిత్ర గల గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల ప్రతిష్ట మరోసారి ఆకాశమంత ఎత్తుకు వెళ్లింది. ఈ ఆస్పత్రిలో రెండోసారిగా మంగళవారం నిర్వహించిన గుండె మార్పిడి శస్త్రచికిత్స సర్వత్రా చర్చనీయాంశమైంది. రూ.20 లక్షల వ్యయం అయ్యే శస్త్రచికిత్సను పేద మహిళకు ఒక్కపైసా ఖర్చు లేకుండా ఉచితంగా నిర్వహించిన డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే బృందం కృషికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. ఈ సత్కార్యానికి ప్రభుత్వం వీసమెత్తు సహకారం అందించకపోయినా.. దాతలు ముందుకొచ్చి సాయమందించారు.
సాక్షి, గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాలలో మంగళవారం జరిగిన గుండెమార్పిడి ఆపరేషన్‌తో గుంటూరు జీజీహెచ్ మరోసారి జాతీయ స్థాయిలో మార్మోగింది. డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే బృందం మరోసారి ఈ అద్భుతం సష్టించింది. ఒక్కపైసా ఖర్చు లేకుండా సుమారు రూ.20 లక్షలు ఖరీదు చేసే గుండె మార్పిడి ఆపరేషన్ రెండోసారి నిర్వహించింది.
దేశంలోనే ఐదో ఆస్పత్రిగా ఖ్యాతి...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుండె మార్పిడి ఆపరేషన్ చేసిన మొట్టమొదటి ప్రభుత్వ ఆస్పత్రిగా గుంటూరు జీజీహెచ్ రికార్డు సృష్టించింది. దేశంలో నాలుగు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు గుండె మార్పిడి ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఐదో ఆస్పత్రిగా గుంటూరు ఆసుపత్రి చరిత్ర సృష్టించింది. గుండె మార్పిడి ఆపరేషన్లు విజయవంతంగా జరగడంతో తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకుంది. 60 ఏళ్ల సుదీర్ఘ వైద్య చరిత్ర ఉన్న ఈ ఆసుపత్రికి 2015 మార్చికి ముందు గుండె ఆపరేషన్లు జరగడమే గగనంగా ఉండేది. ఈ తరుణంలో తాను చదువుకున్న గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా ఉన్న జీజీహెచ్‌లో నిరుపేద రోగులకు సేవ చేయాలనే స‘హృదయం’తో ప్రముఖ కార్డియో థొరాసిక్ సర్జన్ డాక్టర్ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే ఉచితంగా గుండె ఆపరేషన్లు చేసేందుకు ముందుకు వచ్చారు. ఏడాది కాలంలో 250 వరకు నిరుపేద గుండెలకు ఊపిరిలూదారు. ప్రభుత్వం ఎలాంటి నిధులూ మంజూరు చేయకపోయినా దాతల సహకారం, సొంత ఖర్చులతో మే 20న గుండె మార్పిడి ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు.
సన్మానాలకే పరిమితం.. నిధుల మంజూరు శూన్యం..
గుండెమార్పిడి ఆపరేషన్‌తో డాక్టర్ గోఖలేకు సన్మానాలు చేసిన సీఎం, మంత్రులు ప్రభుత్వం తరఫున గుండె మార్పిడి ఆపరేషన్‌ల కోసం నిధులు మంజూరు చేయకపోవడం దారుణమైన విషయం. అయినా దాతలు ముందుకు రావడంతో ఎవ్వరూ ఊహించని విధంగా రెండో గుండె మార్పిడి ఆపరేషన్ సైతం చేపట్టారు. గుంటూరు జీజీహెచ్‌లో ఉన్న రోగికి నెల్లూరులో గుండెను సేకరించి ఏకంగా హెలికాప్టర్‌లో తీసుకొచ్చి మరీ ఆపరేషన్ నిర్వహించడం గొప్ప విషయం. జీజీహెచ్‌లో డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి ఉచితంగా కీళ్ల మార్పిడి ఆపరేషన్లు, డాక్టర్ గొంది శివరామకృష్ణ కిడ్నీ మార్పిడి ఆపరేషన్లు చేస్తున్నారు. జీజీహెచ్ న్యూరాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ ఎన్‌వీ సుందరాచారి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా స్ట్రోక్ యూనిట్‌ను ఏర్పాటు చేసి నిరుపేద రోగులకు మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నారు.
దాతల సహకారం...
ఐ డొనేట్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు నవీన్ ఈ మహాయజ్ఞంలో తామూ భాగస్వాములు కావాలనే సదుద్దేశంతో రెండు గుండె మార్పిడి ఆపరేషన్‌లకూ 15 మందితో రక్తదానం చేయించారు. హెలీప్యాడ్ నుంచి జీజీహెచ్‌కు గుండెను చేర్చేందుకు వేదాంత హాస్పిటల్ అధినేత డాక్టర్ చింతా రామకృష్ణ ప్రత్యేక అంబులెన్స్‌ను సమకూర్చారు. దాతలు చేస్తున్న సహాయాన్ని చూసైనా ప్రభుత్వం కళ్లు తెరిచి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో గుండెమార్పిడి ఆపరేషన్లను చేర్చడమో లేదా, దీనికి సరిపడా నిధులను ప్రత్యేకంగా విడుదల చేయడమో చేయాలని వైద్య నిపుణులు, ప్రజలు కోరుతున్నారు.