
సమష్టి కృషితో విజయవంతం
కడప అర్బన్: ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ ఘట్టమైన కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరగడంపై జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సమష్టి కృషితోనే కల్యాణ ఘట్టం విజయవంతంగా ముగిసిందని ఆయన శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలాంటి చిన్న ఘటనకు తావులేకుండా ముగిసేలా అవిశ్రాంతంగా కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, ఏపీఎస్పీ, సివిల్, ఏఆర్, ఇతర జిల్లాల నుంచి వచ్చిన సిబ్బంది, జిల్లాలోని ఇతర ప్రత్యేక విభాగాల సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు. పోలీస్ శాఖకు సహకరించిన టీటీడీ, అగ్నిమాపక, రెవెన్యూ, ఏపీ ట్రాన్‌న్స్‌కో, ఇతర శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేశారు.