సాక్షి, హైదరాబాద్/కరీంనగర్ క్రైం/ కోరుట్ల రూరల్: తీవ్రమైన హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడుతున్న 56 ఏళ్ల వ్యక్తికి 17 ఏళ్ల యువకుని గుండెను అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా అమర్చారు. శనివారం ఈ గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేయగా.. ప్రస్తుతం బాధితుని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై అతనికి చికిత్స అందిస్తున్నారు. విజయవాడకు చెందిన 56 ఏళ్ల వ్యక్తికి గుండె పనితీరు మందగించింది. ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరగడంతో శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, తరచూ బీపీ లెవల్స్ పడిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు.
వారం క్రితం ఆయన అపోలో ఆస్పత్రికి చెందిన ప్రముఖ గుండె మార్పిడి నిపుణుడు డాక్టర్ ఏజీకే గోఖలేని సంప్రదించారు. బాధితుడిని పరీక్షించిన డాక్టర్ గోఖలే.. గుండె మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. చికిత్సకు బాధితుని తరపు బంధువులు అంగీకరించడంతో ఆ మేరకు అవయవదానం కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేశారు. ఇదే సమయంలో ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కరీంనగర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవీన్ కుమార్ అనే 17 ఏళ్ల యువకుడు బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకున్నట్లు జీవన్‌దాన్‌కు సమాచారం అందింది.
అతని అవయవాలను దానం చేసేందుకు బంధువులు అంగీకరించడంతో అప్పటికే జూబ్లిహిల్స్ అపోలోలో గుండె మార్పిడి చికిత్స కోసం ఎదురు చూస్తున్న బాధితునికి సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న అపోలో వైద్యులు రెండు బృందాలుగా ఏర్పడి.. ఒక బృందం దాత నుంచి గుండెను సేకరించేందుకు శుక్రవారం సాయంత్రం కరీంనగర్ వెళ్లగా, మరో బృందం ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేసింది.
శనివారం ఉదయం దాత నుంచి గుండెను సేకరించి.. కేవలం మూడు గంటల వ్యవధిలో ప్రత్యేక అంబులెన్స్‌లో కరీంనగర్ నుంచి హైదరాబాద్ అపోలోకు గుండెను తరలించారు. పది మందితో కూడిన వైద్య బృందం ఐదున్నర గంటల పాటు శ్రమించి బాధితునికి విజయవంతంగా గుండెను అమర్చింది. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ గోఖలే స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment