అంతా పక్కా ప్లాన్‌..  | Man arrested in Ernakulam over Nurse acid attack | Sakshi
Sakshi News home page

అంతా పక్కా ప్లాన్‌.. 

Published Wed, May 16 2018 12:25 PM | Last Updated on Mon, Aug 20 2018 2:31 PM

Man arrested in Ernakulam over Nurse acid attack - Sakshi

వివరాలు వెల్లడిస్తున్న సీపీ అంజనీకుమార్‌.. నిందితుడు ప్రమోద్‌ (ఇన్‌సెట్‌ లో)

సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రి నర్సు జీషా షాజిపై ప్రేమోన్మాది ప్రమోద్‌ పథకం ప్రకారమే దాడి చేశాడని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజినీ కుమార్‌ తెలిపారు. ఇందులో భాగంగానే కేరళ నుంచి యాసిడ్‌ను తీసుకువచ్చి ఆమెపై పోసినట్లు పేర్కొన్నారు. దాడి అనంతరం పారిపోయిన ప్రమోద్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు కేరళ లోని మావోయిస్టు ప్రాబల్యం ఉన్న మారుమూల ప్రాంతంలో అరెస్టు చేసినట్లు తెలిపారు. వెస్ట్‌ జోన్‌ డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్, బంజారాహిల్స్‌ ఏసీపీ కె.శ్రీనివాసరావులతో కలిసి మంగళవారం తన కార్యాలయంలో కేసు వివరాలు వెల్లడించారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాకు చెందిన జీషా తరచూ పాలక్కాడ్‌ జిల్లాలో ఉంటున్న తన అమ్మమ్మ ఇంటికి వెళ్లేది. ఈ నేపథ్యంలో వారి పక్కింట్లో ఉం డే పెయింటర్‌ ప్రమోద్‌తో ఐదేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. వీరి మధ్య పెరిగిన సాన్నిహిత్యాన్ని ప్రేమగా భావించిన అతను గతేడాది ఆమెకు ప్రతిపాదించాడు. దీనిని జీషా సున్నితంగా తిరస్కరించడంతో ఆమెపై కక్షకట్టిన ప్రమోద్‌ వేధింపులకు దిగాడు. అతడి వ్యవహారశైలి నచ్చని ఆమె అతడి ని పూర్తిగా దూరం పెట్టింది. తనకు సంబంధించిన ఏ వివరాలూ అతడికి తెలియకుండా జాగ్రత్తపడింది.

నర్సింగ్‌ కోర్సు పూర్తి చేసిన జీషా గత జూలైలో హైదరాబాద్‌కు వచ్చి జూబ్లీహిల్స్‌ అపో లో ఆస్పత్రిలో హెల్త్‌ అసిస్టెంట్‌గా చేరింది. కొన్ని రోజల పాటు ఆమె ఆచూకీ కోసం ప్రయత్నించిన ప్రమోద్‌ చివరకు ఫేస్‌బుక్‌ ద్వారా జీషా ప్రొఫైల్‌ను గుర్తించాడు. తొలుత ‘అబౌట్‌’ సహా ఇతర వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాడు. ఫ్రెండ్‌ అయితే కానీ ఇది సాధ్యం కాదని తేలడంతో నేరుగా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ పంపాడు. ఆమె దీనిని యాక్సెప్ట్‌ చేయకపోవడంతో కొత్త పథకం వేశాడు. ఓ యువతి ఫొటోతో నకిలీ పేరుతో ప్రొఫైల్‌ క్రియేట్‌ చేసి దాని నుంచి రిక్వెస్ట్‌ పంపాడు. యువతే అన్న భావనతో జీషా అంగీకరించింది. తద్వారా ఆమె హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో పని చేస్తున్నట్లు గుర్తించాడు. ఇక్కడకు వచ్చి మరోసారి ప్రతిపాదించాలని భావించిన అతగాడు ఆమె తిరస్కరిస్తుందని అనుమానించాడు. అలా జరిగితే  ఆమెపై దాడి చేయాలనే ఉద్దేశంతో కేరళలోనే యాసిడ్‌ ఖరీదు చేశాడు. వాటర్‌ బాటిల్‌లో యాసిడ్‌ను తీసుకువచ్చిన ప్రమోద్‌ గత గురువారం ఆపోలో ఆస్పత్రి వద్ద కాపుకాశాడు. సాయంత్రం ఆస్పత్రి నుంచి  హాస్టల్‌కు వెళ్తున్న జీషా వద్దకు వెళ్లిన అతను మరోసారి ప్రతిపాదించడంతో పాటు వెంట పడటం ప్రారంభించాడు. తిరస్కరించిన జీషా వెళ్లిపోతుండగా వెనుక నుంచి ఆమెపై యాసిడ్‌తో దాడి చేశాడు.

పది శాతం కాలిన గాయాలతో బాధితురాలు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దాడి అనంతరం తన సెల్‌ఫోన్‌ సైతం స్విచ్ఛాఫ్‌ చేసుకు న్న ప్రమోద్‌ కేరళకు పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న బంజా రాహిల్స్‌ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇన్‌స్పెక్టర్‌ కస్తూరి శ్రీనివాస్‌ నేతృత్వంలో డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.రవికుమార్‌ తదితరులతో ఎనిమిది ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సాంకేతికంగా ముందుకు వెళ్లిన ఈ టీమ్స్‌ కేరళలోని పాలక్కాడ్‌ జిల్లా కేంద్రానికి 80 కిమీ దూరంలో ఉన్న అత్తిపడి వద్ద ప్రమోద్‌ తలదాచుకున్నట్లు గుర్తించారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితుడి ఆచూకీ తెలుసుకుని పట్టుకున్నారు. ‘ఫేస్‌బుక్‌లో ఫ్రెండ్‌ రిక్వెస్ట్స్‌ యాక్సెప్ట్‌ చేసే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యక్తిగతంగా తెలిసిన వారి అభ్యర్థనలే అంగీకరించాలి. లేదా కొన్ని సందర్భాల్లో తీవ్ర పరిణామాలు ఎదురవుతాయడానికి ఈ కేసే ప్రత్యక్ష ఉదాహరణ’ అని పోలీసు కమిషనర్‌ అంజినీ కుమార్‌ అన్నారు. ‘యాసిడ్‌ అమ్మకాలు అధీకృతంగానే జరగాలి. పరిచయస్తులు, దుర్వినియోగం చేయరని రూఢీ అయిన వారికే విక్రయించాలి. ఎవరికి పడితే వారికి విక్రయించినప్పుడు జరగరానికి జరిగితే సదరు వ్యాపారులూ నిందితులుగా మారతారు’ అని డీసీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ స్పష్టం చేశారు. ప్రమోద్‌ను బంజారాహిల్స్‌ పోలీసులు నాంపల్లి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు.    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement