
లక్డీకాపూల్: నిమ్స్ ఆస్పత్రిలో గుండె మార్పిడి ఆపరేషన్ విజయవంతమైంది. బ్రెయిన్ డెడ్‌గా మారిన వ్యక్తి నుంచి సేకరించిన గుండెను శనివారం ఉదయం కేవలం 3 గంటల వ్యవధిలోనే మరో వ్యక్తికి అమర్చినట్లు ఆస్పత్రి సీటీ సర్జన్ హెచ్‌ఓడీ డాక్టర్ ఎం. అమరేష్‌రావు తెలిపారు. కరీంనగర్ జిల్లా రేకుర్తికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు అస్తాపురం మల్లయ్య (51) ఈ నెల16న రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. చికిత్స నిమిత్తం సోమాజిగూడ యశోద ఆస్పత్రికి తరలించారు.
అక్కడ రెండు రోజుల పాటు చికిత్స పొందిన మల్లయ్య ఈ నెల 18న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో జీవన్‌దాన్ బృందం అవయవ దానంపై ఆయన కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించింది. మృతుడి భార్య హేమలత, కుటుంబ సభ్యులు దీనికి అంగీకరించారు. ఈ క్రమంలో రెండు కిడ్నీలు, లివర్, గుండె, కళ్లను వైద్యులు సేకరించారు. అప్పటికి గుండె మార్పిడి కోసం నిమ్స్ ఆస్పత్రిలో ఎదురు చూస్తున్న శంకర్ గౌడ్ అనే వ్యక్తికి మల్లయ్య నుంచి సేకరించిన గుండెను అమర్చినట్టు నిమ్స్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment