సాక్షి, హైదరాబాద్: దక్షిణాధి, ఉత్తరాది రాష్ట్రాల్లో నెలవంక కనబడటంతో ఈ నెల 22న (శనివారం) రంజాన్ పండుగ జరుపుకోవాలని రుహియతే హిలాల్ కమిటీ(నెలవంక నిర్ధారణ కమిటీ) ప్రతినిధి ముఫ్తీ సయ్యద్ ఖలీల్ అహ్మద్ తెలిపారు.
శుక్రవారం మొజంజాహీ మార్కెట్‌లోని కమిటీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆకాశంలో మబ్బులు ఉండటంతో హైదరాబాద్‌లో నెలవంక కనబడలేదని, తెలంగాణలోని పలు జిల్లాల్లో అది కనబడినట్లు నిర్ధారణ అయిందని, శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు రంజాన్ పండుగను జరుకోవాలని కమిటీ నిర్ణయించిందన్నారు. దీంతోపాటు ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో కూడా నెలవంక కనిపించినట్లు సమాచారం అందిందని చెప్పారు.
నెల రోజులపాటు కఠోర ఉపవాసాలు ఉండి దైవప్రసన్నత కోసం పాటించిన ఉపవాసాలు అల్లా స్వీకరించాలని వేడుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలంతా శాంతిపూర్వక వాతావారణంలో పండుగ జరుపుకోవాలని సూచించారు. రంజాన్ పండుగ(ఈదుల్ ఫితర్) నమాజ్ రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఈద్గాలతోపాటు దాదాపు అన్ని మసీదుల్లో ఉందన్నారు.
పలు ప్రాంతాల్లో ప్రజల సౌకర్యార్థం మైదానాల్లో కూడా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. ఆయా ఈద్గాలు, మసీదులు, మైదానాల్లో ఈదుల్ ఫితర్ నమాజ్ ఉదయం 6:30 గంట నుంచి 10:30 వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment