
మే 1 నుంచి వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు
రాయచోటి జగదాంబసెంటర్: ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో మే 1 నుంచి 31వ తేదీల వరకు వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి ఎస్.గౌస్‌బాషా బుధ వారం తెలిపారు. జిల్లా పరిధిలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 8 నుంచి 14 సంవత్సరాలలోపు వయస్సు గల క్రీడాకారులకు సమ్మర్ కోచింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆసక్తి గల క్రీడా సంఘాల కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులు ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు వివరాలను డీఎస్‌డీఓ కార్యాలయానికి తెలియజేయాలని ఆయన తెలియజేశారు.
అసంపూర్తి ఇళ్లకు
ఆర్థిక సాయం
పెనగలూరు: గతంలో పక్కా ఇళ్లు మంజూరై, వివిధ కారణాల వల్ల నిర్మాణ పనులు పూర్తిచేయలేకపోయిన పేదలకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయం అందిస్తున్నదని పీడీ సాంబ శివయ్య తెలిపారు. బుధవారం మండలంలోని కొండూరు పంచాయతీ కేసీ ఎస్టీ సముద్రం కాలనీలో హౌసింగ్ లబ్ధిదారులతో పీడీ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలనీకి గతంలో మంజూరైన పక్కా గృహాల లబ్ధిదారులకు పాత బిల్లుతో కలిపి అదనంగా రూ. 75 వేలు కలిపి ఇస్తున్నామని తెలిపారు. పురోగతిలో ఉన్న ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయం చేసేందుకు ఎస్సీ, బీసీ లబ్ధిదారులకు రూ.50వేలు, ఎస్టీ లబ్ధిదారులకు రూ.75వేలు అదనంగా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ ఈఈ మురళీకృష్ణ, ఏఈ హరిప్రసాద్, సర్పంచ్ రామాంజులమ్మ పాల్గొన్నారు.