మరణమంటే.. చావు!
భౌతికంగా ఈ లోకాన్ని వీడి, పంచభూతాల్లో కలవడం. మనలో అనేకమందికి తెలిసిన అర్థం ఇదే.
మరణమంటే.. పునర్జన్మ!!
ఖమ్మం నగరానికి చెందిన ఓ సాధారణ గృహిణి మాత్రం..
ఇలా కొత్త అర్థాన్నిచ్చారు.
ఖమ్మంవ్యవసాయం: ‘‘మరణమంటే.. అనేకమంది అనుకుంటున్నట్టుగా ‘చావు’ మాత్రమే కాదు. మరణమంటే.. పునర్జన్మ..! మరణిస్తూనే.. మరికొందరికి ప్రాణం పోయడం. వారి దేహంలో భాగమవడం. ఇదే పునర్జన్మ’’ అంటున్నారు పసుమర్తి స్మిత. ఎవరీమె..? ఏం చేసింది..? వీటికి జవాబులు కావాలనుకుంటే.. అసలేం జరిగిందో తెలుసుకోవాల్సిందే.
♦ ఆయన పేరు పసుమర్తి వేణు. ఖమ్మం నగరంలోని గాంధీచౌక్‌లోగల స్నేహ జ్యూయలరీ షాప్ యజమాని, వ్యాపార ప్రముఖుడిగా వేణుకు మంచి గుర్తింపు ఉంది. ఆయనకు భార్య స్మిత, కూతురు స్నేహ ఉన్నారు. ఆ ముగ్గురిదీ ముచ్చటైన కుటుంబం.
♦ హాయిగా సాగిపోతున్న ఆ కుటుంబంలో ఒక్కసారిగా భయంకరమైన కల్లోలం. ఈ నెల 23న వేణు ఆకస్మికంగా తీవ్ర అస్వస్థుడయ్యారు. స్థానిక ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బ్రెయిన్ డెడ్ అయినట్టుగా వైద్యులు ప్రకటించారు.
♦ వేణు–స్మితది పాతికేళ్ల దాంపత్యం. ఇన్నేళ్లపాటు తనను ప్రాణప్రదంగా చూసుకున్న జీవిత భాగస్వామి ఒక్కసారిగా దూరమయ్యాడన్న చేదు నిజాన్ని విని ఆమె తట్టుకోలేకపోయారు. గుండె పగిలినంత పనైంది. ఆ తల్లీబిడ్డలను ఓదార్చడం ఎవరి తరం కాలేదు.
♦ మన మనిషి ఎవరైనా అసాధారణ పరిస్థితిలో చనిపోతే... సాధారణంగా పోస్టుమార్టానికి అంగీకరించం. కానీ, ఈ ఇల్లాలు స్మిత అలా కాదు. అంత బాధలోనూ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. భౌతికంగా ఈ లోకాన్ని వీడిని తన భర్త ద్వారా, ప్రాణాపాయ స్థితిలో ఉన్న మరికొందరికి బతుకును ఇవ్వాలనుకున్నారు.
♦ వెంటనే, తన స్వంత ఖర్చుతో భర్తను అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. ప్రభుత్వ పథకం ‘జీవన్‌దాన్’ కింద తన భర్త అవయవాలను దానం చేసేందుకు సిద్ధపడ్డారు. నిమ్స్ ఆసుపత్రిలో మంగళవారం వేణు దేహం నుంచి రెండు కళ్లు, గుండె, లివర్, రెండు కిడ్నీలను వైద్యులు సేకరించారు. సరిగ్గా ఇవే అవయవాల వైఫల్యంతో దాదాపుగా ప్రాణాపాయ స్థితికి చేరిన మరో ఆరుగురికి అమర్చారు. ఆ ఆరుగురూ రేపోమాపో సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఆస్పత్రి నుంచి బయటికొస్తారు. ఆ ఆరుగురిలో వేణు బతికుంటారు..! ఇక్కడ పునర్జన్మ పొందింది ఆ ఆరుగురు మాత్రమే కాదు..!! పసుమర్తి వేణు కూడా...!!! ఆయన కళ్లు ఈ లోకాన్ని చూస్తాయి. ఆయన అవయవాలు ఇతరుల దేహాల్లో చక్కగా పనిచేస్తాయి. ఈ విషయం తెలుసుకున్న పట్టణ ప్రజలు అనేకమంది తమ మనసుల్లో ఇలా దీవిస్తున్నారు... ‘అమ్మా స్మితమ్మా..! వందనం తల్లీ...!!’
మహోన్నతం
పసుమర్తి వేణు అవయవదానం మహోన్నతమని ఖమ్మం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు అన్నారు. నగరంలోని వర్తక సంఘం భవనంలో విలేకరుల సమావేశంలో చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, వెండి, బంగారం మర్చంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడారు. వేణు అవయవాలను దానం చేయాలని ఆయన భార్య, కుటుంబీకులు తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని, సాహసోపేతమైనదని అన్నారు. ఈ సమావేశంలో కొప్పు నరేష్‌కుమార్, గొడవర్తి శ్రీనివాస్‌రావు, కురువెళ్ల ప్రవీణ్‌కుమార్, పత్తిపాక రమేష్, తూములూరి లక్ష్మీనరసింహారావు, బందు సూర్యం, నకిరికంటి రాధాకృష్ణ(సతీష్), బూర్లె లక్ష్మీనారాయణ, సుంకరి నరసింహారావు, రాయపూడి శేషగిరిరావు, బూమా సూర్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.
నేడు అంత్యక్రియలు
పసుమర్తి వేణు అంత్యక్రియలు బుధవారం జరుగుతాయి. ఇందుకు ఖమ్మం పౌర సమితి, చాంబర్ ఆఫ్ కామర్స్, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఏర్పాట్లు చేశాయి. ఈ ఏర్పాట్లను ఖమ్మం పౌరసమితి అధ్యక్షుడు పులిపాటి ప్రసాద్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఖమర్, చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు కొప్పు నరేష్, గొడవర్తి శ్రీనివాస్‌రావు, కళాపరిషత్ చైర్మన్ వివి.అప్పారావు, కిరాణా జాగిరి మర్చంట్స్ అధ్యక్షుడు వేములపల్లి వెంకన్న, బంగారం శాఖ అధ్యక్ష, కార్యదర్శులు బందు సూర్యం, నకిరికంటి సతీష్, రోటరీ అధ్యక్షుడు కురువెళ్ల ప్రవీణ్, చాంబర్ ఆఫ్ మాజీ అధ్యక్షుడు మేళ్లచెరువు వెంకటేశ్వరరావు, ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రతినిధులు కొదుమూరి జగన్నాథం, ప్రతాపనేని నరసింహారావు తదితరులు పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment