
కరాచీ: పాకిస్తాన్ హాకీ దిగ్గజం మన్సూర్ అహ్మద్ గుండె మార్పిడి కోసం భారత్ రావాలనుకుంటున్నారు. 49 ఏళ్ల స్టార్ గోల్‌కీపర్ అహ్మద్ 1994 ప్రపంచకప్‌ను పాక్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. అయితే గత కొంతకాలంగా మన్సూర్ హృద్రోగంతో బాధపడుతున్నాడు. ఐదేళ్ల క్రితం గుండె కవటాలు మూసుకుపోవడంతో స్టంట్‌లు అమర్చారు. అయితే ఇపుడు అవి మళ్లీ మూసుకుపోవడంతో అక్కడి హృద్రోగ నిపుణులు గుండె మార్పిడి శస్త్ర చికిత్సే పరిష్కారమన్నారు.
అమెరికా, భారత్‌లలోని ప్రఖ్యాత హార్ట్ స్పెషాలిటీ హాస్పిటల్‌లను సంప్రదించాలని సూచించారు. పొరుగునే ఉన్న భారత్‌లో గుండెమార్పిడి ఆపరేషన్లు విజయవంతం కావడంతో ఇక్కడికి రావాలని మన్సూర్ ఆశిస్తున్నారు. ఆయన చికిత్స కోసం ఇప్పటికే క్రికెటర్ ఆఫ్రిది ఫౌండేషన్ స్పందించి చేయూతనిచ్చేందుకు ముందుకొచ్చింది. వీసా కోసం కేంద్ర మంత్రి సుష్మాస్వరాజ్‌కు వినతి పంపారు.