jeevandan
-
పెళ్లి నాటి ప్రమాణం.. అవయవదానం
నిడదవోలు: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్యాణ మండపంలో గురువారం జరిగిన ఓ వివాహ వేడుక అవయవదాన హామీ పత్రాల సమర్పణకు వేదికగా మారింది. వధూవరులు సజీవరాణి, సతీష్‌కుమార్‌తోపాటు 66 మంది తమ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు. విశాఖలోని అఖిల భారత అవయవ, శరీరదాతల సంఘం, సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన అవయవదాన ఆవశ్యకతను తెలియజేస్తూ వివాహ వేదిక వద్ద ప్రత్యేక శిబిరం ఏర్పాటుచేశారు. ట్రస్ట్ ప్రతినిధుల సూచనల మేరకు వధూవరులు, వారి బంధుమిత్రులు 66 మంది అవయవదానం చేస్తామని హామీ పత్రాలపై సంతకాలు చేసి ట్రస్ట్ చైర్çపర్సన్ గూడూరు సీతామహలక్ష్మికి అందజేశారు. ఈ పత్రాలను ప్రభుత్వ సంస్థ జీవన్‌దాన్‌కు అందిస్తామని సీతామహలక్ష్మి తెలిపారు. తాము ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 42 వేల మంది నుంచి అవయవదాన హామీ పత్రాలను స్వీకరించామని చెప్పారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ విద్యార్థుల బోధన అవసరాల కోసం 2007లో 35 మృతదేహాలను అప్పగించిన తర్వాత అవయవదాన హామీ పత్రాల ఉద్యమాన్ని చేపట్టామని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 35 మెడికల్ కళాశాలలకు 400 భౌతికదేహాలను అందజేశామన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి ద్వారా 18 మందిని బతికించవచ్చని వివరించారు. అవయవదానం చేసిన వ్యక్తుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబంలో ఒకరికి క్లాస్–4 ఉద్యోగం కల్పించినా మరింత మంది అవయవదానం చేయడానికి ముందుకు వస్తారన్నారు. -
జీవప్రదాతలు పుస్తకావిష్కరణ
జీవన్ దాన్, నిమ్స్ హైదరాబాద్ విభాగంలో, సదాశయఫౌండేషన్ (గోదావరిఖని, పెద్దపల్లి జిల్లా) ఆధ్వర్యంలో తీసిన జీవప్రదాతలు అనే ప్రత్యేక సంచికను గురువారం ఆవిష్కరించారు. డాక్టర్ స్వర్ణలత (జీవన్ దాన్ ఇంచార్జ్) పుస్తకావిష్కరణ చేశారు. ఈ పుస్తకంలో అవయవ, శరీరదానం గురించి విపులంగా వివరించారు. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా దీటి వెంకటస్వామి (సెంట్రల్ ఫిల్మ్ సెన్సార్ బోర్డు మెంబెర్) హాజరయ్యారు. ఈ సందర్భంగా సదాశయ ఫౌండేషన్ గత 13సంవత్సరాలుగా చేస్తున్న కృషికి అభినందనలు తెలిపారు. 500 నేత్రదానాలు, 70 శరీర, 65 అవయవదానాలు చేయడం అసాధారణమైన విషయమని పేర్కొన్నారు. పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షుడు శ్రావణ్ కుమార్, సెక్రటరీ లింగమూర్తి, సభ్యులు పాల్గొన్నారు. -
ఒకరి మరణం ఆరుగురికి పునర్జననం..!
మరణమంటే.. చావు! భౌతికంగా ఈ లోకాన్ని వీడి, పంచభూతాల్లో కలవడం. మనలో అనేకమందికి తెలిసిన అర్థం ఇదే. మరణమంటే.. పునర్జన్మ!! ఖమ్మం నగరానికి చెందిన ఓ సాధారణ గృహిణి మాత్రం.. ఇలా కొత్త అర్థాన్నిచ్చారు. ఖమ్మంవ్యవసాయం: ‘‘మరణమంటే.. అనేకమంది అనుకుంటున్నట్టుగా ‘చావు’ మాత్రమే కాదు. మరణమంటే.. పునర్జన్మ..! మరణిస్తూనే.. మరికొందరికి ప్రాణం పోయడం. వారి దేహంలో భాగమవడం. ఇదే పునర్జన్మ’’ అంటున్నారు పసుమర్తి స్మిత. ఎవరీమె..? ఏం చేసింది..? వీటికి జవాబులు కావాలనుకుంటే.. అసలేం జరిగిందో తెలుసుకోవాల్సిందే. ♦ ఆయన పేరు పసుమర్తి వేణు. ఖమ్మం నగరంలోని గాంధీచౌక్‌లోగల స్నేహ జ్యూయలరీ షాప్ యజమాని, వ్యాపార ప్రముఖుడిగా వేణుకు మంచి గుర్తింపు ఉంది. ఆయనకు భార్య స్మిత, కూతురు స్నేహ ఉన్నారు. ఆ ముగ్గురిదీ ముచ్చటైన కుటుంబం. ♦ హాయిగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా భయంకరమైన కల్లోలం. ఈ నెల 23న వేణు ఆకస్మికంగా తీవ్ర అస్వస్థుడయ్యారు. స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు. ♦ వేణు–స్మితది పాతికేళ్ల దాంపత్యం. ఇన్నేళ్లపాటు తనను ప్రాణప్రదంగా చూసుకున్న జీవిత భాగస్వామి ఒక్కసారిగా దూరమయ్యాడన్న చేదు నిజాన్ని విని ఆమె తట్టుకోలేకపోయారు. గుండె పగిలినంత పనైంది. ఆ తల్లీబిడ్డలను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. ♦ మన మనిషి ఎవరైనా అసాధారణ పరిస్థితిలో చనిపోతే... సాధారణంగా పోస్టుమార్టానికి అంగీకరించం. కానీ, ఈ ఇల్లాలు స్మిత అలా కాదు. అంత బాధలోనూ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. భౌతికంగా ఈ లోకాన్ని వీడిని తన భర్త ద్వారా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరికొందరికి బతుకును ఇవ్వాలనుకున్నారు. ♦ వెంటనే, తన స్వంత ఖర్చుతో భర్తను అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రభుత్వ పథకం ‘జీవన్‌దాన్’ కింద తన భర్త అవయవాలను దానం చేసేందుకు సిద్ధపడ్డారు. నిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం వేణు దేహం నుంచి రెండు కళ్లు, గుండె, లివర్, రెండు కిడ్నీలను వైద్యులు సేకరించారు. సరిగ్గా ఇవే అవయవాల వైఫల్యంతో దాదాపుగా ప్రాణాపాయ స్థితికి చేరిన మరో ఆరుగురికి అమర్చారు. ఆ ఆరుగురూ రేపోమాపో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆస్పత్రి నుంచి బయటికొస్తారు. ఆ ఆరుగురిలో వేణు బతికుంటారు..! ఇక్కడ పునర్జన్మ పొందింది ఆ ఆరుగురు మాత్రమే కాదు..!! పసుమర్తి వేణు కూడా...!!! ఆయన కళ్లు ఈ లోకాన్ని చూస్తాయి. ఆయన అవయవాలు ఇతరుల దేహాల్లో చక్కగా పనిచేస్తాయి. ఈ విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు అనేకమంది తమ మనసుల్లో ఇలా దీవిస్తున్నారు... ‘అమ్మా స్మితమ్మా..! వందనం తల్లీ...!!’ మహోన్నతం పసుమర్తి వేణు అవయవదానం మహోన్నతమని ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అన్నారు. నగరంలోని వర్తక సంఘం భవనంలో విలేకరుల సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, వెండి, బంగారం మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు. వేణు అవయవాలను దానం చేయాలని ఆయన భార్య, కుటుంబీకులు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని, సాహసోపేతమైనదని అన్నారు. ఈ సమావేశంలో కొప్పు నరేష్కుమార్, గొడవర్తి శ్రీనివాస్‌రావు, కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, పత్తిపాక రమేష్, తూములూరి లక్ష్మీనరసింహారావు, బందు సూర్యం, నకిరికంటి రాధాకృష్ణ(సతీష్), బూర్లె లక్ష్మీనారాయణ, సుంకరి నరసింహారావు, రాయపూడి శేషగిరిరావు, బూమా సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. నేడు అంత్యక్రియలు పసుమర్తి వేణు అంత్యక్రియలు బుధవారం జరుగుతాయి. ఇందుకు ఖమ్మం పౌర సమితి, చాంబర్ ఆఫ్ కామర్స్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఏర్పాట్లు చేశాయి. ఈ ఏర్పాట్లను ఖమ్మం పౌరసమితి అధ్యక్షుడు పులిపాటి ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కొప్పు నరేష్, గొడవర్తి శ్రీనివాస్‌రావు, కళాపరిషత్ చైర్మన్ వివి.అప్పారావు, కిరాణా జాగిరి మర్చంట్స్ అధ్యక్షుడు వేములపల్లి వెంకన్న, బంగారం శాఖ అధ్యక్ష, కార్యదర్శులు బందు సూర్యం, నకిరికంటి సతీష్, రోటరీ అధ్యక్షుడు కురువెళ్ల ప్రవీణ్, చాంబర్ ఆఫ్ మాజీ అధ్యక్షుడు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రతినిధులు కొదుమూరి జగన్నాథం, ప్రతాపనేని నరసింహారావు తదితరులు పర్యవేక్షించారు. -
56 ఏళ్ల వ్యక్తి... 17 ఏళ్ల గుండె
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్ క్రైం/ కోరుట్ల రూరల్: తీవ్రమైన హృద్రోగ సంబంధిత సమస్యతో బాధపడుతున్న 56 ఏళ్ల వ్యక్తికి 17 ఏళ్ల యువకుని గుండెను అపోలో ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా అమర్చారు. శనివారం ఈ గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తి చేయగా.. ప్రస్తుతం బాధితుని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యుల పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై అతనికి చికిత్స అందిస్తున్నారు. విజయవాడకు చెందిన 56 ఏళ్ల వ్యక్తికి గుండె పనితీరు మందగించింది. ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరగడంతో శ్వాస సరిగా తీసుకోలేకపోవడం, తరచూ బీపీ లెవల్స్ పడిపోవడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు. వారం క్రితం ఆయన అపోలో ఆస్పత్రికి చెందిన ప్రముఖ గుండె మార్పిడి నిపుణుడు డాక్టర్ ఏజీకే గోఖలేని సంప్రదించారు. బాధితుడిని పరీక్షించిన డాక్టర్ గోఖలే.. గుండె మార్పిడి ఒక్కటే దీనికి పరిష్కారమని సూచించారు. చికిత్సకు బాధితుని తరపు బంధువులు అంగీకరించడంతో ఆ మేరకు అవయవదానం కోసం జీవన్‌దాన్‌లో పేరు నమోదు చేశారు. ఇదే సమయంలో ఇటీవల ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కరీంనగర్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నవీన్ కుమార్ అనే 17 ఏళ్ల యువకుడు బ్రెయిన్‌డెడ్ స్థితికి చేరుకున్నట్లు జీవన్‌దాన్‌కు సమాచారం అందింది. అతని అవయవాలను దానం చేసేందుకు బంధువులు అంగీకరించడంతో అప్పటికే జూబ్లిహిల్స్ అపోలోలో గుండె మార్పిడి చికిత్స కోసం ఎదురు చూస్తున్న బాధితునికి సమాచారం అందజేశారు. విషయం తెలుసుకున్న అపోలో వైద్యులు రెండు బృందాలుగా ఏర్పడి.. ఒక బృందం దాత నుంచి గుండెను సేకరించేందుకు శుక్రవారం సాయంత్రం కరీంనగర్ వెళ్లగా, మరో బృందం ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం దాత నుంచి గుండెను సేకరించి.. కేవలం మూడు గంటల వ్యవధిలో ప్రత్యేక అంబులెన్స్‌లో కరీంనగర్ నుంచి హైదరాబాద్ అపోలోకు గుండెను తరలించారు. పది మందితో కూడిన వైద్య బృందం ఐదున్నర గంటల పాటు శ్రమించి బాధితునికి విజయవంతంగా గుండెను అమర్చింది. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్ గోఖలే స్పష్టం చేశారు. -
అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అవయవాల మార్పిడి
విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రులను అవయవ మార్పిడి నైపుణ్య కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. ఏపీని వైద్యఆరోగ్య రంగంలో ఉన్నత స్ధానంలో నిలబెట్టడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమన్నారు. సీఆర్డీఏ పరిధిలోని మణిపాల్ ఆసుపత్రిలో తొలి కాలేయ మార్పిడి శస్త్ర చికిత్స చేసిన వైద్య నిపుణుల జట్టును కామినేని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి నగరాల్లో తొలి దశలో భాగంగా అవయవాల మార్పిడికి ఆదేశాలు జారీ చేస్తున్నట్లు తెలిపారు. ఏపీలో 120 మానవ అవయవాల హార్వెస్టింగ్ పూర్తి అయ్యిందని ఇందులో 30 అవయవాలను బాధితులకు అమర్చినట్లు ఆయన వెల్లడించారు. జీవన్ దాన్ ద్వారా అవయవదానం కార్యక్రమాన్ని ప్రజలకు అందించాలని సీఎం చంద్రబాబు సూచించినట్లు తెలిపారు. 500 మంది డాక్టర్స్, 1000 మంది నర్స్‌లు, 16 మంది ఆసుపత్రి అడ్మిన్ స్టేటర్స్ను కాంట్రాక్ట్ ప్రాతిపదికనా ప్రభుత్వం నియామకాలు చేపట్టడానికి జీవో జారీ చేశామన్నారు. త్వరలోనే ఈ పోస్ట్‌ల భర్తీకు నియామకాలు పూర్తి అవుతాయని మంత్రి తెలిపారు. బ్రెయిన్ డెడ్ అయిన మనిషి తన అవయవాలను దానం ఇస్తే 5 గురు బాధితులకు కొత్త జీవితం లభిస్తుందన్నారు. ఏపీలో ఎయిమ్స్‌ను నిర్మించి ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టిందని మంత్రి కామినేని పేర్కొన్నారు.