
వివాహ వేదికలో అవయవదానం హామీ పత్రాలు స్వీకరిస్తున్న గూడూరు సీతామహలక్ష్మి
నిడదవోలు: తూర్పు గోదావరి జిల్లా నిడదవోలులోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కల్యాణ మండపంలో గురువారం జరిగిన ఓ వివాహ వేడుక అవయవదాన హామీ పత్రాల సమర్పణకు వేదికగా మారింది. వధూవరులు సజీవరాణి, సతీష్‌కుమార్‌తోపాటు 66 మంది తమ అవయవాలను దానం చేసేందుకు అంగీకరించారు.
విశాఖలోని అఖిల భారత అవయవ, శరీరదాతల సంఘం, సావిత్రిబాయి ఫూలే ఎడ్యుకేషనల్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన అవయవదాన ఆవశ్యకతను తెలియజేస్తూ వివాహ వేదిక వద్ద ప్రత్యేక శిబిరం ఏర్పాటుచేశారు. ట్రస్ట్ ప్రతినిధుల సూచనల మేరకు వధూవరులు, వారి బంధుమిత్రులు 66 మంది అవయవదానం చేస్తామని హామీ పత్రాలపై సంతకాలు చేసి ట్రస్ట్ చైర్çపర్సన్ గూడూరు సీతామహలక్ష్మికి అందజేశారు.
ఈ పత్రాలను ప్రభుత్వ సంస్థ జీవన్‌దాన్‌కు అందిస్తామని సీతామహలక్ష్మి తెలిపారు. తాము ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 42 వేల మంది నుంచి అవయవదాన హామీ పత్రాలను స్వీకరించామని చెప్పారు. ఆంధ్రా మెడికల్ కాలేజీ విద్యార్థుల బోధన అవసరాల కోసం 2007లో 35 మృతదేహాలను అప్పగించిన తర్వాత అవయవదాన హామీ పత్రాల ఉద్యమాన్ని చేపట్టామని పేర్కొన్నారు.
తెలుగు రాష్ట్రాలలో ఇప్పటివరకు 35 మెడికల్ కళాశాలలకు 400 భౌతికదేహాలను అందజేశామన్నారు. బ్రెయిన్ డెడ్ అయిన ఒక వ్యక్తి ద్వారా 18 మందిని బతికించవచ్చని వివరించారు. అవయవదానం చేసిన వ్యక్తుల కుటుంబ సభ్యులను ప్రభుత్వం ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబంలో ఒకరికి క్లాస్–4 ఉద్యోగం కల్పించినా మరింత మంది అవయవదానం చేయడానికి ముందుకు వస్తారన్నారు.