
తంబళ్లపల్లె టీడీపీలో ఉత్కంఠ
బి.కొత్తకోట: తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీలో ఉప్పు–నిప్పుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్, గత ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి దాసరిపల్లి జయచంద్రారరెడ్డి వర్గాలు బలప్రదర్శనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో.. మంత్రులు నిర్వహించే సమావేశ నిర్వహణ తీరును పూర్తిగా మార్చేశారు. ఆదివారం ములకలచెరువు మార్కెట్ యార్డులో ఈ సమావేశం ఉందని, పార్టీ శ్రేణులు హాజరు కావాలని జయచంద్రారెడ్డి వీడియో సందేశంలో కోరారు. దీంతో సమావేశం రసాభాసగా మారే పరిస్థితులున్నాయన్న ఆందోళన పార్టీ వర్గాల్లోనే వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, జిల్లా మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, జోన్‌ఫోర్ ఇన్‌చార్జి దీపక్‌రెడ్డిలు నిర్వహించే ఈ సమావేశాన్ని.. 30 మందిలోపు ముఖ్యలతోనే నిర్వహించి ముగించేలా నిర్ణయించారు. సమావేశం ములకలచెరువు మార్కెట్‌లో నిర్వహిస్తే భారీ సంఖ్యలో రెండు వర్గాలు ఒకేచోటికి తరలివచ్చాక ఉద్రిక్తత నెలకొంటే పరిస్థితి చేయిదాటి పోతుందని భావించినట్టు పార్టీ వర్గాలు చెప్పుకొంటున్నాయి. దీంతో కొద్ది మందితో జరిపే సమావేశాన్ని ములకలచెరువులో కాకుండా శనివారం రాత్రి మంత్రులు విడిదిచేసే బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్‌పైకి మార్చారు. శుక్రవారం రాత్రి తంబళ్లపల్లె పరిశీలకులు గురువారెడ్డి ముఖ్యులతో ఫోన్‌లో మాట్లాడి ఈ సమాచారం ఇచ్చారు. తంబళ్లపల్లె టీడీపీ ఇన్‌చార్జి పదవి విషయంలో గత ఎనిమిది నెలలుగా రెండు వర్గాల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ఇన్‌చార్జి బాధ్యతలను శంకర్‌కు అప్పగించాలని ఆయన వర్గం పట్టుపడుతుండగా.. ఇన్‌చార్జి మార్పు లేదని జయచంద్రారెడ్డి వర్గం గట్టిగా వాదిస్తోంది. దీనితో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ రెండు వర్గాలుగా మారిపోయారు.
పరస్పర ఆరోపణలతో వివాదాలు
తంబళ్లపల్లె టీడీపీలోని రెండు వర్గాలు పరస్పర ఆరోపణలు, విమర్శలతో మునిగిపోయారు. ఏ చిన్న అవకాశం దొరికినా ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకోవడానికి వెనుకాడటం లేదు. ఇటీవల సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య ఆరోపణలు తీవ్రస్థాయికి చేరాయి. ‘శంకర్ వస్తున్నారు.. కార్యకర్తలకు అండగా ఉంటారు’ అంటూ పోస్టులు పెడితే దానికి కౌంటర్‌గా.. శంకర్ టీడీపీకి రాజీనామా చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తించారు.
విభేదాలపైనే దృష్టి
హార్సిలీహిల్స్‌పై మంత్రులు నిర్వహించే పార్టీ నేతల సమావేశానికి హాజరయ్యే స్థానిక నాయకుల ద్వారా నియోజకవర్గంలో పార్టీ పరిస్థితులు, వర్గ విభేదాలు, పరస్పర ఆరోపణలు, ఫిర్యాదులపై వివరాలు సేకరిస్తారని తెలిసింది. ఇరువర్గాల వాదనలు వినే అవకాశం ఇచ్చాక వారి అభిప్రాయాలను తెలుసుకుంటారని తెలిసింది. ఒకరిపై ఒకరు ఇచ్చే ఫిర్యాదులు స్వీకరిస్తారా లేక వారి మధ్య సమోధ్య కుదుర్చుతారా, రెండు వర్గాల వాదనలు విని అధిష్టానానికి నివేదిస్తారా అన్నది చర్చించుకుంటున్నారు. ఈ సమావేశంలో బలప్రదర్శనకు తావులేకుండా మండల కన్వీనర్లు, ప్రధాన కార్యదర్శులు, బూత్ ఇన్‌చార్జిలు, క్లస్టర్, యూనిట్ ఇన్‌చార్జిలను మాత్రమే ఆహ్వానించి వారి నుంచి అభిప్రాయాలు సేకరణకే ప్రాధాన్యం ఇచ్చారు. వీరికి మాత్రమే పాసులు ఇస్తున్నారని తెలిసింది. దీంతో ఇతరులతో సంబంధం లేకుండా.. పార్టీ ముఖ్యల నుంచే వారి అభిప్రాయాలను తీసుకుంటారని తెలుస్తోంది.
● సోషల్ మీడియాలో పోస్టుల యుద్ధం
ములకలచెరువు నుంచి హార్సిలీహిల్స్‌కు మారిన మంత్రుల భేటీ
పార్టీ ముఖ్యలతోనే సమావేశం
బలప్రదర్శనకు సిద్ధమవుతున్న జేసీఆర్, శంకర్ వర్గాలు
హార్సిలీహిల్స్‌పై జరిగే పార్టీ సమావేశం సందర్భంగా తమ బలమెంతో చూపెట్టాలని రెండు వర్గాలు సిద్ధం కావడంతో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. ఇప్పటికే తమ వర్గాలకు చెందిన నాయకులు, కార్యకర్తలతో సమీకరణ మొ దలుపెట్టారు. శంకర్ వర్గం బలప్రదర్శనతో తమ వాదనను మంత్రులకు వినిపించి ఇన్‌చార్జి బాధ్యతలు శంకర్‌కు ఇ వ్వాలని డిమాండ్ చేసేందుకు, ఇక్కడి పరిస్థితులను వివరించేందుకు సిద్ధమ య్యారు. ఈ వాదనను జయచంద్రారెడ్డి వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తూ గట్టిగా వాదించే పరిస్థితి ఉంది. దీంతో రెండు వర్గాలు ఒకే చోట ఉండి.. భిన్నవాదనలు తెరపైకి వచ్చాక అక్కడి పరిస్థితి తీవ్ర ఉద్రిక్తత, ఘర్షణలకు దారి తీస్తుందని పార్టీ వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య విమర్శలు, ఆరోపణల యు ద్ధమే సాగుతోంది. ఈ పరిస్థితుల్లో రెండు వర్గాలు ఒకే చోట కలవడం అంటే ఏమి జరు గుతుందో చెప్పాల్సిన అవసరం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. దీనిపై పోలీసు నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. మండలాల నుంచి ఏ వర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు ఏ సంఖ్యలో వస్తారన్న వివరాలు సేకరిస్తున్నారు.

తంబళ్లపల్లె టీడీపీలో ఉత్కంఠ