బెంగళూరు - చెన్నై.. ఓ గుండె ప్రయాణం!
ఒకే నగరంలో ఒక ఆస్పత్రి నుంచి మరో ఆస్పత్రికి గుండెను పంపి.. అక్కడ గుండెమార్పిడి శస్త్రచికిత్సలు చేయడం ఈమధ్య కాలంలో మనం చూస్తున్నాం. హైదరాబాద్ నగరంలో కూడా ఇలాంటి సంఘటన జరిగింది. కానీ, ఏకంగా ఒక నగరం నుంచి మరో నగరానికి గుండెను తీసుకెళ్లిన సంఘటన మాత్రం తాజాగా జరిగింది. బెంగళూరు హెచ్ఏఎల్ విమానాశ్రయం నుంచి చెన్నైకి ఓ గుండెను తీసుకెళ్లి.. విజయవంతంగా అవతలి రోగికి అమర్చారు.
బెంగళూరు మణిపాల్ ఆస్పత్రిలో సుమారు రెండేళ్ల 10 నెలల చిన్నారి బ్రెయిన్ డెడ్ పరిస్థితిలోకి వెళ్లాడు. మరోవైపు చెన్నైలో రెండేళ్ల 8 నెలల చిన్నారి గుండె మార్పిడి కోసం ఎదురుచూస్తోంది. గుండె దానానికి తల్లిదండ్రులు అంగీకరించడంతో బెంగళూరు పోలీసులు గ్రీన్ కారిడార్ ఏర్పాటుచేసి హుటాహుటిన మణిపాల్ ఆస్పత్రి నుంచి విమానాశ్రయానికి గుండెను తరలించారు. గత సెప్టెంబర్ నెలలో కూడా ఇలాగే బ్రెయిన్ హెమరేజితో మరణించిన మహిళ గుండెను బెంగళూరు నుంచి చెన్నైకి తరలించారు.