
ఎస్సీల స్వయం ఉపాధి పథకాలకు రుణాలు ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్
రాయచోటి: ఎస్సీల స్వయం ఉపాధి పథకాలకు బ్యాంకర్లు వందశాతం రుణాలు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో 2025–26లో ఎస్సీ కార్యాచరణ ప్రణాళిక కింద ఏపీ ఆన్‌లైన్ బెనిఫిషరీ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ వైబ్‌సైట్ ద్వారా ఎస్సీల స్వయం ఉపాధి పథకాలకు రుణాలు మంజూరు అంశంపై బ్యాంకర్లతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. 2025–26లో ఎస్సీ ప్రణాళిక కింద జిల్లాకు 563 యూనిట్లను కేటాయించారని కలెక్టర్ తెలిపారు. 563 యూనిట్లకు వివిధ సెక్టార్లలో రూ. 2341 లక్షల రుణాలు ఇవ్వాలని, ఇందులో రూ. 924 లక్షలు 40 శాతం మేర రాయితీగా పరిగణిస్తారని తెలిపారు.
జిల్లాకు 34 డ్రోన్ యూనిట్లు.....
వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ డ్రోన్లను ఉపయోగించడం ద్వారా అత్యుత్తమమైన ఫలితాలను పొందేందుకు ప్రభుత్వం రైతులకు చేయూతను అందిస్తోందన్నారు. ఈ క్రమంలో వ్యవసాయంలో డ్రోన్ వినియోగం పెంచడానికి కూడా రుణాలు అందించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. జిల్లాకు 34 డ్రోన్లు యూనిట్లు మంజూరు అయ్యాయన్నారు. 80 శాతం రాయితీతో డ్రోన్ యూనిట్ల మంజూరుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ జేడీ చంద్ర నాయక్, లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు ఉన్నత లక్ష్యాలు సాధించాలి
విద్యార్థులు విద్యతోపాటు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని క్రమ శిక్షణతో వాటిని సాధించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో ఇండియన్ నేషనల్ టాలెంట్ సెర్చ్ ఒలింపియాడ్ వారు నిర్వహించిన పోటీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి గ్రాండ్ ప్రైజ్ (లాప్‌టాప్) టాబ్, ఫస్ట్ ప్రైజ్‌తోపాటు గోల్డ్ మెడల్స్ సాధించిన విద్యార్థులను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వారు సాధించిన ల్యాప్‌టాప్, ట్యాబ్, గోల్డ్ మెఢల్, సర్టిఫికెట్లను బహూకరించి అభినందనలు తెలిపారు.