నందలూరు రన్నింగ్‌స్టాప్‌ క్రూసెంటర్‌కు ఘన చరిత్ర | - | Sakshi
Sakshi News home page

నందలూరు రన్నింగ్‌స్టాప్‌ క్రూసెంటర్‌కు ఘన చరిత్ర

Published Wed, May 17 2023 1:01 AM | Last Updated on Wed, May 17 2023 1:02 PM

గూడ్స్‌రైళ్లతో రద్దీగా ఉన్న రైల్వే కేంద్రం   - Sakshi

గూడ్స్‌రైళ్లతో రద్దీగా ఉన్న రైల్వే కేంద్రం

నందలూరు (రాజంపేట): బ్రిటీషు రైల్వే పాలకుల నుంచి కొనసాగిన ఎంతో ఘన చరిత్ర కలిగిన నందలూరు రైల్వే రన్నింగ్‌స్టాప్‌ క్రూ సెంటర్‌ (మిగిలిన ఏకై క డిపార్టుమెంట్‌) ఎత్తివేతకు డెడ్‌లైన్‌ విధించారు. ముందుగా నందలూరుకు మోడర్‌ రన్నింగ్‌రూం కోటి వ్యయంతో మంజూరు చేశారు. దానిని అర్ధాంతరంగా రద్దుచేశారు. ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్‌లో రన్నింగ్‌స్టాప్‌ డిపో ఏర్పాటు అనుకూలం కాదని చెబుతున్నా గుంతకల్‌ రైల్వే ఉన్నతాధికారులు పట్టించుకోలేదని.. వారి అనాలోచిత నిర్ణయాలతో నందలూరు డిపోకు మంగళం పాడారని రైల్వే కార్మిక వర్గాలు చర్చించుకుంటున్నాయి.

6న క్రూసెంటర్‌ క్లోజ్‌..
వచ్చేనెల 6న రన్నింగ్‌స్టాప్‌ క్రూ సెంటర్‌ను క్లోజ్‌ చేయనున్నారు. ఈ మేరకు సంబంధితశాఖ అధికారులకు గుంతకల్‌ నుంచి సంకేతాలు కూడా వచ్చేశాయి. ఇప్పటికే దశలవారీగా లోకోఫైలెట్లు, అసిస్టెంట్‌ లోకోఫైలెట్లు, గార్డులను గుంతకల్‌ ఉన్నతాధికారులు ఏర్పాటు చేసుకున్న డిపోకు తరలించారు. ఇక పూర్తి స్థాయిలో నందలూరు క్రూ సెంటర్‌ను మూసేసేందుకు రంగంసిద్ధం చేశారు.

రన్నింగ్‌స్టాప్‌ సిబ్బందిని ఇప్పటికే గుంతకల్‌ రైల్వే ఉన్నతాధికారులు ఎర్రగుంట్ల డిపోకు వెళ్లేలా మానసికంగా సిద్ధం చేశారు. వచ్చే నెల 6 నాటికి నందలూరులో క్లోజ్‌ చేయనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి లోకోఫైలెట్లు, ఏఎల్‌పీ, గూడ్స్‌గార్డులు తట్టా బుట్టా సర్దుకుంటున్నారు. దీంతో నాగిరెడ్డిపల్లె అర్బన్‌ పంచాయతీలో అద్దె ఇళ్లను ఖాళీ చేసుకుంటున్నారు. ఎర్రగుంటల్లో నివాసం ఉండలేమని వారు అంటున్నారు. కాలుష్యం లేని, తాగునీటి వసతి తదితర సమస్యలు లేని సమీప నగరాల్లో ఉండేందుకు అద్దె ఇళ్లను అన్వేషించుకుంటున్నారు.

నాలుగేళ్లలో..
ఆది నుంచి ఒక పథకం ప్రకారం నందలూరు రైల్వేకేంద్రాన్ని బీజేపీ సర్కారు నిర్వీర్యం చేసుకుంటూ వస్తోందని రైల్వే వర్గాల్లో చర్చ సాగుతోంది. క్రూ సెంటర్‌ క్లోజ్‌ నేపథ్యంలో ఆ పార్టీకి రాజంపేట, నందలూరు ప్రాంతీయుల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. హాల్టింగ్‌, ఉన్న డిపార్టుమెంట్‌లను ఎత్తివేయడం తదితర వాటిని రైల్వే చేపట్టింది. కాంగ్రెస్‌ పార్టీ నందలూరు రైల్వే వైభవం కోల్పోవడానికి నాంది పలికిందని.. ఇప్పుడు బీజేపీ పాలనలో పూర్తిగా గత వైభవంను క్లోజ్‌ చేశారనే విమర్శలు వెలువడుతున్నాయి.

170 ఏళ్ల తర్వాత నిర్వీర్యం దిశగా నందలూరు..
దక్షిణమధ్య రైల్వే చరిత్రలో గుంతకల్‌కు రైలుమార్గంలేని రోజులలోనే నందలూరుకు రైల్వేమార్గం ఉండేది. సదరన్‌ రైల్వే(తమిళనాడు)లో కీలక రైల్వే కేంద్రంగా విరాజిల్లింది. వేలాది మంది కార్మికులతో కళకళలాడింది. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్‌, రాజస్ధాన్‌తో పాటు పలు రాష్ట్రాలకు చెందిన వారు నందలూరులో నివాసాలు ఉండటంతో దేశవ్యాప్త కల్చర్‌ నందలూరులో కొనసాగింది. ఇప్పటి వరకు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు ఆగడంలేదు. ఇక గూడ్స్‌ రైళ్లు కూడా ఆగకుండా వెళ్లిపోనున్నాయి. ఈ నేపథ్యంలో రన్నింగ్‌రూం, రైల్వే హాస్పిటల్‌, ఆర్‌పీఎఫ్‌, జీఆర్‌పీ, ఎలక్ట్రికల్‌, రైల్వే ఇనిస్టిట్యూట్‌ తదితర విభాగాలు కూడా క్లోజ్‌ కానున్నాయి. ఆ విధంగా 170 ఏళ్ల చరిత్ర కలిగిన నందలూరు బీజేపీ పాలనలో గ్రామీణస్టేషన్‌గా అవతరించనున్నది.

రన్నింగ్‌స్టాప్‌ డిపో క్లోజ్‌ చేస్తే ..
నందలూరు రన్నింగ్‌స్టాప్‌ క్రూ సెంటర్‌ వచ్చేనెల 6న క్లోజ్‌ చేయనున్నారు. కళకళలాడే నందలూరు ఇక కళ తప్పనుంది. 170 ఏళ్ల రైల్వేచరిత్ర కాలగర్భంలో కలిసిపోతుంది. గంతకల్‌ రైల్వేడివిజన్‌ ఉన్నతాధికారులు నందలూరుపై కత్తికట్టి మరీ నిర్వీర్యం చేస్తున్నారని స్పష్టంగా కనిపిస్తోంది. ఇక నేరుగా రైల్వేబోర్డులో కదిలిక తీసుకురావాలి. నందలూరు పూర్వవైభవం కోసం ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది.
– జంబు సూర్యనారాయణ, సర్పంచి, నాగిరెడ్డిపల్లె అర్బన్‌, నందలూరు

జిల్లాలో రైల్వే అంటే నందలూరు
జిల్లాలో రైల్వే అంటే నందలూరు.. నందలూరు అంటే రైల్వే అన్నట్లుగా కొనసాగింది. జిల్లాలో ఏ రైలు ఎక్కాలన్నా నందలూరుకు వచ్చేవారు. ఇప్పుడు ఏ రైలూ ఆగడం లేదు. ఉన్న విభాగాలను ఎత్తివేసే పరిస్థితులు నెలకొన్నాయి. నేడు నిర్వీర్యదిశగా పయనించడం బాధాకరం. నందలూరు రైల్వే కేంద్రానికి పూర్వవైభవానికి కలిసికట్టుగా కృషిచేయాలి. – కమాల్‌బాష, రిటైర్డ్‌ లోకోఫైలెట్‌, నందలూరు

No comments yet. Be the first to comment!
Add a comment
ఒకప్పటి నందలూరు రైల్వేకేంద్రం 1
1/1

ఒకప్పటి నందలూరు రైల్వేకేంద్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement