సాక్షి, తిరుపతి : శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయం.. నిరుపేదల పాలిట గుండె‘గుడి’గా పూజింపబడుతోంది. చిన్నవయస్సులో హృద్రోగ సమస్యతో ఆస్పత్రిలో చేరిన నిరుపేద చిన్నారులకు గుండె మార్పిడి చేసి పునర్జన్మ ప్రసాదిస్తోంది. వెల కట్టలేని గుండెను ఉచితంగా అమర్చి శభాష్ అనిపించుకుంటోంది.
రూ.లక్షల విలువచేసే గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోలేక అనేకమంది చిన్నారులు ప్రాణాలు విడుస్తున్నారు. అలాంటి వారికి పునర్జన్మనివ్వటమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ గొప్ప సత్సంకల్పంతో తిరుపతిలో చిన్నపిల్లల ఆస్పత్రి ఏర్పాటుచేయాలని భావించారు. ఆ బాధ్యతను టీటీడీకి అప్పగించారు. దీంతో కార్డియాక్ కేర్ సెంటర్‌కు టీటీడీ శ్రీకారం చుట్టింది.
ఈ ఆస్పత్రి తన మానసపుత్రికగా ప్రకటించిన సీఎం వైఎస్ జగన్ 2021 సెప్టెంబర్ 11న శ్రీపద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. కేవలం ఎనిమిది నెలల్లోనే దీన్ని అందుబాటులోకి తెచ్చారు. అంతేకాక.. అతికొద్ది కాలంలోనే 1,908 గుండె శస్త్రచికిత్సలను ఇక్కడి వైద్యులు విజయవంతంగా పూర్తిచేశారు. ఈ ఆస్పత్రిలో తొలిసారి గుండెమార్పిడి చికిత్సను కూడా చేయడంతో ఆస్పత్రి కీర్తి ఒక్కసారిగా రెపరెపలాడింది. ఇలా ఇప్పటికి రెండు గుండెమార్పిడి శస్త్రచిత్సలను విజయవంతంగా నిర్వహించింది.
తాజాగా.. శ్రీకాకుళంలో బ్రెయిన్‌డెడ్ అయిన వ్యక్తి గుండెను రోడ్డు మార్గంలోవిశాఖకు తరలించి అక్కడ నుంచి ప్రత్యేక ఎయిర్ అంబులెన్స్‌లో రేణిగుంట విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అక్కడి నుంచి నిమిషాల వ్యవధిలో తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి తీసుకొచ్చి నెల్లూరుకు చెందిన చిన్నారికి అమర్చారు.
ఈ నేపథ్యంలో.. టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయానికి ఉత్తమ పీడియాట్రిక్ కార్డియాక్ సెంటర్‌గా గుర్తించి ఆసియా టుడే రీసెర్చ్ అండ్ మీడియా సంస్థ ప్రైడ్ ఆఫ్ నేషన్ అవార్డును ఇటీవల ప్రకటించింది. హైదరాబాద్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై చేతుల మీదుగా ఆస్పత్రి డైరెక్టర్ డా.ఎన్. శ్రీనాధరెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.
మొట్టమొదటి గుండె మార్పిడి శస్త్రచికిత్స ఇలా..
తిరుపతిలోని టీటీడీ శ్రీపద్మావతి చిన్నపిల్లల గుండె చికిత్సాలయంలో ఈ ఏడాది జనవరి 20న తొలిసారి ఓ చిన్నారికి గుండెమార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించారు. జనవరి 16న జంజూరు సన్యాసమ్మ (48) రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలపాలై బ్రెయిన్‌డెడ్ అయ్యింది. షీలానగర్‌లోని కిమ్స్ ఐకాన్ ఆస్పత్రిలో ఉన్న ఆమె అవయవదానం చేశారు. ఆమె గుండెను అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం కేఎస్సార్ అగ్రహారం గ్రామానికి చెందిన 15 సంవత్సరాల బాలుడికి అమర్చి చికిత్సను విజయవంతంగా పూర్తిచేశారు.
దేశంలోని ప్రముఖ వైద్య నిపుణుల సేవలు..
ఇక ఆస్పత్రిలో అత్యాధునిక వైద్య సదుపాయాలతో మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ప్రముఖ గుండె సంబంధిత వైద్య నిపుణులు, ఇతర వైద్య సిబ్బందితో పాటు ఎకో స్కానింగ్, మెడికల్ ల్యాబ్, ఎక్స్‌రే, క్యాథ్‌ల్యాబ్, అడ్వాన్స్‌డ్ ల్యాబ్ అందుబాటులో ఉన్నాయి. దేశంలోని ప్రముఖ చిన్నపిల్లల గుండె వైద్య నిపుణులు సైతం శ్రీపద్మావతి చిన్నపిల్లల కార్డియాక్ కేర్ సెంటర్‌కు వచ్చి తమ సేవలు అందిస్తున్నారు.
వైఎస్సార్ మాట..
అభం శుభం తెలియని ఏ పసిబిడ్డ కూడా గుండె సంబంధిత వ్యాధులతో బాధపడకూడదు. వ్యాధిబారిన పడ్డ నా బిడ్డను కాపాడుకోలేకపోయాననే వేదన ఏ ఒక్కరూ పడకూడదు. ఇందుకు ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరించాలి. ఆ బాధ్యత నాది అంటూ చిన్నపిల్లల గుండె సంబంధిత చికిత్సలను ఆరోగ్యశ్రీలో చేర్చి వివిధ ప్రముఖ ఆసుపత్రుల్లో అందించేలా దివంగత వైఎస్ కృషిచేశారు. 2003లో చెప్పిన ఆ మాటలను కార్యరూపం దాల్చేలా 2004లో నిర్ణయం తీసుకుని పసిగుండెలకు సాంత్వన చేకూర్చారు.
కొండంత అండగా టీటీడీ..
సీఎం ఆదేశాలతో ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకురావడంలో టీటీడీ అప్పటి ఈఓ కేఎస్ జవహర్‌రెడ్డి, ప్రస్తుత ఈఓ ఏవీ ధర్మారెడ్డి, ఆస్పత్రి డైరెక్టర్ డాక్టర్ శ్రీనాథరెడ్డిలు ఎంతో కృషిచేశారు. ఆస్పత్రి నిర్వహణ, వైద్య సదుపాయాల కోసం రూ.25 కోట్లను టీటీడీ విడుదల చేసింది. 2022–23 వార్షిక ఏడాదికి ప్రాణదాన పథకం ద్వారా వైద్యఖర్చుల కోసం రూ.15 కోట్లను విడుదల చేసి టీటీడీ పెద్దన్న పాత్ర పోషించింది. చిన్నారి గుండెలకు శ్రీవారి అభయం తోడవడంతో అనతికాలంలోనే మంచి గుర్తింపు లభించింది.
ముందుకొస్తున్న దాతలు..
మరోవైపు.. ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు ప్రారంభమైన ఎనిమిది నెలల వ్యవధిలోనే ఇక్కడి వైద్య సేవలను గుర్తించి దాతలు ముందుకొస్తున్నారు. శ్రీవేంకటేశ్వర ఆపన్న హృదయం స్కీమ్ ద్వారా వచ్చే మొత్తాన్ని ఇక్కడి పిల్లల వైద్యం కోసం ఖర్చుచేయాలని టీటీడీ నిర్ణయించింది. ఆ మేరకు టీటీడీ ఇచ్చిన పిలుపునకు వివిధ రాష్ట్రాలకు చెందిన 150 మందికి పైగా దాతలు ముందుకొచ్చారు. రూ.లక్ష నుంచి పది లక్షల వరకు ఈ స్కీమ్‌లో జమచేశారు. ఈ పథకం కింద లక్షపైన ఇచ్చే భక్తులకు వీఐపీ బ్రేక్ (5 మందికి) దర్శన సదుపాయం కల్పిస్తోంది. మరింత మంది దాతలు ముందుకొచ్చి చిన్నారి గుండెలకు అండగా నిలవాలని టీటీడీ పిలుపునిచ్చింది.
ఆయన తనయుడిగా..
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తనయుడుగా సీఎం వైఎస్ జగన్ నాలుగడుగులు ముందుకేసి చిన్నపిల్లల గుండె సంరక్షణ బాధ్యత నాది అంటూ ఓ ఆస్పత్రిని నిర్మించాలని సంకల్పించారు. ఆయన చెప్పిన అనతికాలంలోనే టీటీడీ సహకారంతో అత్యాధునిక వైద్య సదుపాయాలతో శ్రీపద్మావతి చిన్నపిల్లల హృదయాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీ ఉన్న ప్రతి ఒక్కరికీ ఖరీదైన గుండె సంబంధిత చికిత్సలను ఉచితంగా అందజేస్తున్నారు. టీటీడీ సంపూర్ణ సహకారంతో ఆస్పత్రి విజయవంతంగా వైద్యసేవలందిస్తూ అనతి కాలంలోనే దేశం నలుమూలలా వ్యాప్తి చెందింది.
వరంగా మారిన ఆరోగ్యశ్రీ..
నిజానికి.. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ప్రత్యేకించి చిన్నపిల్లల హార్ట్‌కేర్ సెంటర్ లేదు. గుండె సంబంధిత చికిత్సలనగానే రూ.లక్షలతో కూడుకున్న వైద్యం అన్న భయం జనంలో ఉండేది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పేదలకు వరంగా మారింది. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక గుండెకు గుడి కట్టారు. మహానగరాలకు వెళ్లి వైద్యం చేయించుకునే స్తోమతలేని ఎన్నో పేద గుండెలకు పునర్జన్మనిస్తున్నారు.
తిరుపతిలోని శ్రీపద్మావతి చిల్డ్రన్ కార్డియాక్ కేర్ సెంటర్‌లో ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఉచితంగా శస్త్రచికిత్సలను అందిస్తున్నారు. ఆరోగ్యశ్రీ లేకున్నా ఇక్కడ వైద్య ఖర్చులు (పరికరాలు, మందులు) భరిస్తే ఎవరికైనా శస్త్రచికిత్సలను చేపడుతున్నారు. ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ద్వారా వివిధ రాష్ట్రాల్లోని పేదల పిల్లలకు సైతం ఉచితంగానే శస్త్రచికిత్సలను అందిస్తున్నారు.
అనతికాలంలోనే వందల మందికి పునర్జన్మ
సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, టీటీడీ సహకారంతో రూ.12 లక్షలు ఖర్చయ్యే గుండె మార్పిడి శస్త్రచికిత్సలను ఉచితంగా చేస్తున్నాం. అనతి కాలంలోనే వందల మందికి వైద్యులు పునర్జన్మనిచ్చారు. ఈ ఆస్పత్రిని ఆదర్శంగా తీసుకుని అలిపిరి వద్ద సుమారు రూ.450 కోట్ల వ్యయంతో చిన్నపిల్లల సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నాం. డిసెంబర్‌లో దీనిని ప్రారంభించేందుకు కృషిచేస్తున్నాం. – డాక్టర్ శ్రీనాథరెడ్డి, డైరెక్టర్, శ్రీ పద్మావతి కార్డియాక్ కేర్ సెంటర్
Comments
Please login to add a commentAdd a comment