రాష్ట్రంలో తొలి గుండె మార్పిడి జరిగిన విద్యార్థి మృతి చెందాడు. వైద్యులు పునర్జన్మ ప్రసాదించారన్న సంబరం కొద్దినెలలు కూడా నిలువలేదు.
కారంపూడి, న్యూస్‌లైన్: రాష్ట్రంలో తొలి గుండె మార్పిడి జరిగిన విద్యార్థి మృతి చెందాడు. వైద్యులు పునర్జన్మ ప్రసాదించారన్న సంబరం కొద్దినెలలు కూడా నిలువలేదు. గుంటూరు జిల్లా కారంపూడి మండలం పెదకొదమగుండ్లకు చెందిన బి ఫార్మసీ విద్యార్థి వీరాంజనేయులు డైలేటెడ్ కార్డియోపతి వ్యాధితో బాధపడున్నాడు. గత ఏడాది నవంబరు 11న హైదరాబాద్‌లోని అపోలో ఆస్ప త్రి వైద్యులు అతనికి ఆపరేషన్ నిర్వహించి, గుండె మార్పిడి చేశారు.
యశోదా ఆసుపత్రిలో మెదడులో రక్తనాళాలు చిట్లడం వల్ల కొద్ది సమయంలో చనిపోబోతున్న వ్యక్తి నుంచి గుండెతీసి వీరాంజనేయులుకు అమర్చారు. అపోలో వైద్యులు దీనిని ప్రతిష్టాత్మకంగా తీసుకుని విదేశాల లో రూ.కోటి పైన ఖర్చుయ్యే ఆపరేషన్‌ను ఉచితంగా చేసి అతడికి ప్రాణం పోశారు. వాస్తవానికి మన రాష్ట్రంలో మొదటసారి జరిగిన అరుదైన ఆపరేషన్‌గా వైద్యరంగంలో ఇది అప్పట్లో సంచలనం అయింది. అప్పటి నుంచి ఇంటి దగ్గరే వుంటున్నాడు. ఆదివారం ఉన్నట్టుండి వీరాంజనేయులు అస్వస్థతకు గురవడంతో డాక్టర్ సలహాపై హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ వైద్యసేవలు అందిస్తుండగా మృతి చెందాడు.